ఇన్ఫోగ్రాఫిక్
డబ్బు, ఆర్థిక వ్యవహారాలు ఆధునిక ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యం కలిగినవి. డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గం కాదు, దాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉండాలి. పొదుపు చేసుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. తెలివిగా ఖర్చు చేయగలగాలి. ఈ వ్యవహారాలను ఒడిసి పట్టుకోవడానికి కొన్ని మెలకువలు అవసరమవుతాయి. కొన్ని పుస్తకాలు ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడంలో సాయపడతాయి.
1 సైకాలజీ ఆఫ్ మనీ
రచయిత: మోర్గాన్ హౌసెల్
డబ్బు, ఖర్చులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి దీన్ని క్లాసిక్‌గా పరిగణిస్తారు. డబ్బు లెక్కల గురించి మాత్రమే కాకుండా మన ఆదాయ సామర్థ్యం, పొదుపు, ఖర్చు చేసే అలవాట్ల విషయంలో మన ఆలోచనా విధానం, ప్రవర్తన ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఈ పుస్తకం వివరిస్తుంది.
2 రిచ్ డాడ్ పూర్ డాడ్
రచయిత : రాబర్ట్ కియోసాకి
ఈ పుస్తకం బహుళ ప్రజాదరణ పొందింది. ఆర్థిక అలవాట్ల గురించి ఇద్దరు వ్యక్తులను పోలుస్తూ కియోసాకి ఈ పుస్తకం రాశాడు. ఒకతనేమో ధనవంతుడు. విజేత. ఇతను సాహసాలు చేయడానికి భయపడడు. ఇంకొకతనేమో గిరిగీసుకుని ఉంటాడు. డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు.
3 ద రిచెస్ట్ మాన్ ఇన్ బాబిలోన్
రచయిత : జార్జ్ ఎస్. క్లాసన్
ఆర్థిక విషయాలను చిన్నచిన్న కథల రూపంలో నేర్పిస్తుంది. సంపదను కాపాడుకోవడం, సరైన మోతాదులో పొదుపు చేసుకోవడం, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం, భవిష్యత్తు ఆదాయానికి భరోసా కల్పించుకోవడం లాంటి విషయాలు ఇందులో చర్చకు వస్తాయి.
4 థింక్ అండ్ గ్రో రిచ్
రచయిత : నెపోలియన్ హిల్
జీవితాన్ని ఆర్థిక కోణంలో ఎలా చూడవచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది. జీవితంలో విజయం కేవలం డబ్బు ద్వారా మాత్రమే సాకారం కాదని, దానిపట్ల ఎంతో శ్రధ్ద కలిగి ఉండాలని సూచిస్తుంది.
5 ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్
రచయిత : బెంజమిన్ గ్రాహం
ఈ పుస్తకాన్ని పెట్టుబడుల రంగంలో బైబిల్‌గా భావిస్తారు. దీర్ఘకాలంలో భారీగా పుంజుకొనే అవకాశం ఉన్న కంపెనీల నుంచి అంతగా విలువ లేని స్టాక్స్ కొనడం మొదలుకొని, ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్రాధాన్యాన్ని ఈ పుస్తకం పాఠకులకు నేర్పిస్తుంది.
6 స్టాప్. థింక్. ఇన్వెస్ట్.
రచయిత : మిఖాయెల్ బెయిలీ
పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పెంచుకోవడానికి చదవాల్సిన పుస్తకం ఇది. నిరంతరం మారుతూ ఉండే మార్కెట్‌కు అనుగుణంగా మన వ్యూహాలు మారుతూ ఉండాలని ఈ పుస్తకం బోధిస్తుంది. అంతేకాకుండా మనం పెట్టే పెట్టుబడులు మన దీర్ఘకాలిక లక్ష్యాలతో సంబంధం కలిగి ఉండాలని సూచిస్తుంది.