‘యంగ్ ఇండియాను డ్రగ్ ఇండియాగా మార్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయి. కొందరు స్వదేశీ స్వార్థపరులు ఆ కుట్రతో కుమ్మక్కయ్యారు. యువతే కాదు కౌమార బాలబాలికలూ ఈ డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. ఇది ఒక విషాదకరమైన విషయం’ అని చెబుతూ ప్రజా నాట్యమండలి
తనదైన శైలిలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. డ్రగ్స్ ఉచ్చు నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటే ఎంతో అప్రమత్తత అవసరం అంటూ సమాజానికి ‘హెచ్చరిక’ చేస్తున్నది.
‘ఆధునిక వీధి నాటకం పోరాటాయుధం’ అన్నాడు ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు సప్ధర్ హష్మి. ప్రజల సమస్యల మీద నాటకాలు రూపొందించి వీధివీధినా ప్రదర్శించారాయన. ఇదే కారణంగా, 1989 జనవరి 1న నాటకం ప్రదర్శిస్తూనే గూండాల చేతుల్లో హష్మి హతుడైన విషయం జగద్విదితం. అయితే ఆయన రగిల్చిన స్ఫూర్తి దేశమంతా పల్లెపల్లెనా వెల్లివిరిసింది. ప్రజానాట్య మండలి కూడా దాన్ని అందిపుచ్చుకుంది. తెలుగు నేల మీద 1990వ దశకంలో అక్షర కళాయాత్ర మొదలు అక్షరాస్యత పెంపు కోసం ఎన్నో కళాజాతాలు (కళాయాత్రలు) కృషి చేశాయి. ఏదేని ఓ అంశాన్ని కళారూపాల ద్వారా విస్త్రృత ప్రచారం చేసేందుకు కళాయాత్రలు బాగా తోడ్పడ్డాయి. వీధి నాటకం, కళాయాత్రల సారాన్ని పుణికిపుచ్చుకుని ప్రజా నాట్యమండలి ఎన్నో వీధి నాటికలు రూపొందించి వేలాది ప్రదర్శనలు ఇచ్చింది. తాజాగా ఈ సంస్థ హైదరాబాద్ కమిటీ ‘హెచ్చరిక’ పేరిట డ్రగ్స్‌కు పిల్లలు ఎలా బానిసవుతున్నారో చెబుతూ నాటికను రూపొందించింది. బస్తీలు, విద్యా సంస్థల్లో దీన్ని విస్త్రృతంగా ప్రదర్శిస్తున్నది.
‘హెచ్చరిక’ నాటికలో ఒక బస్తీలో రెండు కూలీ కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో… కూతురు పదో తరగతి చదువుతున్నది. పేరు అమ్ములు. కూతురికి రీల్స్ పిచ్చి. ఆమె తండ్రి తాగుబోతు. కానీ కూతురు అంటే ఎంతో ప్రేమ. ఒకసారి పెళ్లి కూతురు డ్రెస్‌లో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా…’ పాటకు రీల్ చేయాలని ఉబలాటపడుతుందామె. అందుకు డ్రెస్ కొనివ్వమని తండ్రిని పట్టుబడుతుంది. పెళ్లి దుస్తులు 10 నుంచి 25 వేల రూపాయల ఖరీదు ఉంటాయి. వాటిని కొనలేక తండ్రి వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. అందుకు అమ్ములు అలిగి తండ్రితో మాట్లాడనని భీష్మించుకుని కూర్చుంటుంది. తల్లికి ఇది అర్థం కాదు. రీల్స్ అప్లోడ్ మాటలేమోగాని అప్పులోళ్లు మాత్రం ఇంటి చుట్టూ తిరుగుతున్నారంటూ వాపోతుంది.
మరో కుటుంబంలో… కొడుకు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో జాలీగా తిరిగేవాడు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. రీల్స్ చేస్తున్న అమ్ములుతో స్నేహం పెంచుకున్నాడు. ఆమెకూ డ్రగ్స్ అలవాటు చేశాడు. ఇద్దరూ గతి తప్పి ఇంటి నుంచి పారిపోయారు. అర్థం, పర్థం లేని మత్తులో జోగారు. డబ్బులైపోయాక.. ఇళ్లకు తిరిగి వచ్చారు. అప్పటికే ఆ అమ్మాయి (చిన్న వయసులోనే) నెల తప్పింది. రెండు కుటుంబాలు పోట్లాటకు దిగుతాయి. పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు పెట్టుకుంటారు. ఎస్.ఐ. (మహిళ) పరిష్కారంతో నాటిక ముగుస్తుంది. కథ సాధారణమైనదైనా, ఎక్కువ కుటుంబాలు ఈ సమస్యను ఎదుర్కోవడం వలన నాటికకు కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాదు ప్రదర్శనానంతరం కళాకారులతో డ్రగ్స్, గంజాయి సమస్య గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు కూడా.
ఈ డ్రగ్స్ ఒకసారి అలవాటైతే మానడం, మాన్పించడం కష్టం. నరాలు దెబ్బతిని మెదడుకు, శరీరానికి సంబంధం తగ్గిపోతుంది. శారీరకంగా బలహీనపడి, మెదడు ఆలోచనారహితమై పోతుందని ముగింపులో చెబుతారు. ఇది ప్రేక్షకుల్లో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్న ఆలోచనను రేకెత్తిస్తుంది. ఆ విధంగా ఈ నాటిక ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నది. కేవలం 30 నిమిషాల నిడివి ఉన్న ఇది పాటలు, నృత్యాలు, సన్నివేశాలతో చకచకా సాగిపోతుంది. దాదాపు పదిహేను మంది కళాకారులు ఉన్న ఈ బృందం మారన్న నాయకత్వంలో అటు బస్తీల్లోనూ ఇటు విద్యా సంస్థల్లోనూ 200కుపైగా ప్రదర్శనలిచ్చింది. ఈ ప్రదర్శనకు నగర పోలీసులు తోడ్పాటునందిస్తున్నారు.
వీధి నాటిక పేరు: హెచ్చరిక
సంస్థ: ప్రజా నాట్యమండలి, హైదరాబాద్ బృందం
కథాంశం: చైతన్య రహితులవుతున్న యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలనే మేల్కొలుపు
పాత్రధారులు: మారన్న, కల్యాణ్, రఘు, రాజు, విజయ్, మంజునాథ్, భరత్, నాగ రాజు, వంశీ, రాము, వెన్నెల, అన్న పూర్ణ, సునీత తదితరులు
– కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు