పుట్టింది మొదలు మరణించేవరకు మనిషి జీవితం నిరంతర సంఘర్షణల మయం. అలాంటి జీవితంలో వివిధ దశల గురించి మనిషి ఆలోచన ఎలా ఉంటుందనే దానిని కవి పెన్నా శివరామకృష్ణ ముక్తక లక్షణంతో, నాలుగు పాదాలలో ప్రతీకాత్మకంగా చిత్రిస్తూ వెలువరించిన కవితా సంకలనం ‘పెన్నా సరాలు’. రచయిత పేర్కొన్నట్లు ఇవి మాత్రా ఛందస్సులో సాగుతూ, గురజాడ ‘ముత్యాల సరాలు’ బాటలో నడుస్తాయి. ఈరోజు ఉండే పరిస్థితులు రేపు, రేపటివి ఎల్లుండికి ఉండవు. అవసరాలే అన్నీ నిర్ణయిస్తాయి. దీనినే “మొన్న దయ్యము, నేడు దేవత/ నిన్న దైవం, నేడు దయ్యము!/ అవసరాలే నిర్ణయించును/ ఎపుడు నెయ్యము కయ్యము” అంటారు శివరామకృష్ణ.
మరో సరంలో “అన్నిటికి ఎదురీదుతూనే/ కలిసి కాలం తోటి నడువు!/ అలసి ఆగిన తరువు కోసం/ పెరుగదెపుడూ రుతువు గడువు” అంటూ కాలంతోపాటే నడవాలి తప్ప, అలసి ఆగిపోతే కాలం ఆగదు అని హెచ్చరిస్తారు. యవ్వనంలో మనుషులకు ప్రేమ వ్యామోహం సహజమే. ప్రేమబంధాల్లో కొన్నిసార్లు దారితప్పడం, ‘ఎందుకిలా?’ అని ప్రశ్నించుకోవడమూ అంతే సహజం. దీనిని “భ్రమల చుట్టూ తిరుగుతూనే/ చాల దూరం వెళ్ళిపోయా!/ దారి తప్పిన ప్రతి సారీ/ మనసులోకే మరలిపోయా” అని అక్షరీకరించారు. ఇది కొంత తాత్తికంగా, ఆలోచనాత్మకంగా సాగుతుంది. మలిసంధ్యలో జీవితాన్ని సమీక్షించుకోవడం, మన కలలు కల్లలైన సందర్భాలను తలచుకొని వగవడం సాధారణం. ఈ అవస్థను “ఒక్క కల నెరవేర్చుకొనుటకు/ బతుకునే బలి చేసినాను!/ కడకు ఓటమి ఒప్పుకొంటూ/ మనసునే వెలివేసినాను” అంటారు. జీవన జ్వాలికలు, ప్రేమమాలికలు, సాంధ్య దీపికలు అనే మూడు భాగాలలో, 520 ముక్తకాలుగా సాగిన ‘పెన్నా సరాల’ నుంచి ఏరుకోవాల్సిన మంచి ముత్యాలు ఎన్నో.
పెన్నా సరాలు
రచన: పెన్నా శివరామకృష్ణ
పేజీలు: 152; వెల: రూ. 150/-
ప్రచురణ: ప్రవాహినీ ప్రచురణలు
ప్రతులకు: నవతెలంగాణ,
నవచేతన, నవోదయ బుక్ హౌస్
ఫోన్: 94404 37200
శంకర! పంచ శతి
(ఈతి బాధలు నీతి బోధలు)
రచన: డా॥ కూర్మాచలం శంకరస్వామి
పేజీలు: 132
వెల: రూ. 100
ప్రచురణ: అన్నపూర్ణ ప్రచురణ
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలు
ఫోన్: 93908 28188
ఆటా పాటా (బాలల కథలు)
రచన: ఎన్నవెళ్లి రాజమౌళి
పేజీలు: 104
వెల: రూ. 80
ప్రచురణ: మౌళి పబ్లికేషన్స్
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌజ్
ఫోన్: 98485 92331
కాళిదాసు మేఘసందేశమ్
రచన: డా॥ టి.లక్ష్మీనారాయణ
పేజీలు: 62
వెల: రూ. 70
ప్రతులకు: నవచేతన,
నవోదయ పుస్తక కేంద్రాలు
ఫోన్: 92900 93933
-హర్షవర్ధన్ చింతలపల్లి