అనగనగా కథలన్నీ కంచికి పోయేవే! కానీ, కంచికి చేరని ఈ కథలు కాశీ మజిలీలో పుట్టాయి. అలనాడు పేదరాసి పెద్దమ్మ చెప్పిన కథలు, సాలభంజికలు వివరించిన కథలు తరాలుగా ఊ కొడుతూ విన్నాం. వీటిలో కొన్ని కాశీ యాత్రలో ఊరినవి అయితే, మరికొన్ని వాటికి ప్రేరణగా పుట్టినవి. కథలకు, కల్పనలకు మూలం ఎక్కడైనా ఉన్నదా అంటే.. అది కాశీ మజిలీలోనే దొరుకుతుందేమో! మణిసిద్ధుడనే యతి, గోపకుమారుడితో కాశీ యాత్రకు బయల్దేరుతాడు. దారిపొడవునా కనిపించే వింతలు, విడ్డూరాల గురించి విడమరచి చెబితే గానీ రానంటాడు గోపకుమారుడు.
సరేనంటాడు యతి. ప్రతి మజిలీలో గోపకుమారుడు ఓ వింతను చూడటం, మణిసిద్ధుడిని అడగటం! దాని వెనుక ఉన్న వృత్తాంతం అంతా ఆయన చెప్పడం. లేని రెండు పాత్రలను సృష్టించి, వాటితో తన మస్తిష్కంలో మెదిలిన ఊహలకు అందమైన కథల రూపం ఇచ్చిన రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు. 1900 సంవత్సరంలో 360 మజిలీలతో, 12 భాగాలుగా వెలువడ్డాయి ఈ కథలు. దాదాపు 125 సంవత్సరాల్లో ఎన్నోసార్లు పునర్ముద్రణకు నోచుకున్నాయి. అనేక కావ్యాలకు, సినిమాలకు ప్రేరణనిచ్చిన కథలు ఇవి.
అక్కినేని ‘కీలుగుర్రం’ కథ కాశీమజిలీ కథలో ఊరిందే! ఎన్టీఆర్ ‘జగదేకవీరుని’ కథకు మూలం కూడా ఇందులోనిదే! ఈ కథలు చదువుతుంటే… ఆపాత మధురాలు అని పేరెన్నికగన్న జానపద చిత్రాలెన్నో మస్తిష్కంలో మెదులుతాయి. జంట బాహుబలి చిత్రాలు ఒక్కటై విడుదల అవుతున్న ఈ రోజుల్లో… ఈ జానపద కథలు ఎవరు చదువుతారు అన్న సందేహం చాలామందికి కలగడం సహజం. కోట్లు వెచ్చించి, ఏండ్లు ఖర్చు చేసి నిర్మించిన సినిమా అది! దర్శకుడి జిజ్ఞాసను తెరకెక్కించడం కోసం అంతలా కష్టపడ్డారు. రచయిత, దర్శకుడి ఊహను మనం సినిమాగా చూశాం.
ఇందులో మన సృజనాత్మకత ఏముంది? అదే ఈ కథలు చదువుతూ ఉంటే.. పాఠకుడి మనోఫలకంపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ కూడా చేయలేని గ్రాఫిక్స్ కదలాడుతాయి. మన ఊహలు ఏవేవో ఊసులు చెబుతాయి. అక్షరాలను సన్నివేశాలుగా మలిచి కనువిందు చేస్తాయి. మన మనసుకు ఇంతటి ఊహాశక్తి ఉన్నదా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కో కథ చదువుతున్న కొద్దీ.. కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఈ కథలు పెద్దలను, పిన్నలను అందరినీ అలరిస్తాయి.
తరాలుగా ఉర్రూతలూగించిన ఈ కథలకు కాలక్రమంలో సరళ అనువాదాల అవసరం ఏర్పడింది. వ్యావహారిక భాషలోకి మారేకొద్దీ.. కాశీమజిలీ కథలు మరింత రంజుగా పాఠకులను అలరించాయి. ఇప్పుడు వాటినే ‘శంకర విజయం’ నవలా
రచయిత నేతి సూర్యనారాయణ శర్మ అనుసృజన చేశారు. ఆనాటి మేటి కథల్లోని చిక్కుముళ్లను పరిహరిస్తూ.. 32 ప్రధాన కథలుగా కాశీమజిలీ కథలను మనకు అందించారు. ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో దాదాపు 128 వారాలు ప్రచురితమై పాఠకులను అలరించాయి. అలా వారం వారం ప్రచురితమైన కథలను మూడు సంపుటాలుగా మన ముందుకు తీసుకొచ్చారు రచయిత. సరళంగా సాగిపోయే ఈ కాశీమజిలీ కథలు… ఈ తరం చదివితే, భాషా జ్ఞానం
పెరుగుతుంది. వారి మెదళ్లలో సృజనాత్మకత చిగురిస్తుందనడంలో సందేహం లేదు.