చేసింది చెప్పడం జ్ఞాపకశక్తి. చెప్పింది చేయడం సామర్థ్యం. ఆలోచనకు ఆచరణకు ఉన్న సంబంధమే జ్ఞాపకశక్తికి అనుభవానికి ఉందంటున్నారు తూర్పు వంశీకృష్ణ. తన జ్ఞాపకాల్లో నిలిచిపోయిన పాఠాలను గుర్తు చేసుకుంటూ నేటి తరగతి గదులు అనుభవపూర్వకమైన బోధనకు ఆలవాలంగా మారాలంటున్నాడు. ఆ మార్పు సాధించేలోగా నష్టపోకుండా ఇప్పుడు మా ‘యాక్టివ్ డిస్కవరీ క్యాంపస్‌కి రండి’ అని పిలుపునిస్తున్నాడు . ఇక్కడ బడిలో చెప్పే విశేషాలన్నీ ప్రయోగపూర్వకంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఇక ఆ విషయాలను ఎప్పటికీ మర్చిపోరు! చిన్ననాటి కలను సాకారం చేసుకునేందుకు తను చేసిన ప్రయత్నాలు,యాక్టివ్ డిస్కవరీ విశేషాలు చెబుతున్నాడు వంశీ!
మాది మహబూబ్ నగర్ జిల్లాలోని గార్లపాడు. నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. మూడో తరగతిలో ఉన్నప్పుడు మా లక్ష్మీకాంత్ సార్ తెల్లవారుజామున నిద్రలేపేవారు.
‘అదిగో… ఆ తూర్పు దిక్కుగా చూడండి. ఆకాశంలో దీపంలో కనిపిస్తూ ఉందే… అదే శుక్ర గ్రహం!’ అని చెప్పేవారు. అప్పటి నుంచి శుక్రగ్రహం పేరు, దాని గురించి మా సార్ చెప్పిన విశేషాలన్నీ నాకు గుర్తున్నాయి. తొమ్మిదో తరగతిలో ఇండస్ట్రియల్ స్టడీ టూర్‌కు వెళ్లాం. ఓ జౌళి పరిశ్రమలో సల్ఫర్‌తో పత్తిని శుద్ధి చేయడం చూశాను. అప్పుడు తెలుసుకున్న విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది! కొంతమంది చదివి నేర్చుకుంటారు. కొంతమంది విని నేర్చుకుంటారు. మరికొంతమంది చేయడం ద్వారా నేర్చుకుంటారు. నాది చేయడం ద్వారా నేర్చుకునే తత్వం. నేను చేసింది ఏదీ మర్చిపోలేదు. అందుకే చదువు అనుభవపూర్వకంగా ఉండాలన్నది నా ఆశ.
సక్సెస్ తర్వాత యాక్టివ్
ఎంబీఏ చదివిన తర్వాత హైదరాబాద్‌లో కంప్యూటర్ నెట్వర్క్ ట్రైనింగ్ సెంటర్స్ నిర్వహించాను. మూడు శిక్షణా సంస్థలు, వంద మంది దాకా ఉద్యోగులు, సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఉండేవారు. ఇంతకన్నా సాధించాల్సింది ఏముంటుంది అనిపించింది. కానీ, ఏదో వెలితి! ఏదో ఒకటి చేయాలన్న తపన నన్ను ఊరికే ఉండనివ్వలేదు. అనుభవపూర్వక (ప్రాక్టికల్) విద్య కోసం పనిచేయాలని ముందుడుగు వేశాను. హైదరాబాద్‌కు దగ్గరలోని గోపన్‌పల్లిలో నాలుగు ఎకరాల భూమి లీజుకు తీసుకున్నాను. అందులో షెడ్లు నిర్మించి యాక్టివ్ డిస్కవరీ క్యాంపస్‌ని 2013లో ప్రారంభించాను. ఆ సంస్థ ప్రారంభించిన కొద్ది నెలలకే మంచి పేరు వచ్చింది. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఓ రోజు మా క్యాంపస్‌కి వచ్చి ఆశ్చర్యపోయారు. గచ్చిబౌలిలో ఉన్న ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ క్యాంపస్‌లో యాక్టివ్ డిస్కవరీని పెట్టమన్నారు. ఆరు నెలల తర్వాత సంస్థను అక్కడికి తరలించాం. అక్కణ్నుంచి క్యాంపస్‌ను మళ్లీ ఇప్పుడున్న చోటికి మార్చాం.
పల్లెలో ప్రయోగశాల
చేవెళ్ల సమీపంలోని కౌకుట్లలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి యాక్టివ్ డిస్కవరీ క్యాంపస్‌ని ఏర్పాటు చేశాను. ఇందులో సైన్స్, పరిశ్రమల నిర్వహణ, వస్తువుల తయారీ, వ్యవసాయం, ఇండ్ల నిర్మాణం, మట్టి పాత్రల తయారీ లాంటి అనేక కార్యక్రమాలను విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నాం. ఇక్కడి కలాం భవన్లో సైన్స్ ప్రయోగాలు, సైన్స్ విశేషాలు తెలుసుకునేందుకు కావాల్సిన ప్రయోగశాల ఉంది. పాఠశాల విద్యలో ఉండే జీవ, భౌతిక, రసాయన శాస్ర్తాల విశేషాలన్నీ ప్రయోగ పూర్వకంగా తెలుసుకోవచ్చు. భౌతిక నియమాలు, సిద్ధాంతాలను పిల్లలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా సరదాగా చెబుతూ, చేయిస్తాం. థియరీ అయిదు శాతం చెబితే, తొంభై అయిదు శాతం ప్రయోగాత్మక బోధనే ఉంటుంది. మా సిబ్బంది ప్రయోగశాలలో విద్యార్థులకు మార్గదర్శనం చేస్తారు. సైన్స్ ల్యాబ్‌లో మైక్రోస్కోప్‌లు, టెలిస్కోపులే కాదు మనకు అందుబాటులో లేని విషయాలను కూడా అర్థం చేసుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. ఉదాహరణకు… వాతావరణ మార్పుల్లో టోర్నడోలు ఒకటి. అది ఎలా వస్తుంది? ఏ రూపంలో ఉంటుందో విద్యార్థులు తెలుసుకునేందుకు నీళ్లను వేగంగా కదిలిస్తూ కృత్రిమంగా సృష్టిస్తాం. పాఠ్యాంశంలోని విషయాలను విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా అవగాహన కల్పించడమే మా బాధ్యత, లక్ష్యం. విద్యార్థులు కేవలం సైన్సే కాదు సమాజాన్ని, పరిశ్రమలను, వ్యవసాయాన్ని, ప్రకృతిని కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి అవకాశం కల్పించేలా మా క్యాంపస్‌లో వివిధ విభాగాలు, దానికి తగిన నైపుణ్యాలున్న సిబ్బంది ఉన్నారు. విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్తుంటారు. కానీ, అక్కడ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి యంత్రాలను ఆపి, ఆపి నిర్వహించలేరు. విద్యార్థులు ఉండేందుకు వసతులు ఉండవు. కాబట్టి విద్యార్థుల కోసం మా దగ్గర రైస్‌మిల్, ఫ్లోర్ మిల్ ఏర్పాటు చేశాం. సబ్బులు, పెన్నులు, చెప్పులు, కొవ్వొత్తులు, క్రేయాన్స్, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్ లాంటి పదిహేను రకాల కుటీర పరిశ్రమలున్నాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి కుటీర పరిశ్రమలను ఎంచుకుంటారు. ఆయా వస్తువులను తయారు చేసి, తయారీని దశలవారీగా చూపిస్తాం. ఆ తర్వాత వాళ్లే సొంతంగా అయిదారు ఉత్పత్తులు తయారు చేసుకునేలా ప్రోత్సహిస్తాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విద్యార్థులు తమవెంట తీసుకుపోవచ్చు.
ఇల్లుకట్టి చూడు!
కొన్ని పాఠశాలల్లో మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేయడం నేర్పిస్తారు. ఇక్కడ కేవలం బొమ్మలు, పాత్రలే కాదు ఇటుకలు చేయిస్తాం. గోడలు కట్టిస్తాం. పైకప్పు వేయిస్తాం. ఇల్లు కట్టి చూపిస్తాం. గడ్డి ఇళ్ల కోసం వాసాలు ఎలా వేస్తారో, ఇంటి నిర్మాణంలో మనిషి సాధించిన ప్రగతిని ఒక పరిణామ క్రమంలో వివరిస్తాం. ఇది తెలిస్తే సగం సివిల్ ఇంజినీరింగ్ చదివినట్టే. అలాగే మెట్టపంటల సాగు, వరి సాగు విధానాలను విద్యార్థులకు నేర్పిస్తాం. విద్యార్థుల కోసం వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల పంటల సాగు కూడా చేస్తున్నాం. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో విద్యార్థులకు క్షేత్ర పర్యటన తప్పని సరి. కాబట్టి ప్రతి ఏటా ఆ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో మా క్యాంపస్‌కు వస్తున్నారు. చెన్నైలోని మూడు మాంటిస్సొరి పాఠశాలలు నుంచి ఏటా పిల్లలు ఇక్కడికి వస్తుంటారు. మూడు రోజులపాటు ఇక్కడే ఉండి ప్రయోగాత్మక విద్యను అభ్యసిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ల కోసం వసతి కూడా ఉంది. ఈ పదేండ్లలో లక్ష మంది దాకా విద్యార్థులు యాక్టివ్ క్యాంపస్‌లో శిక్షణ పొందారు. 450కిపైగా విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి.
ఆచరణే లక్ష్యం
విద్యాబోధన ప్రయోగాత్మకంగా ఉండాలి. చదివిన దాని కంటే, చేతులతో చేసినది మెదడుకి బాగా అర్థమవుతుంది. ఎక్కువ కాలం గుర్తుంటుంది. అందుకే విద్య వంద శాతం అనుభవపూర్వకంగా నేర్చుకునేలా ఇక్కడ కరికులం రూపొందించాం. వైద్య విద్యార్థులు పొద్దున చదువుకుంటారు. మధ్యాహ్నం హాస్పిటల్లో పనిచేస్తారు. రోగిని బతికించాలంటే వైద్య విద్య ప్రాక్టికల్‌గా ఉండాలి. ఏ విద్య అయినా బోధనా విధానం ఇలాగే ఉండాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతాం.
– తూర్పు వంశీకృష్ణ, యాక్టివ్ డిస్కవరీ క్యాంపస్ వ్యవస్థాపకులు
– నాగవర్ధన్ రాయల