ఇది స్త్రీవాద సాహిత్యానికి మాత్రమే చెందిన కథా సంపుటి అనుకుంటే పొరపాటే. మగవాడితో పాటు అన్నిరంగాల్లో పనిచేస్తున్న మహిళలు, కుటుంబంలోని స్త్రీల అంతరంగం గురించి ఆలోచించే ప్రతి మగవాడికీ ఈ కథా తరంగిణి చెందినదే. ఇందులోని పదహారు కథలు చదివిన తరువాత అందరూ ఆలోచించాల్సిందే. తాము చేసిన తప్పులను ఆమోదించాల్సిందే. నేటి కుటుంబాలు, మనుషుల మధ్య తెలియని పలుచని అడ్డుగోడలు, ఆనందాలు, అగాధాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను తన కథల్లో పండించారు.
కుటుంబం కోసం ఉపాధి బాటపట్టిన రాధికకు అవమానాలు ఎదురైనా.. ఆమె ‘అపరాజితగా’నిలిచిన వైనం ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఒక నటి జీవితం వెనుక దాగిన కఠిన నిజాలు, తన కలను నిజం చేసుకునేందుకు ఎదురయ్యే అడ్డంకులు, చివరికి స్వీయగెలుపు దిశగా సాగిన ‘సంధ్యాతీరం’ మరో మేలైన కథ. ఇలా తన కథల్లో స్త్రీని శక్తికి ప్రతీకగా చూపించారు రచయిత్రి. అదే సమయంలో హింసించే జాతిలోనే కాపాడే వారున్నారని, తోడుగా నిలిచేవారుంటారని మగవారికీ సమన్యాయం చేశారు. ఈ కథలన్నీ మనచుట్టే జరిగినట్టుగా అనిపిస్తాయి.
రచయిత: గొర్తి వాణి శ్రీనివాస్
పేజీలు: 146, ధర: రూ.150
ప్రతులకు: 9441345651
-రాజు పిల్లనగోయిన