పిల్లలను పెంచడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ జర్నీలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక సవాలుగా ఉంటుంది. పాత రోజుల్లో భయం, శిక్షల ద్వారా క్రమశిక్షణ అమలు చేసేవారు. చైల్డ్ సైకాలజీ, మోడరన్ పేరెంటింగ్ విధానాలు సానుకూల క్రమశిక్షణ ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతున్నాయి. ఇది కేవలం పిల్లల తప్పులను సరిదిద్దడం మాత్రమే కాదు, వారి జీవితానికి అవసరమైన నైపుణ్యాలను, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం. సానుకూల క్రమశిక్షణ అనేది పిల్లల ప్రవర్తనను సరిదిద్దడానికి ఉపయోగించే విధానం. ఇందులో శిక్షలకు, అవమానాలకు తావు ఉండదు. పరస్పర గౌరవం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలను నేర్పడంపై దృష్టి పెడుతుంది. ఇది దీర్ఘకాలికంగా ప్రభావం చూపే అంతర్గత క్రమశిక్షణను అలవాటు చేస్తుంది.
పిల్లల పెంపకంలో సానుకూల క్రమశిక్షణను అలవాటు చేయాలంటే ఆరు విషయాలను పాటించాలి. వాటిని పాటిస్తే పిల్లలు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారు.
1.ఆదరణ, పట్టుదల
సానుకూల క్రమశిక్షణలో ప్రధాన సూత్రం ఆదరణ, పట్టుదలను సమన్వయం చేయడం.ఆదరణ: పిల్లల భావాలను, అవసరాలను అర్థం చేసుకోవడం, వారి పట్ల ప్రేమను, గౌరవాన్ని చూపించడం. వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి దగ్గరగా ఉండటం.
పట్టుదల: పిల్లలు స్పష్టమైన, స్థిరమైన నియమాలను, హద్దులను పాటించేలా చూడటం. నియమాలను పాటించడంలో రాజీ పడకపోవడం.
పిల్లలు తమ తప్పుల నుంచి నేర్చుకోవడానికి, కుటుంబంలో వారు ముఖ్యమైన భాగమని అనుభూతి చెందడానికి ఈ సమన్వయం చాలా అవసరం.
2.ప్రవర్తనకు కారణం కనుక్కోవడం
పిల్లలు తప్పుగా ప్రవర్తించినప్పుడు, వారి ప్రవర్తన వెనుక ఏదో ఒక అవసరం తీరలేదని అర్థం చేసుకోవాలి. ‘కోపం’, ‘అల్లరి’ లాంటి ప్రవర్తనలు కేవలం పైకి కనిపించే లక్షణాలు మాత్రమే.
గమనించడం: పిల్లలు దేనికోసం ఆరాటపడుతున్నారు? వారికి శ్రద్ధ కావాలా? లేక శక్తిని చూపించాలనుకుంటున్నారా? లేదా ఏదైనా విషయంలో నిస్సహాయంగా భావిస్తున్నారా? అని గమనించి వాటి మీద దృష్టి సారించాలి.
అవసరం గుర్తించడం: పిల్లలు సాధారణంగా సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కోసం ప్రయత్నిస్తారు. ఈ అవసరాలు తీరనప్పుడే అల్లరి చేస్తారు.తల్లిదండ్రులు వారి అవసరాలను సానుకూల పద్ధతిలో తీర్చడానికి సాయం చేయాలి.
3.ప్రభావవంతమైన సంభాషణ
పిల్లలతో మాట్లాడే విధానం వారి క్రమశిక్షణను ప్రభావితం చేస్తుంది.
శ్రద్ధగా వినడం: పిల్లలు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినడం అవసరం. వారు చెప్పేది నిజంగా వినండి. అప్పుడే వారు గౌరవం పొందినట్లుగా భావిస్తారు.
నేను’తో ప్రారంభం: ‘నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు!’ అనడానికి బదులు, ‘నువ్వు అరిచినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది’ అని చెప్పండి. ఇది పిల్లలను నిందించకుండా, వారి ప్రవర్తన మీపై చూపే ప్రభావాన్ని తెలియజేస్తుంది.
సమస్య-పరిష్కారం: పిల్లలు ఒక తప్పు చేసినప్పుడు, ‘నీకు శిక్ష వేస్తున్నాను’ అని చెప్పడానికి బదులు, ‘ఈ సమస్యను ఎలా పరిష్కరించగలం? ఇంకోసారి ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?‘ అని అడగండి. దీనివల్ల పరిష్కారం కనుగొనడంలో పిల్లలూ భాగస్వాములు అవుతారు.
4. తార్కిక పరిణామాలు Vs శిక్ష
సానుకూల క్రమశిక్షణలో శిక్షకు బదులుగా తార్కిక పరిణామాలు ఉపయోగించాలి. శిక్ష భయాన్ని, పగను పెంచుతుంది. తార్కిక పరిణామాలు పిల్లలకు తమ చర్యల బాధ్యతను నేర్పుతాయి. ఉదాహరణకు బొమ్మలు విసిరేస్తే శిక్షగా టీవీ ఆపేయడం బదులు విసిరేసిన బొమ్మలను శుభ్రం చేసే బాధ్యతను అప్పగించాలి. తార్కిక పరిణామాలు అమలుకు RRR సూత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు పిల్లలకు అప్పజెప్పే పనులు రిలేటెడ్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గా, రీజనబుల్‌గా ఉండాలి.
5. మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం
పిల్లలు సరిగా ప్రవర్తించినప్పుడు దాన్ని గుర్తించి అభినందించడం చాలా ముఖ్యం.
ప్రోత్సాహం: ‘నువ్వు చాలా తెలివైన దానివి’ అని ఫలితం ఆధారంగా ప్రశంసించకుండా, ‘నువ్వు ఈ పనిని పూర్తి చేయడానికి ఎంత కష్టపడ్డావో చూశాను, నీ కృషికి అభినందనలు’ అని వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
రొటీన్లు, నియమాలు: ఇంట్లో స్థిరమైన రొటీన్లు, స్పష్టమైన నియమాలను ఏర్పాటు చేయండి. పిల్లలు తాము ఏమి ఆశించాలో తెలుసుకున్నప్పుడు, వారు నియమాలను పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నియమాలను ఏర్పాటు చేయడంలో పిల్లలను కూడా భాగస్వాములను చేయండి.
6. స్వీయ-క్రమశిక్షణ, బాధ్యత
సానుకూల క్రమశిక్షణ అంతిమ లక్ష్యం పిల్లలు బయటి ఒత్తిడి లేకుండా తమను తాము నియంత్రించుకునే శక్తిని పొందడం.
సానుకూల క్రమశిక్షణ అనేది ఒక రాత్రిలో వచ్చే మార్పు కాదు, ఇది నిరంతర అభ్యాసం. తల్లిదండ్రులు స్థిరంగా, సహనంతో, ప్రేమతో వ్యవహరించడం ద్వారా పిల్లలు క్రమశిక్షణ కలిగిన, బాధ్యతాయుతమైన,ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులుగా ఎదుగుతారు. మన లక్ష్యం కేవలం తప్పులను ఆపడం కాదు, రేపటి కోసం మానసికంగా దృఢంగా ఉండే పౌరులను తయారు చేయడం.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261