పిల్లలకు లెక్కలు, సైన్సు, సోషల్ వంటి సబ్జెక్టులు స్కూల్లో నేర్పిస్తారు కానీ, జీవన నైపుణ్యాలు, భావోద్వేగ నైపుణ్యాలు, నాయకత్వం నైపుణ్యాలు నేర్పడం అనేది చాలా తక్కువ. ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. బడిలో చెప్పని పాఠాలు ఇంట్లో నేర్పాలి. బడిలో చదువు బతుకుతెరువు చూపిస్తే, పేరెంట్స్ నేర్పే నైపుణ్యాలు బతకడం ఎలాగో బోధిస్తాయి. పిల్లల్ని పెంచడం అనేది ఏదో గాలివాటంగా జరిగే పని కాదు. అది ఓ గురుతర బాధ్యత. ఈ విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోకూడదు.
పిల్లలు పెరిగే విధానం బట్టే భవిష్యత్తులో వాళ్లు ఎలా జీవిస్తారనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నగర, పట్టణ జీవనంలో పిల్లలకు తల్లిదండ్రులు తప్ప మిగతా ఎవరూ ఓ సలహా ఇచ్చే పరిస్థితి 90 శాతం కుటుంబాల్లో లేదు. తల్లిదండ్రులు తమ ఉద్యోగాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా రోజుకు కనీసం ఓ గంట చిన్నారులతో గడపాలి. తరగతి గది నేర్పించని ఎన్నో విషయాలపై అవగాహన పెంచాలి. వారికి తల్లిదండ్రులుగానే కాకుండా స్నేహితులుగానూ వ్యవహరించాలి. అప్పుడే వాళ్లు ఏ రంగంలోకి వెళ్లినా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.
భావోద్వేగాలపై అదుపు..
భావోద్వేగాల నియంత్రణ పిల్లల్లో పెద్ద సమస్యగా మారింది. ఐదేళ్ల పిల్లాడి నుంచి తల్లిదండ్రులు, గురువులపై ఆవేశంతో ఊగిపోతున్న చిన్నారులు ఎక్కువయ్యారు. ఇటీవల ఓ విద్యార్థిని ఉపాధ్యాయినిని అందరిలో తిడుతూ చెప్పు తీసి మరీ కొట్టడం మన తెలుగు రాష్ర్టాల్లోనే చూశాం. కేవలం సెల్‌ఫోన్‌ను ఉపాధ్యాయినిని తీసుకోవడమే తప్పయిపోయింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై దాడులు చేస్తున్న వారిని చూస్తున్నాం. ఎమోషన్స్‌ని ఎలా వెంటిలేట్ చేయాలో బడిలో నేర్పరు. ఆ బాధ్యత తల్లిదండ్రులదే.
వ్యక్తిత్వం చాలా ముఖ్యం..
నేటితరం పిల్లలకు మంచి వ్యక్తిత్వం అలవరిచే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకూ ఎక్కడెక్కడ ఎలాంటి అలవాట్లున్నాయో అన్నీ ఇప్పుడు ప్రతి ఇంటిలోకీ స్మార్ట్ఫోన్ల ద్వారా వచ్చేశాయి. చాలామంది పిల్లలు రీల్స్ చూసే చాలా విషయాలు నేర్చుకుంటున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటున్నది. మంచి నడవడిక కూడా పిల్లలను గొప్ప స్థానాల్లో కూర్చోబెట్టడానికి దోహదపడుతుంది.
సొంతంగా నిర్ణయం..
ప్రస్తుతం చాలామందిలో సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉండటం లేదు. ఈ పోటీ ప్రపంచంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించాలంటే సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లే సామర్థ్యం ఉండాలి. చిన్ననాటి నుంచే పిల్లలను సొంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సాహించాలి. వారి నిర్ణయంలో తప్పొప్పుల గురించి తెలియజేయాలి. ఒక వయసు వచ్చిన తర్వాత కుటుంబపరమైన నిర్ణయాల్లో పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
బానిస కానివ్వొద్దు..
తల్లిదండ్రులకు ఇప్పుడు స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాల నుంచే పెద్ద సవాలు ఎదురవుతున్నది. తిన్నా, పడుకున్నా, కూర్చున్నా చివరికి బాత్రూంలో ఉన్నా సామాజిక మాధ్యమాల్లోనే మునిగి తేలున్నారు. రీల్స్, షార్ట్స్, వీడియో గేమ్‌లతో గడిపేస్తున్నారు. ఇదో విష వ్యసనంలా మారింది. దీనికి విరుగుడు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. చిన్నప్పటి నుంచే నియంత్రించాలి. పోటీ పరీక్షల్లో, స్పోర్ట్స్‌లోనూ విజయం సాధించిన వారిని మీ విజయరహస్యం ఏంటని అడిగితే కొన్ని సంవత్సరాలు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉన్నానని చెబుతున్నారు. కాబట్టి, మీ పిల్లలను కూడా వీలైనంత వరకు స్మార్ట్ దునియాకు దూరంగా ఉంచండి. అవసరం మేరకే వాటిని వినియోగించేలా చూడండి.
వినూత్న ఆలోచనలు..
వచ్చేదంతా కృత్రిమ మేధకు అనుసంధానమైన కాలమే. విద్యార్థులు గొప్ప అవకాశాలను అందుకోవాలంటే తరగతి గదిలో పాఠాలు మాత్రమే చాలవు. సృజన, వినూత్న ఆలోచనలు ఉంటేనే రాణిస్తారు. పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగానే ఉంటుంది. చుట్టూ ఉండే విషయాల గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. అందుకే వారు ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. పేరెంట్స్ వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించాలి. ఏంటి ఈ సోది ప్రశ్నలు అంటూ విసుక్కుంటే పిల్లల సృజనాత్మకత, జిజ్ఞాసలను అడ్డుకున్నట్టే.
ప్రతిభను గుర్తించాలి..
బిడ్డల్లో దాగిన ప్రతిభను ముందుగా గుర్తించేది తల్లిదండ్రులే. ఆయా అంశాల్లో పిల్లలను ప్రోత్సహించి, వాళ్లు ఉన్నత స్థాయికి ఎదిగేంతవరకు అండగా నిలవాలి. సచిన్ టెండూల్కర్‌లో క్రికెట్‌పై ఆసక్తి గమనించి పేరెంట్స్ ప్రోత్సహించడం వల్లే మాస్టర్ బ్లాస్టర్ కాగలిగాడు.
మార్గదర్శకులుగా..
పిల్లలకు ఏది అవసరమో గుర్తించి ప్రేమపూర్వకంగా అందించేది తల్లిదండ్రులే. అది వారిలో భద్రతా భావాన్ని పెంపొందించి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తుంది. అదే సమయంలో పిల్లలు ఎక్కువగా పేరెంట్స్‌నే ఫాలో అవుతారని గుర్తుపెట్టుకోవాలి. ఇరుగుపొరుగు వారితో, బంధువులతో ఎలా ఉంటున్నారు అనేది పిల్లలు గమనిస్తూ ఉంటారు. అది వారి పర్సనాలిటీ పై ప్రభావం చూపుతుంది. పేరెంట్స్ ఎప్పుడూ పిల్లలకు రోల్ మోడల్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. పిల్లలకు కార్లు, బంగళాలు ఇచ్చామా అనేది ముఖ్యం కాదు. క్యారెక్టర్ ఇచ్చామా, లేదా అనేది ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొనే సామర్థ్యం ఇవ్వగలుగుతున్నామా అనేది ముఖ్యం. ఇవన్నీ తల్లిదండ్రులుగా మనం అందివ్వాల్సినవే!
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261