Panchangam | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్రం ప్రకారంగా తేది 29-03-2025 నుంచి చంద్రలగ్నాత్తు అష్టమ స్థానంలో నుంచి శని భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. తేది 14-05-2025 నుంచి భాగ్య స్థానాధిపతి గురు ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. పాలకులకు ఆర్థికపరమైన ఇక్కట్లు ఎదురవుతాయి. పాలన మందకొడిగా సాగుతుంది. సమస్యలకు మార్గాలు కనుగొనలేక సతమతమవుతారు. ప్రజా సంక్షేమం గాడి తప్పుతుంది. ప్రజలకు పాలకులపై విశ్వాసం సన్నగిల్లుతుంది.
వర్ష లగ్నం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తేది 30-3-2025 ఆదివారం సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్నది. ముందురోజు అనగా 29-3-2025 సాయంత్రం 4-29 గంటలకు సింహ లగ్నంలో పాడ్యమి తిథి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వర్షారంభ లగ్నం సింహం అయింది. లగ్నాత్తు అష్టమంలో పంచగ్రహ కూటమి నెలకొని ఉన్నది. దీని ప్రభావంతో దేశం ఆకస్మిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కొన్ని ప్రాంతాల్లో అస్థిరత ఏర్పడుతుంది. వ్యాధులు ప్రబలుతాయి. భూకంపాలు, పెను తుఫానులు సంభవించే ప్రమాదం ఉంది. లగ్నాధిపతి అష్టమంలో ఉన్న కారణంగా ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతుంది. ధన, లాభాధిపతి కూడా అష్టమస్థితిలో ఉండటం వల్ల… రాష్ర్టానికి రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. వ్యవసాయం కుంటుపడుతుంది. ప్రజలకు పాలకుల దన్ను కరువవుతుంది. తృతీయ, దశమాధిపతి అష్టమంలో ఉండటం వల్ల సరిహద్దు రాష్ర్టాలతో జలం విషయంలో జగడాలు తప్పవు. ప్రజల మధ్య పరస్పర వైషమ్యాలు ఏర్పడతాయి. చతుర్థ, భాగ్యాధిపతి ఏకాదశంలో ఉండటం వల్ల అకాల వర్షాలు, మండుటెండలు, తుఫానుల వల్ల నష్టం సంభవిస్తాయి. పంచమ, అష్టమాధిపతి దశమంలో ఉండటం వల్ల కొంత అనుకూల ఫలితాలు కలుగుతాయి. విద్యా రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. షష్ఠమ, సప్తమాధిపతి సప్తమంలో ఉండటం వల్ల కొంత మేలు జరుగుతుంది. వైద్య, ఆరోగ్య రంగం మెరుగైన ఫలితాలు సాధిస్తుంది.
జగల్లగ్నం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర పౌర్ణమి ఆదివారం తేది 13-04-2025 రోజున తెల్లవారుజామున 3-21 గంటలకు (14వ తేదీ) రవి మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. మేష సంక్రమణ సమయంలో ఉన్న కుంభం జగల్లగ్నం అయింది. లగ్న ద్వాదశాధిపతి శని.. ధన స్థానంలో పంచగ్రహ కూటమిలో ఉన్నాడు. ధన, లాభాధిపతి గురువు చతుర్థంలో, తృతీయ, దశమాధిపతి కుజుడు నీచలో ఉన్నారు. చతుర్థ, భాగ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో, పంచమ, అష్టమాధిపతి బుధుడు ద్వితీయంలో, షష్ఠమాధిపతి చంద్రుడు భాగ్యంలో, సప్తమాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు. ఈ గ్రహస్థితిని అనుసరించి సమష్టిగా పరిశీలిస్తే.. పాలకులకు గడ్డుకాలమనే చెప్పాలి. అనవసరమైన సదుపాయాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. వ్యాపార పరంగా విదేశాల్లో మనదేశానికి మంచి పరపతి దక్కుతుంది. వాణిజ్యం వృద్ధి సాధిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవించే ప్రమాదం ఉంది.
ఈ సంవత్సరం చాలా కాలం త్రిగ్రహ, చాతుర్గ్రహ, పంచగ్రహ కూటములు తారసిల్లుతున్నాయి. ఫలితంగా కాలం సజావుగా సాగదు. ప్రజలకు ఒడుదొడుకులు ఉంటాయి. ఎక్కువకాలం 3, 4 లేదా 5 గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తున్నాయి. త్రిగ్రహ – చాతుర్గ్రహ – పంచగ్రహ కూటములు ఎక్కువగా ఏర్పడినవి.
1. ఉగాది నుంచి 18-5-2025 వరకు మీనంలో శని-రాహువుల కలయిక వల్ల పాలకులకు ఇబ్బందులు. ప్రతికూల వాతావరణం వల్ల పంటలకు నష్టం.
2. ఉగాది నుంచి 14-5-2025 వరకు గురు-శని పరస్పరం త్రిక-ఏకాదశ (3-11) స్థానాల్లో ఉండటం వల్ల వింధ్య పర్వతం-శ్రీలంక మధ్య ఉన్న భూభాగంలో ప్రతికూల వాతావరణం నెలకొని ఉంటుంది.
3. ఉగాది నుంచి 27-7-2025 వరకు రాహు-కేతువుల మధ్య మిగతా గ్రహాల స్థితి కారణంగా కాలసర్పయోగం ఏర్పడుతుంది. దీంతో పాలకులకు సమస్యలు, పంటలకు నష్టం.
4. 16-5-2025 నుంచి సంవత్సరాంతం వరకు శని-రాహువులు ద్విర్దాదశ (2-12) స్థానాల్లో ఉండటం వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
5. 7-6-2025 నుంచి 28-7-2025 వరకు కుజ-కేతువుల కలయిక వల్ల పంటలకు నష్టం, భూకంప భీతి, తుఫానులు ఏర్పడే అవకాశం ఉంది.
6. 29-7-2025 నుంచి 14-9-2025 వరకు శని-కుజుల సమసప్తక స్థితి. అయోధ్య, శ్రీలంక మధ్య ప్రాంతంలో అనావృష్టి సూచన, పంటలకు నష్టం కలుగుతుంది.
7. 27-7-2025 నుంచి 20-08-2025 వరకు గురు-శుక్ర సమసప్తక స్థితి. వింధ్య పర్వతం, కావేరి నది మధ్య వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు ఉపాధి కోసం వలసబాట పడతారు.
8. 21-10-2025 నుంచి 28-11-2025 గురు అతిచారం, శని-వక్రం కారణంగా.. పాలకులకు ఇబ్బందులు తప్పవు. ప్రజలకు సంక్షేమం దూరమవుతుంది.
9. 6-6-2025 నుంచి 28-7-2025 వరకు కుజ వీక్షణతో శని మీన సంచారం. వర్షాభావం మూలంగా పంటలకు నష్టం.
10. 18-10-2025 నుంచి 5-12-2025 వరకు గురు వీక్షణతో మీన రాశిలో శని సంచారం. వర్షాభావం మూలంగా పంటలకు నష్టం.
11. 13-7-2025 నుంచి 28-11-2025 వరకు మీన రాశిలో శని వక్రాన్ని పొందుతున్నాడు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
12. 11-6-2025 నుంచి బుధోదయం ఆరుద్రాది పంచకంలో అవుతున్నది. పాలకుల మధ్య పరస్పర విభేదాలు ఏర్పడతాయి. అనావృష్టి ఛాయలు అలుముకుంటాయి. వ్యాధులు ప్రబలుతాయి.
13. 6-3-2026 నుంచి సంవత్సరాంతం కుజ, రాహులు కలిసి సంచరిస్తున్నారు. పంటలకు నష్టం. స్వల్ప భూకంప అవకాశం.
14. గురు రాశిత్రయ సంచారం. ప్రపంచంలో యుద్ధ వాతావరణం, ప్రజాగ్రహానికి కారణమవుతున్నది.
15. 17-11-2025 నుంచి 23-11-2025 వరకు వృశ్చిక రాశిలో త్రిగ్రహ కూటమి. 16-1-2026 నుంచి 7-2-2026 వరకు మకరరాశిలో నాలుగు గ్రహాల కూటమి, 13-2-2026 నుంచి 17-3-2026 వరకు కుంభరాశిలో నాలుగు గ్రహాల కూటమి, 26-2-2026 నుంచి 1-3-2026 వరకు కుంభరాశిలో పంచ గ్రహ కూటమి. 2026 మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా పలు దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. 11-11-2025 నుంచి 28-11-2025 వరకు శని, బుధుడు, గురు గ్రహాల వక్ర సంచారం కారణంగా యుద్ధాలు సంభవించే ప్రమాదం ఉంది.
సూచన: పైన పేర్కొన్న గ్రహ కూటమి సమయాల్లో యజ్ఞ యాగాదులు, దైవ ప్రార్థనలు, అభిషేకాలు చేయడం ద్వారా దేశారిష్టాలు, వ్యక్తిగత అరిష్టాలు దూరమై పరిస్థితులు సద్దుమణుగుతాయి.