హిందూమతం జీవేశ్వరులకు సాకార నిరాకారాలు రెండూ అంగీకరించినది. జీవుడు దేహంలో ఉన్నంతకాలం సాకారుడు. దాన్ని విడిచి మరో దేహం ధరించే కాలంలో నిరాకారుడు. అపుడతడు ఏ విధంగా ఉంటాడో ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు.
ఈశ్వరుడు కూడా అంతే. పరబ్రహ్మ స్వరూపంలో నిరాకారుడు నిర్గుణుడు సర్వసాక్షి. మన ఊహకు అందడు. విశ్వరచనా సందర్భంలో మాత్రం సాకారుడై మనకు కొంత అందుతున్నాడు.
సృష్టికర్త అయిన అతనికి పర వ్యూహ విభవ సర్వాంతర్యామి అర్చ అవతారాలు అని పాంచరాత్ర ఆగమం అయిదు రూపాలు అంగీకరించింది.
పర రూపంలో అతడు నారాయణుడు. సత్వగుణ ప్రధానుడై నిష్కలంకుడై శాంతుడై లక్ష్మీదేవి పాదసంవాహనం చేస్తుండగా ఆదిశేషునిపై క్షీరసాగరంలో శయనించి ఉంటాడు. అతనిని నిత్యసూరులు సేవిస్తూ ఉంటారు.
రెండవదైన వ్యూహస్థితిలో జగత్ సృష్టి కొరకు అతడు చేసికొన్న నియమం ప్రకారం వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే నాలుగు రూపాలు ధరించి ఆయా వ్యూహాన్ని అధిష్టిస్తాడు.
మూడవదైన విభవంలో తాను సృష్టించిన జగత్తు రక్షణ కొరకు నేడు మనం ప్రసిద్ధంగా చెప్పుకొనే దశావతారాలు, వానితో కలసిన చతుర్వింశతి అవతారాలు ధరించినాడు.
ఇక సర్వాంతర్యామిగా అతడు అందరి హృదయాలలో ఉండనే ఉన్నాడు. కాని ఈనాడు ఆత్మసాక్షిగా నడుచుకునేవారు అరుదు.
అవతారాల మాటకు వస్తే అవి ఆయా దేశ కాలాలకే పరిమితాలు కాని.. సార్వకాలికాలు సార్వదేశికాలు కాలేదు. అందుచేత సర్వేశ్వరుడు అన్ని కాలాలకు అన్ని దేశాలకు అనుకూలం కోసమై అయిదవదైన అర్చా రూపాన్ని స్వీకరించి ఆయా ప్రదేశాలలో వెలసినాడు. వానినే ఇపుడు మనం క్షేత్రాలని అక్కడి హరి నివాసాలను ఆలయాలని వ్యవహరిస్తున్నాం.
– పాలమూరు జిల్లా దేవాలయాలు కపిలవాయి లింగమూర్తి రచన నుంచి