Ramaayanam | నాకు గానీ, అక్కకు గానీ రాని విద్య.. పాటలు పాడటం. కానీ, చిన్నప్పటి నుంచీ రేడియోలో మాత్రం పాటలు బాగా వినేవాళ్లం. అందుకేనేమో.. మంచి పాటలు వినడమంటే ఇప్పటికీ ఎంతో ఇష్టం! రేడియోలో చిత్రసీమ, మీరు కోరిన పాటలు, మధుర గీతాలు వంటి సినిమా పాటలు ఎన్నో వినేవాళ్లం.
రేడియోలో భక్తి గీతాలు, దేశభక్తి గేయాలు, లలిత గీతాలు, జానపద గేయాలు, పల్లె పాటలు, ఈ మాసపు పాట, ఈ పాట నేర్చుకుందాం లాంటి శీర్షికల పేరుతో వచ్చే పాటలనూ వదిలేవాళ్లం కాదు. ఇవి కాకుండా రేడియో సిలోన్లో మీనాక్షి పొన్నుదురై వేసే తెలుగు పాటలు, వివిధ భారతిలో అమీన్ సయాని బినాకా గీత్ మాలా, సైనికుల కోసం వేసే జయమాల, ఆప్ కీ ఫర్మాయిష్ లాంటి ప్రోగ్రాంలలో హిందీ పాటలు వినీవినీ.. పాటల పట్ల విపరీతమైన ఇష్టం ఏర్పరచుకున్నాను. టీవీ వచ్చిన కొత్తలో చిత్రలహరి లాంటి ప్రోగ్రాం వస్తుందంటే అప్పటికే రాత్రి భోజనం పూర్తిచేసి.. ఫ్రీ అయ్యాక చూడటం అలవాటు.
ఇదంతా ఒకెత్తు అయితే.. బయట మామూలుగా పాడేవాళ్ల పాటలు ఇంకో ఎత్తు. మేము అప్పుడప్పుడూ పొలం దగ్గరికి వెళ్లేవాళ్లం. అక్కడ నాట్లు, కలుపులు, కుప్ప నూర్పిళ్లప్పుడు ఆడవాళ్లు ఏవో పాటలు పాడేవాళ్లు. అవి ఓ రకమైన యాసతో మాకు తెలియని కొన్ని తెలుగు పదాలతో భలే బాగుండేవి. ఆ పాడేవాళ్ల గొంతులు కూడా ఒక పల్లె సొగసుతో, విరుపుతో అడవిపూల వంటి కొత్తదనంతో ఉండేవి. అయిలమ్మ, లచ్చమ్మ.. వాళ్లల్లో బాగా పాటలు పాడేవాళ్లుగా గుర్తుంది. కొందరు మొగవాళ్ల గొంతులు కూడా పల్లె యాసతో బాగుండేవి.
మా నాన్న వైపువాళ్లలో అందరూ కలిసినప్పుడు సరదాగా పాటలు పాడటం, జోక్స్ చెప్పుకొని నవ్వడం చేసేవాళ్లు. మా వాళ్లలో ఎవరిదైనా పెళ్లి అయితే.. అందరితో కలిపి పాటల ప్రోగ్రామ్ పెట్టేవారు. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా హాజరయ్యేవాళ్లు. పెద్ద జంపఖానాలు పరిచి వధూవరులను మధ్యలో కూర్చోబెట్టి.. ఇటువైపు కొందరూ, అటువైపు కొందరూ కూర్చునేవారు. అదే ఇప్పటి సంగీత్, రిసెప్షన్ కలిపి అన్నమాట. అయితే.. డాన్సులు మాత్రం లేవు.
మా పెద్ద చిన్నాన్న కొడుకు శరత్ అన్న జానపద గేయాలు, ఎంకి పాటలు బాగా పాడేవాడు. ‘నీ దారికడ్డం పండుకుంట.. గొల్లోళ్ల పిల్లా! నువ్వు దాటైన పోరాదే గొల్లోళ్ల పిల్లా!’ అని శరతన్న పాడుతుంటే.. మా చిన్న చిన్నాన్న కొడుకులు మధు, శ్రవణ్ తబలా కొడుతూ, కోరస్ పాడుతూ వినోదాన్ని పంచేవారు.
సరస్వతక్క ‘చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ’ పాటను ఎంతో మధురంగా పాడేది. మా చిన్న మేనత్త కూతురు రాధక్క గొంతు కూడా చాలా బాగుండేది. మాతో సహా మిగతా వారంతా వినువారమే కానీ పాడువారము కాదు.
మా చిన్న చిన్నమ్మ లక్ష్మిది అద్భుతమైన గాత్రం. ఆమె చెంచులక్ష్మి సినిమాలోని ‘పాల కడలిపై శేష తల్పమున పవళించేవా దేవా!’ పాట పాడితే.. అందరూ ‘వన్స్ మోర్’ అని చప్పట్లు కొట్టేవారు. వాళ్ల పిల్లలు వెంకన్న, వాసు, శ్రవణ్ కూడా బాగా పాడేవారు.
ఇక్కడే అసలు సమస్య వచ్చేది. అప్పటిదాకా ప్రేక్షకులుగా ఉన్నవాళ్లల్లో కొందరు విపరీతంగా ప్రేరణ పొంది.. ‘తరువాత నేను పాడుత!’ అంటూ ముందుకొచ్చేవారు. వాళ్లలో ఒకరిద్దరు బాగా పాడేవాళ్లున్నా, మిగతా వారికి అంతగా గాత్ర సంపద ఉండేది కాదు. పాడొద్దని ఎలా చెబుతారు? దాంతో ఒకరివెనుక మరొకరు పాడుతుంటే.. ‘చిత్ర హింస.. మీరు కోరని పాటలు వింటున్నారు!’ అన్నట్లు అనిపించేది. చివరికి వచ్చేసరికి గానం చేసి అలరించే వాళ్ల బదులు.. గాయం చేసేవాళ్లే ఎక్కువయ్యేవారు.
ఓసారి బడికి వరుసగా మూడు రోజులు సెలవొస్తే.. అక్కనూ, నన్నూ చిన్నపెండ్యాలలోని వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది ఇంద్రాణి. తను అక్క క్లాస్మేట్, ఫ్రెండ్ అయినా.. నన్ను కూడా బాగా ఇష్టపడేది. వాళ్లింట్లో ఉయ్యాల బల్ల స్పాట్ మాకు ఇష్టం. అక్కడే నేనూ, అక్కా, ఇంద్రాణీ, వాళ్ల చెల్లి నీహారిణీ కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో వాళ్ల పక్కింటి అమ్మాయి వచ్చింది.
“అక్కా! ఏం జేస్తుండ్రు?” అంటూ. “మేమేదో జోకులు చెప్పుకొంటున్నం!” అన్నది ఇంద్రాణి. “నాకు జోకులు జెప్పుడు రాదు. మీలెక్క ఉండాల్నని ఇష్టం. ఏం జెయ్యాలె మరి?!” అన్నది ఆ పిల్ల. “సరె! ఒక పాట పాడు. నువ్వు పాటలు నేర్చుకొని బాగ పాడుతున్నవట గద! మీ అమ్మ జెప్పింది” అన్నది ఇంద్రాణి. క్షణం ఆలస్యం లేకుండా ఆ అమ్మాయి.. “మంచి మనుషులులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట ఇప్పుడు మీరు వింటారు.
ఈ పాటను సినిమాలో శోభన్ బాబు, మంజులపైన చిత్రీకరించారు!” అని చెప్పి.. ‘పడకు పడకు.. వెంట పడకు. పడుచు పిల్లకు ఆశ పడకు, పోపోరా చినవాడా! టట్టొయ్.. టట్టడోయ్.. పడకు పడకు అడ్డు పడకు. పడుచువాని చేయి విడకు.. పోలేనే చినదానా!’ అంటూ పాట మొత్తం కామాలూ, ఫుల్ స్టాపులూ లేకుండా మ్యూజిక్‌తో సహా పాఠం అప్పజెప్పినట్టుగా గడగడా చదివేసింది. మేమింకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోకమునుపే.. “ఎట్ల పాడిన అక్కా?! ఎట్లుంది?!” అంటూ అడిగింది ఎంతో అమాయకంగా.
ఇంద్రాణే మొదట తేరుకుని.. “బాగ చదివినవ్ చెల్లే! ముందుముందు ఇంక బాగ నేర్చుకున్నాక పాడు. సరేనా!” అన్నది. ఆ అమ్మాయి అప్పటికీ యమధర్మరాజును వదలని సావిత్రిలా.. “గీ అక్కంటే నాకిష్టం. గీ అక్కేం జెప్తులేదు!” అని నాకేసి చూపిస్తూ.. “అక్కా! నువ్వొక్క పాట పాడవా?!” అన్నది నాతో. నేనేం చెప్పాలో తెలియలేదు గానీ.. “రమా! నువ్వు కూడ ఒక్క పాట చదువరాదూ?!” అని ఇంద్రాణి నన్ను బనాయించడం మొదలుపెట్టింది. నేను ఆ అమ్మాయితో.. “నాకు నీ అంత బాగ చదువుడు రాదబ్బా! కొంచెం ప్రాక్టీసు చేసి ధైర్యం ఒచ్చినాక అప్పుడు చదువుత!” అని చెప్పాను. ఆ రోజంతా మేము ఒకళ్లనొకళ్లం అలా పాటలు పాడమని వెంటబడుతూ, నవ్వుకుంటూనే ఉన్నాం.
– నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి