శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర పౌర్ణమి (తత్కాల కృష్ణ పాడ్యమి) ఆదివారం తెల్లవారితే సోమవారం అనగా తేది 13/14-04-2025 తెల్లవారుజామున 3-23 గంటలకు స్వాతి నక్షత్రం మొదటి పాదం, తుల రాశి, కుంభ లగ్నంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
ఫలితం: కృష్ణ పాడ్యమి- శుభకరం, సోమవారం- సుభిక్షం, స్వాతి నక్షత్రం- పంటల సమృద్ధి, వజ్రం నామ యోగం- సువృష్టి, కౌలవ కరణం- సువృష్టి, తెల్లవారుజామున- సుభిక్షం, కుంభ లగ్నం- స్వల్ప వృష్టి, మఖాది నక్షత్ర మండలం- హానికరం.
సాముదాయిక ఫలితం: ప్రజలలో చైతన్యం, ఆధ్యాత్మికత పెరుగుతుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వర్షాలు ఉంటాయి. తద్వారా సంతోషంతో జీవనం కొనసాగిస్తారు. అక్కడక్కడా వర్షాభావ సూచనలు కూడా ఉంటాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. పొరుగు దేశాలతో వైరభావం ఏర్పడుతుంది.
వర్షం-ఆఢకము-ఫలము: రవి రాజు కావడం వల్ల ఈ సంవత్సరం రెండు తూముల వర్షం కురుస్తుంది. సముద్రంలో 9 భాగాలు, పర్వతాలపై 9 భాగాలు, భూమిపై 2 భాగాల వర్షం కురుస్తుంది.
ఆఢకదారుని నిర్ణయం- ఫలం: ఈ సంవత్సరంలో శని మీన రాశి మొదటి పది భాగాలలో సంచరించుట వల్ల, వర్షాఢకం బాల్యావస్థలో ఉన్న బ్రాహ్మణుడి హస్తగతమై ఉన్నందున దుర్భిక్షం, భయోత్పాతాలు సంభవిస్తాయి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ కృష్ణ త్రయోదశి ఆదివారం తేది 25-5-2025 నాడు ఉదయం 9-30 గంటలకు అశ్విని నక్షత్రం, చతుర్థ పాదం మేష రాశి, పూర్ణ జలరాశి అయిన కర్కాటక లగ్నంలో మహిష వాహనంపై రోహిణి కార్తె ప్రవేశిస్తున్నది. ఫలం: పురు- పురుష యోగం: వర్షాభావం, సూర్య- చంద్ర యోగం: వర్షించును, కర్కాటక లగ్నం: సువృష్టి, వాయునాడి: సవాయు వర్షాలు కురుస్తాయి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠ శుక్ల ద్వాదశి ఆదివారం తేది 8-6-2025 నాడు ఉదయం7-17 గంటలకు స్వాతి నక్షత్రం, చతుర్థ పాదం, తుల రాశి, పాద జలరాశి అయిన మిథున లగ్నంలో జంబుక వాహనంపై మృగశిర కార్తె ప్రవేశిస్తున్నది. ఫలం: పురుష- స్త్రీ యోగం: వృష్టి, చంద్ర- సూర్య యోగం: వర్ష యోగం, మిథున లగ్నం: సామాన్య వృష్టి, వాయు నాడి: వాయువుతో కూడిన వర్షం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠ కృష్ణ ద్వాదశి ఆదివారం తేది: 22-6-2025 నాడు ఉదయం 6-19 గంటలకు భరణి నక్షత్రం రెండో పాదం మేష రాశి ప్రయుక్త పాద జలరాశి అయిన మిథున లగ్నం మూషిక వాహనంపై ఆరుద్ర కార్తె ప్రవేశిస్తున్నది. ఫలం: స్త్రీ -పురుష యోగం: సువృష్టి, చంద్ర-చంద్ర యోగం: సామాన్య వృష్టి, మిథున లగ్నం: స్వల్పవృష్టి, కృష్ణ ద్వాదశి: శుభప్రదం, ఆదివారం: పశువులకు అరిష్టం, భరణి నక్షత్రం: అశుభప్రదం (వ్యాధి భయం), సుకర్మ యోగం: సుభిక్షం, మిథున లగ్నం: వర్ష సమృద్ధి.