జరిగిన కథ
గుణమందియుడు పోటిసునికి రెండు వారాల్లో పూర్తిగా నయం అవుతుందని నమ్మకంగా చెప్పినాడు. జయసేనుడు తన తల్లి రాలేదని ఆందోళన పడుతుండగా.. ఒక అశ్వికుడు వాళ్ల మందిరం వద్దకు వేగంగా వచ్చినాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. తర్వాత…
మం దిర ప్రధాన ద్వారం ముందు ఆగిన అశ్వికుని వద్దకు పరుగులాంటి నడకతో చేరుకున్నారు జయసేనుడు, వామదేవుడు. ద్వారపాలకుడు అతన్ని ఏదో అడుగుతుండగానే… “అశ్వికా! నీవు మల్లికాపురం నుండి వచ్చిన వార్తాహరుడవా?” అని అడిగినాడు జయసేనుడు. వెంటనే ఆ అశ్వికుడు గుర్రం మీద నుంచి దిగి సవినయంగా నమస్కరించినాడు. “చిత్తం ప్రభూ! నేను మల్లికాగిరి నుండి వస్తున్నాను. నా పేరు సూరణుడు” అంటూ, ఏదో చెప్పబోయి.. చెప్పలేక తటపటాయించినాడు.
“సూరణా! ఆయన జయసేనుడు. నేను అతని మిత్రుడను వామదేవుడను. వార్తాహరుడు ఏ విషయమైనా స్పష్టంగా, నిర్మోహమాటంగా, దాపరికం లేకుండా చెప్పాలి. పైగా నీవు శత్రువు వద్ద నుండి వస్తున్నవాడవు కాదు. మా కుటుంబ సంబంధమైన వార్తను ఆత్మీయుల నుండి తెచ్చినవాడవు. నీకోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఆలస్యం చేయకుండా విషయం తెలియజేయి” అన్నాడు వామదేవుడు. “అమ్మగారి ప్రయాణానికి అనుకోని అవాంతరం ఏర్పడింది ప్రభూ!” అన్నాడు సూరణుడు. “అవాంతరమా! ఏం జరిగింది?” జయసేనుని గొంతులో ఆందోళన. “మరేమీ లేదు ప్రభూ! తమరి అత్తగారి విన్నపం మేరకే అమ్మగారు ప్రయాణాన్ని సప్తమికి ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ రాత్రికి చేరుకోవలసిన వారు రేపు అపరాహ్ణానికి చేరుకోగలమని తెలియజేయమన్నారు” తలవంచుకొని వివరించినాడు సూరణుడు. వార్తను చేరవేయడమే అతని పని. మిగతా వివరాలు అతనికి తెలుసునో, తెలియదో! అడగనా… వద్దా… అన్న సందేహంలో జయసేనుడు కొట్టుకుంటుండగానే.. వామదేవుడు అతని మనసు ఎరిగిన చెలికాడు అనిపించుకుంటూ.. “ఇంతేనా! అమ్మగారు రాకపోవడానికి ఇంకా ఏమైనా కారణాలు, కార్యక్రమాలు ఉన్నాయా?” అన్నాడు. “కారణాలు తెలియవు ప్రభూ! అంతఃపుర స్త్రీలు అనుకుంటుండగా విన్నాను. ఈరోజు చిన్న రాణిగారి చేత అమ్మగారు వరలక్ష్మీ వ్రతం చేయించే కార్యక్రమం ఏదో ఉన్నదని…” సూరణుడు కారణం చెప్పకనే చెప్పినాడు. దానికి ఒక్క నవ్వు నవ్వి.. “సరి సరి! ఇక నీవు వెళ్లవచ్చును” అన్నాడు వామదేవుడు. ఆ మాటలకు కొనసాగింపుగా ద్వారపాలకునితో జయసేనుడు ఇలా అన్నాడు “ముద్దశీలా! సూరణుడికి ఈ రాత్రికి కావలసిన భోజన వసతి ఏర్పాట్లు చేయించు. రేపు ఉదయమే మల్లికాగిరికి బయలుదేరుతాడు”
* * *
అక్కడ మల్లికాగిరిలో… మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందమైంది రోహ పరిస్థితి. అసలే తన ప్రయాణం ప్రశ్నార్థకం అవుతుందేమో అనుకుంటున్న ఆమెకు, పురోహితుని పలుకులు మొలుకులై గుచ్చుకున్నాయి. తనను అసలు కాపురానికే పంపకూడదన్నాడు. ‘ఆ మాటలు అత్త విన్నదా? విని కూడా పట్టించుకోలేదా!? తనను వెంటబెట్టుకుని పోతుందా!?..’ గుండె నిండా మేఘ గర్జనలు, ఉల్కాపాతాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా తీయని మాట అన్నది సిరిసత్తి. “కోడలు పిల్లా! మనం రేపు తెల్లవారుజామున బయలుదేరాలి!” ఇంకా నమ్మకం కలుగనట్లు చూసింది అత్త వంక రోహ. “పురోహితుని మాటలు విన్నావా? నేనూ విన్నాను. ఈ జ్యోతిషాలు, సాముద్రికాలు పూర్తిగా నమ్మదగినవి కావు. నీవు మా ఇంటికి కాబోయే మహారాణివి. ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత ఎంత తొందరగా చేపడితే అంత మేలు జరుగుతుంది. అంతగా అయితే ఇటువంటి దోష నివారణ కోసం మార్గాలు కూడా ఉంటాయి. పోదనకు వెళ్లిన తర్వాత మన పురోహితుణ్ణి అడిగి, అటువంటివి అన్నీ పూర్తి చేద్దాం” అన్నది సిరిసత్తి. అత్తను గట్టిగా హత్తుకున్నది రోహ. అత్తలో అమ్మ కనిపించింది రోహకు. కోడలిలో కూతురు కనిపించింది సిరిసత్తికి.
* * *
“నీవు అంతగా ఆశ పడటానికి అక్కడ ఏమీ లేదే…” చంద్రహత్థి అడిగిన ప్రశ్నలకు జవాబుగా అంటూ, ఓరకంట దాన్ని గమనించింది రాయహత్థి. మెరుస్తున్న దాని చూపులు హఠాత్తుగా పగటి వెలుగుకు చిక్కిన తారకలైనాయి. నమ్మలేనట్లు అన్నది. “నిజమేనా…” అని. “ఆఁ!” నమ్మబలికింది రాయహత్థి. ఉత్సాహమంతా నీరుగారి పోగా.. ఈ విధంగా పలికింది చంద్రహత్థి, సాగరము లోన యోడపై సాగి సాగి ఒడ్డు దొరకక ఒక కాకి యొరలుచుండె దాని పగిదియె నా ప్రేమ తల్లి నిజము ఓడ తెరచాప నిజమైన గూడు నగునె! “ఈ కథ నేనెప్పుడూ వినలేదే చంద్రా! ఏందా కథ?” ఆసక్తిగా అడిగింది రాయహత్థి. “అది కథ కాదక్కా! వెత! తీరానికి వచ్చిన ఓడ మనసుకు బాగా నచ్చి అందులో హాయిగా కూర్చున్నదట ఒక కాకి. ఓడను తీసుకొని వెనుదిరిగి పోయినాడు సారంగు. అట్లా ఓడ సముద్రంలో చాలాదూరం పోయిన తర్వాత చుట్టూ పరికించి చూసింది కాకి. కనుచూపు మేరంతా నీళ్లే. దాని కంటినిండా కన్నీళ్లే! ఎక్కడికి వెళుతుంది? ఎవరితో చెప్పుకొంటుంది? ఓడను నమ్ముకోవడం కాకి తప్పే కదక్కా!…” కన్నీళ్లు టపటపా రాలినాయి.
ఆ ఓడ పోటిసుడని, కాకి చంద్రహత్థేనని ఎవరికైనా అర్థమవుతుంది. రాయహత్థి మాత్రం అర్థం చేసుకోలేదా!? చంద్రహత్థి మీద ఆమెకు చెప్పలేనంత జాలి కలిగింది. “పిచ్చిపిల్లా! వలపు మరచి, వగపును అల్లుకుంటావెందుకే?” చంద్రహత్థిని అక్కున జేర్చుకొని, కన్నీరు తుడిచి, చెక్కిలి ముద్దాడింది రాయహత్థి. ఆపై చంద్రహత్థి మనసుకు గిలిగింతలు పెట్టే మాట అన్నది… “నీవు వలచిన వాడు సామాన్యుడు కాడు. మహావీరుడు. అతడు నీ గురించి ఆలోచిస్తున్నదీ, లేనిదీ తెలవదు కానీ, పరోపకార ధర్మం తెలిసినవాడు; నిజ ధర్మం మరచిపోనివాడు; ఇతరుల మేలు గురించి ఆలోచించేవాడు; తన గురించి ఎవరైనా బాధపడుతుంటే తట్టుకోలేడు. నీవు మనసులో ఏమీ పెట్టుకోకుండా ఆ మహావీరుని సేవచేయి. ఇక్కడి నుంచి వెళ్లకముందే నీ దాసుడు అయిపోతాడు…” చివరి మాట చెవిలో చెబుతున్నట్లుగా అని, దాని కళ్లలో కళ్లు పెట్టి చూసింది. కోటి భావాలు ఒకరి నుండి మరొకరికి ఆ చూపుల వంతెన మీద నుంచి చేరుకున్నాయి. తన వెంట రమ్మని సైగ చేస్తూ, పోటీసుని మంచం దాకా తీసుకొని పోయింది. రాయహత్థి రాకను చూసి, మళ్లీ కళ్లు మూసుకున్నాడు పోటిసుడు. చంద్రహత్థి తన చూపుల కొలమానంతో పోటీసుని అణువణువూ కొలుచుకో సాగింది. మొలకు బిగుతైన గోచిగుడ్డ తప్ప శరీరమంతా అనాచ్ఛాదితంగా ఉన్న పోటిసుడు నల్లని అందమైన మహావీరుని విగ్రహాన్ని తలపిస్తున్నాడు.
“పురోహితుని మాటలు విన్నావా? నేనూ విన్నాను. ఈ జ్యోతిషాలు, సాముద్రికాలు పూర్తిగా నమ్మదగినవి కావు. నీవు మా ఇంటికి కాబోయే మహారాణివి. ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత ఎంత తొందరగా చేపడితే అంత మేలు జరుగుతుంది. అంతగా అయితే ఇటువంటి దోష నివారణ కోసం మార్గాలు కూడా ఉంటాయి. పోదనకు వెళ్లిన తర్వాత మన పురోహితుణ్ణి అడిగి, అటువంటివి అన్నీ పూర్తి చేద్దాం” అన్నది సిరిసత్తి.
మెడల దాకా పరుచుకున్న గిరజాల జుట్టు; విల్లులాంటి దట్టమైన కనుబొమ్మలు; అంబువు లాంటి ముక్కు; అందమైన పెదాలు; పెదాల మీద మెరిసే కోరమీసం; బలమైన దవడలు; నున్నటి మెడ; విశాలంగా పరచుకున్న వక్షస్థలం; సమతలంగా ఉన్న పొట్ట; కండలు తిరిగిన చేతులు; బలమైన పిక్కలు; దృఢమైన పాదాలు… “మహావీరుడా! నీకోసం ఎవరు వచ్చినారో చూసినావా…” ప్రేమతో మందలించింది రాయహత్థి. మళ్లీ కళ్లు తెరిచినాడు పోటిసుడు. తనకోసం ఎవరు వచ్చినారో తెలుసుకునేందుకు. తననే చూస్తున్న చంద్రహత్థి చూపులో చూపు కలిసి పోయింది. చంద్రహత్థి తొలిసారి అతని అరచేతులు రుద్దిన సందర్భంలో ఆమెకు కలిగిన విద్యుత్తు ప్రసారమే ఇప్పుడు పోటిసునికి కలిగింది. ఒక్కసారిగా లేవబోయి వెన్నెముక కలుక్కుమనగా బాధతో.. “అమ్మా!” అన్నాడు. హత్థిలిద్దరూ ఒకేసారి చెరొక పక్క అతన్ని చేరుకున్నారు. ఎడమ భుజం చంద్రహత్థి, కుడి భుజం రాయహత్థి పట్టుకున్నారు. ఆ స్పర్శ అతన్ని బాధ మరచిపోయేలా చేసింది. పడుకున్న చోటినుండే ఇద్దరినీ మార్చిమార్చి చూసినాడు పోటిసుడు. “దీని పేరు చంద్ర… చంద్రహత్థి! నీవు గాయపడినప్పటి నుంచి నాకంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటున్నది. నీవు నాకు బిడ్డలాంటివాడివైతే, దానికి మాత్రం నీవే సర్వస్వం!” పోటీసుని ముఖంలో ఆనందం, ఆశ్చర్యం, అపనమ్మకం… ‘నిజమా?!’ అన్నట్లు చంద్రహత్థిని చూసినాడు. ఆమె మనసు వీణ ప్రేమ రాగాన్ని శ్రుతి చేసుకోసాగింది. సరిగ్గా అప్పుడే గుమ్మంలో ఒక యువకుడు కనిపించినాడు. “ఏమే పెండ్లామా? ఇక్కడ ఏం చేస్తున్నావే?” అన్నాడు చంద్రహత్థిని చూస్తూ…
(సశేషం)