‘పండ్ల మహారాజు మామిడి గారొస్తున్నారహో…’ అంటూ దండోరా వేసే సమయం ఆసన్నమైంది. ఆ రాక కోసం దేశంలోని ప్రజలంతా వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. మండుటెండల్లో పండు వెన్నెల్లా ఆనందాన్ని కలిగించే అనుభూతి కోసం ఎవరు మాత్రం ఎదురు చూడరు మరి! ఫలరాజు అంటే ఒక్కరేనా, యువరాజులు, సామంత రాజులు, జమీందార్లూ… ఇలా ఓ పరివారమే మనల్ని పలకరిస్తుంది. అల్ఫాన్సో, దశ్హరి, చౌంసా, బంగినపల్లి ఇలా ఒక్కో రకానికీ ఒక్కో పేరూ, ప్రత్యేకతా! అసలు వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఎవరు పెట్టారు అన్న సంగతులు ఆద్యంతం ఆసక్తికరం!
మామిడి పండు ప్రపంచ ప్రసిద్ధి చెందిందే అయినా భారతదేశంలో మాత్రం దాని అభిమానులు చాలా ఎక్కువ. ఒక్క మన దగ్గరే దాదాపు 1500 రకాల మామిడి పండ్లు పండుతున్నాయి. మనం ఏటా 25 మిలియన్ మెట్రిక్ టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భూమ్మీద పండుతున్న మామిడి పండ్లలో 45 శాతం వాటా భారత్‌దే. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ పండులో కొన్ని రకాలు మరింత ప్రాచుర్యం పొందాయి. వాటికి పేర్లు అవి పండే ప్రాంతాన్ని, పెంచిన వ్యక్తులను, వాటి రంగు రుచులను బట్టి వచ్చాయి. అందుకే ఒక్కో పేరూ ఒక్కో పండంత ప్రత్యేకం!
భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చిన విదేశీయుల్లో పోర్చుగీసు వాళ్లు ప్రప్రథములు. గోవా రాష్ట్రంలో వీరు ఎక్కువగా కాలనీలు నిర్మించుకుని నివసించారు. ఆ సమయంలోనే భారత్‌లో మామిడి పండ్లు వాళ్లను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో వారు అంటుకట్టే విధానంలో రకరకాల మామిడి పండ్లను పండించడాన్ని ప్రారంభించారు. ఐరోపాలో పండేందుకు వీలుగా వీటిలో మార్పులు చేర్పులు చేశారు. అలా సృష్టించిన వాటిలో ఒక రకమే అల్ఫాన్సో. మంచి సువాసన, రంగు, ముక్కలు తరగడానికి వీలుగా ఉండే గుజ్జు దీని ప్రత్యేకతలు. ఇక, భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాల్లో పోర్చుగీసు కాలనీలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన గవర్నర్ అల్ఫాన్సో అల్బుకర్క్ పేరు మీదుగా దీనికి అల్ఫాన్సో మామిడిగా నామకరణం చేశారు. భారత్‌తోపాటు వివిధ దేశాల్లో చాలామంది ఇష్టపడే అల్ఫాన్సో ఖరీదైన మామిడి రకాల వరుసలో ఉంటుంది.
మామిడి పండ్లలో మనకు సుపరిచితమైన రకాల్లో తోతాపురి తప్పకుండా ఉంటుంది. ఎక్కడ మామిడి పండ్లు ఉన్నా అక్కడ తోతాపురి రకం కనిపించకుండా ఉండదు అనేంతగా మన దగ్గర ఆ రకం పండ్లు దొరుకుతాయి. అయితే ఎరుపు ఆకుపచ్చల కలయికగా ఉండే ఈ పండుకు ఆ పేరు దాని ఆకృతి వల్లే వచ్చింది. హిందీలో తోతా అంటే చిలుక. ఈ పండు అచ్చం చిలుక ముక్కులా చివర్లో వంకర తిరిగి ఉంటుంది కనుక ఈ పండుకు చిలుక ముక్కు లేదా చిలుక ముఖం పండు అని పిలుస్తారు. కన్నడనాట గినిమూతి (చిలుకమూతి) మామిడి కాయగా పిలుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో ఇది ఎక్కువగా పండుతుంది. ఇక, కర్ణాటకలో విరివిగా పండే బాదామి రకం పండ్లకు కూడా దాని బాదం గింజ ఆకృతిని బట్టే ఆ పేరు వచ్చిందట.
సింధ్రీ రకం మామిడి పండుకు అది పండే ప్రాంతాన్ని బట్టి పేరు వచ్చింది. స్వతంత్రం రావడానికి ముందు మనదేశంలో భాగంగా ఉన్న సింధ్ ప్రాంతంలో ఈ పండు పండేదట. ప్రస్తుతం సింధ్ పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఉంది. ఒక రకమైన సువాసనతో, తీపిలోనే చిరు వగరు కలగలిపిన రుచితో ఉంటుందీ పండు. ఖరీదైన మామిడి పండ్లలో ఒక రకం ఇది. ఇక, దాదాపు ఇదే తరహా పేరుతో మన దగ్గర సింధూరి పండు పండుతుంది. సిందూర వర్ణంలో ఉండే దీని గుజ్జును, చెక్కును బట్టి దీనికి సింధూరి అనే పేరును పెట్టారట. తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో బాగా పండుతుంది.
మొఘల్ రాజు హుమాయూన్కీ, షేర్షా సూరికీ మధ్య బిహార్‌లోని చౌంసా అనే ప్రాంతంలో 1539లో యుద్ధం జరిగింది. ఇందులో షేర్ షా హుమాయూన్ని ఓడించాడు. ఆ విజయానికి గుర్తుగా ఆ ప్రాంతంలో పండే తనకిష్టమైన అమిత తీపి రకం మామిడి పండుకి చౌంసా అని పేరు పెట్టాడట షేర్ షా. ఆ విధంగా ఓ విజయానికి గుర్తుగా ఈ పండుకి పేరు ఏర్పడిందన్నమాట. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో అధికంగా పండే ఇవి దేశమంతా అందుబాటులో ఉంటాయి.
మనకు బాగా తెలిసిన దశ్హరి మామిడి పండు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టానికి సంబంధించింది. లక్నో నగరం దగ్గరి దశ్హరి గ్రామంలో తొలుత ఈ పండు పండింది. ప్రత్యేక రుచి కలిగిన ఈ మామిడి పండును అంటుకట్టడం ద్వారా సృష్టించాడు ఆ ప్రాంతపు జమీందారు అబ్దుల్ హమీద్ ఖాన్ కాందహారీ. ఆయన మంచి వ్యవసాయవేత్త. ఎన్నో రకాలైన చెట్లు హమీద్ వ్యవసాయ క్షేత్రంలో ఉండేవి. అందుకే లక్నో నవాబు ఉండే ప్యాలెస్‌లోని తోటల్లోనూ పెంచేవారట. రాజులు అమితంగా వీటిని ప్రేమించడంతో బాగా పేరొచ్చింది. అక్కడినుంచి ఇవి దేశం మొత్తం మీదా మామిడి రకాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. తొలిచెట్టు దశ్హరి నుంచే వచ్చింది కాబట్టి ఆ పండుకు దశ్హరి అనే పేరే స్థిరపడిపోయింది. తెలుగు రాష్ర్టాల్లో బాగా ఫేమస్ అయిన బంగినపల్లి మామిడి పండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి అనే గ్రామానికి చెందిన రకం. ఆ ఊరి పేరు మీదుగానే దానికా పేరు వచ్చిందన్నమాట!
మామిడి పండ్లలో పాలలాంటి వాసనతో ఉండే లంగ్డా రకం కూడా చాలామందికి ఇష్టం. హిందీలో కుంటివాడు అని అర్థం వచ్చే ఈ చిత్రమైన పేరు వెనుక ఒక కథ ఉంది. 250-300 సంవత్సరాల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఒక రైతు తోటలో మొట్టమొదట ఈ చెట్టు ఉండేదట. ఎంతో జాగ్రత్తగా తన మామిడి తోటను చూసుకునే వాడట ఆ రైతు. అందులో కాసిన వాటిలో, ఈ రకం ప్రత్యేకంగా ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. ఇక, ఆయన ఏదో సమస్య వల్ల కుంటుతూ నడిచేవాడట. దీంతో ఆ రైతు తోటలోవి అని చెప్పడానికి లంగ్డా ఆమ్ అని చెప్పేవారట. ఆ తర్వాత ఈ చెట్టు బిహార్‌తోపాటు తెలంగాణ తదితర దక్షిణాది రాష్ర్టాలకు పరిచయమైంది.