స్మార్ట్ రింగ్.. ఆరోగ్యంపై మరింత నిఘా పెడుతున్నది. అందుకే ఈ రింగ్స్‌కు గిరాకీ పెరుగుతున్నది. దానిని దృష్టిలో పెట్టుకొని.. ‘గ్యాబిట్ స్మార్ట్ రింగ్’ తాజాగా మార్కెట్లోకి వచ్చేసింది. ఇది కేవలం స్మార్ట్ రింగ్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి సంబంధించిన నాలుగు ప్రధాన అంశాలను ట్రాక్ చేసే ఏఐ కోచ్ కూడా. నిద్ర, ఫిట్నెస్, పోషణ, ఒత్తిడి.. వివరాల్ని ఎప్పటికప్పుడు పక్కాగా విశ్లేషించి చెబుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే ఏడు రోజులకు పైగా పనిచేస్తుంది. టైటానియంతో తయారవడంతో.. తేలికగానూ, మన్నికగానూ ఉంటుంది. దీని బరువు కేవలం 3.1 గ్రాములు మాత్రమే. ఇందులో 30కి పైగా వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. వ్యాయామం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ కదలికలను గుర్తిస్తుంది. దీనికి ఉన్న మరో ఫీచర్.. క్యాలరీ ట్రాకింగ్. దీంతో బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. మహిళల కోసం ప్రత్యేకంగా పీరియడ్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంట్లో ప్రధానమైన ఫీచర్.. ఏఐ హెల్త్ కోచ్. PEP అనే ఏఐ హెల్త్ కోచ్ ఫీచర్ ఇందులో ఉంది. ఇది మీ ఫిట్నెస్ వివరాల్ని విశ్లేషించి.. పర్సనల్ హెల్త్ కోచ్‌లా సలహాలు ఇస్తుంది.
మినీ పీసీ.. పనిలో మేటి!
ఇప్పుడంతా భారీ డెస్క్‌టాప్‌లకు బదులుగా, మినీ పీసీలకే మొగ్గుచూపుతున్నారు. ప్రముఖ బ్రాండ్లన్నీ.. చిన్నపరిమాణాల్లోనే శక్తిమంతమైన పీసీలను తయారుచేస్తున్నాయి. skull saints సంస్థ కూడా అదే బాటలో నడుస్తున్నది. స్కల్సైంట్స్ కోర్ఎక్స్ మినీ పీసీని లాంచ్ చేసింది. ఇది పరిమాణంలోనే చిన్నది.. ఫీచర్లు మాత్రం కాదు. ఇందులో ఏఎండీ రైజెన్ 74800హెచ్ ప్రాసెసర్ ఉంది. ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేస్తూనే.. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకుంటూ.. మరోవైపు పాటలు వినవచ్చు. ఆన్లైన్ క్లాసులు వినేవారికి, ఇంటి నుంచి పనిచేసేవారికి చాలా ఉపయోగపడుతుంది. మినీ పీసీకి ఒకేసారి మూడు మానిటర్లను కనెక్ట్ చేయవచ్చు. ఒక స్క్రీన్‌పై వీడియోలు చూస్తూ.. మరో స్క్రీన్‌పై ఆఫీస్ పని చేసుకోవచ్చు. 4కె రిజల్యూషన్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. 16 జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తున్నది. Wi-Fi 6, బ్లూటూత్ 5.2 ఫీచర్లతో ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగుంటుంది. అవసరాలకు తగినట్టుగా ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
గాలి పోయినా.. టెన్షన్ వద్దు!
రోడ్డు ప్రయాణాల్లో.. ముఖ్యంగా సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి అకస్మాత్తుగా టైర్లలో గాలి తగ్గడం పెద్ద సమస్య. ఈ ఇబ్బందిని అధిగమించడానికి అమెజాన్ బేసిక్స్ సంస్థ కొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. అదే అమెజాన్ బేసిక్స్ పోర్టబుల్ డీసీ డిజిటల్ టైర్ ఇన్‌ఫ్లేటర్. ఇది నిమిషాల్లోనే టైర్లలో గాలి నింపేస్తుంది. ఈ టైర్ ఇన్‌ఫ్లేటర్ పని చేయాలంటే 12V విద్యుత్ సరిపోతుంది. దీన్ని వాడటం చాలా సులభం. మూడు రకాల పిన్‌లతో కారు, బైక్, సైకిళ్లలో గాలిని నింపొచ్చు. దీనికి ఉన్న హెచ్డీ డిజిటల్ డిస్ప్లే ప్రెజర్‌ను కచ్చితంగా చూపిస్తుంది. అలాగే, రాత్రి సమయంలో వాడేందుకు ఎల్ఈడీ లైట్ సౌకర్యం కూడా ఉంది. దీనితోపాటు వచ్చే ఒక ప్రత్యేక పిన్ సాయంతో ఫుట్‌బాల్స్, బెలూన్లు, ఎయిర్ పిల్లోలు, మ్యాట్రస్లలోనూ గాలి నింపొచ్చు.
వెన్నునొప్పికి చెక్..
నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువ సమయం కూర్చోవడం అనేది తప్పనిసరిగా మారింది. దీంతో చాలామంది వెన్నునొప్పి, నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ఫోవెరా ఆర్థోపెడిక్ కాక్సిక్స్ కుషన్‌తో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ కుషన్ వెన్నుకు సరైన సపోర్ట్ ఇస్తుంది. దీన్ని ప్రధానంగా ‘టెయిల్ బోన్’ నొప్పిని దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. డిజైన్ ‘U-ఆకారంలో’ ఉంటుంది. ఇది మీరు కూర్చున్నప్పుడు మీ టెయిల్ బోన్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూస్తుంది. అలాగే, సరైన భంగిమలో కూర్చోవడానికీ సాయపడుతుంది. కూల్ జెల్ మెమరీ ఫోమ్.. శరీర ఆకృతికి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. గాలి లోపలికీ బయటికీ ప్రసరించే మెష్ కవర్ ఉండటంతో కింద వేడెక్కదు. అన్ని సీట్లకూ సెట్ అవుతుంది. శరీర బరువు ఆధారంగా రెండు సైజులలో దీన్ని పొందొచ్చు.