యమునా నది ఒడ్డున కొలువుదీరిన ఢిల్లీ నగరానిది యుగాయుగాల చరిత్ర. కానీ ఆధునిక కాలంలో ఢిల్లీ నగరం నుంచి విడుదలవుతున్న నానా రకాల కాలుష్యాలను మోస్తూ యమున ప్రపంచంలోనే అత్యంత మురికి నదుల్లో ఒకటిగా మారిపోయింది. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినా, వీడియోలు, వార్తల్లో పరోక్షంగా చూసినా మనసు చివుక్కుమంటుంది. యమున కాలుష్య కాసారంగా మారడం ఢిల్లీకి చెందిన పంకజ్ కుమార్‌ను కలచివేసింది. ఆ నది శుద్ధికి తనవంతుగా నడుంబిగించేలా చేసింది. కృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టమైన, కృష్ణుడి బాల్య విశేషాలను తనలో దాచుకున్న యమునను పునరుజ్జీవింప చేయడానికి పంకజ్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఆదివారం ఉదయం.. ఢిల్లీ మహానగరం వారాంతపు వేళ సద్దుమణిగి ఉంటుంది.
ఆ సమయంలో పంకజ్, అతని సహచరులు ఢిల్లీలోని కాళింది కుంజ్ దగ్గర యమున ఒడ్డుకు చేరుకుంటారు. చేతులకు గ్లవ్స్ తొడుక్కుని చెత్తకుప్పలు, ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను ఏరివేయడం మొదలుపెడతారు. పంకజ్ ఇంతకుముందు ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. కానీ, యమున శుద్ధికోసం పూర్తిగా అంకితమవడానికి ఆ ఉద్యోగానికి స్వస్తి పలికాడు. అంతేకాదు భారతదేశంలోని నదుల శుద్ధి కోసం ‘ఎర్త్ వారియర్స్’ అనే స్వచ్ఛంద సంస్థనూ స్థాపించాడు. భారతదేశంలో రోజుకు 7,300 కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదలవుతుంది. ఇందులో కేవలం 28 శాతమే శుద్ధి జరుగుతుంది.
మిగిలినదంతా నదుల్లో, ఇతర జల వనరుల్లో చేరిపోతుంటుంది. ఈ విషయమే పంకజ్‌ను ఆలోచింపజేసింది. నదుల శుద్ధికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించింది. అయితే, నదుల శుద్ధికి వ్యర్థాల ఏరివేత ఒక్కటే పరిష్కార మార్గం కాదు. కాబట్టి, పంకజ్ బృంద సభ్యులు దేశంలోని పన్నెండు రాష్ర్టాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఎలా పనిచేస్తున్నాయో పర్యవేక్షిస్తున్నారు. కాలుష్యం చేసేవారి మీద న్యాయపరమైన దావాలు వేస్తున్నారు. నదులను పరిరక్షించుకుంటేనే ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలకు తమ బాధ్యతను గుర్తుచేస్తున్నారు. అలా నదుల శుద్ధి దిశగా అందరినీ భాగస్వాములను చేస్తున్నారు. నదులు కలుషితం కావడానికి కారణం మనమే. వాటిని స్వచ్ఛంగా మార్చుకోవాల్సిన బాధ్యతా మనదే. పంకజ్ బృందం ప్రయత్నం దీన్నే గుర్తుచేస్తున్నది.