నూతన సంవత్సరంలో అడుగు పెట్టేశారు.. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందడి చేసే ఉంటారు.. బంధువులకు, స్నేహితులకు అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పే ఉంటారు..పనిలో పనిగా అది చేద్దాం, ఇది చేద్దాంఅని బోలెడు నిర్ణయాలు తీసుకొనే ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా?..ఏటా జనవరిలో తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు కొనసాగిస్తున్నామో అని. పోయిన ఏడాది తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలు చేశారో.. ఓసారి గుర్తుతెచ్చుకోండి. చాలావరకు మధ్యలోనే వదిలేసి ఉంటారు కదా. మీరే కాదు.. ప్రపంచంలో 92 శాతం మంది ఇదే బాపతు.
2024 జనవరిలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వారు 49 శాతం, 30 నుంచి 49 ఏళ్ల మధ్య వారు 31 శాతం, 50 ఏళ్లు పైబడిన వారు 21 శాతం కొత్త నిర్ణయాలు తీసుకున్నారట. అందులో 43 శాతం మంది ఫిబ్రవరి నెలలో, 46 శాతం మంది ఆరు నెలల్లో తీసుకున్న నిర్ణయాలను గాలికి వదిలేశారట. కేవలం 8 శాతం మంది మాత్రమే ఏడాది చివరి వరకు వారు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించారట. సో.. న్యూ ఇయర్లోకి అడుగు పెట్టగానే నిర్ణయాలు తీసుకోవడం, వాటిని మధ్యలోనే వదిలేయటం ఓ రివాజు అన్నమాట.
ఎందుకు అలా?
నూతన సంవత్సరం మొదట్లో ఎంతో ఉత్సాహంతో, నిబద్ధతతో తీసుకున్న నిర్ణయాలను మధ్యలోనే ఎందుకు వదిలేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా?.. సైకాలజిస్టులు జానెట్ పాలవి, పీటర్ హెరమన్లు ఈ విషయంపై ఆలోచించారు. నిర్ణయాలను ఇలా మధ్యలోనే వదిలేయడానికి నాలుగు కారణాలు ఉన్నాయని వారి అధ్యయనంలో తెలిసింది.
ఈ నాలుగు రకాల అవాస్తవ ఆలోచనలు, అంచనాల కారణంగానే కొత్త ఏడాది సందర్భంగా తీసుకునే నిర్ణయాలను మధ్యలోనే వదిలేస్తారు.
కొనసాగించడం ఎలా?
ఇదంతా తెలుసుకొని అసలు అమలు చేయలేనప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు అని వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు, చిన్నచిన్న మార్పులతో నూతన సంవత్సర నిర్ణయాలను కొనసాగించవచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు.
ఓ మంత్రం అనుకోండి..
నూతన సంవత్సరంలో అది చేద్దాం.. ఇది చేద్దాం, ఇది మార్చేద్దాం.. అది మార్చేద్దాం అనుకోకుండా మీరు ఆచరించాల్సిన ఒక పదాన్ని తీసుకోండి, దాన్నే మంత్రంగా భావించండి. ఈ ఏడాదిలో కోపాన్ని తగ్గించుకుందాం.. రోజు వ్యాయామం చేద్దాం.. అందరితో స్నేహంగా ఉందాం.. ఇలా అన్నమాట. వందలు వద్దు.. ఒక్కటి మాత్రమే తీసుకోండి. దానికి ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోవద్దు. ఏదైతే మంత్రంగా భావించారో దాన్ని ఏడాదంతా కొనసాగించడానికి ప్రయత్నించండి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. అనుకోవాల్సిన అవసరం లేదు, సత్ఫలితాలను మీరే చూస్తారు.
ఏం వద్దనుకుంటున్నారో లిస్ట్ రాయండి..
సాధారణంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే అందరూ చేసే పని ఏంటంటే.. అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని అనుకోవడం. అలా కాకుండా ఏం చేయకూడదని భావిస్తున్నారో నిర్ణయించుకోండి. డబ్బులు దుబారా చేయకూడదు.. ఆఫీస్‌కి లేటుగా వెళ్లకూడదు.. స్నేహితులు, బంధువులతో గొడవలు పెట్టుకోకూడదు.. ఇలా అన్నమాట. ఏం చేద్దాం అనే దానికంటే ఏం చేయకూడదు అనేది బాగా పనిచేస్తుందని నిపుణుల మాట.
నెలకో లక్ష్యం రాసుకోండి..
ఇలా చేయాలి.. అలా చేయాలి అనుకోవడం కంటే ఏ నెలలో ఏం చేయాలో రాసి పెట్టుకుంటే అనుకున్నది సాధించవచ్చు. జనవరి నెల అంతా తక్కువగా మాట్లాడాలి.. ఫిబ్రవరి అంతా ధ్యానం చేయాలి.. మార్చి నెల అంతా ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి.. ఇలా 12 నెలలకు 12 లక్ష్యాలు నిర్దేశించుకోండి. నెలలో 30 రోజులు దాన్ని పాటించడానికి ప్రయత్నించండి.
చిన్ని చిన్ని ఆశ..
చాలాసార్లు చేసే పొరపాటు ఏంటంటే పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకోవడం, వాటిని సాధించలేక చతికిలబడటం. అందుకే మీరు సాధించాలనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి దోహదపడే చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకోండి. ఒక్కో చిన్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక రూపొందించండి. చిన్న లక్ష్యాలను సాధించినప్పుడు మీలో డోపమైన్ రిలీజ్ అయి ముందున్న లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
ఇదండీ కొత్త సంవత్సరం నిర్ణయాలను కొనసాగించే విధానం. ఇవన్నీ ఏదో గాలి మాటలు కాదు, పరిశోధనలను ఆధారంగా చేసుకొని రూపొందించిన పద్ధతులు. వీటిని అవగాహన చేసుకోండి.. నూతన సంవత్సరంలో మీ లక్ష్యాలను సాధించండి.. విష్ యు ఆల్ ద బెస్ట్.
21-90 రూల్
ఏదైనా కొత్తగా అలవాటు కావాలంటే కనీసం 21 రోజులు పడుతుంది. ఆ అలవాటు జీవనశైలిలో భాగం కావాలంటే 90 రోజులు పడుతుంది. అంతవరకు కొత్త అలవాటును కొనసాగించాలి. అలా కాకుండా రెండో మూడో వారాలు చూసి ఏ మార్పూ లేదని మధ్యలోనే వదిలేయకూడదు. ఇది చాలామంది చేసే పొరపాటు. నూతన సంవత్సర నిర్ణయాలను ఫిబ్రవరి నాటికి వదిలేయడానికి కారణం ఇదే.
-బి. కృష్ణ, సైకాలజిస్ట్
జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు,
ఏపీఏ ఇండియా, 99854 28261