మీనా బిసెన్ మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా చారెగావ్ గ్రామ సర్పంచ్. 47 ఏండ్ల మీనా ఎం.ఏ. ఆంగ్లం, సోషల్ వర్క్‌లో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్నారు. బీఈడీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తిచేశారు. 2006లో బాలాఘాట్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ బడుల్లో గెస్ట్ టీచర్‌గా పాఠాలు చెప్పారు. ఆ తర్వాత బాలాఘాట్ పట్టణంలో ప్రైవేట్ బడుల్లోనూ ఇంగ్లిష్, లెక్కలు బోధించారు.
2015లో అక్కడే పేరున్న ఓ ప్రైవేట్ బడి ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. అలా పదహారేండ్లపాటు ఉపాధ్యాయినిగా సేవలందించారు. 2022లో బోధనా రంగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే ఏడాది మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీనా పోటీచేశారు. ఇద్దరు మాజీ మహిళా సర్పంచ్‌లపై పోటీచేసి నెగ్గారు. రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటికీ ఆమె ఇంగ్లిష్ బోధించడం మాత్రం ఆపలేదు. తమ ఊరి పంచాయతీ భవనంలోనే ఉచితంగా తరగతులు చెబుతున్నారు.
ఆంగ్లం బోధిస్తూ భావితరాల జీవితాల్లో వెలుగులు నింపాలని మీనా కంకణం కట్టుకున్నారు. ఇక, మీనా రాజకీయ జీవితం ప్రారంభించడానికి స్ఫూర్తి మాత్రం ఆమె పిల్లలే. మీనా కొడుకు స్వప్నిల్ సామాజిక కార్యకర్త. కూతురు సోనాలి ఓ గ్రామీణ పోస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. వారినుంచే సాటి గ్రామీణులకు ఏదైనా మేలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. చారెగావ్ సర్పంచ్‌గా పోటీచేశారు. తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. ఇంతలో జబ్బు కారణంగా మీనా ఓ ఏడాదిపాటు మంచానికే పరిమితం అయ్యారు.
2024లో మళ్లీ తన విధుల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. సర్పంచ్‌గా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే, మళ్లీ ఉపాధ్యాయినిగా మారిపోయారు. “పాఠాలు చెప్పడం నాకెంతో ఇష్టం. అందుకే సర్పంచ్‌గా గెలిచినప్పటికీ మా ఊరి పిల్లలకు ఇంగ్లిష్ బోధించడం మొదలుపెట్టాను” అంటారు మీనా. ఇలా ఉంటే మొదట్లో మీనా దగ్గరికి ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఒక్క విద్యార్థి మాత్రమే వచ్చాడు. క్రమంగా ఆ సంఖ్య పెరిగి ఇప్పుడు డబ్బుకి చేరుకుంది. విద్యార్థులు కూడా బడి పిల్లలు మొదలుకుని కళాశాలకు వెళ్లేవాళ్లు కూడా మీనా ఇంగ్లిష్ తరగతులకు హాజరవుతారు. చారెగావ్ గ్రామస్తులు కూడా మీనాను సర్పంచ్జీ అని పిలిచే కంటే మేడమ్‌జీ అనే సంబోధిస్తారు. ఉపాధ్యాయుడు నాయకుడయితే అభివృద్ధితో పాటు అక్షర జ్ఞానం కూడా పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుంది.