ఒకప్పుడు చందమామ కథలు చదువుతూ నిద్రపోయిన బాల్యం. మరి నేడు స్మార్ట్‌ఫోన్ దగ్గరుంటే గానీ పడుకోని దైన్యం. కథలకు ఆదరణ తగ్గిపోతుందన్న సమయంలోనే తెలంగాణ సారస్వత పరిషత్తు నేటి బాలలకు మేలైన బహుమతి అందించింది. ‘బాల సారస్వతం’ పేరిట అందమైన 70 కథలను వండి వార్చింది. రెండుమూడు పేజీలకు మించని నిడివితో సాగిన ఈ కథలు.. పిల్లలకు టన్నులకొద్దీ నీతి సూత్రాలు అందిస్తాయి. ఓ కథలో.. వినోదిని సైకిల్ నేర్చుకునే సమయంలో కింద పడి గాయాలపాలవుతుంది. ఇక సైకిల్‌కు దూరంగా ఉండాలనుకున్న తనకు పడిలేస్తున్న సముద్రపు ‘కెరటం’ కనిపిస్తుంది. అలా పట్టుదలతో తాతయ్య, అమ్మమ్మల సహాయంతో సైకిల్ నేర్చుకుంటుంది.
పరీక్షలు పూర్తవ్వగానే మన పుస్తకాలను చింపకుండా లేనివారికి ఇచ్చి వారి చదువుకు తోడుగా నిలువాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది‘కాగితాల వాన’. మనం చేస్తున్న తప్పిదాల వల్ల రేపటి తరమంతా పీల్చేగాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ‘పర్యావరణం బాగుంటేనే’ కథ చెబుతుంది. టీచరంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదని. విద్యార్థి భవిష్యత్తును తీర్చి దిద్దేవాడన్నదానికి నిరంజన్ సార్ సాక్ష్యం. మత్తు పానీయాలకు బానిసలైన విద్యార్థుల్లో ‘మార్పు కోసం’ ఊరిలో లైబ్రరీ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు వారిని సిద్ధం చేసిన వైనం.. ఎందరో ఉపాధ్యాయులకు ఆదర్శం. ఇలా ప్రతీ కథలో నీతి దాగున్నది. పిల్లలకోసం పెద్దలు రాసిన ఈ కథలను ప్రతి విద్యార్థి చదివి ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పేజీలు: 183, ధర: రూ.210
ప్రతులకు: తెలంగాణ సారస్వత పరిషత్తు తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్
-రాజు పిల్లనగోయిన