సినిమాలంటే ఇంగ్లిష్, హిందీ, తెలుగు లాంటి కొన్ని భాషలే గుర్తుకువస్తాయి. కానీ, ఈశాన్య భారతదేశంలోని మణిపుర్ పేరు ఎవ్వరికీ స్ఫురించదు. ఆ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లా రింగుయి కొండ ప్రాంతాన్ని ‘బాలీవుడ్ ఆఫ్ ఉఖ్రుల్’ అని పిలుస్తారు. సినిమాలంటే ప్రాణమిచ్చే రింగుయి గ్రామస్తులు ముప్పై అయిదేండ్ల కింద తమ తొలి చిత్రం నిర్మించారు. అప్పటినుంచి ఇప్పటివరకు స్థానిక తాంగ్ఖుల్ నాగా భాషలో 50కి పైగా సినిమాలు నిర్మించడం విశేషం. నాగా తెగకు చెందిన రింగుయి గ్రామ జనాభా దాదాపు నాలుగు వేలు. వారి సినిమా ప్రయాణం 1989లో మొదలైంది. 1990లో ‘నవుయి తుయింగాషిత్’ పేరుతో తొలి చిత్ర నిర్మాణానికి సంకల్పించారు. ఆర్థిక వనరులు లేకపోవడంతో ఈ సినిమాలో నటించిన వాళ్లే తలా రెండు వందల రూపాయలు చందాగా వేసుకున్నారు.
అందుబాటులో ఉన్న వనరులతోనే నిర్మాణం పూర్తిచేశారు. ఈ ప్రయత్నంలో సినిమా నిర్మాతలు, నటులకు హేళనలు ఎదురయ్యాయి. చిత్రీకరణకు తగిన కెమెరా కోసం ఈ సినిమా దర్శకుడు, నిర్మాత అఫంగ్ అహుమ్, నటుడు అనం అహుం మణిపుర్ రాజధాని ఇంఫాల్ వెళ్లారు. అక్కడినుంచి ఓ ఫొటోగ్రాఫర్‌ను సాయంగా తెచ్చుకుని సినిమా పూర్తిచేశారు. అలా 1990 మార్చిలో పరిమిత వనరులతోనే ‘నవుయి తుయింగాషిత్’ నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలైంది. మంచి విజయం సాధించింది. దీని స్ఫూర్తిగా మరిన్ని చిత్రాలు రూపుదిద్దుకున్నాయి.
1992లో ఆల్ మణిపుర్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు గెలుచుకున్న ‘మై లాస్ట్ డేస్ ఎట్ ఉఖ్రుల్’, ఆ తర్వాత కాలంలో వచ్చిన ‘రంచో రమ్రిన్’, ‘ఖిపవుయి ఖయోన్’, ‘సంఖోక్’ లాంటి సినిమాలు చెప్పుకోదగ్గవి. సంఖోక్ అయితే దక్షిణ కొరియాలో జరిగిన ‘బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024’లో మణిపుర్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇంతలో ఇంటర్నెట్, సోషల్ మీడియా రావడంతో ఉఖ్రుల్లో సినిమా హాళ్లు ఒక్కొక్కటిగా మూతపడటం మొదలైంది. ఆన్లైన్లో తాంగ్ఖుల్ భాషా సినిమాలు చూడటం మాత్రం ఆగిపోలేదు. మణిపుర్ ప్రభుత్వం కూడా సినిమా రంగానికి రింగుయి సేవలను గుర్తించింది. 2019లో ఆ గ్రామంలో ఓ ఫిల్మ్ సెంటర్ స్థాపనకు పునాది వేసింది. రింగుయి స్ఫూర్తిగా ప్రతీ భారతీయ గ్రామం కూడా ఏదో ఒక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకోవాలి.