‘విద్యార్థిగా ఉర్దూనే ఊపిరిగా మలచుకున్నా/ నాలో తెలుగును నిలిపిన హరికథలకు సన్మానం’ అనేవారు సినారె. తన బడి భాష ఉర్దూ అయినా తనను తెలుగు కవిగా మలిచింది తాను బాల్యంలో వేములవాడలో విన్న హరికథలు, సిరిసిల్లలో విన్న శ్రీవైష్ణవ నగర సంకీర్తనలు అని చెప్పేవారు ఆయన. ఆనాటి నిజాం రాజ్య అధికార భాషైన ఉర్దూలో విద్యాభ్యాసం చేశారు సినారె. అటు ఉర్దూలో, ఇటు తెలుగులో తొలిదశ నుంచే రచనలు చేశారు. సందర్భోచితంగా సినీ గీతాల్లోనూ ఉర్దూ పదాలను కుమ్మరించేవారు ఆయన. అలాంటిదే ‘గులేబకావళి కథ’ కోసం నారాయణరెడ్డి రాసిన ‘సలామలేకుం సాహెబుగారు..’. తెలుగు తెరపై ఉర్దూ అత్తరు చల్లిన ఆ గీత పరిమళాలు మీరూ ఆస్వాదించండి.
హైదరాబాద్ నగరంలో గల మిశ్రమ సంస్కృతిని, తహజీబ్ని తన రచనల్లో చూపించారు సినారె. తన రచనా వ్యాసంగంలో అవసరమైన చోట ఉర్దూ, పారసీక పదాలు, వాక్యాలు ప్రయోగించేవారు ఆయన. సినీ గీతాల్లోనూ అంతే! ‘రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరబాద్ రిక్షావాలా జిందాబాద్’, ‘సలామలేకుం రాణీ! నీ గులాము నౌతాను’ వంటి తెలుగు ఉర్దూ పదాలతోపాటు ‘చాణక్య చంద్రగుప్త’ సినిమా కోసం రాసిన ‘బయా ఇష్కందరే ఆజం ముబారక్ పితహుకల్ ఆలం…’ లాంటి గీతంలో ఉర్దూ, తెలుగు, పారసీతో పాటు పంజాబీ పద ప్రయోగాలూ చూడవచ్చు. ఇవన్నీ సినారె భాషా ప్రౌఢిమకు కొన్ని తార్కాణాలు.
ఆమె: సలామలేకుం సాహెబుగారు
భలే షోకుగా వచ్చారా?
కోరస్: భలే భలే షోకుగా వచ్చారా..
అతను: అస్సలామలేకుం పసందు చూసి
నిషాచేసి దిల్ ఖుషీ చేయగా వచ్చానే!
ఆమె: నడుం వంగి గడ్డాము నెరిసినా..
పడతి మోజు పోలేదా.. పులుపు తగ్గి పోలేదా
కోరస్: నీ పులుపు తగ్గిపోలేదా
అతను: వయసుతోటి పని యేముందే
నా మనసు చూడవే బుల్బుల్..
నా హొయలు చూస్తేనే జిల్జిల్
ఆమె: అత్తరులో మునిగొస్తేనేమి
ఆటను గెలుచుట కల్ల.. పోటీలో నువు ఢిల్లా
కోరస్: మా పోటీలో నువు ఢిల్లా! సలామలేకుం!
అతను: అత్తరుకంటే మత్తును
చూపే సత్తువ ఉందే పిల్లా..
నా చలాకి చక్కెర బిళ్లా…
నా చలాకి చంకీ పిల్లా…
ఈ గీతమంతా చక్కని ఉర్దూ తెలుగు పదాల జుగల్బందీగా సాగిపోతుంది. రెండు భాషల సోగసులు, సొబగులు తెలిసిన కవి కదా! ఎక్కడా కృతకంగా కనిపించదు. ఇది తొలినాటి సినీగీతాల్లో ఒకటి. ‘గులేబకావళి కథ’ కోసం రాసింది. ఈ గీతమంతా నాయికా ప్రధాన చెలికత్తె, నాయకుల సంభాషణాత్మకంగా సాగుతుంది. తోడుగా బృందం జతకలుస్తుంది. పాత్రోచితమైన భాషను గీతంలో రాయడం ఇందులోని విశేషం. నాయకుడు సంప్రదాయ ముస్లిం దుస్తులతో మారువేషంలో వస్తాడు. అంతకుముందే నాయిక ఓ పోటీలో అనేకమందిని ఓడించి తన బందీలుగా చేసుకుంటుంది. వారిని విడిపించడం కోసం నాయకుడు వచ్చిన సందర్భంలో ఈ పాట వస్తుంది. ముసలివాణ్ని ఆటపట్టించడానికి నాయిక చెలికత్తెలు రంగంలోకి దిగుతారు. కథానాయకుడు వారిని బురిడీ కొట్టిస్తాడు.
నిజానికి కథరీత్యా నాయకుడు నాయికను ఓడిస్తాడన్న విషయం చూసేవారికి అర్థమవుతుంది, కానీ నర్మ గర్భంగా, వాచ్యంగా శృంగార రసం తొణికిసలాడుతుంది. నిజానికి ఈ సినిమాలో ఈ పాత్ర లక్ష్యం నాయికను గెలవడం. అందుకోసం ఏర్పరిచిన పాత్ర ముస్లిం కాబట్టి దానికి తగిన భాషను కవి ఇందులో ప్రయోగించారు. ఇందులోని ప్రతి పదం నాయకుని లక్ష్యాన్ని, నాయిక మనస్తత్వాన్ని తెలపడం మనం చూడొచ్చు. ఒకరి లక్ష్యం గెలవడం… మరొకరి లక్ష్యం ఓడించడం. ఇక భాష విషయానికి వస్తే తెలుగుతో కలిసిన అన్యభాషా పదాలు ఈ గీతానికి మరింత అందాన్ని తెచ్చాయి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి… కేవలం బాణీకి తగినట్టు రాయడం సినారెకు తెలియదు. ఏది రాసినా అందులో తనదైన ముద్ర ఉండేట్టు మలచడం ఆయనకు తెలిసిన విద్య. ఈ గీతం లక్ష్యాన్ని ఛేదిస్తూనే.. సన్నివేశ లక్షణాన్ని సమున్నతంగా నిలబెట్టి బంగారానికి తావి పులిమారు రచయిత.
ఈ గీతంలోని ప్రతి పాదంలో ఏదో ఒక పదం ఒదిగిపోయింది. ‘సలామలేకుం’ ‘దిల్ ఖుషీ చేయగా’, ‘బుల్బుల్’, ‘జిల్జిల్’, ‘అత్తరు’, ‘ఢిల్లా’, ‘పరారు’, ‘ఖరారు’ లాంటి పదాల సంయోజనం ఈ గీతాన్ని విలక్షణంగా చూపాయి. మన పూర్వకవుల నుంచి నేటిదాక చూసినట్టయితే అనేక ఉర్దూ, పారసీక పదాలు తెలుగు కావ్యాల్లో కనిపిస్తాయి. వీటిపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు సైతం జరిగాయి.
ఆమె: కన్నెలందరం కాలుదువ్వితే
రిమ్మదిరిగిపోతుందోయ్
నీ గుండె పీచుమంటుందోయ్
కోరస్: నీ గుండె పీచుమంటుందోయ్..
సలామలేకుం
అతను: జబ్బచరచి నే దుకానంటే
దెబ్బకు మీరు పరారు
మీ దెయ్యం దిగుట ఖరారు అస్సలామలేకుం పదాలతో పాటు చక్కటి జాతీయాలను కూడా ప్రయోగించారు కవి. ‘చింతచచ్చినా పులుపు చావలేదు’ అన్నదానిని ‘పులుపు తగ్గిపోలేదా’ అంటారు. ఇదే కోవలో ‘జబ్బచరిచి నే దుకానంటే దెబ్బకు మీరు పరారు’, ‘వయసుతోటి పనియేముంది నా మనసు చూడవే బుల్బుల్’ లాంటి పంక్తులు ఈ గీతంలో ప్రధాన రసమైన శృంగారాన్ని ఇట్టే తెలియజేస్తాయి.
– పత్తిపాక మోహన్