ఇప్పటి పిల్లలు చాలావరకు తరగతి పుస్తకాలే చదువుతారు. హై స్కూల్కు చేరుకునే సరికి ఆటలు, సినిమా పేజీలను దినపత్రికల్లో చూసే ప్రయత్నం చేస్తుంటారు. అంతేతప్ప రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలం చాలా తక్కువమందిలోనే కనిపిస్తుంది. పైగా నవతరం పిల్లలు స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ తెరలకు అతుక్కుపోతున్నారు. అయితే, బాల్యం నుంచే పిల్లల్లో వార్తా పత్రికలు చదివించడం అలవాటు చేయాలి. దానికి సరైన సమయం ఈ ఎండకాలం సెలవులే. తమిళనాడు రాష్ట్రం తిరువెరుంబూర్లోని ప్రభుత్వ ఆది ద్రావిడ సంక్షేమ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఈ దిశగా చూపుతున్న చొరవ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ పాఠశాల ఉపాధ్యాయులు తమ విద్యార్థులు సెలవుల్లో ఖాళీగా కూర్చోకుండా దినపత్రికలు చదివేలా చర్యలు తీసుకున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలతో వార్తలు చదవడానికి, దినపత్రిక కొనడానికి సిద్ధమేనా అడగ్గా… ఉన్నపళంగా ఓ యాభై మంది పిల్లలు పత్రికలకు చందాదారులుగా మారిపోయారు.
అందరూ ఓచోట చేరి వార్తలు చదవడం, తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవడం చేస్తున్నారు. ఇక ఆటలంటే ఇష్టం ఉన్నవాళ్లు స్కోర్లు పేపర్లలో చదివి తెలుసుకుంటున్నారు. దీనికి ముందు టీవీలో అప్పటికప్పుడు చూడటమే వారికి తెలిసింది. పైగా ఇప్పుడు తమకు ఇష్టమైన ఆటగాళ్ల చిత్రాలను ఓ నోట్బుక్లో అతికించుకుని మురిసిపోతున్నారు. పిల్లలు కూడా “మేమెప్పుడూ దినపత్రికలు కొనాలని అనుకోలేదు. ఇప్పుడు తమిళం, ఇంగ్లిష్ రెండు భాషల పేపర్లూ తెప్పించుకుంటున్నాం” అని చెబుతున్నారు. అంతేకాదు “మేము టీవీ, మొబైల్ ఫోన్ల నుంచే వార్తలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మా పిల్లలతోపాటు దినపత్రిక చదవడం కొత్త అనుభూతిని ఇస్తున్నది” అంటూ ఓ అమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్నది. నిజమే తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ఫోన్ చేతికిచ్చి ఊరడిస్తున్నారు. అదే వార్తాపత్రికలు చదివిస్తే అంతులేని లోకజ్ఞానం సొంతమవుతుంది. మన దగ్గర కూడా తెలుగుతోపాటు ఆంగ్ల దినపత్రికలను చదివించడం ద్వారా పిల్లలను ఓ మంచి అలవాటు దిశగా ప్రోత్సహించిన వాళ్లమవుతాం. వేసవి సెలవుల ఉద్దేశం ఊరికే గడిపేయడం కాదు… విజ్ఞానం సంపాదించుకోవడానికి సరైన సమయం.