‘జీవితంలో అత్యంత లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్ ఏదీ?’ అని అడిగితే.. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్నవాళ్లు బాగా లాభం వచ్చిన కంపెనీ పేరు చెబుతారు. సంబంధం లేనివాళ్లు తాము కొన్న ప్లాట్ అనో.. బంగారం అనో అంటారు. అదీ లేనివాళ్లు పిల్లల చదువుపై పెట్టిన ఇన్వెస్ట్మెంట్నే అద్భుతమైన
పెట్టుబడి అంటూ సమాధానమిస్తారు.. పిల్లలవైపు మురిపెంగా చూస్తూ. మరి.. ‘అత్యంత నష్టదాయక ఇన్వెస్ట్మెంట్?’ అంటే ఏం చెబుతారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. లాభసాటి ఇన్వెస్ట్‌మెంట్‌ను గుర్తుపెట్టుకొనే మనం.. అత్యంత నష్టదాయకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ను అస్సలు
గుర్తుపెట్టుకోం. పైగా.. తెలిసినా ఆ నష్టదాయకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ను అలా కొనసాగిస్తూనే ఉంటాం.
స్ట్టాక్మార్కెట్ బిగ్బుల్ అఫ్ ఇండియా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాను ఇదే ప్రశ్న అడిగితే.. ‘టైటాన్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్.. నా జీవితంలో అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్’ అంటూ ఉత్సాహంగా చెబుతారు. ఆ తర్వాతి ప్రశ్నకు సమాధానం.. ‘ఆరోగ్యంపై నేను చేసిన ఇన్వెస్ట్మెంట్.. నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన ఇన్వెస్ట్మెంట్. నాకు కోలుకోలేని విధంగా నష్టం కలిగించిన ఇన్వెస్ట్మెంట్!” అంటూ కాసింత నిరాశగా చెబుతారు. ఆయన మద్యం వంటి వ్యసనాల వల్ల ఆరోగ్యం పాడు చేసుకొన్నారు. డబ్బులు ఇచ్చి అనారోగ్యం కొనుక్కోవడం అంటే ఇదే! ఈ మాట చెప్పిన రెండేళ్లలోపే.. 62 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.
ఇలాంటి వాళ్ల మరణం.. వారి కుటుంబానికే కాదు, మొత్తం దేశానికీ నష్టం కలిగిస్తుంది. భారత దేశ ఉజ్వల భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయడమే కాకుండా.. ఎంతోమంది సామాన్యులకు ధైర్యం కలిగించి, ఇన్వెస్ట్మెంట్ ద్వారా దేశ ప్రగతికి, యువత ప్రగతికి దోహదం చేసినవ్యక్తి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.
2020లో కరోనాతో దేశంలోనే కాదు ప్రపంచమంతా నైరాశ్యం ఆవహించి ఉన్న సమయంలోనూ రాకేశ్ ధైర్యంగా ఉన్నారు. “మంచి రోజులు వస్తాయి. భయపడకండి. ఇలాంటి సంక్షోభాలు ఎన్నో ఈ ప్రపంచం చూసింది. మార్కెట్ నుంచి పారిపోవద్దు. మంచి లాభాలకు ఇదే సరైన సమయం.. ఇన్వెస్ట్ చేయండి!” అని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పి, ఎంతోమందిని మార్కెట్ నుంచి వెళ్లిపోకుండా చేశారు. అప్పుడు నిఫ్టీ ఏడున్నర వేలు ఉంటే.. ఇప్పుడు 25 వేలు దాటింది. ఆయన మాటలను నమ్మి మార్కెట్‌ను అంటిపెట్టుకొని ఉన్నవాళ్లకు లాభాల పంట పండింది. అందుకే, దేశ ప్రగతిని ఇలా ముందుచూపుతో సరిగ్గా అంచనా వేసి, యువతకు ధైర్యం చెప్పే ఆయన అకాల మృతి.. వారి కుటుంబానికే కాకుండా దేశానికి కూడా తీరని నష్టం.
ముంబైలోని రాజస్థాన్ మార్వాడీ కుటుంబంలో జన్మించిన రాకేశ్ తండ్రి ఆదాయపు పన్ను శాఖలో అధికారి. పిల్లలను వాళ్లకు నచ్చిన పని చేయమని ఆయన ప్రోత్సహించారు. రాకేశ్ బీకాం చేశాక.. ‘స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉంది’ అని చెబితే.. ‘ముందు సీఏ చేయి. బతకడానికి అవకాశం ఉంటుంది!’ అని సీఏ చేయించారు. ‘స్టాక్ మార్కెట్‌కు వెళతాను!’ అంటే.. ‘డబ్బు మాత్రం ఇవ్వను. ముంబైలో ఇల్లు ఉంది’ అని చెప్పారు. ‘స్టాక్ మార్కెట్‌కు వెళ్తే నీకు ఎవరూ పిల్లను కూడా ఇవ్వరు!’ అని తల్లి వద్దని చెప్పింది. ‘పిల్లను ఇవ్వకపోతే నీకు ఒక కోడలు తగ్గుతుంది!’ అంటూ రాకేశ్ నవ్వుతూ బదులిచ్చి.. కేవలం ఐదు వేల రూపాయలు తీసుకొని.. తనను తాను నమ్ముకొని మార్కెట్లో అడుగుపెట్టారు. అన్న కూడా సీఏ కావడంతో అతని వద్దకు వచ్చే వారిని కలిసి.. ‘18 శాతం వడ్డీ ఇస్తా!’ అని కొంత మొత్తం తీసుకున్నారు. ఆ రోజుల్లో వడ్డీ 12 శాతం ఉండేది.
ఇక రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా చెప్పిన అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్.. టాటాలకు చెందిన టైటాన్. 2000 సంవత్సరంలో టైటాన్ స్టాక్ ధర దాదాపు మూడు రూపాయలు ఉండేది. ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి క్షుణ్నంగా అధ్యయనం చేసే రాకేశ్.. టైటాన్ గురించి బాగా చదివాడు. ఉద్యోగుల భారం ఎక్కువగా ఉండటంతో వీఆర్ఎస్ ఇచ్చి పంపుతుండడాన్ని గమనించి.. మెల్లగా టైటాన్ షేర్లను కొనడం మొదలుపెట్టారు. అలా.. టైటాన్లో ఆయన వాటా ఐదు శాతానికి చేరింది. ‘కంపెనీని స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్నాడా? ఏమిటీ రాకేశ్ ఉద్దేశం!?’ అని టాటా వారు విచారిస్తే.. యాజమాన్యంలోకి రావాలని తనకు ఎలాంటి ఉద్దేశం లేదనీ, కంపెనీకి మంచి భవిష్యత్తు ఉందని తన నమ్మకమంటూ చెప్పారు. ఇప్పుడు ఆ ఐదు శాతం వాటా విలువ.. 18 వేల కోట్లు. టైటాన్ షేర్ ధర మూడు రూపాయల నుంచి ఇప్పుడు రూ.3600 దాటింది.
విజేతల ఆలోచనలు భిన్నంగా ఉంటాయని రాకేశ్ విజయ గాథ వింటే అర్థం అవుతుంది. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మధు దండావతే ఆర్థిక మంత్రి. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ నిరాశలో కూరుకుపోయి ఉంది. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటేనే భయపడేవారు. దండావతే బడ్జెట్‌పై ఎవరిలోనూ ఆశలు లేవు. ఆ సమయంలో తన ఆలోచనే తనను సంపన్నుడిగా మార్చిందని రాకేశ్ చెబుతారు. ఆ రోజుల్లో బడ్జెట్ సాయంత్రం ప్రవేశ పెట్టేవారు. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు స్టాక్ మార్కెట్ ఉండేది. మధు దండావతే బడ్జెట్‌కు అందరూ భయపడి స్టాక్స్ అమ్ముకొంటే.. రాకేశ్ భిన్నంగా ఆలోచించాడు. ప్రధాని వీపీ సింగ్ ఠాకూర్. ఠాకూర్లు వ్యాపారానికి ప్రోత్సాహం అందిస్తారు కానీ దెబ్బతీయరు అనుకున్నారు. వీపీ సింగ్ కేంద్రమంత్రిగా సంస్కరణలు తెచ్చారు. బడ్జెట్ కూడా అలానే ఉంటుందని నమ్మారు. రాకేశ్ నమ్మకం వమ్ము కాలేదు. బడ్జెట్‌కు ముందు అతని ఫోర్ట్‌ఫోలియో మొత్తం మూడు కోట్ల రూపాయలు కాగా.. రాత్రి తొమ్మిది గంటలకు 20 కోట్లు అయింది. మార్కెట్ రాకెట్లా దూసుకెళ్లింది. తన భార్య రేఖ జీవితంలో తనను ఏమీ అడగలేదు. సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. “మా ఇంట్లో కారు, ఏసీ లేదు. వాళ్ల పుట్టింట్లో అవి ఉండేవి. జీవితంలో ఆమె అడిగిన ఒకే ఒక కోరిక.. ‘ఏసీ ఎప్పడు తెస్తారు?’ అని. బడ్జెట్ రోజు 3 కోట్లు కాస్తా 20 కోట్లు కావడంతో.. ఏసీ తెస్తున్నట్టు భార్యకు చెప్పాను” అని ఓ సందర్భంలో చెప్పారాయన.
కంపెనీల పనితీరు చూసి స్టాక్స్ కొనడం తప్ప సొంతంగా కంపెనీలు పెట్టే ఉద్దేశం తనకు లేదని అనేకసార్లు చెప్పినా.. చివరి దశలో విమానయాన సంస్థ ప్రారంభించారు. భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని బలంగా నమ్మడమే కాకుండా.. అనేక సమావేశాల్లోనూ చెప్పేవారు. మోడీ విజయం సాధిస్తారని, మోడీనే కాదు.. అధికారంలోకి ఎవరు వచ్చినా ఇండియా గ్రోత్‌కు తిరుగులేదని చెప్పేవారు. మార్కెట్ గురించి, భారత్ వృద్ధి గురించి అద్భుతమైన అవగాహన ఉన్న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. తన ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేశారు. దాంతో.. 62 ఏళ్లకే తనువు చాలించారు. ఇండియా గ్రోత్‌లో రాకేశ్ లాంటి వారి మేధస్సు నేటితరానికి చాలా అవసరం.
ఐదు వేల రూపాయలతో స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన ఝున్‌ఝున్‌వాలా తన స్టాక్స్ మీది లాభాలే కాకుండా.. ఏటా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల డివిడెండ్స్ పొందే దశకు చేరుకున్నారు. నిరంతరం మార్కెట్లోనే మునిగిపోయేవారు. స్టాక్ మార్కెట్ కదలికలు, స్టాక్స్ కదలికలను సరిగ్గానే
అంచనా వేయగలిగారు. కానీ, తన శరీర కదలికలను, అనారోగ్య దాడిని ముందుగా ఊహించలేక పోయారు.
– బుద్దా మురళి