స్త్రీ-పురుష సంగమం లేకుండా మానవ జన్మ అసంభవం. ప్రతి ఒక్కరి జీవితం కుటుంబం, వివాహ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. అందుకే జీవితంలో వివాహం అనివార్యమైంది. మనిషి సంతోషంగా జీవించాలంటే ఎవరికైనా తోడు – నీడ అవసరం. ఈ విషయం మరో కొత్త కోణంలో ఆవిష్కరించింది ‘నువ్వో సగం – నేనో సగం’ ఈ నాటిక.
తల్లిలేని కొడుకును ఓ తండ్రి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు. ఆ కొడుకు పెళ్లీడుకొస్తాడు. అందగాడు, పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ తండ్రి స్నేహితుడికి ఒక్కగానొక్క కూతురు ఉంటుంది. అందగత్తె, మంచి చదువరి. ఉన్నతోద్యోగం చేస్తుంటుంది. వీరిద్దరికీ పెండ్లి చేస్తే బాగుంటుందని ఆ తండ్రుల ఆలోచన. ఇంత వరకూ కథ ఓకే. ఆ అమ్మాయి ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా నడుచుకోవాలని భావిస్తూ ఉంటుంది.
‘భార్య భర్తలు ఇద్దరూ సమానమేనని, ఎవరూ ఎక్కువ కాదని, తక్కువా కాదని ఆమె భావన. కుటుంబ ఖర్చులు ఇద్దరూ సమానంగా పంచుకోవాలని భార్యా
భర్తల విషయంలో మూడో (తండ్రైనా) వ్యక్తి ప్రమేయం ససేమిరా ఉండకూడదని ఆమె కోరుకుంటుంది. పెండ్లి తర్వాత తామిద్దరం వేరు కాపురం పెట్టాల్సిందేనని కరాఖండిగా చెబుతుంది. ఆ షరతులకు ఇష్టమైతేనే పెళ్లి. లేకుంటే లేదు’ అని స్పష్టం చేస్తుంది. తండ్రులిద్దరూ ఫోనులో మాట్లాడుకుంటారు. ‘అబ్బాయిని మేనేజ్ చేసి, పెళ్లి చేద్దాం. ఆ తర్వాత అంతా సర్దుకుంటుందిలే’ అని వాళ్లు కూడబలుక్కుంటారు.
ఇద్దరికీ ఘనంగా పెండ్లి చేస్తారు. షరతు ప్రకారం దంపతులు ఇద్దరూ వేరు కాపురం పెడతారు. అబ్బాయి తండ్రి, అమ్మాయి తండ్రి ఒంటరిగా జీవిస్తుంటారు. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, బియ్యం, పప్పులు, కూరలు.. ఇలా ఏ వస్తువు కొన్నా ఎవరి డబ్బులు వాళ్లు (ఫిఫ్టీ-ఫిఫ్టీ) చెల్లించాల్సిందేనని భార్య పట్టుబడుతుంది. ఈ క్రమంలో ఒక రోజు ఒకరు ఇంటిపని చేస్తే, ఇంకోరోజు మరొకరు వంటపని చేయాలని నియమం పెడుతుంది. ఒకే స్కూటర్‌పై ఇద్దరూ తమ తమ ఆఫీస్‌లకు వెళ్తున్నా పెట్రోల్ డబ్బులు లెక్కకట్టి తన వాటా భార్తకు ఇచ్చేస్తుంటుంది ఆ ఇల్లాలు. భార్య ఆధునిక (సగం సగం సమానత్వం) చాదస్తాన్ని భర్త పంటి బిగువున భరిస్తుంటాడు.
‘భార్యభర్తల్లో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ?’ అనే చర్చ చాలాకాలం నుంచీ ఉన్నదే. పురుషాధిక్య సమాజం కనుక.. భార్య కన్నా భర్త కాస్త ఎక్కువ సమానం అని భావిస్తుంటారు. భర్త ఇంటికి యజమాని. భార్య సేవకురాలు మాత్రమే అన్న భావనే ఎక్కువమందిలో ఉంది. అందుకే స్త్రీలు సమాన హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. అందుకే భార్యభర్తల సమానత్వం గురించి ఎన్నో కథలు, నాటకాలు, నవలలు, సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఒకటి ‘నువ్వో సగం – నేనో సగం’ నాటిక.

కొన్నాళ్లకు భర్తకు ప్రమోషన్ వస్తుంది. ఆ సంతోషాన్ని భార్యతో పంచుకోవాలని, భార్యకు మల్లెపూలు తీసుకెళ్తాడు. కోరి కోరి జడలో పెట్టించుకున్న తర్వాత ఆ మల్లెపూవు డబ్బులు లెక్కగట్టి, అందులో సగం ఇవ్వబోతుందామె. అతను హర్ట్ అయిపోయి బరస్ట్ అవుతాడు. అదే సమయంలో తన ప్రాణ స్నేహితుడు హాస్పిటల్ ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు సర్దమని అడిగితే, మూడో మనిషికి నా డబ్బులు ఇవ్వనని నిక్కచ్చిగా చెబుతుందామె. ‘ఇలాంటి లెక్కల భార్యతో కాపురం ఎలా రా బాబూ?’ అని తలపట్టుకుంటాడు అతను. అయినా భరిస్తూనే ఉంటాడు.
కొన్నాళ్లకు ఆమె నెల తప్పుతుంది. కడుపులోని బిడ్డపట్ల ఆమెకు అపేక్ష పెరుగుతుంది. భర్తకు ఇది ఇష్టం ఉండదు. ‘ఆ మూడో మనిషి రాక అనవసరం. వెంటనే అబార్షన్ చేయించుకో. ఆ ఖర్చులకు, మందులకు నా సగం డబ్బులివిగో’ అని ఆమె ముందు ఉంచుతాడు. ఆమె నిర్ఘాంతపోతుంది. అప్పటికి గానీ తాను చేస్తున్న తప్పేంటో ఆమెకు తెలిసిరాదు. సగం-సగం-సమానం అంటే కేవలం ఆర్థిక లెక్కలు కాదని, అనుబంధాలు, ప్రేమలు పంచుకోవడమని, గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడమని అర్థమవుతుంది. వీరిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉండాలని అబ్బాయి తండ్రి చేసే ప్రయత్నాలు చివరికి సుఖాంతం అవుతాయి.
నాటిక మొదట్లో నవ్వుల పువ్వులు పూయిస్తూ చివరికి గంభీరంగా మారుతుంది. పరిమిత పాత్రలతోనే సాగినా.. నాటిక భలేగా రక్తి కట్టింది. నాటిక రచనలో లగువుబిగువులు ఉన్నాయి. అందుకే ఈ నాటకం పుట్టి ముప్పై ఏండ్లు గడిచినా… ఇంకా రంగస్థలంపై ప్రదర్శితమవుతూనే ఉన్నది. దుగ్గిరాల సోమేశ్వరరావు 63వ జయంతి సందర్భంగా రసరంజని ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ‘నువ్వో సగం- నేనో సగం’ ఇటీవల ప్రదర్శించారు.
నాటిక పేరు: నువ్వో సగం – నేనో సగం
రచన: కీ॥శే॥ పి.భవానీ ప్రసాద్ (బాబ్జీ)
నిర్వహణ, దర్వకత్వం: పోలిమెట్ల సుబ్బారావు
పాత్రధారులు: పోలిమెట్ల సుబ్బారావు,
సురభి లలిత, యేపూరి శ్రీనివాసరావు
ప్రదర్శన: మల్లీశ్వరి ఆర్ట్స్, హైదరాబాద్