అమ్మ! తనకంటూ ఓ పేరు అక్కర్లేదు. తొలి మాట అదే, తొలి బాధకు స్పందనా అదే, ఊరటనిచ్చే తారకమంత్రం అమ్మే, సమస్యల్ని దాటించే పాశుపతాస్త్రం! బతుకుని సృష్టించిన దేవుడు… దానికొక అర్థాన్ని, సంతృప్తిని కలిగించేందుకు ఇచ్చిన వరం. ఇక భారతీయుల దృష్టిలో తన స్థానం గురించి చెప్పేదేముంది! మనకు తల్లి తొలి దైవం, తన జోల మొదటి పాట, ఆమె కొంగు చెరగని సంపద. అందుకే మనకు ప్రత్యేకించి మాతృదినోత్సవం అవసరం లేదు. కానీ తన గురించి తల్చుకుని తీరాల్సిన వేయిన్నొక్క సందర్భాలలో మదర్స్ డే కూడా ఒకటి. అందుకని మారుతున్న కాలంతోపాటుగా మారని తన మాతృత్వ బాధ్యతతోపాటుగా… పెరిగిన సవాళ్ల గురించి ఓసారి గుర్తుచేసుకుందాం.
ఏటా మే రెండో ఆదివారం జరిపే మదర్స్ డే సంప్రదాయం ఓ కూతురు తన తల్లి కోసం ఆరంభించడం విశేషం. 19వ శతాబ్దంలో జీవించిన యాన్ మేరియా, పిల్లలంతా పురిట్లోనో, లేకపోతే పసివయసులోనో చనిపోవడాన్ని గమనించారు. పరిశుభ్రత లేకపోవడం, అవగాహన లోపించడం లాంటి చిన్నపాటి విషయాలే ఇందుకు ముఖ్య కారణం అని అర్థమైంది. ఆ పరిస్థితి చక్కదిద్దేందుకు ‘మదర్స్ డే క్లబ్స్’ మొదలుపెట్టి అనూహ్యమైన ప్రభావాన్ని చూపించారు.
అమెరికన్ సివిల్ వార్ తర్వాత రెండుగా విడిపోయిన దేశాన్ని కలిపేందుకు కూడా ఈ క్లబ్స్ పాటుపడ్డాయి. యాన్ చనిపోయాక… తన స్ఫూర్తిని ప్రచారం చేసేందుకు కూతురు అన్నా జార్విస్ మదర్స్ డే ప్రారంభించారు. మొదట్లో అంతా ఎగతాళి చేసినా… 1914లో అమెరికన్ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా అంగీకరించడంతో అది ఓ సంప్రదాయంగా మారింది. అదే సమయంలో గ్రీటింగ్ కార్డుల్లాంటి బహుమతులు ఉత్పత్తి చేసే సంస్థలు ఈ రోజును విపరీతంగా ప్రచారం చేసి వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాయి.
ఇక ప్రపంచీకరణ… ఆ తర్వాత ఆన్లైన్ వ్యాపారం, సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఆ ఉధృతి ఏ స్థాయిలో ఉందో కనిపిస్తూనే ఉంది. ఒక దశలో మదర్స్ డేని స్థాపించిన అన్నా జార్విస్సే ఈ వాణిజ్యపు పోకడల్ని నిరసిస్తూ అరెస్ట్ అయ్యారంటే… ఆ స్ఫూర్తి ఎంతలా పలచబడిందో అర్థం చేసుకోవచ్చు. కానీ నాణానికి మరోవైపుగా ఆమె స్థానాన్ని గుర్తుచేసుకునే సందర్భంగా దీన్ని మలుచుకునే కృషీ జరగకపోలేదు. ఇదీ అలాంటి ప్రయత్నమే! మరీ ముఖ్యంగా ఇప్పటి తల్లుల గురించి, వారి పెరుగుతున్న సవాళ్ల గురించీ!
మాతృత్వం ఓ కల. పెళ్లి జరిగినప్పటి నుంచి, ఓ బిడ్డను ఎత్తుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు అందుకు సహకరిస్తున్నాయా అంటే కాస్త ఆలోచించాల్సిందే! ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతీ ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. ఇప్పటి పరిస్థితులే అందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు.
నవమాసాలు మోసి పండంటి బిడ్డను కన్నాక… మరిన్ని సమస్యలు పలకరిస్తున్నాయి. ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేసేవారు. కానీ ఇప్పుడు సౌలభ్యం, సమయం లేకపోవడం, వైద్యుల వెసులుబాటు లాంటి కారణాలతో రోగులే కాకుండా వైద్యులు కూడా సిజేరియన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏ దేశంలో అయినా సిజేరియన్ ద్వారా ప్రసవం జరగడం 10-15 శాతానికి మించకూడదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తున్నది.
కానీ ఐఐటి మద్రాసు సేకరించిన గణాంకాలలో కళ్లు చెదిరే వైరుధ్యం కనిపిస్తున్నది. 2021 నాటికే మన దేశంలో 21.5 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఇక ప్రైవేటు ఆసుపత్రులలో అయితే దాదాపు సగం సందర్భాల్లో సిజేరియన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సంఖ్య ఈపాటికి పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. సిజేరియన్ వల్ల ఇన్ఫెక్షన్లు, రక్తహీనత, రక్తం గడ్డకట్టడం, వెన్నునొప్పి లాంటి సమస్యలతోపాటు రెండో కాన్పు కూడా సిజేరియన్ ద్వారానే జరగాల్సిన పరిస్థితి వస్తుంది. సిజేరియన్ ద్వారా పుట్టే పిల్లల ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల వారిని మరింత జాగ్రత్తగా గమనించుకోవాల్సిన బాధ్యతా తల్లుల మీదే ఉంటుంది.
సిజేరియన్ అయినా, సాధారణ డెలివరీ అయినా ప్రసవం అనేది తీవ్ర వేదనతో ఉంటుంది. బతుకే భారం అనిపించేంత బాధ. అందుకే పెద్దలు ప్రసూతి వైరాగ్యం అన్నారేమో! కానీ ఆ వైరాగ్యం అక్కడితో ఆగదు. ఆ సమయంలో ఏర్పడే హార్మోన్ మార్పుల వల్ల కుంగుబాటు, ఒత్తిడి, ఉద్వేగం పెరిగిపోతాయి. ఒక్కోసారి అవి తీవ్రతరం అయిపోయి భ్రాంతి, అయోమయం లాంటి స్థితి ఏర్పడుతుంది. పోస్ట్ పార్టం డిప్రెషన్/బ్లూస్/సైకోసిస్… అంటూ రకరకాల పేర్లతో పిల్చుకునే ఈ సమస్యలు ఈ కాలానికే ప్రత్యేకం కాదు కానీ… ఒకప్పుడు వాటినుంచి తప్పించే పరిస్థితులు ఉండేవి. పసిపిల్లలను గమనించుకునే పెద్దలు, సాంత్వన ఇచ్చే అనుభవజ్ఞులు, తగినంత విశ్రాంతి… అన్నీ ఉండేవి. ఇప్పుడలా కాదు. ఒంటరి కుటుంబాలు, పసిపిల్లల అనారోగ్య సమస్యలు, ఆఫీసు ఒత్తిడి… లాంటి పరిస్థితులన్నీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. ఇక ప్రసవం తర్వాత అలసట, నొప్పి, రొమ్ముల్లో పోట్లు, నిద్రలేమి లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. చిన్న కుటుంబాలు, ఆఫీసు బాధ్యతల మధ్య తల్లులు వాటిని ఓర్చుకుంటూనే పిల్లలను సాకడం ఓ సాహస ప్రయాణమే!
అది 1990ల కాలం. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక వెలెస్లె కాలేజి అప్పటి అధ్యక్షులు జార్జ్ బుష్ భార్య బార్బరా బుష్ని ఓ వేడుకకు ఆహ్వానించింది. అంతే! ఓ 150 మంది విద్యార్థులు తనను పిలవడానికి వీల్లేదంటూ పిటిషన్లు పంపారు. కారణం! తను కేవలం ఓ భార్యే కదా. ఇంట్లో ఉండే మనిషికి అంత ప్రాధాన్యత ఎందుకు అని. ఈ చులకన భావం ఈ రోజుది కాదు. పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత, మహిళలకు కూడా బయటికి వచ్చి పనిచేసే అవకాశాలు వచ్చాయి. అదే సందర్భంలో భార్యలు ఇల్లు మాత్రమే చూసుకోవాలి అని ఓ వర్గం వాదించడం మొదలుపెట్టింది. మాతృత్వం మహిళలకు మాత్రమే సాధ్యం కాబట్టి, వాళ్లు ఆఫీసు పనికి వెళ్తే పిల్లల ఆలనాపాలనలో లోటు ఉంటుందని వీళ్ల ఆరోపణ. అటు ఇంటినీ, ఇటు కెరీర్నీ సమర్థంగా కొనసాగించే సత్తా మహిళలకు ఉంటుందని మరో వర్గం అభిప్రాయం. ఇది ఎడతెగని చర్చ. దీనికే మమ్మీ వార్స్ అని పేరు. క్రమంగా ఈ చర్చ ఓ వైపే మొగ్గు చూపుతున్నది. స్త్రీలు కచ్చితంగా ఇంటినీ, కెరీర్నీ సంభాళించుకోగలరని సమాజం నమ్ముతున్నది. కాకపోతే అందుకు కుటుంబం నుంచీ కార్యాలయాల నుంచీ సహకారం అంది తీరాల్సిందే. అది దయ కాదు. బాధ్యత! ఆ దిశగా సానుకూలత కూడా కనిపిస్తున్నది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇంటిపని, పిల్లల్ని చూసుకోవడానికి 1965లో భర్తలు వారానికి ఆరున్నర గంటలు మాత్రమే కేటాయించేవారనీ… అది 2016 నాటికి 18 గంటలుగా మారిందని గమనించింది. కానీ మహిళలు కేటాయించే 43 గంటలతో పోలిస్తే అది చాలా తక్కువే. గడిచిన పదేళ్లలో మరీ ముఖ్యంగా కొవిడ్ తర్వాత పరిస్థితులు కొంచెం మారి ఉంటాయి కానీ… ఇప్పటికీ పనిచేసే మహిళల మీద అదనపు భారం పడుతున్నదన్నది వాస్తవం! ఇక ఆఫీసులో సహకారం గురించైతే చాలా చెప్పుకోవాలి!
ఉద్యోగంలో చేరిన మహిళలు వెంటనే పెళ్లి చేసుకుంటే వాళ్లకు కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం అనే భావన, పిల్లలు ఉన్న స్త్రీలు ఉద్యోగం పట్ల అంకితభావంతో ఉండలేరు అనే అభిప్రాయం… ఇలాంటి పక్షపాత ధోరణులు ఇంకా సన్నగిల్లలేదు. ఒకే తరహా నైపుణ్యం, విద్యార్హతలు, అనుభవం ఉన్న మహిళల రెజ్యూమెలు పంపినప్పుడు… వారిలో పిల్లలు లేనివారికే యాజమాన్యం ప్రాధాన్యత ఇచ్చినట్టు ఓ పరిశోధనలో తేలింది. రైతు కూలీల దగ్గరినుంచీ సీఈఓల వరకూ మగవారికి ఓ రేటు, మహిళలకు మరో వేతనం. ఎక్కువమంది పిల్లలు ఉన్న కొద్దీ తక్కువ జీతం వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక పదోన్నతులు, వేతనాల పెంపులో అయితే చెప్పక్కర్లేదు. అసలు మహిళలు ఉద్యోగంలోకి అడుగుపెట్టడానికే చాలా ఆలోచించాల్సిన పరిస్థితులు. ఈ కెరీర్ ఎంచుకుంటే నేను కుటుంబానికి దూరమవుతానా, పిల్లల పట్ల నా బాధ్యత నెరవేర్చలేనా అన్న సంశయంతోనే… మహిళలు కొన్ని పరిమితులకు అనుగుణంగా కెరీర్ ఎంచుకుంటున్నారు. ఇక పని మొదలుపెట్టాక కూడా మదర్ హుడ్ పెనాల్టీ, మదర్ హుడ్ వేజ్ గ్యాప్ అంటూ రకరకాల పేర్లతో వారిపట్ల చూపుతున్న వివక్ష ఇంకా బలంగానే ఉంది.
‘డబ్బా తిండి పెడుతున్నావా… నేనైతే కందిపప్పు, క్యారెట్ ఉడికించి పెట్టేదాన్ని’, ‘స్నానం ఇలా చేయిస్తున్నావేంటీ… రక్త ప్రసరణ పెరిగేలా గట్టిగా రుద్దాలి’, ‘పాప తుమ్మితే, దగ్గితే డాక్టర్ అంటావేంటి… ఇంట్లో శొంఠి వాడరా’… ఇలాంటి సవాలక్ష మాటలు చాలా తల్లులకు ఏదో ఓ సందర్భంలో వినిపిస్తూ ఉంటాయి. ఒక పెద్దగా మేలుకోరి చెప్పడం వేరు, అవతలి వ్యక్తి కంటే పిల్లల్ని బాగా పెంచేశాననే అహంతో చెప్పడం వేరు. అలా చెప్పినప్పుడు అవతలివారి మొహం చిన్నబోతుంటే చూసి సంబరపడటం మరీ దారుణం. ఓ నివేదిక ప్రకారం మూడింట రెండు వంతుల మంది తల్లులు ఈ మామీ షేమింగ్ వల్ల క్షోభను అనుభవిస్తున్నారంట. సవాలక్ష సవాళ్ల మధ్య పిల్లలను కనిపెంచుతున్న ఆధునిక తల్లులకు ఇదీ ఓ సవాలే. ఇక పనికి వెళ్లే తల్లులు మరిన్ని మాటల్ని వినాల్సి వస్తున్నది. ‘ఆఫీసు, ఇల్లూ ఎలా చూసుకుంటావు’, ‘పిల్లాడు బెంగపెట్టుకోడా!’, ‘అయ్యో! పిల్లాడికి జ్వరంగా ఉన్నా ఆఫీసుకి వచ్చావా!’ తరహా నకిలీ ఓదార్పులు తీవ్రమైన పశ్చాత్తాపానికి గురి చేస్తున్నాయట. అసలే పెంపకంలోని ప్రతీ క్షణం తాము చేస్తున్నది సరైనదా కాదా అన్న సంశయంతో అడుగు వేయాల్సి వస్తుంది. ఎక్కడ అంచనా తప్పినా తప్పు చేశాననే బాధ వేధిస్తుంది. దీనికి మదర్స్ గిల్ట్ అని పేరు. దానికి తోడు నిరంతరం ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటే అవి మనోవేదనకే దారితీస్తాయి. అదే జరుగుతున్నది.
గొంతెమ్మ కోరికలతో పెళ్లిళ్లు చేసుకోవడం, వాటి కోసం భర్తను వేధించి చివరికి విడాకులు తీసుకోవడం, తను ఇచ్చే భరణంతో దర్జాగా జీవితాన్ని గడపడం – ఇదే మహిళల తత్వం అన్నంత తీవ్రంగా ఓ అభిప్రాయం బలంగా నాటుకొంది. మన చుట్టూ కనిపించే రీల్స్, సీరియల్స్ కూడా ఇదే భావాన్ని దర్జాగా ప్రకటిస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి ఏంటో ఒక్కసారి మనచుట్టూ ఉన్న కుటుంబాలను గమనిస్తే అర్థమైపోతుంది. ఇష్టం లేని పెళ్లి నుంచి బయటికి వచ్చేసిన స్త్రీలను ఇప్పటికీ తప్పుగా, తక్కువగానే చూస్తుంటారు. సాధారణంగా కోర్టులు పసిపిల్లల బాధ్యతను తల్లులకే అప్పగించేందుకు మొగ్గుచూపుతాయి. భర్త నుంచి ఎంత భరణం లభిస్తుంది, అది నిరంతరాయంగా వస్తుందా, న్యాయవ్యవస్థ చుట్టూ ఎంతకాలం ఎన్నిసార్లు తిరగాలి… లాంటి ప్రశ్నలన్నిటికీ జవాబు వెతుక్కోవాల్సిందే. దీనికి తోడు ‘సింగిల్ పేరెంట్’గా మారాక ఎదురయ్యే సవాళ్లు వేరు. ఇక ఒంటరి మహిళల పట్ల ఇరుగుపొరుగూ, ఆఫీసూ చూపించే దృక్పథమూ ఓ విషాదమే.
జీవితంలోని ప్రతి దశ మన స్నేహం మీద ప్రభావం చూపిస్తుంది. స్కూల్, ఆ తర్వాత కాలేజి, ఆపై ఉద్యోగం, పెళ్లి… వీటన్నిటికంటే పిల్లల రాక మరింత ప్రభావం చూపిస్తుంది. పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడంలోను, ఉద్యోగం చేయడంలోను ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అది ఒక్కరోజుతో తీరిపోయే వ్యాపకం కాదు. రోజురోజుకూ పెరిగే బాధ్యత. దాని ఖరీదు బయటి బంధాల మీద పడితీరుతుంది అంటారు లాంకెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన అనె క్రోనిన్. ఇలా కొన్నాళ్లకు ఆప్తస్నేహాలు కూడా పల్చబడిపోతుంటాయి. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య రాదంటారు సామాజిక శాస్త్రవేత్తలు. స్నేహితుల వివరాలన్నీ ఓ చోట భద్రంగా ఉంచుకోవడం, ఓ సమయం పెట్టుకుని అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉండటం, అందరూ కలిసి గెట్ టు గెదర్ లాంటి కలయికకి ప్రయత్నించడం చేయవచ్చు. మరోవైపు స్నేహితులు కూడా పెద్దమనసుతో పరిస్థితిని అర్థం చేసుకుని… తమ వైపు నుంచి బంధం చేజారకుండా చూసుకోవాలి.
పిల్లల కోసం నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండటం. వారి గురించే ఆలోచిస్తూ, అనుక్షణం వారికోసమే తపిస్తూ ఎంత చేసినా తృప్తి పడకుండా కష్టపడటం… ఇది తీవ్రమైన మానసిక, శారీరిక సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు కాస్త సమస్యాత్మకంగా ఉన్నా, ఇంట్లో సరైనా సహకారం లభించకపోయినా ఆ శ్రమకు హద్దుండదు. వీటికే మామ్ బర్న్ ఔట్ (Mom Burnout), మామీ మార్టిర్ కాంప్లెక్స్ (mommy martyr complex) లాంటి రకరకాల పేర్లున్నాయి. తన కనీస అవసరాలు చూసుకోకుండా, తన ఆనారోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా, తగినంత నిద్ర పోకుండా తిండి తినకుండా, తనకోసం ఆలోచించడమే తప్పన్నట్టుగా, ఎంత త్యాగం చేస్తున్నా అది సరిపోదనుకుంటూ… పడే ఈ తపనతో నీరసం, కుంగుబాటు, నిద్రలేమి, మతిమరుపు, కోపం లాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
జీవితంలో ప్రతి దశకీ ఓ సందర్భం ఉంటుంది. కాలాన్ని బట్టి ఆ వయసు మారుతూ ఉంటుంది కానీ… మరీ దాటిపోతే మాత్రం ఆ ముచ్చటే సవాలుగా మారుతుంది. పిల్లల విషయంలో మరీనూ! ఆలస్యంగా పెళ్లి, కొన్నాళ్లు కొత్త సంసారాన్ని ఆస్వాదించాలనే ఆశతో… పిల్లల కోసం ప్రయత్నించే వయసు దాటిపోతున్నది. అది ఏ వయసు వరకు సబబు అనేదాని మీద శాస్త్రవేత్తలు, పరిశోధకుల నుంచి కచ్చితమైన జవాబులు వినిపిస్తున్నాయి. ఓ అమ్మాయి జీవితకాలంలో ఎన్ని అండాలు వెలువడతాయో అన్న లెక్కతోనే తను పుడుతుందని చెబుతారు. వయసు పెరిగే కొద్దీ వాటి సంఖ్యలోను, నాణ్యతలోనూ తగ్గుదల కనిపిస్తుంది. ఓ పరిశోధన ప్రకారం 35 ఏళ్ల వయసు మహిళకి బిడ్డను కనే అవకాశం 29 శాతానికి తగ్గిపోతే… 42 ఏళ్ల నాటికి అది 15 శాతానికి పడిపోయింది. కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భం దాల్చాలనుకున్నవారికి కూడా వయసు ఓ అడ్డంకే. 35 ఏళ్ల వయసులో సేకరించే అండాశయంతో బిడ్డను కనే అవకాశం 40 శాతం ఉంటే, 40 ఏళ్లు దాటాక అది కేవలం 9 శాతంగానే కనిపించింది. మాతృత్వం మీద వయసు ప్రభావాన్ని నిరూపించే ఇలాంటి పరిశోధనలు కోకొల్లలు. ఓ వయసు దాటిన తర్వాత ఎక్స్ క్రోమోజోం బలహీనపడటం లాంటి పరిస్థితుల వల్ల అబార్షన్, పుట్టుకలలో లోపాలు లాంటి సమస్యలూ ఉంటాయి. మరోవైపు జీవన సహచరుల వయసు కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి, వారి వైపు నుంచి సమస్యలూ తోడవుతాయి. కాబట్టి అవకాశం ఉంటే కనుక 35 ఏళ్ల లోపు మాతృత్వం ఉత్తమం అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఒకవేళ వయసు పెరిగిపోతున్నది అన్న అనుమానం ఉంటే… ముందుగా అండాశయాన్ని భద్రపరుచుకునే విధానాలు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పటి తల్లులు ఎదుర్కొనే సమస్యల జాబితాలో ఇవి కొన్ని మాత్రమే. వాటికి పరిష్కారం మాత్రం మన చేతిలోనే ఉంది. వేలెత్తి చూపించే ముందు, తల్లుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. బాధ్యత మోపేముందు అందులోంచి కొంత పంచుకునేందుకు సిద్ధంగా ఉండాలి. చులకనగా చూసే ముందు వారి వేదన గమనించాలి. అన్నిటికంటే తన పిల్లల ఆరోగ్యం, ఉన్నతి కోసం నిష్కల్మషంగా పాటుపడే వారి శ్రమను గుర్తించాలి. మదర్స్ డే రోజు ఇచ్చే పూల బొకే ఒక్కరోజులో వాడిపోతుంది. కానీ వారికిచ్చే గుర్తింపు, గౌరవం తల్లుల గుండెల్లో ఓ సంతృప్తిని కలిగిస్తుంది. ఆ అసలైన బహుమతి మన చేతుల్లోనే ఉంది.
– కె.సహస్ర