ఆ మధ్య యూట్యూబ్ లో ఓ సంచలనం.. ‘అమ్మ పాడే లాలిపాట.. అమృతం కన్నా తీయనంట..’ పాటకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాట రచయిత, గాయని ఇద్దరూ నెల రోజులపాటు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు. వర్ధమాన గాయని ఫుల్ ఫేమస్.. ఇదీ అమ్మ పాటకు ఉన్న పవర్. అమ్మ లాలిపాటే కాదు, అమ్మ స్పర్శ, ఆమె ప్రేమ.. ఇలా అమ్మకు సంబంధించిన ప్రతిదీ బిడ్డకు అమృతమే అంటున్నాయి పరిశోధనలు. అవేంటో చూసేద్దాం..
నాడు ‘జో అచ్యుతానంద జోజో ముకుందా..’ పాట రాసిన తాళ్లపాక అన్నమయ్య దగ్గరనుంచి నేడు ‘అమ్మ పాడే లాలిపాట..’ రాసిన మిట్టపల్లి సురేందర్ వరకు అమ్మ ప్రేమ గురించి గొప్పగా చెప్పినవారే. అమ్మ ప్రేమపై తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాల్సిందే. అమ్మ అంటే అందరికీ అంత అభిమానం మరి! అసలు అమ్మ ప్రేమకు అంత శక్తి ఉందా అని పరిశీలిస్తే పుట్టిన తర్వాత కాదు, కడుపులో ఉన్నప్పటినుంచే అమ్మ ప్రేమ బిడ్డకు ఆలంబన అని పరిశోధనలు చెబుతున్నాయి.
కడుపులో ఉండగానే శిశువు తన తల్లి గొంతు గుర్తు పడుతుందని క్రిస్టినీ మూన్, ఆమె సహచరులు 2013లో చేసిన పరిశోధనలో తెలిసింది. మీరు తమ పరిశోధనకు 12 మంది ఎనిమిది నెలల గర్భిణులను ఎంచుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరినీ రోజూ క్రమం తప్పకుండా ఓ పద్ధతిలో మాట్లాడటం, పాడటం చేయమన్నారు. దంపతుల గొంతులకు ప్రతిస్పందనగా గర్భస్థ శిశువు గుండె చప్పుడు నాన్న గొంతుకు, అమ్మ గొంతుకు వేరువేరుగా మారడం గమనించారు. పుట్టిన తర్వాత బిడ్డ అమ్మ గొంతుకు ఎక్కువగా ప్రతిస్పందించడం గమనించారు. అమ్మ గొంతుకు శిశువు గర్భంలో ఉండగానే ప్రతిస్పందిస్తారని ఈ పరిశోధనలో తేలింది. అంతకుముందు మ్యూజిక్ సైకాలజిస్ట్ సాండ్రా ఈ. ట్రెహబ్ 2001లో చేసిన పరిశోధనలో 6 నుంచి 8 నెలల వయసున్న శిశువులు తల్లి మాటల కంటే పాటలకు ఎక్కువగా స్పందిస్తారని తేలింది.
ఇతరులతో ఎలా మెలగాలో పిల్లలు అమ్మ ప్రేమ నుంచే నేర్చుకుంటారు. అమ్మ తమపై ఎలాంటి ప్రేమను చూపుతుందో, అలాంటి ప్రేమనే చుట్టూ ఉన్నవాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. పెద్దయ్యాక భార్యతోనూ, స్నేహితులతోనూ ఏర్పరచుకునే బంధాలకు అమ్మ ప్రేమే పునాది. ఉద్వేగాల సమతుల్యత పాఠాలు అమ్మ ప్రేమ నుంచే నేర్చుకుంటారని అనేక పరిశోధనల సారాంశం. అమ్మ స్పర్శతో శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది బిడ్డలో నేను భద్రంగా ఉన్నాను అనే భావనను పెంచుతుంది. తరచుగా అమ్మ స్పర్శ పొందిన బిడ్డలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ విడుదల తక్కువగా ఉండటం గమనించారు. అలాంటి పిల్లలు ఉద్వేగాలను చక్కగా వ్యక్తీకరించగలరని పరిశోధనలు రుజువు చేశాయి.
అమ్మ ప్రేమ భద్రత, భరోసాను ఇవ్వడమే కాదు, బిడ్డ మెదడు నిర్మాణాన్ని కూడా మార్చేయగలదని పరిశోధనలో తేలింది. తల్లి ప్రేమ మెదడులో ఉద్వేగాల నియంత్రణ, ఒత్తిడి ప్రతిస్పందన, బౌద్ధిక కార్యాచరణలను నియంత్రించే భాగాలను ప్రభావితం చేయగలదని న్యూరో సైన్స్ చెబుతుంది. 2012లో చేసిన ఓ పరిశోధనలో బాల్యంలో అమ్మ ప్రేమను పొందిన చిన్నారుల మెదడులో అభ్యసనం, జ్ఞాపకశక్తులను ప్రభావితం చేసే హిప్పోక్యాంపస్ పరిమాణం అమ్మ ప్రేమ పొందని వారి కంటే పది శాతం ఎక్కువగా ఉండటం గమనించారు. అమ్మ ప్రేమ పొందిన చిన్నారుల్లో మెదడులోని రివార్డ్ సిస్టం కూడా చురుగ్గా ఉండటం పరిశోధకులు గమనించారు.
అమృతం కన్నా గొప్పదైన అమ్మ ప్రేమ బిడ్డకు అందకుండా ఉంటే.. అది పిల్లల ఎదుగుదలపై వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్నే సైకాలజీలో మాతృత్వ గాయం అంటారు. దీని బారినపడిన పిల్లలు ప్రేమ రాహిత్యంతోను, ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
మాతృత్వ గాయం అంత సులువుగా మానేది కాదు. దాని ద్వారా వచ్చే బాధను కూడా అంత తేలిగ్గా తీసి పారేయలేం. ఆ బాధ వ్యక్తిని అలా వెన్నాడుతూనే ఉంటుంది. అయితే, కొద్దిపాటి సాధనతో దీనినుంచి బయటపడొచ్చు.
స్వీయ కరుణ : ఇతరుల పట్ల ఎంత సానుభూతితో, సహానుభూతితో ఉంటారో, తమపట్ల, తమ బాధల పట్ల కూడా అంతే సహానుభూతిని అలవర్చుకోవడం ద్వారా దీనినుంచి బయటపడొచ్చు
మనసు మళ్లింపు : బాల్యం బాధలతోనే ఉందని బాధ పడుతూ కూర్చోకుండా సృజనాత్మక కళలు సంగీతం, చిత్రలేఖనం లాంటి వాటి వైపు మనసు మళ్లించి ఈ గాయాన్ని నయం చేసుకోవచ్చు.
ఉద్వేగాలతో జోడి : అమ్మ ప్రేమకు దూరమైన వారికి ఉద్వేగాలు అంతగా అర్థం కావు. ఉద్వేగాల అక్షరాస్యతను పెంచుకోవడంతో పాటు, వాటికి సరైన నిర్వచనం ఇవ్వడం ద్వారా సరి చేసుకోవచ్చు.
మళ్లీ బాల్యం: బాల్యంలో అమ్మ నుంచి పొందలేని ప్రేమను స్నేహితుల నుంచి, జీవిత భాగస్వామి నుంచి పొందుతూ, ప్రేమలోని పరిమితులను పాటిస్తూ మాతృత్వ గాయం బాధ నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు అర్థమైందా.. అమ్మ ప్రేమ ఎంత అవసరమో! అమ్మ ప్రేమ కేవలం బాల్యం పైనే కాదు, మనిషి జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది. బంధాలను ఏర్పరచుకోవడంలోనూ, వాటిని కాపాడుకోవడంలోనూ అమ్మ ప్రేమే మార్గదర్శి. అలాంటి అమ్మ ప్రేమను మన బిడ్డలకు అందేలా చేద్దాం .. మన అమ్మల నుంచి పొందుదాం.