Ramaayanam | మా బడిలో ఓ కోతి మూక ఉండేది. టీచర్లంటే భయం ఉన్నా.. వాళ్లనుకూడా అప్పుడప్పుడూ ఆట పట్టించేది. అలా.. మా లడ్డు సారును కుర్చీలో ఇరుక్కునేలా చేశారు. దూర్వాసుడనే పేరున్న సింహాచారి సారును కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు.
సింహాచారి సారు ధోతి కట్టుకునేవాడు. సన్నగా, పొడుగ్గా పొగచూరిన కర్రకు బట్టలు తొడిగినట్టు ఉండేవాడు. మా ఎనిమిదో తరగతి గది ఓ పెద్ద పొడవాటి గుడిసె. దాంట్లో ఒకపక్క ఎయిత్ ఏ, మరోపక్కన ఎయిత్ బీ క్లాసులు ఉండేవి. మధ్యలో అబ్బాయిలు సైకిల్స్ పెట్టేవాళ్లు.
సింహాచారి సారు పాఠం చదువుతూ పోయేవాడు తప్ప అర్థమయ్యేలా, సొగసుగా తెలుగు పాఠం చెప్పడం ఆయనకు వచ్చేది కాదు. ముఖ్యంగా పద్యభాగం బోధించేటప్పుడు పద్యం రాగయుక్తంగా కాకుండా గడగడా చదివి ప్రతిపదార్థం చెప్పి.. “ఆఁ.. ఇగ చదువుకోండి” అనేవాడు. తొమ్మిది, పదో తరగతుల వారికి నరసింహమూర్తి సారు రసరమ్యంగా పద్యాలు పాడుతూ, కథలు చెబుతూ ఎంతో ఆసక్తిగా పాఠం చెబితే.. ఈయనేమో తెలుగు భాషంటేనే ఉత్సాహం పోయేలా చెప్పేవాడు. ఓరోజు సింహాచారి సారు మా క్లాసుకు వచ్చాడు. “ఆఁ.. పుస్తకాలు తియ్యండి” అంటూనే కుర్చీలో కూర్చున్నాడు. అంతే.. దభాల్న వెనక్కు పడిపోయాడు. “అయ్యో.. సారు పడ్డడు” అంటూ ఒకళ్లిద్దరు మగపిల్లలు పరిగెత్తి లేవదీశారు. ఆయన దిగ్భ్రాంతి నుండి తేరుకుని విపరీతమైన కోపంతో ఊగిపోయాడు.
ముక్కుపుటాలు అదురుతున్నాయి. “ఎవడ్ర వాడు?! తన్నేను గాడిదను! బయిటికి రా!” అని అరిచాడు.. బుస్సుబుస్సుమని గాలి వదులుతూ. అంతా నిశ్శబ్దం.. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కుర్చీకి మూడే కాళ్లున్నాయి. నాలుగో కాలుండే చోట పైకి తెలియకుండా ఉండేలా టెంపరరీగా ఓ వెదురు కర్ర ఆనించినట్టు ఉన్నారు. ఆయన కూచోగానే కుర్చీ బ్యాలెన్స్ లేక పడిపోయింది. “సరే! మీకందరికీ తెలుసు గానీ చెప్పరు గద! మంచిది.. నేనే తెలుసుకుంట! ఎవ్వరు జేసిన్రో తెలుసుకొని, వాణ్ని ప్రేయర్ల అందరు జూడంగ తన్నియ్యకుంటే జూడండి! నేను మాటంటె మాటే!” అన్నాడు. అయినా.. ఒక్కలు కూడా లేచి నిలబడలేదు.
“సరే! ఎవ్వడో తెలిసి వాణికి శిక్ష పడేదాకా నేను మీ క్లాసుకు రాను. మీకు పాఠం చెప్పను” అని పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆ తరువాత విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సరాసరి హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేశాడు.
ఆయన మాటలు మాకేమీ షాక్ కలిగించలేదు. మామూలుగానే విన్నాం. ‘ఇస్కా అంజామ్ దేఖ్తే రహో’ అన్నా కూడా.. మాకు భయం కలుగలేదు. వెనుకనుంచి ఓ అబ్బాయి మాత్రం.. “ఆఁ.. మంచిగయింది. ఇగ ఈయినె మన క్లాసుకు రాకుంటె మనకే మంచిది” అన్నాడు గట్టిగా. అందరం నవ్వాం.
కానీ, ఐదు నిమిషాల్లో నాకు హెడ్మాస్టర్ నుండి పిలుపు వచ్చింది. వెళ్లాను. హెచ్ఎం సార్, వరదా రెడ్డి సారు, ఇంకా బుసలు కొడుతూనే సింహాచారి సారూ ఉన్నారు. “రమా! నువ్వు నిజం చెప్తవ్! నీకు అబద్ధమాడుడు రాదు. కుర్చీ కర్ర ఇరగ్గొట్టి ఎదటి పుల్ల ఆనిచ్చి పెట్టింది ఎవరమ్మా?!” అని నిజనిర్ధారణ కమిటీ తరఫున వరదారెడ్డి సారు అడిగాడు. నేను సత్య హరిశ్చంద్రుడి చెల్లెల్ని మరి! “నాకు తెల్వదు సార్! కుర్చీ అట్లనే ఉన్నదనుకున్న! అసల్కు ఎవరైనా కుర్చీ కాలెట్ల తీస్తరు సార్?!” అని అడిగాను. సింహాచారి సారు మరొక్కసారి బుస్సుమన్నాడు. నన్ను రెండుమూడు సార్లు అడిగి.. నాకు తెలియదన్నాక.. “ఈ అమ్మాయికి తెల్వదు సార్! తను చూస్తె చెప్పేదే! అయినా ఏదో కోతి పోరగాళ్లు! ఒదిలి పెట్టండి సార్! నేను ఆ క్లాసుకు పొయ్యి మగ పోరగాండ్లనందర్ని ఇయ్యర మయ్యర జోపుత.. సరేనా! ఇగ నువ్వు పోమ్మా!” అన్నాడు వరదారెడ్డి సారు. “నేను ఒదుల సార్! వాడెవ్వడో తెలువాలె! అంతదనుక నేను వాండ్ల క్లాసుకు పోను” అన్నాడు భీష్మప్రతిజ్ఞ చేసినాయన.
“రమా! నువ్వు నిజం చెప్తవ్! నీకు అబద్ధమాడుడు రాదు. కుర్చీ కర్ర ఇరగ్గొట్టి ఎదటి పుల్ల ఆనిచ్చి పెట్టింది ఎవరమ్మా?!”
“ఈ అమ్మాయికి తెల్వదు సార్! తను చూస్తె చెప్పేదే! అయినా ఏదో కోతి పోరగాళ్లు! ఒదిలి పెట్టండి సార్! నేను ఆ క్లాసుకు పొయ్యి మగ పోరగాండ్లనందర్ని ఇయ్యర మయ్యర జోపుత.. సరేనా! ఇగ నువ్వు పోమ్మా!”
మొత్తానికి నెల రోజులపాటు మాకు నరసింహమూర్తి సారు వచ్చి వినసొంపుగా పాఠాలు చెప్పాడు. ఇక సింహాచారి సారు రాడని నిర్ధారించుకున్నాక మా ఆనందం ఎక్కువకాలం ఉంచకుండా.. ఏం నచ్చచెప్పారో ఏమో, మళ్లీ మా క్లాసుకు వచ్చాడు. పిల్లలందరూ ఉసూరుమన్నారు. అయితే.. అప్పటికీ, ఇప్పటికీ ఆ కుర్చీ కాలు విరగ్గొట్టిన శూరుడెవరో ఎవరికీ తెలియలేదు.
– నెల్లుట్ల రమాదేవి , రచయిత్రి