ఒకప్పటి వేసవి సెలవులు వేరు. ఎండవేడి తగలకుండా ఇండోర్ గేమ్స్ ఆడుతూ, మధ్యలో ఓసారి తాతయ్య ఊరికి వెళ్లి వస్తూ.. ఇంకా కుదిరితే ఏదైనా పుణ్యక్షేత్రానికి బయల్దేరేలా ప్లాన్ చేసుకునేవాళ్లు. ఇప్పుడలా కాదు. వేసవి, బతుకమ్మ.. ఆ మాటకు వస్తే శనాదివారాలు కలిసి వచ్చేలా ఓ నాలుగు రోజుల విడుపు వస్తే చాలు.. ఊళ్లకి ఊళ్లు ఖాళీ అయిపోతున్నాయి. సిటీలో అయితే మరీనూ! అలుపెరగని ఉద్యోగాలు, ఊపిరి తిప్పుకోనివ్వని చదువుల మధ్య ఏ కాస్త వెసులుబాటు వచ్చినా కారు గేరు మార్చి రయ్యిమనడమే! ఇప్పుడు పర్యటన కోసం ఖర్చుకి వెనకాడటం లేదు. యాత్ర అంటే తీర్థయాత్రే అనే పరిమితి లేదు. రవాణా సౌకర్యాలు, విడిది విషయంలోనే కాదు.. ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనే ఆలోచనల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చేసింది. స్క్రీన్ టూరిజం, సోలో టూరిజం, లాంగ్ స్టే టూరిజం… పేర్లు తెలిసినా తెలియకపోయినా అనుసరిస్తున్న పద్ధతులలో భిన్నత్వం కనిపిస్తున్నది. అలాంటి సరికొత్త ట్రెండ్స్ గురించి తలుచుకునే ప్రయత్నమిది!
1990 లలో మొదలైన ఆర్థిక సంస్కరణలు మన జీవనశైలిలో చాలా మార్పులే తెచ్చాయి. సాంకేతిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత ఉన్నవారికి సంపాదన పెరిగింది. దాన్ని ఖర్చు చేసే దృక్పథమూ మారింది. కానీ వీలైనంతగా దాచుకోవాలనే తపన మాత్రం తగ్గలేదు. కొవిడ్ తర్వాత అది కూడా మారింది. ఉన్న కొద్దిపాటి జీవితం చేజారిపోక ముందే.. దాన్ని ఆస్వాదించాలనే తత్వం నేర్పింది. ఫలితం! కొవిడ్ వరకు అరకొరగా ఉన్న టూరిజం.. ఆ తర్వాత పరుగులు తీసింది. ఏటా 15 శాతానికి పైగా పెరుగుతున్నది. 2030 నాటికి దేశీయంలో 500 కోట్ల పర్యటనలు చేస్తారనే అంచనా వచ్చేసింది. తీరు మారుతున్నది పర్యటనతో అందరికీ లాభమే. తిరిగేవారికి కావల్సినంత కాలక్షేపం, కుటుంబంతోనో స్నేహితులతోనో గడిపే అవకాశం, తనని తాను వెతుక్కునే ప్రయత్నం. ఇక ఆ పర్యటన కోసం చేసే ఖర్చుతో ప్రభుత్వం నుంచి హోటళ్ల వరకూ దారి పొడవునా అందరికీ లాభమే. ఇందులో సరికొత్త ట్రెండ్స్ రావడంతో ఇప్పుడు టూరిజం కూడా మూలమూలలకీ విస్తరిస్తున్నది.

ఇది మనకు కొత్తేమీ కాదు. ఓసారి పాత సినిమాలు గుర్తుచేసుకోండి. కశ్మీరులో దాల్ సరస్సు, కర్ణాటకలో బృందావన్ గార్డెన్స్, రాజస్థాన్ కోటలు, చార్మినార్, మెరీనా బీచ్.. ఇవన్నీ కనిపించేవి. జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రదేశాలకు వెళ్లాలని కలలు కనేవాళ్లు చాలామంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మరింతగా విస్తరించింది. బాహుబలి, మన శివశంకర వరప్రసాద్, ఏ మాయ చేశావే.. లాంటి ఎన్నో సినిమాల్లో చూపించిన కేరళంలో పర్యటించేవారి సంఖ్య పెరిగింది. ఓ మోస్తరుగా ఆడిన నా ఆటోగ్రాఫ్ సినిమా కూడా కేరళం మీద మనసు పారేసుకునేలా చేసింది. గుణ లాంటి పాత సినిమాలను తవ్వి మరీ.. అందులో చూపించిన గుహలను చూసేందుకు వరుస కడుతున్నారు. మధ్యతరగతి జీవులు దేశీయమైన స్క్రీన్ టూరిజంతో తృప్తి పడితే, కాస్త ఉన్నవాళ్లు విదేశాలకీ పయనమవుతున్నారు. దూకుడులో కనిపించే టర్కీ నుంచి దురంధర్‌లో చూపించిన బలూచిస్తాన్ వరకు చాలాచోట్లకి స్క్రీన్ టూరిజం పెరిగింది.
సినిమాల నుంచి సామాజిక మాధ్యమాలకు చేరుకోవడం స్క్రీన్ టూరిజంలో వచ్చిన మరో మార్పు. అప్పటిదాకా నిద్రాణంగా ఉన్న ప్రదేశాలకు ఓ ప్రవచనకారుడు చెప్పాడనో, నచ్చిన ఇన్ఫ్లూయెన్సర్ గొప్పగా చూపించాడనో పర్యటనకు సిద్ధపడటం. అనంతగిరి హిల్స్ నుంచి శ్రీరంగపురం (వనపర్తి) వరకు ఇన్‌స్టా రీల్స్‌తో ప్రచారం పెంచుకున్న ప్రదేశాలెన్నో! ఓసారి గుర్తుచేసుకోండి. మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో చూసి ఇలాంటి ఓ ప్రదేశానికి వెళ్లే ఉంటారు.


శాన్ఫ్రాన్సిస్కో వెళ్లినవారు అక్కడి అల్కట్రాజ్ జైలును చూడాలనుకుంటారు. మన దగ్గర అండమాన్ జైలును కూడా. చరిత్రలో చేదుపుటలను గుర్తుచేసే ప్రదేశాలకు వెళ్లడమే డార్క్ టూరిజం. చెర్నోబిల్, హిరోషిమా, న్యూయార్క్ ట్విన్ టవర్స్ ఉన్న గ్రౌండ్ జీరో, నాజీల క్యాంపులు.. అన్నీ ఈ డార్క్ టూరిజం కిందకే వస్తాయి. నానాటికీ పెరుగుతున్న ఈ ట్రెండ్ మీద నెట్‌ఫ్లిక్స్ ‘డార్క్ టూరిజం’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఇలాంటి ప్రయాణాలు చేసి తిరిగి వచ్చినవారిలో జీవితం పట్ల ఓ రకమైన కృతజ్ఞత కలుగుతుందని ఇందులో తేల్చారు. అప్పటి కష్టాలతో పోలిస్తే తాము చాలా సుఖంగా, సౌకర్యంగా ఉండటం అదృష్టమనే భావనే ఇందుకు కారణం.
డార్క్ టూరిజంలో భాగంగానే వార్ టూరిజం చెప్పుకోవచ్చు. భీకర యుద్ధాలు జరిగిన ప్రదేశాలు, సైనిక స్మారకాలు ఈ కోవలోకి వస్తాయి. ఇండియా గేట్ ఇందుకు కచ్చితమైన ఉదాహరణ. ప్రపంచ యుద్ధాలు జరిగిన చోట్ల అడుగడుగునా ఈ వార్ మెమోరియల్స్ కనిపిస్తాయి. ఇందులోనే మిలటరీ టూరిజం మరో విభాగం. యుద్ధపరికరాలు, వాహనాలు, మ్యూజియాలను చూసే ప్రయత్నమిది. వైజాగ్‌లో కనిపించే సబ్‌మెరైన్ మ్యూజియం, ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం తెలుగువాళ్లకి ఇష్టమైన పర్యటనలుగా మారుతున్నాయి. బేగంపేటలో జరిగే ‘వింగ్స్ ఇండియా’ వైమానిక ప్రదర్శనకి కూడా పర్యటకుల తాకిడి పెరుగుతున్నది.
యాత్ర అనగానే మనకు కొన్ని నిబంధనలు గుర్తుకొస్తాయి. రాత్రివేళల్లో ప్రయాణం చేసి ఏదన్నా ప్రముఖమైన ప్రదేశానికి చేరుకోవడం. అక్కడ ఓ నాలుగైదు రోజులు ఉండి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసుకోవడం. వాటిని కెమెరాల్లో బంధించడం. క్షేమంగా మరో రాత్రి ప్రయాణంతో ఇంటికి తిరిగి రావడం. కానీ…

ఒకప్పుడు సంక్లిష్టమైన చికిత్సలు కావాలంటే అమెరికా, ఇంగ్లండ్ వెళ్లేవారు. పరిస్థితులు మారిపోయాయి. ఎలాంటి చికిత్సలకైనా ఆసియా దేశాలు దిక్సూచిలా మారాయి. మన దేశం అయితే క్రమంగా తొలి పది స్థానాల్లో చోటు సంపాదించుకుని ఇంకా పైకి ఎగబాకుతున్నది. సంతాన సాఫల్యం, గుండె సమస్యలు, అవయవ మార్పిడి, కీళ్ల మార్పిడి.. ఇక్కడ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా చవకగా జరిగిపోతున్నవి. బయట నుంచి సరే! మనవాళ్లు కూడా టర్కీలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కీ, కాస్మెటిక్ సర్జరీల కోసం థాయ్లాండ్కీ వెళ్తున్నారు. దేశీయంగా కూడా గ్యాస్ట్రో, ఆర్థోపెడిక్ వంటి రంగాల్లో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతున్నది. మరి ఇక్కడివాళ్లు! ఆయుర్వేదం, నేచురోపతులతో దీర్ఘకాలిక రోగాలనీ, మలినాలనీ వదిలించుకునేందుకు కేరళం బాట పడుతున్నారు.

రోమన్ సామ్రాజ్యంలో బానిసలు కొట్టుకు చచ్చే గ్లాడియేటర్ యుద్ధాల గురించి విన్నాం. కానీ మనుషుల్ని కాల్చి సంబరపడే నరకం ఈమధ్యనే నిజమైంది. 1990లలో బోస్నియా రాజధాని అయిన సరయెవో, సెర్బ్ దళాల చేతిలో ఉండేది. ఆ సమయంలో ఇటలీ, రష్యా, అమెరికా లాంటి సంపన్న దేశాల నుంచి పర్యటకులు వచ్చేవారు. వాళ్ల ఉద్దేశం యాత్ర కాదు… వధ! స్థానిక సైనికులకు డబ్బులిచ్చి వారి ఆధీనంలో ఉన్న స్థావరాల్లో మాటు వేసి ఉండేవారు. బతుకు తెరువు కోసం వీధుల్లోకి అడుగుపెట్టినవాళ్లను పిట్టల్లా కాల్చి సంబరపడేవాళ్లు. సరయెవో సఫారీగా పిలుచుకునే ఈ పైశాచికానందం కోసం కోట్లు ఖర్చుపెట్టేవాళ్లు. ఓ అంచనా ప్రకారం ఈ స్నైపర్ టూరిజం బుల్లెట్ల దాడిలో వెయ్యిమందికి పైగా గాయపడితే.. రెండు వందలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

మెరైన్ టూరిజం:
తెలుగువారికి పడవ ప్రయాణం గురించి ప్రత్యేకించి చెప్పాలా! లంకలు, తీరాలు దాటేందుకే కాదు నది మీద భద్రాచలం లాంటి దూర ప్రయాణాలూ చేసేవారు. ఇప్పుడదే మళ్లీ ట్రెండింగ్ అవుతున్నది. ముంబై, చెన్నై, వైజాగ్, కొచ్చిన్ లాంటి తీర ప్రాంతాల నుంచి గోవా, అండమాన్, లక్షద్వీప్ లాంటి ప్రాంతాలకు ఖరీదైన క్రూజ్‌లు నడుస్తున్నాయి. హోటల్ నుంచి థియేటర్ వరకు సకల సౌకర్యాలూ ఉండే ఈ నౌకల్లో తీరం చేరుకోవడం ఎంత సంతోషమో.. ప్రయాణం అంతకంటే సౌకర్యంగా ఉంటున్నది.
అడవిలోకి:
సిటీకి ఓ వంద కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక అడవి కనిపిస్తుంది. వారాంతంలో వెళ్లిపోతే ఓ రెండు రోజులపాటు ఆ తల్లి ఒడిలో హాయిగా గడిపేయవచ్చు. టెంట్, క్యాంప్ ఫైర్, గ్రిల్.. లాంటి చిన్నపాటి వసతులే అద్భుతంగా తోచే అవకాశమిది. పచ్చటి గడ్డే పరుపుగా, సూర్యోదయాలే మెలకువగా, రెక్కలు లేని పక్షుల్లాగా పచ్చదనం మధ్య ఊపిరి పీల్చుకునే ఈ ట్రెండ్ ఇప్పుడు మంచి ఊపుమీదుంది. సోమశిల, అనంతగిరి, మంచిరేవుల, అమ్రాబాద్.. ఇలా తెలంగాణలో ఫారెస్ట్ టూరిజానికి లెక్కలేనన్ని లక్ష్యాలున్నాయి.
అగ్రి టూరిజం:
కలుపు నుంచి కుప్ప వరకూ సాగుతో సంబంధం ఉన్న మాటలేవీ తెలియని రోజులు వచ్చేశాయి. ఆహారం, శ్రమ, ప్రకృతి.. వీటన్నిటి విలువ తెలియాలంటే ఇప్పటి పిల్లలకు ఆ పొలాలు చూపించాల్సిందే. ఆ పచ్చటి వాతావరణం మధ్య పెరగడం కార్పొరేట్ జీవులకూ ఊరటే. ఇందులో భాగంగా పల్లెల్లో బస చేయించి పత్తి, పసుపు లాంటి రకరకాల పంటలను పాడిపశువుల పెంపకాన్ని దగ్గరగా చూపిస్తారు. మహరాష్ట్రలో మొదలైన ఈ అగ్రి టూరిజం ప్రస్తుతం లక్షలమంది యాత్రికులతో పచ్చగా ఉంది.
ఇవే కాదు రోప్ వే టూరిజం, కార్వాన్ టూరిజం, హెరిటేజ్ టూరిజం.. ఇలా రకరకాల యాత్రలకు సిద్ధమవుతున్నారు. టూరిజాన్ని కూడా ప్రముఖ ఆదాయవనరుగా గుర్తించిన ప్రభుత్వాలు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎవరూ సాయం చేయాల్సిన పని లేకుండా యాత్రాస్థలంలో సమస్త బాధ్యతలూ తీసుకునే టూరిస్ట్ ఆపరేటర్లు, సొంత వాహనాలు, గూగుల్ మ్యాప్స్ లాంటి సాధనాలూ.. అన్నీ క్షేమంగా వెళ్లి, సౌఖ్యంగా గడిపి, సంతృప్తిగా తిరిగిరమ్మని వెన్ను తడుతున్నాయి.

ఇంటికి అతిథులు వస్తే ఎవరికైనా సంబరమే. కానీ అందులోనూ ఆతిథ్యం ఓ ఆదాయవనరు అయితే సంతోషమే. కానీ ఇల్లే అతిథులతో నిండిపోతే.. మన ఉనికికే ప్రమాదమనిస్తే. కొన్ని ప్రదేశాలకు వెల్లువెత్తిన టూరిస్టులు ఇలాంటి భయమే కల్పించారు. పొలోమని ఒకే చోటికి పోటెత్తే పరిస్థితిని ఓవర్ టూరిజం అంటారు. ఉదాహరణకు నెదర్లాండ్స్‌లోని గెతూర్న్ అనే పల్లె… పాత కాలపు ఇళ్లు, వందకు పైగా వంతెనలతో చూసేందుకు స్వర్గంలా ఉంటుంది. అక్కడి స్థానిక జనాభా మూడు వేలకు మించదు. కానీ ఏటా వచ్చే పర్యటకుల సంఖ్య మాత్రం పది లక్షలకు పైమాటే.
2024-25లో స్పెయిన్ ప్రజలు పర్యటకులకు వ్యతిరేకంగా చాలా ప్రదర్శనలు చేశారు. వేలమంది వీధుల్లోకి వచ్చి హోటళ్లను మూసేస్తూ, పర్యటకుల మీద నీళ్లు చల్లుతూ నిరసన తెలియచేశారు. మెక్సికో, ఇటలీ, గ్రీస్ దేశాల్లోనూ ఇలాంటి ప్రదర్శనలు కనిపించాయి. గోవా నుంచి కూర్గ్ వరకూ మన దేశంలో కూడా స్థానిక నిరసనలు వినిపిస్తున్నాయి.
ఓవర్ టూరిజం వల్ల చాలా సమస్యలే వస్తాయి. స్థానికంగా ఉండేవారికి నీటి కొరత, అధిక ధరలు, ప్రశాంతత లేకపోవడం, కాలుష్యం లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఏ సౌందర్యం అయితే ఆకర్షించిందో… యాత్రికులు దాన్నే పీల్చి పిప్పి చేసేస్తారు. అందుకే ప్రభుత్వాలు కూడా ఓవర్ టూరిజం పట్ల చర్యలు తీసుకుంటున్నాయి. హిమాలయాల నుంచి తాజ్‌మహల్ వరకు ప్రతిచోటా పర్యటించేందుకు, అక్కడ సమయం గడిపేందుకు పరిమితులు విధిస్తున్నాయి. ఉదాహరణకు తాజ్‌మహల్ వద్ద మూడు గంటల కంటే ఎక్కువ సేపు గడిపితే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

మానవత్వం, సమానత్వం అంటూ ఎన్ని కబుర్లు చెప్పుకొన్నా.. తనకంటే పేదవాళ్లని చూస్తే మనిషికి అదో తృప్తి. కొంతమందికి అలాంటి పరిస్థితి జీవితం పట్ల కృతజ్ఞత పెంచితే, మరికొందరికి అదో అసంతృప్తి. అందుకే స్లమ్ టూరిజానికి గిరాకీ పెరుగుతూ వచ్చింది. రోడ్లు, పైకప్పే కాదు.. తాగునీరు, మరుగుదొడ్లు లేకుండా డ్రైనేజీల పక్కన గుడిసెల్లో గడిపే జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని కొందరికి ఆత్రుత. ఉదాహరణకు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా తర్వాత ముంబై ధారవిని చూసేందుకు విదేశీయులు పోటెత్తారు. ఈ టూర్లను ఏర్పాటు చేసేవారు చాలామంది, అక్కడి పేదవాళ్లకు డబ్బులిస్తామని చెప్పి అటు యాత్రికులను, ఇటు పేదలను మోసం చేస్తున్నారనే అపవాదు ఉంది.
ఒకప్పుడు ఊటీ, కొడైకనాల్, కూర్గ్ లాంటి ప్రాంతాలకు వెళ్లడం అంటే.. స్టేటస్ సింబల్ గా ఉండేది. ఇప్పుడలా కాదు! అవి కూడా పర్యాటక క్షేత్రాలుగా మారిపోయాయి. అర్బన్ ఐలాండ్, ఎల్‌నినో, గ్లోబల్ వార్మింగ్ పేరు ఏదైనా కానీయండి.. నానాటికీ పెరిగిపోతున్న తాపాన్ని తప్పించుకునేందుకు వేసవిలో ‘Coolcations’కి సిద్ధపడుతున్నారు. చలికాలంలో కూడా లంబసింగి లాంటి అతిశీతల ప్రదేశాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రపంచం అంతా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. ధృవానికి దగ్గరగా ఉండే నార్డిక్ దేశాలకు జనం క్యూ కడుతున్నారు.
యాత్ర అది కూడా కుటుంబంతో కలిసి ప్రయాణించడం అంటే, సురక్షితంగా ఉండాలని ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. రైల్వే ప్లాట్‌ఫాం మీదకు చేరుకోగానే వినిపించే మొదటి అనౌన్స్మెంట్ ఆ సురక్ష గురించే. కానీ, ఇప్పుడలా కాదేమో! వెళ్లాల్సిన చోట ప్రకృతి విపత్తులు రావచ్చని తెలిసినా, తీవ్రవాదుల దాడి జరిగినా.. పరిస్థితులు కాస్త సద్దుమణగ గానే తిరిగి వెళ్తున్నారు. MINTEL అనే సంస్థ జరిపిన పరిశీలనలో ఏకంగా 67 శాతం మంది బ్రిటిష్ పౌరులు, తీవ్రవాదుల దాడి జరిగినా కూడా ఇష్టమైన చోటికి వెళ్లేందుకు సిద్ధమే అని తేల్చారు. కొన్ని సందర్భాలలో ప్రమాదం జరిగిన వెంటనే పర్యటకుల తాకిడి పెరగడాన్నీ గమనించారు. మన దేశంలోనూ కేదార్నాథ్ వరదల తర్వాత పహల్గాంలో తీవ్రవాదుల దాడి తర్వాత మొదలవుతున్న పర్యటనలు చూస్తుంటే.. నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడిపేసేకంటే, బయటికి అడుగుపెట్టి లోకాన్ని చూసే స్వేచ్ఛనే జనం కోరుకుంటున్నట్టుగా ఉంది.
– కె.ఎల్.సూర్య