ఆర్థిక లావాదేవీల్లో గొలుసుకట్టు పథకాల గురించి వార్తల్లో తరచుగా వింటూ ఉంటాం. పాంజీ స్కీమ్స్ అంటే ఇవే. వీటిలో చేరేవాళ్లు తమతోపాటు మరికొంత మందిని చేర్పించాలి. సభ్యత్వ రుసుముతోపాటు తాము చేరిన సంస్థల ఉత్పత్తులను కొనాలి. వాటిని సభ్యులకు అమ్మాలి. అదీ మార్కెట్లో తక్కువలో దొరికే అలాంటి వస్తువు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధరకు! ఇలా చేస్తే కోటీశ్వరులైపోతారు, విలాసవంతమైన జీవితం సొంతమైపోతుంది అంటూ ఈ తరహా పథకాలు ఊదరగొడుతుంటాయి.
ఇలాంటి పథకాల వల్ల పైస్థాయిలో ఉండే ఏ కొద్దిమందో తప్ప కిందిస్థాయిలో ఉండేవాళ్లకు ఏ ప్రయోజనం చేకూరదు. పైగా ఈ పథకాల్లో భాగమైన ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమైపోయాయి. మల్టి లెవల్ మార్కెటింగ్ మాయాజాలాన్ని సీనియర్ జర్నలిస్ట్ అరుణా రవికుమార్ ‘ఆశల దోపిడి’లో కళ్లకు కట్టారు. గొలుసుకట్టు పథకాల ఆనుపానులన్నీ ఈ పుస్తకంలో తేటతెల్లం చేశారు. ప్రభుత్వ చర్యలు,కోర్టు తీర్పులు ఎలా ఉన్నా వీటి బారినపడి మోసపోకుండా ఉండే బాధ్యత ప్రజలదేనని హెచ్చరించారు.
రచన: అరుణా రవికుమార్
పేజీలు: 136; ధర: 249
ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 99480 98883
కాకతీయులు తెలుగు ప్రాంతాలను దాదాపు మూడు శతాబ్దాల పాటు పాలించిన రాజవంశం. రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఈ వంశంలో పేరుగాంచిన రాజులు. వీరి కాలంలో తెలంగాణలో ఎన్నో కోటలు, దేవాలయాలు, చెరువులు నిర్మాణమయ్యాయి. వీటిలో కొన్నిటిని కాకతీయ సామంతులు నిర్మించడం విశేషం.
అయితే, ప్రధాన చరిత్రలో ప్రస్తావనకు రాని మరికొన్ని విశేషాలను కన్నెకంటి వెంకటరమణ ‘కాకతీయుల గురించి మరికొంత…’ అనే చిరు పుస్తకంలో వివరించారు. ఇందులో రామప్పగుడి నంది ప్రత్యేకత, రాజ్య రక్షణకు కాకతీయులు తీసుకున్న చర్యలు, రామప్ప, వేయిస్తంభాల గుళ్ల పరిరక్షణకు గులాం యాజ్దానీ చేసిన కృషి, లజ్జాగౌరి శిల్ప వివరణ, హైదరాబాద్ నగరంలో పురాతన ఆలయాలతోపాటు ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రం మొదట ఎక్కడ ఉండేదో తదితర అంశాలపై వెంకటరమణ రాసిన వ్యాసాలు పాఠకులకు కొత్త సంగతులను తెలియజేస్తాయి.
రచన: కన్నెకంటి వెంకటరమణ
పేజీలు: 80; ధర: రూ. 100
ప్రతులకు: ఫోన్: 94903 96828