బెగ్గర్స్ కాలనీలో ఆకలి నిద్ర లేసింది. శారీరక-మానసిక అవిటి దేహాలను ఈడ్చుకుంటూ బిచ్చమెత్తుకోటానికి ఎళ్తుంరు ఆడున్న బిచ్చగాళ్లు. ఇరువై ఏండ్ల చంద్రి గుడా ఒడి ఉయ్యాలలో తన ఆర్నెల్ల బిడ్డను వడుకోవెట్టుకొని భిక్షాటనకు బయల్దేరింది. ఎన్కంగ తోకాడిస్తు పులిరాజు. నాలుగు గుడిసెలు దాటంగనే ఊతకర్రతో కుంటుకుంటు మెల్లకన్ను గుర్విగాడు ఎదురైండు. వానికి ముప్పయ్యేండ్లు ఉంటయిగని లగ్గం కాలే. పెనిమిటి సచ్చివొయి ఒంటరిగ ఉంటున్న చంద్రి మీన మనసువడ్డడు.
చంద్రికాడికొచ్చి.. “చంద్రీ! నేను చెప్పింది ఆలోచించినవా? నువ్వంటే నాకు శానా ఇష్టవే! మనం లగ్గం చేస్కుందం! నిన్ను, నీ బిడ్డను మంచిగ సూస్కుంటనే!” అన్నడు.మునుపు గుడా రెండుమూడు సార్ల ఇట్టనే అన్నడు.“నాతోని కాదులే గని ఇంకెవల్లనన్న సూస్కో!” అంది చంద్రి.“అట్టనమాకే చంద్రి! నిన్ను కూకోవెట్టి సాత్తనే! అమ్మతోడు నన్ను నమ్ము!” అంటు చంద్రి చేయి వట్టుకొని.. తన నెత్తిన వెట్టుకొని ఒట్టేసుకోవోయిండు. గంతే…ఏక్‌దమ్మున పులిరాజు ‘భౌ భౌ!’ అంటూ రెండు కాళ్లెత్తి గుర్విగాని మీదికి పులిలా దుంకవోయింది. తప్పించుకోవోయిన గుర్విగాడు కింద వడ్డడు.“రేయ్ రాజూ ఆగు!” అంది చంద్రి.గుర్విగాడు మెల్లిగా లేసి ముఖం మాడ్చుకొని ఎల్లివోయిండు.
గస వెడ్తున్న పులిరాజు తల నిమిరి ‘పోదం పా!’ అన్చెప్పి.. ఆటో అడ్డా కాడికొచ్చింది చంద్రి.బిడ్డను జాగ్రత్తగా వట్టుకొని అక్కడ రెడీగ ఉన్న షేరింగ్ ఆటో ఎక్కి కూకుంది. పులిరాజు గుడా ఆటోలకు దుంకి చంద్రి కాల్ల కాడ కూకుంది. గుర్విగాడు గూడ అప్పుడే వచ్చి డ్రైవర్ పక్కన కూకుండు. ఆటో నిండంగనే డ్రైవర్ ఆటోను ముందుకు వోనిచ్చిండు.ఆటో కుదుపులకు, రోడ్డుపై హారన్ల మోతలకు ఏడ్పందుకున్న బిడ్డకు చనుబాలు అందించింది. బిడ్డకు పాలువడ్తున్న చంద్రికి సచ్చివోయిన అమ్మ యాదికొచ్చింది. బిచ్చమెత్తుకోను వోయేటప్పుడు అమ్మ గుడా తనకు ఇట్టనే పాలు పట్టి ఉంటది అనుకుంది. అమ్మ ఇప్పుడు బతికి లేదు. తమని ఇడ్సివెట్టి ఎటో ఎల్లివొయిన అయ్య యాదికచ్చి చంద్రి కళ్లల్ల నీళ్లు తిరిగినయి. చంద్రి ఆలోచనలు ఎనకటి రోజులల్లకు వొయినయి.
గప్పుడు చంద్రికి పదేల్లుంటయి. బెగ్గర్స్ కాలనీ పక్కనున్న వీధి బళ్లే నాలుగో క్లాసు సద్వుకుంటంది. అమ్మ, అయ్య గిదే యాలకు బడికాడ తననొదిలి అడుక్కోటానికి వోయేటోల్లు. అయ్యకు ఓ కాలు ఓ చేయి లేదు. అమ్మ బాగనే ఉంది గని కాళ్లకు దెబ్బలు తగిలినట్టు కట్లు కట్టుకొని అడుక్కోనేది. అమ్మకు చీప్ లిక్కరు, కల్లు, గంజాయి తాగుడు అలవాటు. పరాయి మొగోల్లతో కల్సి తాగి ఏ అద్దరాత్రో వచ్చేది. అయ్య జేబిల డబ్బుల్ని దొబ్బుక వొయి గుడా తాగేది. అయ్య ఎంతో నచ్చచెప్పి సూసిండు. అమ్మ మారకపోంగా.. ఫుల్లుగ తాగొచ్చి అయ్యనే కొట్టేది. కాలు, చేయి లేని అయ్య ఏం చేయలేక దెబ్బలు తిని ఊకునేటోడు. అమ్మ ప్రతిరోజూ తాగొచ్చి చేసే రచ్చను తట్టుకోలేక.. అయ్య ఇల్లిడ్సివెట్టి ఎటో ఎల్లివోయిండు. మల్ల తిరిగి రాలే. జీవుల గోస పట్టని కాలం పగలు రాత్రులను ఎనక్కి నెట్టుకుంట నడుస్తనే ఉంది.
అందరు ఆడివిల్లల తీర్గనే చంద్రి గూడ ఎదిగింది. వయసుకొచ్చింది. కాలనీకి కొత్తగా వచ్చి ఆటో నడ్పుకుంటున్న లచ్చుంగాడు.. చంద్రిని రోజు సూస్తుండేటోడు. ఒక రోజు వాళ్లమ్మను కలిసి..“అక్కా! చంద్రి అంటే నాకు బవు ఇష్టం! నాకు నా అనే వోల్లు ఎవ్వరు లేరు! నూ ఒప్పుకొంటే చంద్రిని లగ్గం జేస్కుంట!” అని అడిగిండు. నడిపేది కిరాయి ఆటోనే అయినా బాగనే సంపాయిస్తడు. అడిగిన వారం రోజుల్లోనే.. చంద్రిని లచ్చుంగానికిచ్చి లగ్గం జేశింది అమ్మ. ముగ్గురూ ఒక్కతానే ఉంటున్నరు. కాపురం మంచిగనే నడుస్తోంది.తెల్లార్తుంది చీకటి వడ్తోంది. అమాస పున్నాలు వొస్తున్నయి వోతున్నయి. కాలం గిర్రున తిరుగుతనే ఉంది.అమ్మ తాగుడు మాన్తలేదు. పిచ్చిదాన్లెక్క తయారైంది. అప్పుడప్పుడు లచ్చుంగాడే కంపౌండు కల్లు తెచ్చిచ్చేటోడు. తాగి బువ్వ గూడ తినకుండ వడుకునేది. ఆరోగ్యం మొత్తం ఖరాబ్జేస్కుంది. మూలిగే నక్క మీన తాటిపండు వడ్డట్టు.. ఒకనాడు జొరమొచ్చి మంచాన వడింది. ఇంగ లేవనేలే. అట్టనే సచ్చివోయింది.
లచ్చుంగాడు సుత పాణం బాగుంటలేదని ఆటో నడ్పవోతలేడు. లోజొరంతో ఉంటుండు. రోజురోజుకూ చిక్కి వోతుండు. ఇటు చంద్రికేమో మూడో నెల. అమ్మ లేదు. కట్టుకున్నోడు మంచాన వడ్డడు. బువ్వకే కష్టమై.. మూన్నెల్ల కడ్పుతోని బిచ్చమెత్తుకోను బోవాల్సొచ్చింది. గప్పుడే ఓనాడు బిచ్చమడుక్కొని తిరిగొస్తుంటే.. ఓ కుక్కపిల్ల ఎంటవడి ఇంటికొచ్చింది. తెల్లగ ముద్దుగున్న గా కుక్కను దగ్గరికి దీశింది చంద్రి. తాము తిన్నదాంట్లో దానికీ కొంచెమంత వెట్టేది. దాంతోని ఆ కుక్క చంద్రిని ఇడ్సివెట్టి ఉండేది కాదు. లచ్చుంగాడు మంచాన పడినాక.. తనకు ఆ కుక్క పిల్లే తోడైంది. దానికి ‘పులిరాజు’ అని పేరెట్టుకుంది. బిడ్డలెక్క సాకింది. తనకు కాన్పయి ఆడ బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన నాలుగు నెల్లకే అర్థం గాని రోగంతో లచ్చుంగాడు సచ్చివొయిండు. నా అనేవాల్లెవ్వరు లేని అనాదైంది చంద్రి. ఒక్క పులిరాజే తనకు తోడు.
అట్టా ఆలోచిస్తున్న చంద్రి గ్నాపకాల్లోంచి బయటికొచ్చి కళ్లు తుడ్చుకుంది. కాళ్ల దగ్గర కూకోనున్న పులిరాజు తలపై నెనరుగా నిమిరింది. గప్పుడే ఆటో ఆపి.. “ఇంజన్ బౌలి రైతుబజార్..” అని కేకేసిండు ఆటో డ్రైవర్.“నేను దిగుత అన్న!” అనుకుంట.. బిడ్డను భద్రంగ వట్కొని ఆటో దిగింది చంద్రి.పులిరాజు సుత కిందికి దుంకింది. మెల్లకన్ను గుర్విగాడు గుడా గాడనే దిగిండు.అక్కడ జనం కిక్కిరిసి ఉన్నరు. వాహనాలతోని ట్రాఫిక్ జామ్ అయింది. రైతుబజార్ వైపు నడుస్తోన్న చంద్రి పక్కకెళ్లి.. ఓ కారు మెళ్లంగ వోతున్నది. అందులంగ ఒకతను కారు అద్దాలు కిందికి దింపి గుట్క నమిలి తుపుక్కున ఉమ్మేసిండు. అది పులిరాజు మీద వడింది. మల్ల గుడా పులిరాజు వైపు సూస్కుంటనే కాండ్రించి ఉమ్మేసిండు. తెల్లటి పులిరాజు మీన గుట్కా మరకలు గలీజుగ అగ్పడ్తున్నయి. గవ్విటిని సూశిన చంద్రికి ఒల్లు మండింది.
“గిదేంది సారూ? కళ్లు అగ్పడ్తలేవా? అది మనలాంటి జీవి గాదా? దానిమీద అట్టా ఉమ్మేసినరేందీ?” అనడిగింది. అతను చంద్రి వైపు ఈసడింపుగా చూసి.. డ్రైవర్‌ను కారు ఆపమని సైగ చేసిండు. కిందికి దిగి మల్ల పులిరాజుమీద కాండ్రించి ఉమ్మేసి.. “మల్ల గుడా ఊసిన! అయితేందీ? ఏం చేస్తవ్?” అన్నడు దబాయింపుగా.తట్టుకోలేనంత కోపమొచ్చింది చంద్రికి. అది కుక్క కాదు. తన బిడ్డ లెక్క. దానిమీద ఉమ్మేసి, పైయంగా దబాయిస్తే ఊకుంటదా చంద్రి? “ఏం సారూ? నూ మనిషివేనా? అన్నం తింటున్నవా? గడ్డి తింటున్నవా?” అనడిగింది.దాంతోని అతని అహం దెబ్బ తిన్నది. కోపంగా చంద్రి చెంపమీద ఛెళ్లున దెబ్బేసిండు. బలహీనంగా ఉన్న చంద్రి తూలి కింద వడింది. ఒళ్లోని బిడ్డ గుడా కిందవడి ఏడుస్తొంది. ఆడ్నే ఉన్న గుర్విగాడు గమనించి బిడ్డను గబుక్కున ఎత్తుకొని.. ఏడుస్తున్న బిడ్డను సంజాయిస్తుండు. కింద వడిన చంద్రి సివంగిలా పైకిలేసి.. తనని కొట్టినతని చొక్కా వట్టుకొని గట్టిగా ఊపి ఇసిరేసింది. అతను తూలి పడబోయి నిలదొక్కుకొని.. మల్ల చంద్రిని కొట్టటానికి చేయెత్తిండు. గింతల్నే జరిగిందంతా చూస్తున్న ఒకతను అడ్డమొచ్చి.. ఆ కొట్టినోని చేయి పట్టుకొని.. “ఏందిరాబై తమాషా జేస్తున్నవా? తప్పు చేస్తవ్!
ఆడపిల్ల అని సూడకుండ కొడ్తవ్! సదూకున్నోని లెక్కనే ఉన్నవ్ గదా! గుట్కా తిని ఏడ ఉమ్మేయాలో తెల్వదా? బుద్ధున్నోడు ఎవడైన కుక్క మీద ఉమ్మేస్తడా?” అనడిగిండు.అంతల్నే అక్కడికి ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చింరు. “ఏం జరుగుతుందిక్కడా? ట్రాఫిక్ల గీ లొల్లేంది?” అనుకుంట ఆడ గుమికూడినోల్లను ఎల్లగొట్టింరు. “సార్! వీళ్లను స్టేషన్‌కు తీస్కపోండి! వీళ్ల గొడ్వేందో తెలుస్తది!” అన్నడు.. చంద్రిని కొట్టబోతుంటే అడ్డమొచ్చినతను.పోలీస్టేషన్ రైతుబజార్ పక్కనే ఉంటది. “చల్ నడువురి స్టేషన్‌కు! ఏం జరిగిందో స్టేషన్ల చెప్పుకోంరి!” అన్నడు కానిస్టేబుల్.“నాకేం బయమా? స్టేషన్‌కు వస్త సార్! ఏం జరిగిందో? తప్పు చేసిందెవలో స్టేషన్లనే తేలాలే!” అన్చెప్పి.. గుర్విగాని తానున్న బిడ్డని తీస్కొని పోలీస్టేషన్ వైపు నడిచింది చంద్రి.
ఉమ్మేసినతను డ్రైవింగ్ చేస్తున్నతన్ని.. ‘నువ్వెళ్లు!’ అన్నట్లు సైగ జేసిండు.ఆయినె కారు స్టార్ట్ చేయంగనే.. కానిస్టేబుల్ కారుకు అడ్డం పోయి.. “యాడికి బోతున్నర్ సార్? స్టేషన్‌కు నడువురి!” అని డోర్ తీసి లోపల కూర్చుండు.కారును పోలీస్టేషన్‌కు తోల్కచ్చి ఆపంగనే.. తాళం చేతులు తీసుకొని కారు దిగిండు కానిస్టేబుల్. ఆ కారు నడిపినతను ఆడంగా జారుకునే ప్రయత్నం చేస్తుంటే కానిస్టేబుల్ సూశి.. “నిన్ను సూస్తనే ఉన్న! ఏం సంగతీ? పారిపోదమన్కుంటున్నవ్ లే? కార్ల ఏం రవాణా జేస్తుంరు? నడువు స్టేషన్లకు!” అన్కుంట అతణ్ని లాక్కొచ్చి స్టేషన్లో కూర్చోవెట్టిండు.ఇంకో కానిస్టేబుల్ ఉమ్మేసినతన్ని వెంటబెట్కొచ్చిండు. చంద్రి, గుర్విగాడు గుడా ఆపాటికే స్టేషన్కొచ్చింరు. వాళ్లందర్ని ఎస్సైకి చూపించి.. జరిగిన కథంతా చెప్పిండు కానిస్టేబుల్.“ఏం సంగతి గుట్కా మహారాజ్? గుట్కా నమిలి ఎక్కడ ఉమ్మేయాలో తెలుస్త లేదా?” అని కోపానికచ్చిండు ఎస్సై. ఇంతల్నే రెండో కానిస్టేబుల్ వచ్చి.. “సార్! కార్ డ్రైవర్ పారిపోటానికి ప్లాన్ జేసిండు. అనుమానమచ్చి స్టేషన్‌కు పట్కొచ్చిన! కార్లో ఏమో ఉన్నట్లు అనుమానం గొడ్తంది!” అంటూ కారు తాళాలు ఎస్సై టేబుల్ మీద పెట్టిండు.
కానిస్టేబుల్‌ను తనతో రమ్మని, కారు కాడికొచ్చిండు ఎస్సై శ్యాం ప్రసాద్. కానిస్టేబుల్ కార్ చెక్ చేస్తు.. “సార్!” అని కేక పెట్టిండు.“ఏమైందీ?” అని కార్ లోపట్కి సూసిన ఎస్సై.. వెనక సీటు కింద కన్పించిన డ్రగ్స్ పాకెట్లు చూసి షాక్ తిన్నడు. ఆ డ్రగ్స్ కోట్ల విలువైనవి.ఓ కానిస్టేబుల్ అప్పుడే గబగబా వచ్చి.. “సార్! మిమ్మల్ని ఏసీపీ సార్ పిలుస్తుండు!” అన్నడు.“మీరిక్కడే ఉండండి! మనం కార్లో చూసింది ఎవరికీ తెలీకూడదు! టేక్ కేర్!” అన్చెప్పి.. ఏసీపీ ఛాంబర్ వైపు పరుగెత్తిండు ఎస్సై .
ఏసీపీ ఛాంబర్లో సీఐ జహాంగీర్తో ఏదో సీరియస్‌గా చర్చిస్తున్నాడు ఏసీపీ.ఎస్సై సైల్యూట్ కొట్టి ఎదురు సీట్లో కూర్చుండు. ఏసీపీ నుదుటిపై చెమటలు తుడ్చుకొని..“ఇప్పుడు స్టేషన్‌కు వచ్చిన కేసు… కుక్క మీద గుట్కా ఉమ్మేసిందే కదా?” అని అడిగిండు. “అవును సార్! దాని గురించే నేను మీ సలహా కోసం వద్దామనుకుంటున్న! ఈలోగా మీరే పిలిచారు!” అన్నాడు ఎస్సై. “ఇట్స్ ఓకే! ఉమ్మేసినతని పేరేంటన్నారు?” అడిగిండు ఏసీపీ. “రూపేష్ సర్!” “ఓకే! ఏదో పొరపాటు జరిగిందని చెప్పించి, వాళ్లను కాంప్రమైజ్ చేపించి పంపేయండి!” అన్నడు ఏసీపీ.“సారీ సర్! రూపేష్ కార్లో కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నయి సర్!” అని ఎస్సై చెప్పగానే…“అఫ్కోర్స్! ఉంటే ఉన్నాయి మనకెందుకు లంపెటా! అందుకే ఆలిస్యం చేయకుండా ఆ కుక్క ఎవరిదో వాళ్లకు కొన్ని డబ్బులు ఇప్పించి కాంప్రమైజ్ చేసి పంపేయండి!” అన్నాడు ఏసీపీ. ఎస్సై ఆశ్చర్యవొయి సీఐ వైపు సూసిండు. “ఏసీపీ సాబ్ జైసా బోలే… వైసాహి కరో ఎస్సైసాబ్! బస్ ఖిస్సా ఖతమ్!” అన్నడు సీఐ జహాంగీర్.
“సర్! మరి కార్లో ఉన్న డ్రగ్స్… ?” అని ఏసీపీని మల్ల అడిగిండు ఎస్సై. “మనకెందుకయ్యా! నొప్పించక తానొవ్వక… అని చదూకోలే? కార్లో మనమేం చూడలేదు! మనకేం దొరకలేదు! దట్సాల్!” అన్నాడు ఏసీపీ.‘పై అధికారుల మాటల్ని తూ.చ. తప్పకుండా పాటించటమే పోలీస్ డిపార్ట్మెంట్లోని కింది ఆఫీసర్ల డ్యూటీ!’ అనుకొని.. లేచి తన ఛాంబర్లకు వచ్చిండు ఎస్సై శ్యాంప్రసాద్. అప్పటికే తన ఛాంబర్లో లాయర్ భద్రగిరి కూర్చోనుండు. “గుడ్ మార్నింగ్ ఎస్సై గారు!” అన్నడు లాయర్ భద్రగిరి.“వెరీ గుడ్ మార్నింగ్ సర్! ఎంత సేపయింది వచ్చి?” అన్నడు ఎస్సై కుర్చీలో కూచుంటు.
“ఇప్పుడే వచ్చిన సార్! నా క్లయింట్ చంద్రమ్మ గురించి! మావాళ్లు నాకంటే ముందే వచ్చి బయట కూచున్నారు! చూశారా?” అన్నడు లాయర్. చంద్రికి జరిగిన అవమానం, చంద్రి పోలీస్టేషన్లో ఉన్న విషయం క్షణాల్లో బెగ్గర్స్ కాలనీ వాళ్లకు తెల్వటం, వాళ్లు వారి ఆత్మీయ న్యాయ సలహాదారు లాయర్ భద్రగిరికి తెలపటం, లాయర్ భద్రగిరి రంగంలోకి దిగటం, పదుల సంఖ్యలో బెగ్గర్స్ స్టేషన్‌కు చేరుకొని, స్టేషన్ ముందు బైఠాయించడం వేగంగా జరిగిపోయింది.ఆ బిచ్చగాళ్లను చూసి, కేసు ఫైల్ చేయక తప్పదనుకున్నడు ఎస్సై. అయినా కాంప్రమైజ్‌కు ప్రయత్నించి చూద్దామని.. “ఇంత చిన్న కేసుకు మీరు రావడమెందుకు సార్? ఒక్క ఫోన్ చేస్తే కేస్ నేనే సాల్వ్ చేసి పంపించేవాణ్ని కదా!” అన్నడు ఎస్సై. “అదెలా?” అడిగిండు లాయర్.
“న్యూసెన్స్ కేసే కదా సార్! మీ క్లయింట్‌కు ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పిద్దాం! ఏసీపీ గారు కూడా.. ఆ అమ్మాయికి న్యాయం చేయమని చెప్పారు. ఎంత ఇప్పిద్దామంటారో ఓ ఫిగర్ మీరే చెప్పండి?”.లాయర్ నవ్వి.. “నో ఛాన్స్ ఫర్ కాంప్రమైజేషన్! వి హావ్ లూజిట్ సర్! కేసు మన చేయి దాటిపోయింది!” అన్నడు. “ఎలాగా?” అడిగిండు ఎస్సై. “రవి గాంచని చోట కవి గాంచును అనేది పాత సామెత సార్! ‘పోలీసులు గాంచని చోట మీడియా లెన్స్‌లు గాంచును’ అనేది కొత్త సామెత! ఈ కేసులో పట్టుబడ్డ ఆగంతకులు డ్రగ్స్ సరఫరాదారులు సార్! వారిలో ఒకరు నేషనల్ లెవెల్లో డ్రగ్స్ సప్లయి చేసే బడా స్మగ్లర్ కొడుకు! కారు నడుపుతున్న వ్యక్తి డ్రగ్స్ సరఫరా దారుడు! ఇంతకుముందు రెండుసార్లు ఇస్వంటి కేసుల్లోనే జైలు శిక్ష అనుభవించినోడు.
ఇతను కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడినా, చిన్నపాటి శిక్షలతోనే బయట పడ్తాడు! అది ఇతని ప్రత్యేకత! వెరీ టాలెంటెడ్ క్రిమినల్ లాగున్నడు కదా?” అన్నడు లాయర్.“ఇదంతా మీకెలా తెలుసు సార్?” ఆశ్చర్యంగా అడిగిండు ఎస్సై. జవాబుగా తన జేబులోంచి స్మార్ట్‌ఫోన్ తీసి.. యూట్యూబ్ చానల్ ఓపెన్ చేసి ఎస్సైకి అందించాడు లాయర్. అందులో.. ‘పాతబస్తీ ఇంజన్ బౌలి వద్ద కోట్ల విలువైన డ్రగ్స్‌తో పోలీసులకు చిక్కిన డ్రగ్స్ స్మగ్లర్ లఖన్ సింగ్! గతంలో ఇతను కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడినప్పటికీ చిన్నచిన్న శిక్షలు పడటం విశేషం! ఈసారైనా నేరానికి తగిన శిక్ష పడుతుందా? దొరికిన డ్రగ్స్ విలువెంత? పోలీసులు తీసుకోబోయే చర్యలు, కోర్టు తీర్పు గురించి ప్రజలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు!’ అంటూ వచ్చిన స్క్రోలింగ్ చదివి తల పట్టుకొన్నాడు ఎస్సై. అప్పుడే ఓ కానిస్టేబుల్ వచ్చి.. “సార్! మిమ్మల్ని ఏసీపీ గారు పిలుస్తున్నరు!” అని చెప్పటంతో.. “లాయర్ గారూ.. ఉండండి! వెంటనే వస్తా!” అన్చెప్పి గబగబా ఏసీపీ ఛాంబర్ వైపు వెళ్లాడు.
ఎస్సై వచ్చి కూర్చోగానే.. “సీఐ సాబ్! మీరిద్దరూ కలిసి ఈ కేసు కాంప్రమైజ్ అయ్యేలా చూడండి! ఫోన్‌కాల్స్ చూస్తున్నరు కదా? ఆ పట్టుబడినోడు అన్ని పార్టీలకూ ఎలక్షన్ ఫండ్ ఇచ్చేటోని సెకండ్ సెటప్ కొడుకంట! ప్రభుత్వాలనే ప్రభావితం చేసేంత గట్స్ ఉన్నోడంట! నా నరాల్లో బీపీ హైజంప్ చేస్తోంది! ఎలాగైనా కేసు కాంప్రమైజ్ చేయించండి!” అన్నడు ఏసీపీ.. టెన్షన్‌తో తల పట్టుకొని.“కాంప్రమైజ్ చేయటానికి ఛాన్సే లేదు సార్! కంప్లేనెంట్ వైపు నుంచి లాయర్ భద్రగిరి వచ్చారు!” అన్నాడు ఎస్సై. “ఆయణ్ని కూడా కన్విన్స్ చేసి చెప్పండి.. కేస్ కాంప్రమైజ్ చేయమని!” అన్నడు ఏసీపీ అసహనంగా.“లాయర్ భద్రగిరి సాధారణంగా కాంప్రమైజ్ అయ్యే కేసుల్లో ఇన్వాల్వ్ కాడు సార్! తను టేకప్ చేశాడంటే.. కేస్ ఫైల్ అయి తీరాల్సిందే!” అన్నడు సీఐ జహాంగీర్.ఏసీపీ కొద్దిసేపు తలపట్టుకొని ఆలోచించి.. “ఇట్స్ ఓకే! దొరికినోళ్ల మీద ఎన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టే అవకాశం ఉంటే అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టండి!” అన్నడు.. ఏమీ చేయలేని కసితో.సీఐ, ఎస్సై.. ‘ఓకే సార్!’ అని చెప్పి.. సీఐ చాంబర్‌కు వచ్చింరు.చంద్రమ్మను పిలిచి లాయర్ భద్రగిరి సమక్షంలో రిటెన్ కంప్లయింట్ తీసుకున్నరు.
“నా క్లయింట్ పెట్‌డాగ్‌పై ఉమ్మేసి, మహిళ అని చూడకుండా ఆమెపై చేయి చేసుకున్నాడతను! మేము చేస్తున్న న్యాయ పోరాటం ఈ విషయం పైనే! దట్సాల్! ఆ డ్రగ్స్ కేసుతో నా క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదు!” అని చెప్పి.. లాయర్ భద్రగిరి బయటికొచ్చిండు.పోలీస్టేషన్ బయట బైఠాయించిన కాలనీ బిచ్చగాళ్లతో.. “మిత్రులారా! చంద్రమ్మకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడ్తాను! మనకు పోలీసువారు పూర్తిగా సహకరిస్తున్నారు! మీరు వెళ్లి బేఫికర్‌గా మీ పనులు చూస్కోండి!” అన్నడు. తమనుంచి రూపాయి కూడా ఆశించని లాయర్ భద్రగిరి మాటంటే వాళ్లకు వేదవాక్కు! అందరూ లేచి ఎవరి దారినవారు వెళ్లిపోయింరు.కారు, అందులోని డ్రగ్స్‌ను పంచ్‌నామా చేసి సీజ్ చేసింరు. కుక్క మీద ఉమ్మేసి చంద్రమ్మను కొట్టినందుకు మొదటి కేసు, మాదక ద్రవ్యాలతో పట్టుబడింది రెండో కేసుగా నమోదు చేసి.. ముద్దాయిలను కోర్టులో హాజరు పర్చారు పోలీసులు. కేసును పరీశీలించిన జడ్జీ.. ముద్దాయిలకు పద్నాలుగు రోజులు రిమాండ్‌కు పంపాలని ఆదేశించారు.
గొడవ జరిగిన రోజునుంచి చంద్రి బిడ్డకు జ్వొరం. దవాఖానకు తీస్కవోయినప్పుడు గుర్విగాడే చంద్రి ఎంట ఉన్నడు. డబ్బులు గుడా సర్దిండు. స్టేషన్‌కు వోయినప్పుడు గుడా లాయర్ భద్రగిరికి, కాలనీ వాళ్లకు ఫోన్లు చేసి రప్పించింది కూడా గుర్విగాడేనని చంద్రికి ఎర్కయింది. ‘మనం లగ్గం జేస్కుందాం చంద్రి!’ అన్న గుర్విగాని మాటల గురించి ఆలోచనల వడింది చంద్రి. తన ఒంటరి బతుకులో తనని అర్థం చేసుకునే ఒక మగ మనిషి తోడు అవసరమే అనుకుంటుంది.ఇంకో మూడు రోజులకు కేసు కోర్టు బెంచిమీదికి వస్తదనీ, ఆ రోజు పది గంటల వరకు కోర్టుకు హాజరవ్వాలని చంద్రికి తెలిపిండు లాయర్ భద్రగిరి. “అట్టనే వస్త సార్!” అన్చెప్పింది చంద్రి.
గుర్విగానితో మాట్లాడాలనుకొని.. వాణ్ని ఇంటికి రమ్మన్నది చంద్రి. రాత్రి ఏడింటికి గుర్విగాడు వచ్చిండు. కొద్దిసేపు ఏం మాట్లాడకుండా కూకున్నంక.. “అదే… నూ ‘మనం లగ్గం చేస్కుందం’ అన్నవ్ గదా! అదే ముచ్చట మాట్లాడ్దమని విలిసిన!” అంది. “ఊఁ మరేం ఆలోచించినవ్?” అడిగిండు వాడు.“నాకు ఇట్టా అడుక్కుతిని బతకటం ఇష్టం కాదు! ఏరే దారిలేక ఇట్ట బతుకుతున్న! అడుక్కోనువోతే వయసులో ఉన్న ఆడమడిసిని ఎవరెన్ని మాటలంటరో ఎర్కనా నీకు? ‘గట్టిగున్నవ్! అడక్కొనే తినాలా? ఇంకేం చేసినా డబ్బలొత్తయ్!’ అని ఒకల్లంటే.. ‘కత్తిలాగున్నవు కొద్దిసేపు కళ్లు మూసుకుంటే బోలెడు డబ్బులొస్తయ్!’ అని ఇంకొకల్లు అనవట్టింరు! పాచి పనైన చేస్కొని బతుకుదామన్కోని పని అడగవోతే.. ‘బిచ్చగాల్ల కాలనీ వాల్లు దొంగలుంటరు!’ అని పనిల వెట్కుంట లేరు! నేను నాల్గో తరగతి సద్విన! నా బిడ్డను మంచిగ సద్వించాలనుకుంటున్న! బిడ్డకి ఇస్వంటి పాడు బతుకు ఇయ్యొద్దు అన్‌కుంటున్న! మనం లగ్గం చేస్కున్నంక ఎటన్నావోయి చిన్న గుడిసె అద్దెకు తీస్కోనుందం! నేను నాలుగిండ్లల్ల పాచి వనికి వోత! నూ నీ ఇష్టమొచ్చిన పని చెయ్యి గని.. గీ బిచ్చమెత్తుకొనుడు వద్దు! గీ ముచ్చట నీకిష్టమైతే నీతో లగ్గం నాకిష్టమే!” అంది చంద్రి.గుర్విగాడు సంతోషంగ.. “నూ చెప్పినట్టే నడ్సుకుంటనే చంద్రి!” అన్నడు. సంబరవడింది చంద్రి. “మూడు రోజుల్ల కేసు ఉందంట! సార్ చెప్పిండు! ఇద్దరం కోర్టుకు వోదం! కోర్టు పని అయినంక లాయర్ సార్‌కు మన లగ్గం ముచ్చట జెబుదం. సార్ ముంగట్నే దండలు మార్చుకుందం!” అంది చంద్రి. “సరే.. అట్టనే చేద్దం!” అన్నడు గుర్విగాడు.ఆ రాత్రి గుర్విగానికి కూడ వంట చేసింది చంద్రి. ఇద్దరూ మాటాడుకుంట తిన్నరు. పులిరాజుకు గుర్విగాడంటే ఇష్టం ఏర్పడినట్టుంది. వానితోని రాసుకొని పూసుకొని తిరుగుతోంది. ఈ రాత్రికి ఈడ్నే పడుకోమని గుర్విగానికి చెప్పింది చంద్రి. గుడిసె బయట గడె మంచమేసి.. దిండు, పక్కగుడ్డలేసింది. లోపటంగ గడె వెట్కొని పాపను నిద్రబుచ్చి తనూ వడుకుంది. పులిరాజు గుడా చంద్రి పక్కనే వడుకుంది.గుడిసె బయట గుర్విగాడు గడె మంచమ్మీద వడుకొని.. చంద్రితో గడపవోయే రేపటి రోజుల్ని ఊహించుకుంటు కుశాల్‌గా నిద్దట్లెకు జారుకుండు.
మరుసటి రోజు బెగ్గర్స్ కాలనీ నిద్ర లేసింది. కానీ…చంద్రి నిద్ర లేవలేదు. చంద్రి బిడ్డ, పులిరాజు గుడా నిద్ర లేవలేదు. వాళ్లకు ఆకలిగా లేదు. వాళ్లకు ఇంకెప్పటికీ ఆకలి కాదు. నిన్న అర్ధరాత్రి చంద్రి గుడిసె కాలివోయింది. ఆ గుడిసెలున్న చంద్రి, చంద్రి బిడ్డ, పులిరాజు ప్రాణాలు అగ్గిలో కాలి బూడిదైనయి. వాళ్లకోసం గుండెలు బాదుకొని ఏడ్సేటోలెవరు లేరు. గుడిసె బైట పడుకున్న గుర్విగాడు లేడు. వాడు పడుకున్న గడె మంచానికి ఒక కాలు ఇరిగి ఉంది. పక్క దుప్పట్లు ఇసిరేసినట్టు కింద పడి ఉన్నయి. మంచం పక్కనే గుర్విగాని ఊతకర్ర అనాథలా పడి ఉంది. గుర్విగాడు మాత్రం మాయమైండు. ఏదో ఒకరోజు ఈ మహా నగరంలోని ఏ మురికి గుంటలోనో వాడొక దిక్కులేని శవంగా బయటపడొచ్చు…చంద్రి సంఘటన తెల్సి లాయర్ భద్రగిరి బెగ్గర్స్ కాలనీకి వచ్చిండు. ఇలా జరుగుతదని ఆయనె ఊహించే అవకాశం లేదు. చాలా బాధవడ్డడు. పోలీసులొచ్చింరు. షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె కాలిందని ‘పంచ్‌నామా’లో రాస్కున్నరు. కాలిపోంగ మిగిలిన మృతుల శరీర భాగాలను పోస్ట్ మార్టం కోసం పంపింరు.
చంద్రి కేసు బెంచ్ మీదికి వచ్చినరోజు… చంద్రి చనిపోయిన సంఘటన మాటిమాటికీ మనసులో మెదులుతోంటే.. మర్చిపోలేక అన్యమనస్కంగా తలొంచుకొని కుర్చీలో కూలబడిండు లాయర్ భద్రగిరి. పోలీసులు దాఖలు చేసిన ఫస్ట్ కేసులో ఆర్జీదారు చంద్రమ్మ చనిపోయినందువల్ల, ఆమె తరుఫున కేసుకు సరైన సాక్షులను పోలీసువారు కోర్టులో హాజరు పర్చలేనందు వల్ల.. కేసును కొట్టేశారు. రెండోది డ్రగ్స్ సరఫరా కేసు. ఇద్దరు ముద్దాయిలను హాజరు పర్చారు పోలీసులు. వారి వద్ద తక్కువ మోతాదులో డ్రగ్స్ దొరికిన కారణంగా వారికి ఒక నెల జైలు శిక్ష, పాతిక వేల జరిమానా విధిస్తు జడ్జి తీర్పు ఇచ్చారు. లాయర్ భద్రగిరి ఆ తీర్పు విని.. తల పైకెత్తి జడ్జి వైపు, ముద్దాయిల వైపు చూసిండు. బోనులో కొత్తగా ఇద్దరు నైజీరియన్లను చూసి ఆశ్చర్యపోయిండు.
‘ఎవరు ఈ నైజీరీయన్స్? డ్రగ్స్‌తో పట్టుబడింది వీరు కాదే? దొరికిన డ్రగ్స్‌కు వీరికి ఏం సంబంధం? ఈ మధ్య దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా నైజీరియన్స్ పేర్లే విన్పిస్తున్నాయి. ఎందుకు? వీళ్లు అద్దెకు దొరికే నేరస్థులా? లేక ఇది వేరే కేసా? దేశంలోకి టన్నుల కొద్ది డ్రగ్స్ ఎక్కడినుండి వస్తున్నది? కస్టమ్స్ అధికారులు ఏం చేస్తున్నరు? నిఘా విభాగాలు ఏం చేస్తున్నయి? రాయబార కార్యాలయాలు ఉన్నది ఎందుకు? ప్రజలు ఎవరిని అనుమానించాలి? స్థానికుల అండ లేనిదే దేశంలో డ్రగ్స్ అమ్మకాలు సాధ్యమా? జవాబుదారీతనం ప్రభుత్వాలది కాదా?’.. ఇలా అనేక ప్రశ్నలు భద్రగిరి బుర్రలో సుళ్లు తిరుగుతున్నయి.
డ్రగ్స్‌తో పట్టుబడినవారు నైజీరియన్స్ కాదని కోర్టుకు తను ఎలా రుజువు చేయాలి? చంద్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో చనిపోయింది అంటే… చంద్రి మరణ రహస్యం కొంచెంకొంచెంగా అర్థమవుతోంది లాయర్ భద్రగిరికి. తన కుక్క మీద ఉమ్మేసిన వాడు, డ్రగ్స్ సప్లయిదారుడు ఒక్కడేనని చంద్రి సాక్ష్యంతో తెలిసి పోతుంది. తీగ లాగితే డ్రగ్స్ మాఫియా అక్రమ సామ్రాజ్యపు డొంక కదుల్తుంది. ఈ చట్టవ్యతిరేక వ్యాపారంలో భాగస్థులుగా ఉన్న నాయకులెవరో? వారివారి వాటాలెంతో బట్టబయలు కావొచ్చు. ప్రభుత్వాలు కూడా కూలిపోవచ్చు. అందుకనీ.. సాక్ష్యం తుడిచేయటానికి చంద్రిని అడ్డు తొలిగించుకున్నారు.
చంద్రి న్యాయపోరాటం వీళ్ల చీకటి వ్యాపారాల మీద కాదే! చంద్రిది యాక్సిడెంటల్ డెత్ కాదు! ప్లాన్ ప్రకారంగా చేసిన మర్డర్! ఎంత దారుణం! చంద్రికి న్యాయం జరగాలి! సాక్ష్యాన్ని దొరకబుచ్చుకొని చంద్రి కేసును తిరిగి బెంచ్ మీదికి వచ్చేలా చేయాలి!’ అనుకున్నడు లాయర్ భద్రగిరి.చంద్రి లేదు. ప్రత్యక్ష సాక్షి గుర్విగాడు మాయమైండు. యూట్యూబ్ చానల్స్ వారు రికార్డ్ చేసిన సమాచారం డిలీట్ చేసింరు. మిగిలిన సాక్ష్యం ఒకటే. ఆరోజు ఉమ్మేసినతణ్ని అడ్డుకున్న వ్యక్తి. సీసీ పుటేజీలో ఫొటో ఉంది. కాని మనిషి దొరకలేదు. బహుశ స్థానికుడు కాకపోవచ్చేమో. లాయర్ భద్రగిరికి అతను దొరుకుతాడనే నమ్మకం నీరుగారిపోయింది.దేశంలో వ్యాపార రంగాలన్నీ మాఫియా గుప్పెట్లోకి వెళ్లాక, అడ్డంగా బలిసిన కార్పొరేట్ శక్తులే రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాక, దేశంలోని మూడంచెల ప్రజాస్వామ్య వ్యవస్థ వారి పెంపుడు కుక్కలా మారుతోందనేది సత్యదూరమేం కాదు.
నీతి, నిజాయతీ, నైతికత నిర్వీర్యమవుతున్నవి. నిజం మాట్లాడే వాడే నేరస్థుడవుతున్నాడు. మనిషత్వం కర్కశంగా ఖూనీ చేయబడుతున్నది. సాక్ష్యాలు మాయమవుతున్నాయి.గుజరాత్లో కావచ్చు. మహారాష్ట్రలో కావచ్చు. ఉత్తరప్రదేశ్‌లో కావచ్చు. పుల్వామాలో కావచ్చు. ఢిల్లీలో కావచ్చు. మణిపూర్‌లో కావచ్చు. దేశంలోని ఇతర ఏ ప్రాంతాల్లోనైనా కావచ్చు. ఆఖరికి బెగ్గర్స్ కాలనీలోనూ కావచ్చు. సిద్ధాంతాలపై కాక అబద్దాల పునాదులపై నడిచే ప్రభుత్వాలకు నేరాలు చేయటం, సాక్ష్యాలను మాయం చేయటమే పాలనా ప్రవృత్తి. ఇదే నడుస్తున్న చరిత్ర!చంద్రి విషయంలోనూ అదే జరిగింది.కానీ… ఛేంజ్ ఈజ్ లా ఆఫ్ నేచర్ అంటారు. మార్పు ప్రకృతి సహజం. ఈ దుష్ట దుర్మార్గ హింసనణచ ఏ మారు మూలనో అసలు సిసలైన మనిషి సంతకం మొలకెత్తే ఉంటుంది!
గొడవ జరిగిన రోజునుంచి చంద్రి బిడ్డకు జ్వొరం. దవాఖానకు తీస్కవోయినప్పుడు గుర్విగాడే చంద్రి ఎంట ఉన్నడు. డబ్బులు గుడా సర్దిండు. స్టేషన్‌కు వోయినప్పుడు గుడా లాయర్ భద్రగిరికి, కాలనీ వాళ్లకు ఫోన్లు చేసి రప్పించింది కూడా గుర్విగాడేనని చంద్రికి ఎర్కయింది. ‘మనం లగ్గం జేస్కుందాం చంద్రి!’ అన్న గుర్విగాని మాటల గురించి ఆలోచనల వడింది.
సయ్యద్ గఫార్
‘కథ’కు సామాజిక ప్రయోజనం ఉండాలని ఆశించే రచయిత సయ్యద్ గఫార్. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లా వాడపల్లి. ప్రస్తుత నివాసం హైదరాబాద్‌లో. ఎనిమిదేళ్లపాటు ‘పంచాయతీ రాజ్ లీడర్’ స్థానిక సంస్థల విశ్లేషణ మాస పత్రికను నడిపించారు. స్టేజీ నాటకాల్లో నటన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1973 నుంచీ కథలు రాస్తున్నారు. ప్రతిష్టాత్మక నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీలలో ‘తిమింగలాలు తిరిగే తీరంలో’ కథతో కలిపి.. వరుసగా ఆరోసారి బహుమతి అందుకున్నారు. రెండుసార్లు కన్సొలేషన్ బహుమతులు, ఒకసారి విశిష్ట, మరోసారి ప్రత్యేక బహుమతి, రెండుసార్లు తృతీయ బహుమతులు దక్కించుకున్నారు. ‘జనన వాంగ్మూలం’ కవితా సంపుటి, ‘ఖుర్బాని’ కథల సంపుటి వెలువరించారు. మరో కథా సంపుటి, కవితా సంపుటి, మూడు నాటికలు, నవల ముద్రణ దశలో ఉన్నాయి. ఒక సినిమాతోపాటు మరొక వెబ్ సీరీస్‌కు ఈయన కథలపై చర్చలు జరుగుతున్నాయి.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
-సయ్యద్ గఫార్
81432 53116