అపసవ్య జీవనశైలి.. శారీరక శ్రమ లేని జీవనవిధానం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయనీ, దీర్ఘకాలిక వ్యాధులు చిన్న వయసులోనే పలకరిస్తాయనీ ఎప్పటినుంచో వింటున్నాం. ఇప్పుడు, ఈ జాబితాలో మరో సమస్యను చేర్చారు అయోవా విశ్వవిద్యాలయ పరిశోధకులు. అదే డిప్రెషన్! దీన్ని ధ్రువీకరించేందుకు కొవిడ్ సమయంలో మూడు వేల మంది అభ్యర్థుల దినచర్యను పరిశీలించారు. సహజంగానే చాలామంది లాక్డౌన్ కాలంలో… కంప్యూటర్లకు అతుక్కునే ఎక్కువ కాలం గడిపేశారు. ఆ సమయంలోనూ కాస్త అటూఇటూ కదిలేవారితో పోలిస్తే… వీరిలో మానసిక సమస్యలు అధికంగా కనిపించాయట. కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం లాంటి నెగెటివ్ భావనలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాబట్టి నిత్య వ్యాయామం, మితాహారం తదితర ఆరోగ్య సూత్రాలను పాటిస్తూనే మధ్యమధ్యలో కాసేపు కుర్చీలోంచి లేచి కాలు కదపడం ఉత్తమమని చెబుతున్నారు.