కొత్త ఏడాది రాగానే దాని ప్రత్యేకతలేంటి అని చూస్తాం. తేదీల నుంచి ఈవెంట్ల వరకూ ఏమేం విశేషాలున్నాయో గమనిస్తాం. గ్రహణాల్లాంటి పంచాంగ విషయాలనూ క్యాలెండర్‌లోనే వెతికేస్తాం. అలాంటి కొత్త ఏడాదిలో ఖగోళ వింతలు చోటు చేసుకుంటున్నాయంటే, ఇంకెంత ఆసక్తి నెలకొంటుందో కదూ! సౌర కుటుంబంలోని ఆరేడు గ్రహాలు ఒక దగ్గరికి రావడం, ఒకే గుంపుగా మన కళ్లకూ కనిపించనుండటం 2025 ప్రత్యేకత. ‘ప్లానెటరీ పరేడ్’గా పిలుస్తున్న ఈ గ్రహ గమనాల సంగతులు ఓసారి చూద్దాం.
జనవరి నెల వచ్చీరాగానే ఆకాశంలో తారలు తళుక్కు తళుక్కున మెరిశాయి. ఉల్కాపాతాలు నేలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ నెల నాలుగైదు తారీఖుల్లో నిమిషానికి రెండు చొప్పున తోకచుక్కలు కనిపించి ఖగోళాసక్తి ఉన్న వారికి పండుగ వాతావరణాన్ని రుచి చూపించాయి. కాలుష్యానికి దూరంగా వెళ్లి మామూలు కంటితో చూసిన వాళ్లు కొందరైతే, టెలిస్కోపుల్లో మరింత సునిశితంగా గమనించి ఆనందించిన వారు మరికొందరు. ఇక, ఇదే ఏడాది జనవరి 25వ తేదీన ఏకంగా 6 గ్రహాలు ఒకే చోట గుమిగూడనున్నాయి. మార్చి నెలలో అయితే ఏకంగా 7 గ్రహాలు సమీపంలో ఉండటమే కాదు మనకు కనిపించబోతున్నాయి కూడా. ఇలా వరుస క్రమంలో గ్రహాలు అమరడాన్నే ‘ప్లానెటరీ పరేడ్’ అని పిలుస్తున్నారు.
ప్లానెట్ పరేడ్‌లో కుజుడు, గురువు, శుక్రుడు, శని, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలన్నీ దాదాపు ఒకే దిక్కున సమీపంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. జనవరి 21 నుంచే ఇవన్నీ ఇలా దగ్గర దగ్గరగా దర్శనమిచ్చే అవకాశం ఉన్నా 25న మరింత స్పష్టంగా గోచరిస్తాయి. నిజానికి ఇవన్నీ ఒకదానికొకటి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కానీ, ఈ గ్రహాలన్నీ ఈ సమయంలో సూర్యుడికి ఒకే వైపునకు రావడం వల్ల ఈ అద్భుతం ఆవిష్కృతం అవుతుందన్నమాట. ఇందులో దూరాన ఉండే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను మాత్రం టెలీస్కోప్‌తో చూస్తేనే కనిపించే అవకాశముంది.
మిగతా అన్నింటినీ మాత్రం నేరుగా చూడొచ్చు. అయితే ఇవన్నీ బాగా చూడాలంటే కాలుష్యం లేకుండా, నిర్మలాకాశం ఉండే చోటుని ఎంచుకోవడం మంచిది. ఆయా రోజుల్లో రాత్రి 8:30 తర్వాత నైరుతి మూల చందమామ చుట్టు పక్కల చుట్టాల్లా చెట్టాపట్టాలేసుకుని కనువిందు చేస్తాయీ గ్రహాలన్నీ. కాస్త నిశితంగా పరిశీలిస్తే, శ్వేత వర్ణంలో కాస్త పెద్ద సైజులో తేజోవంతంగా శుక్రుడు కనిపిస్తే, కనకపుష్యరాగం రంగులో అంటే బంగారు వన్నెలో బృహస్పతి అలరిస్తాడు. అరుణారుణ వర్ణంలో మెరిసిపోయేది కుజుడైతే, నీలికాంతుల్లో మిణుకుమనేది శనిగ్రహం. టెలీస్కోప్ నుంచి చూస్తే యురేనస్, నెప్ట్యూన్లు తళుకులీనుతూ కంటపడతాయి. ఇక, మార్చినెల 8న ఇలాంటి దృశ్యమే మరోసారి నీలాల నింగిలో కనువిందు చేయనుంది. అప్పుడైతే బుధుడు కూడా ఈ సమూహానికి జతవుతాడు. ఇంకేం,ఈ ఏడాది ఖగోళాసక్తి ఉన్న వారికి పండగే అన్నమాట!