అచ్చు పత్రికలు సంఖ్యాపరంగా తగ్గడంతో వెబ్ మ్యాగజైన్లు, సామాజిక మాధ్యమాలు రచనారంగంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఈ కారణంతో కథాసాహిత్యం పరిమిత స్థాయిలో మాత్రమే చెలామణి అవుతున్నది. అయినప్పటికీ.. కథలపై ఆరాధనాభావంతో రచనలు చేస్తున్న వారిలో విహారి ఒకరు. వృత్తిరీత్యా ఎల్ఐసీలో పనిచేసి పదవి విరమణ చేసిన ఆయన సాహిత్యం మీద మక్కువతో వివిధ పత్రికలకు సాహిత్య వ్యాసాలెన్నో రాశారు. అనేక సందర్భాల్లో రాసిన వ్యాసాలు, వివిధ పత్రికల్లో ప్రచురించిన కథలన్నీ ‘నిప్పు నుంచి నీరు’ కథా సంపుటి పేరుతో మనకు మరోసారి పరిచయం చేశారు. 20 కథలున్న ఈ పుస్తకంలో ఒక్కో కథదీ ఒక్కో ప్రత్యేకత.
నారాయణమ్మ పక్కనే ఉంటూ ఆస్తికోసం సేవలు చేసిన మనువరాలి (వసంత) స్వార్థాన్ని, అమెరికా నుంచి ప్రమీల (మరో మనుమరాలు) వచ్చి మానవ సంబంధాలను గుర్తు చేసే ‘జంట కొమ్మలు’ ఆస్తి కోసం ఆరాటపడేవారికి గుణపాఠం చెబుతుంది. చిన్న పిల్లలను అర్థం చేసుకునేందుకు పెద్ద ప్రయత్నాలేమీ అక్కర్లేదు. కించిత్తు ప్రేమ, రవ్వంత లాలింపు చాలంటూ కొడుకుపై రోహిణికున్న కోపాన్ని శాంతింపచేసిన ‘నిప్పు నుంచి నీరు’ ఈ తరానికి ఒక పేరెంటింగ్ పాఠం నేర్పుతుంది. మహానగరం హైదరాబాద్లో వస్త్ర దుకాణంలో పనిచేస్తూ, చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న భార్యభర్తల బతుకు చిత్రాన్ని వివరించిన ‘అనివార్యం’ కథ పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో చెబుతుంది. తన కథా సంపుటిలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేశారు విహారి. ఆయా కథల్లోని కష్టాలను మనసుతో చదివేలా చక్కగా తీర్చిదిద్దారు.
రచయిత: జేఎస్ మూర్తి (విహారి)
పేజీలు: 155, ధర: రూ.200
ప్రతులకు: 98480 25600
– రాజు పిల్లనగోయిన