పాడి, పంట రెండు కలిస్తేనే ఎవుసం. కాలం అయితే పంట పండుతుంది. కాకపోతే పాడి ఆదుకుంటుంది. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం పల్లెకు ఎంత బలమో మరోసారి నిరూపితమైంది. జర్మనీ మహిళ దాతృత్వం, రైతుల కష్టంతో కుమ్మరిగూడెం కొత్త చరిత్ర సృష్టించింది. పాడి పోషణలో ఆ ఊరు గోకులాన్ని మరిపిస్తున్నది. ఇక్కడ ఉత్పత్తి అయిన దేశీ నెయ్యి అమెరికా సహా ఇతర దేశాలకూ ఎగుమతి అవుతూ.. కుమ్మరిగూడెం కమ్మదనాన్ని పంచుతున్నది.
గోధూళి వేళకు.. కుమ్మరిగూడెం గుమ్మాలన్నీ గోవు మాలక్ష్మి కోసం ఎదురు చూస్తుంటాయి. పదుల కొద్దీ గిర్ ఆవులు ఒద్దికగా నడుస్తూ.. పద్ధతిగా తమ తమ యజమానుల ఇండ్లకు చేరిపోతాయి. ఆ సమయంలో రేగిన ధూళి పరిమళం ఎంత గొప్పగా ఉంటుందో… ఆ గోవులు వచ్చాక ఆ పల్లెవాసుల జీవితాలు అంతగా పరవశిస్తున్నాయి. ఈ గ్రామస్తుల జీవితాల్లో ఇంతటి మార్పునకు కారణం ఓ విదేశీ మహిళ దాతృత్వం. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల అనుబంధ ఆవాసమైన కుమ్మరిగూడెంలో 72 కుటుంబాలు, 300 మంది జనాభా ఉన్నది. కొన్నాళ్ల కిందటి వరకు ఇక్కడి రైతు కుటుంబాలు సాగు భారంగానే సాగేది. పెట్టుబడి ఖర్చులుపోను అంతంత మాత్రమే మిగిలేది.
జర్మనీకి చెందిన మోనికా రేటరింగ్ పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తురాలు. భారత్లో పర్యటిస్తూ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలను ఆదుకుంటుండేవారు. కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన సర్జన రమేశ్ వరంగల్ నగర శివారులో మహర్షి గోశాల నిర్వహిస్తున్నారు. 2018లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుభాష్ పాలేకర్ సాగు విధానంపై జరిగిన శిక్షణకు కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన మారుపాక కోటితో రమేశ్ కూడా వెళ్లారు. ఆ సదస్సుకు మోనికా రేటరింగ్ హాజరయ్యారు. ఆమె చేస్తున్న సామాజిక సేవ గురించి వారికి తెలిసింది.
కుమ్మరిగూడెం సందర్శించాల్సిందిగా ఆమెను కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మోనిక కుమ్మరిగూడెం వచ్చారు మోనికా. అక్కడి రైతు కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. వారికి శాశ్వతంగా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించారు. మొదటి దశలో కుమ్మరిగూడెంలోని రైతులను గుజరాత్ తీసుకెళ్లి ఒక్కొక్కటి రూ.50 వేల చొప్పున వెచ్చించి 29 గిర్ ఆవులను కొనుగోలు చేసి ఇచ్చారు మోనికా. ఆ తర్వాత మరో ఆరు ఆవులను కొనిచ్చారు. అలా కుమ్మరిగూడెం పాల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇప్పుడు గూడెంలో అరవై వరకు ఆవులు సమృద్ధిగా పాలు ఇస్తూ… రైతులకు అన్నం పెడుతున్నాయి.
మోనికా రేటరింగ్ అందించిన చేయూతను ఇక్కడి రైతులు దుర్వినియోగం చేయలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పట్టుదలతో పాడి పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగుల వేశారు. ఊళ్లో ఉన్న ఆవులతో ప్రతి నెలా 50 కిలోల నెయ్యి ఉత్పత్తి చేస్తున్నారు. దేశీ గోవులు కావడం, సంప్రదాయ పద్ధతులు వాటిని సాకుతుండటంతో ఇక్కడి నెయ్యికి మంచి డిమాండ్ ఏర్పడింది. పాలు విక్రయించడం ద్వారా రోజువారీ ఆదాయానికి లోటు లేకుండా పోతున్నది. మరోవైపు సగటున 30 లీటర్ల పాల నుంచి కిలో నెయ్యి ఉత్పత్తి చేస్తున్నారు. శుద్ధమైన నెయ్యి కావడంతో బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.4000 వరకు పలుకుతున్నది. ఆదిలాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి కూడా వీళ్లకు ఆర్డర్లు వస్తున్నాయి.
అంతేకాదు అమెరికాలోని డల్లాస్, బ్రిటన్లోని లండన్, జర్మనీ నుంచి కూడా నెయ్యి ఆర్డర్లు వస్తున్నాయి. పలు ఆయుర్వేద వైద్యులు సైతం స్వయంగా వచ్చి కుమ్మరిగూడెం నెయ్యి కొనుగోలు చేసి వెళ్తున్నారు. ఒకప్పుడు ఎవరికీ తెలియని కుమ్మరిగూడం.. ఇప్పుడు అంతర్జాతీయంగా పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నది. తమ జీవితాలను మార్చేసిన మోనికా రేటరింగ్కు సదా రుణపడి ఉంటామంటున్నారు గ్రామస్తులు. ‘ఒక పూట అన్నం పెట్టిన, రెండు జతల దుస్తులు ఇచ్చినా దానమే! కానీ, ఆ మనసున్న మహిళ దాతృత్వం.. మా తలరాతనే మార్చేసింది. రుణాల నుంచి బయటపడ్డాం. ఆర్థికంగా కుదురుకుంటున్నాం. ఆ తల్లి.. మమ్మల్నే కాదు.. మా ముందు తరాల జీవితాలనూ మార్చేసే గొప్ప సాయం చేసింద’ని కృతజ్ఞత చాటుకుంటున్నారు.
గిర్ జాతి ఆవులతో మంచి ఉపాధి ఏర్పడింది. చాలామంది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. మాకున్న కొద్దిపాటి వ్యవసాయానికి పాడి కూడా తోడైంది. మాకు రెండు ఆవులు ఉండగా ఒక ఆవు మాత్రమే ఇప్పుడు పాలు ఇస్తున్నది. రోజుకు 3 లీటర్ల పాలు పోస్తున్నా. నెలకు పదివేల వరకు ఆదాయం వస్తున్నది.
– మారుపాక యాదగిరి
గిర్ జాతి ఆవుల పాలతో వచ్చే నెయ్యికి మంచి డిమాండు ఉన్నది. మా ఊరిలో ప్రతిరోజు 60 లీటర్ల వరకు పాలు పోస్తారు. వాటి నుంచి నెయ్యిని తయారుచేస్తున్నాం. పాడి రైతులకు రూ.లక్ష వరకు బిల్లులు పంపిణీ చేస్తున్నాం. గిర్ జాతి ఆవులు కావాలని ఇంకొంత మంది రైతులు అడుగుతున్నారు. దాతలు సహకరిస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది.
– మారుపాక రాజు
– పిన్నింటి గోపాల్ , హనుమకొండ