Test Cricket | క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఏదో తెలియని మహత్తు ఉంది. ఏ ముహూర్తంలో పరిచయమైందో గానీ అభిమానులను ఏండ్లుగా అలరిస్తూనే ఉన్నది. తరాలు మారుతున్నా.. తరగని వన్నెతో తులతూగుతున్నది. కాలానికి తగ్గట్లు ఈ ఆట కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ఫార్మాట్లు మారుతున్నా.. టెస్టు క్రికెట్‌కు ఉన్న క్రేజ్ వేరు. పచ్చని పచ్చికపై తెల్లటి దుస్తులతో ఎర్రని బంతితో క్రికెటర్ల విన్యాసాలు చూడటానికి రెండు కండ్లు చాలవు. ఐదు రోజుల ఆటలో లెక్కలేనన్ని నాటకీయ పరిణామాలు.. అభిమానులకు సెషన్‌కో కిక్ పంచుతుంటాయి.
ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే టీ20ల వెలుగు జిలుగుల్లో టెస్టు క్రికెట్‌కు ప్రమాదం పొంచి ఉందన్న ప్రతీసారి టెస్ట్ ఫార్మాట్ అభిమానుల అంచనాలను మరోస్థాయికి తీసుకెళుతున్నది. తాజాగా ముగిసిన భారత్-ఇంగ్లండ్ సిరీస్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌గా జరిగిన ఐదు మ్యాచ్‌ల పోరు ఒక యుద్ధాన్ని తలపించింది. ప్రతి పోరూ ఫ్యాన్స్‌కు పసందైన విందు అందించింది. రెండు, మూడు రోజులకు పరిమితం కాకుండా ప్రతి మ్యాచ్ చివరి రోజు వరకు హోరాహోరీగా సాగిన తీరు.. చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి. 2-2తో సమమైన టెస్టు సిరీస్ ఎన్నో రికార్డులకు, అద్భుత విన్యాసాలకు, ప్లేయర్ల పోరాటపటిమకు సాక్ష్యంగా నిలిచింది. అన్నిటికీ మించి పొట్టి క్రికెట్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో… టెస్ట్ క్రికెట్ మళ్లీ డిస్టిన్షన్లో పాసైంది.
– చెగ్గోజు రాజశేఖర్, మునిగాల శ్రీనివాస్
భారత్ ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ టెస్టు క్రికెట్‌కు కొత్త జోష్ తీసుకొచ్చింది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ గడ్డపై అభిమానుల అశేష మద్దతు ఈ ఫార్మాట్‌కు వన్నె తరగలేదని నిరూపించింది. ఆధిక్యం చేతులు మారుతూ ఐదు రోజుల పాటు నువ్వానేనా అంటూ కడదాకా ఇరు జట్లు పోరాడిన తీరు అభిమానులను కట్టిపడేసింది. మూడు గంటల్లో ముగిసే టీ20ల్లోని మజాను మరిపిస్తూ టెస్టులను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కు దేశ క్రికెట్‌కు చుక్కాని అయిన మన్సూర్‌అలీఖాన్ పటౌడీ పేరిట జరిగేది. ఈసారి అది అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌గా రూపాంతరం చెందింది. ఆధునిక క్రికెట్‌కు ఆరాధ్య ఆటగాళ్లుగా పేరొందిన అండర్సన్, టెండూల్కర్ తమ దేశ క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా రెండు దేశాల బోర్డులు ఈ సిరీస్‌కు రూపకల్పన చేశాయి. పటౌడీ పేరు మార్పుపై వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ అండర్సన్-టెండూల్కర్ సిరీస్ తొలిసారే లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టింది. పటౌడీ ఘనమైన చరిత్రను గౌరవిస్తూనే ఆయన పేరిట మెడల్ ప్రదానం చేసిన తీరు మెచ్చుకోదగినది.
ఇంగ్లండ్‌తో ఈ సిరీస్‌కు ముందు భారత్ ఒక సంధికాలాన్ని ఎదుర్కొంది. దిగ్గజ త్రయం విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్తో టీమ్ ఇండియాలో నవ శకం మొదలైంది. పరివర్తనలో భాగంగా యంగ్ తరంగ్ శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించిన బీసీసీఐ తమ భవిష్యత్ ప్రణాళికలు ఏంటో చెప్పకనే చెప్పింది. కాలానికి తగ్గట్లు మారాలన్నట్లు కోహ్లీ, రోహిత్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ గిల్ భారీ అంచనాలతో భారత కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. స్వింగ్ బౌలింగ్ పెట్టింది పేరైన ఇంగ్లండ్ పిచ్‌లపై గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా అదరగొట్టింది. కోహ్లీ, రోహిత్, అశ్విన్ లాంటి క్రికెటర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు.. ఇప్పుడు ఈ అనుభవం లేని వారితో ఏమవుతుందన్న వారి అంచనాలను పటాపంచలు చేసింది. మాజీ క్రికెటర్ల సిరీస్ ముందస్తు అంచనాలను యువ భారత్ తలకిందులు చేసింది.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సమరం లీడ్స్‌లో మొదలై.. చారిత్రక ఓవల్‌లో ముగిసింది. లీడ్స్‌లో ఇంగ్లండ్ బోణి కొడితే ఓవల్‌లో ఉత్కంఠ విజయంతో టీమ్ ఇండియా సిరీస్‌కు ఘనమైన ముగింపు ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఇంత హోరాహోరీగా సాగిన సిరీస్ ఇదేనని తాజా, మాజీలు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రతీ మ్యాచ్ ఆఖరి రోజు వరకు నువ్వానేనా అన్నట్లు సాగడమే దీనికి కారణం. పరుగుల వరద పారిన లీడ్స్ టెస్టులో మెండైన ఆధిపత్యం భారత్‌దే అయినా ఇంగ్లండ్‌ను విజయం వరించింది. ఈ సిరీస్ ముందు వరకు గిల్ సగటు 35.05 మాత్రమే. అప్పడు నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి గిల్ చేసింది 52 పరుగులు కాగా, అత్యుత్తమ స్కోరు 18 మాత్రమే! కానీ తొలిసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగిన గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గత అనుభవాలను చెరిపేస్తూ తొలి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు. గిల్‌కు తోడు జైస్వాల్, పంత్ సెంచరీలతో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ప్రతిగా ఇంగ్లండ్ దీటుగా స్పందించింది. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్, పంత్ సెంచరీలతో 364 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బుమ్రా, సిరాజ్ విఫలమైన వేళ.. డకెట్ సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఊదేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు సెంచరీలు నమోదైనా మనకు నిరాశే ఎదురైంది. దీంతో భారత్ 0-1తో వెనుకంజలో నిలిచింది.
బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. 58 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమ్ ఇండియా తొలిసారి ఆ వేదికపై విజయాన్ని అందుకుంది. కెప్టెన్ గిల్ (269) డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. ఇంగ్లండ్‌ను 407 పరుగులకు కట్టడి చేసింది. బుమ్రా గైర్హాజరీలో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మమద్ సిరాజ్ (6/70) ఆరు వికెట్లతో దుమ్మురేపాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్ (161) మరోమారు విజృంభించడంతో స్కోరును 427/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్..ఆకాశ్‌దీప్ (6/99) ఆరు వికెట్ల ప్రదర్శనతో 271 పరుగులకు పరిమితమై.. 336 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పరుగుల పరంగా విదేశీ గడ్డపై భారత్‌కు రికార్డు విజయం కావడం విశేషం.
ఈ విజయంతో సిరీస్ 1-1తో డ్రా కాగా, సిరీస్‌లో మూడో టెస్టుకు చారిత్రక లార్డ్స్ వేదికైంది. జోరూట్(104) సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా, బుమ్రా (5/74) ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. రాహుల్ (100) సెంచరీకి తోడు పంత్ (74), జడేజా (72) అర్ధ సెంచరీలతో భారత్ 387 పరుగులు చేసింది. సుందర్ (4/22) స్పిన్ తంత్రంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. జడేజా (61 నాటౌట్) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. బషీర్ బౌలింగ్‌లో బంతి అనూహ్యంగా వికెట్లను గిరాటేయడంతో సిరాజ్ నిశ్చేష్టుడయ్యాడు. ఫలితంగా సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
నాలుగోదైన మాంచెస్టర్ టెస్టు డ్రాగా ముగిసింది. పరుగుల వరద పారిన ఈ పోరులో రెండు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను గిల్ (103), జడేజా (107 నాటౌట్), సుందర్ (101 నాటౌట్) ఒడ్డున పడేసిన తీరు అద్భుతం. ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ 140 ఓవర్లకు పైగా ఈ ముగ్గురు క్రీజులో పాతుకుపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆఖరిదైన ఓవల్ టెస్టులో భారత్ అద్భుతమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు భారత్ ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (118) సెంచరీతో 396 పరుగులు చేసిన టీమ్ ఇండియా ఇంగ్లండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్రూక్ (111), రూట్ (105) సెంచరీలతో అలవోకగా గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్‌ను సిరాజ్ (5/104), ప్రసిద్ధ్ కృష్ణ (4/126) ఘోరంగా దెబ్బతీశారు. చేతిలో నాలుగు వికెట్లతో విజయానికి 35 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ సిరాజ్ దెబ్బకు ఓటమి వైపు నిలిచింది. ఆరంటే ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్ సిరీస్‌ను 2-2తో ముగించింది.
టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపు తీసుకొచ్చింది బాజ్‌బాల్. న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్, ఇంగ్లండ్ ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నిక్‌నేమ్ అయిన బాజ్ పేరిట రూపుదిద్దుకున్న ‘బాజ్‌బాల్’ టెస్టు క్రికెట్‌ను గతిని మార్చేసిందని చెప్పాలి. అప్పటి వరకు సంప్రదాయక బాటలో నడిచిన టెస్టు క్రికెట్‌కు ధనాధన్ దంచుడుతో బాజ్‌బాల్ కొత్త ఊపు తీసుకొచ్చింది. ప్రత్యర్థి కోలుకోకముందే ఎదురుదాడికి దిగుతూ, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను తలపిస్తూ పరుగుల వరద పారించడం, అనూహ్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ఇవి బాజ్‌బాల్ శైలికి అద్దంపడతాయి. అయితే భారత్‌తో సిరీస్‌లో ఈ బాజ్‌బాల్ పాచిక పెద్దగా పారలేదని చెప్పాలి. అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి టీమ్ ఇండియాతో సిరీస్ ఆడిన ఇంగ్లండ్ ఆ మేరకు ప్రభావం చూపించలేకపోయింది. అండర్సన్, బ్రాడ్ గైర్హాజరీలో ఇంగ్లండ్ బౌలర్లు టీమ్ ఇండియా బ్యాటర్లను నిలువరించడంలో విఫలమయ్యారు. దీనికి తోడు గతంతో పోల్చుకుంటే మొదటి బంతి నుంచే దంచుడు మొదలుపెట్టే ఇంగ్లండ్ బ్యాటర్లు ఒకింత ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. ఫలితంగా బాజ్‌బాల్ ఎరాలో ఇంగ్లండ్ రెండో డ్రాను ఖాతాలో వేసుకుంది. గతంలో మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాపై తొలి డ్రా ఎదుర్కొన్న ఇంగ్లిష్ టీమ్.. మళ్లీ అదే వేదికగా టీమ్ ఇండియాపై రెండో డ్రా చేసుకోవడం బాజ్‌బాల్ పరిస్థితికి అద్దం పడుతుంది. ఓవరాల్‌గా సిరీస్ మొత్తమ్మీద బాజ్‌బాల్ ప్రభావం పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.
హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ బౌలింగ్ సిరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లోటును మరిపిస్తూ సిరాజ్ అలుపెరుగకుండా ఆడిన తీరు ప్రపంచ క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు అందుకుంది. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని ముందే చెప్పినట్లు ఐదు మ్యాచ్‌ల్లో బుమ్రా మూడింటికే పరిమితం కాగా, సిరాజ్ ఐదింటికి ఐదు ఆడి తన ఫిట్నెస్ ఏంటో చేతల్లో చూపించాడు. టెస్టుల్లో బుమ్రాతో కలిసి 33.82 సగటు కనబరిచిన సిరాజ్.. అతని గైర్హాజరీలో ఏకంగా 25.20 సగటుతో దుమ్మురేపాడు. బుమ్రా లేని సమయంలో బౌలింగ్ భారాన్ని తన భుజ స్కంధాలపై మోస్తూ సిరాజ్ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల్లో ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ తెలంగాణ డీఎస్పీ 23 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. విరామం లేకుండా బౌలింగ్ చేయడంలో దిట్ట అయిన హైదరబాదీ తన ఫిట్నెస్ ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. తనకెంతో ఇష్టమైన బిర్యానీ తినడం మానేసిన మియాభాయ్.. భారత భవిష్యత్ పేస్ దళానికి నాయకునిగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు గాయాలతో బుమ్రా ఎంపిక చేసిన టెస్టుల్లో ఆడుతుండగా, సిరాజ్ మాత్రం తాను ఉన్నానంటూ కెప్టెన్ బౌలర్‌గా మన్ననలు అందుకుంటున్నాడు. కెప్టెన్ బంతిని అందించిన ప్రతీసారి అలుపెరుగకుండా స్పెల్‌కు 9, 10 ఓవర్లు బౌలింగ్ చేసే సిరాజ్ రానున్న రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ఈ మధ్య కాలంలో ఎస్ఈఎన్ఏ (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో సిరాజ్ వికెట్ల విజృంభణ పతాక స్థాయిలో ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు 41 టెస్టులాడిన సిరాజ్ 31.05 సగటుతో 123 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదుసార్లు ఐదేసి వికెట్లు, ఏడు సార్లు నాలుగేసి వికెట్లు తీశాడు.
లార్డ్స్ టెస్టులో జట్టు గెలుపు అంచుల్లో ఉన్న సమయంలో సిరాజ్ ఔటైన తీరు అందరినీ కలిచివేసింది. బ్యాటర్‌కు ఏమాత్రం తీసిపోకుండా బషీర్ బంతిని డిఫెన్స్ చేసిన సిరాజ్.. అనూహ్యంగా కాళ్ల మధ్యలో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. బంతి వికెట్లను తాకడం బెయిల్ పడటంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు గెలుపు సంబురాల్లో మునిగిపోగా, అవతలి ఎండ్‌లో ఉన్న జడేజా ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు. భారత్ ఓటమి ఖరారైన వేళ సిరాజ్ పిచ్‌పై అలానే కుప్పకూలిపోయాడు. తన వల్ల జట్టు ఓటమి పాలైందన్న బాధలో ఉన్న సిరాజ్‌ను బ్రూక్ ఓదార్చిన ఫొటో వైరల్‌గా మారింది. లార్డ్స్ ఓటమితో ఒకింత విలన్‌గా మారిన సిరాజ్.. ఓవల్ టెస్టులోనూ దాదాపు అదే బాధ అనుభవించాడు. ఛేదనలో బ్రూక్ 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు బౌండరీ లైన్ తాకుతూ సిరాజ్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. లైఫ్ దక్కించుకున్న బ్రూక్ ధనాధన్ సెంచరీతో గెలుపు సమీకరణం పూర్తిగా మారిపోయింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న సిరాజ్ ఆఖరి రోజు ఆటలో హీరో అయ్యాడు. ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌కు కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. సిరాజ్ విసిరిన బంతికి అట్కిన్సన్ క్లీన్‌బౌల్డ్ కావడంతో ఓవల్ స్టేడియం మోత మోగిపోయింది. వికెట్ తీసిన ఆనందంలో తన ఆరాధ్య ఆటగాడు రొనాల్డో ట్రేడ్‌మార్క్ స్టయిల్‌ను అనుసరిస్తూ సిరాజ్ గెలుపు సంబురాల్లో మునిగిపోయాడు.
ఈ సిరీస్ జరుగుతుండగా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు గాయాలవడం.. ఒక పక్క తీవ్ర నొప్పి వేధిస్తున్నా ఆ ఇద్దరూ జట్టు (దేశం) కోసం పోరాడిన తీరు గురించి చెప్పుకొని తీరాల్సిందే. ఆ ఇద్దరే పంత్, వోక్స్. మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వోక్స్ వేసిన యార్కర్‌ను ఆడబోయిన పంత్‌కు.. కుడికాలి చిటికెన వేలు వద్ద తీవ్ర గాయమైంది. కాలికి రక్తంతోనే మైదానాన్ని వీడిన పంత్.. మళ్లీ బ్యాటింగ్‌కు రాడనే అంతా భావించారు. కానీ అతడు రెండో రోజు కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మాంచెస్టర్‌లో స్టోక్స్ కూడా కాలికి తిమ్మిర్లు రావడంతో క్రీజును వీడినా మరుసటి రోజు వచ్చి సెంచరీ బాదాడు. ఇక ఓవల్‌లో వోక్స్ పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. యాదృచ్ఛికమో మరేమో గానీ పంత్ గాయానికి కారణమైన వోక్స్.. ఓవల్‌లో గాయపడి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి తప్పించడానికి ఒక చేతికి కట్టుతోనే బ్యాటింగ్‌కు రావడం గమనార్హం. నడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అతను.. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో పరుగులు తీస్తూ.. దేశం కోసం నొప్పిని భరించిన తీరును చూసి క్రికెట్ ప్రపంచం అభినందించకుండా ఉండలేకపోయింది.
25 రోజుల పాటు (ఐదు టెస్టులు జరిగిన రోజులు) రసవత్తరంగా సాగిన ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌లలోనూ ఫలితం ఐదో రోజే వచ్చింది. టెస్టుల్లో ఇలా జరగడం ఇది నాలుగోసారి మాత్రమే. చివరిసారిగా 2017/18 యాషెస్ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలోనూ ఫలితం ఐదో రోజే తేలింది.
ఇంగ్లండ్ ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా గిల్ (754) రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గవాస్కర్ (732)ను దాటేశాడు.
ఒక సిరీస్‌లో గవాస్కర్ (774) తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ (754) నిలిచాడు.
టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు గిల్ (269) నమోదైంది. గతంలో కోహ్లీ (254)
పేరిట ఈ రికార్డు ఉంది.
ఒక సిరీస్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. గిల్ (754), రాహుల్ (532), జడేజా (516) రాణించారు.
ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచిన తొలి ఆసియా టీమ్‌గా భారత్ రికార్డుల్లోకెక్కింది.
అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీని వివాదాలు మరింత రసవత్తరంగా మార్చాయి. హెడింగ్లీ మొదలుకుని ఓవల్ దాకా ఒక్కో టెస్టులో ఒక్కో వివాదం ఆటను ఆసక్తికరంగా మార్చేసింది. ఇంగ్లండ్ సిరీస్‌లో మునుపెన్నడూ లేని విధంగా డ్యూక్ బంతుల నాణ్యతపై చర్చ జరిగింది. డ్యూక్ బాల్స్ త్వరగా రూపాన్ని కోల్పోతున్నాయని, అవి మృదువుగా మారడంతో బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదని భారత్‌తో పాటు ఇంగ్లండ్ సారథులు, ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు పలు సందర్భాల్లో ఫిర్యాదుచేశారు. ఈ ఆరోపణలను డ్యూక్ సంస్థ ప్రతినిధులు మొదట్లో కొట్టిపారేసినా తర్వాత నాణ్యత విషయంలో తాము పునఃపరిశీలిస్తామని హామీ ఇచ్చారు. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ.. నిర్దేశిత సమయం కంటే 90 సెకన్లు ఆలస్యంగా రావడం, ఆ తర్వాత సమయాన్ని వృథా చేయడంతో గిల్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఈ సందర్భంగా గిల్ హావభావాలు, అతడి సంజ్ఞలు వివాదాస్పదమయ్యాయి. ఇక మాంచెస్టర్‌లో జడేజా, సుందర్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌తో పాటు క్రాలీ చేసిన వ్యాఖ్యలు క్రీడాస్ఫూర్తిని గంగలో కలిపాయని చెప్పక తప్పదు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా (107*), వాషింగ్టన్ సుందర్ (101*) ఐదో వికెట్‌కు అజేయంగా 203 రన్స్ జోడించి భారత్‌ను ఒడ్డున పడేశారు. అయితే జడ్డూ, సుందర్ వారి వ్యక్తిగత స్కోరు 90లలో ఉండగా స్టోక్స్.. జడ్డూ వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని కోరగా అందుకు జడేజా నిరాకరించాడు. అప్పుడు స్టోక్స్ ‘నువ్వు బ్రూక్ బౌలింగ్‌లో సెంచరీ చేసుకుంటావా?’ అని ప్రశ్నించగా పక్కనే ఉన్న క్రాలీ కూడా అదేరీతిలో మాట్లాడటం వివాదాస్పదమైంది. క్రికెట్‌ను నిబంధనల మేరకు ఆడాలే తప్ప స్టోక్స్ బాజ్‌బాల్ సూత్రాల ప్రకారం ఆడొద్దని విమర్శకులు అతడికి హితువు పలికారు. ఓవల్‌లో గంభీర్‌తో పిచ్ క్యూరేటర్ ఫోర్టిస్ వాగ్వాదం, చివరి టెస్టులో అంపైర్ ధర్మసేన ఆతిథ్య జట్టుకు అనుకూలంగా వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి.
మొత్తంగా యంగ్ టీమ్‌తో బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే నిలువరించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరికొన్నేండ్ల పాటు టెస్టు క్రికెట్‌ను శాసించే సత్తా ఉందని ఈ సిరీస్ ద్వారా మరోమారు నిరూపితమైంది. దిగ్గజాలు నిష్క్రమించినా వారిని మరిపిస్తూ యంగ్ తరంగ్‌లు దూసుకొస్తారని చేతల్లో నిజమైంది.