శివరాత్రి వచ్చిందంటే.. తెలంగాణ ప్రాంతమంతా కైలాస సదనంగా మారిపోతుంది. పల్లెపల్లెలో శివనామం మార్మోగుతుంది. తలచినంత మాత్రాన పలికే సదాశివుడు మన రాష్ట్రంలో వాడవాడలా వేములవాడ రాజన్నంత గొప్పగా కొలువుదీరాడు. ఓ చోట మల్లన్నగా, ఇంకోచోట జంగమయ్యగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలా పరమేశ్వరుడు మార్కండేయ స్వామిగా వెలిసిన పవిత్ర క్షేత్రం మమ్మాయపల్లి. ఆయువు తీరిన మార్కండేయుడిని అనుగ్రహించిన రూపం ఇది. కాలుణ్ని అడ్డగించి, అల్పాయుష్కుణ్ని చిరంజీవిగా ఆశీర్వదించిన మహాకాలుణ్ని భక్తులు ఇక్కడ లింగరూపంలో కొలుస్తుంటారు.
మమ్మాయపల్లి శివారులోని శివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలో ఉంటుందీ గ్రామం. 12వ శతాబ్దంలో ఇక్కడ ఆలయం నిర్మించారట. కాలక్రమంలో అది శిథిలం కావడంతో.. ఇటీవల నూతన ఆలయాన్ని కట్టించారు. ఏటా శివరాత్రికి మమ్మాయపల్లిలో వారం రోజులపాటు జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా పాలమూరు నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. జాతర సందర్భంగా బండ్లను ఊరేగించడం ఇక్కడి సంప్రదాయం. స్థల పురాణం ప్రకారం మార్కండేయుడి తల్లిదండ్రులు సంతానం కోసం ఇక్కడే తపస్సు చేశారట. పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన పుత్రుణ్ని ప్రసాదిస్తాడు.
తమ పుత్రుడికి పూర్ణాయుష్షు ప్రసాదించమని మళ్లీ తపస్సు చేశారట అతని తల్లిదండ్రులు. ఈ క్రమంలో మమ్మాయపల్లి శివారులో సరస్సు తీరానికి చేరుకున్నారట. ఇసుకతో శివలింగం చేసి నిత్యం ధ్యానించారట. తల్లిదండ్రులకు పుత్రశోకం తప్పించాలని మార్కండేయుడు కూడా శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. చివరికి పరమేశ్వరుడి మెప్పు పొంది.. దీర్ఘాయుష్షు పొందుతాడు. ఈ పౌరాణిక ఘట్టానికి మమ్మాయపల్లి కేంద్రమని కొందరి నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఇక్కడ కొలువై ఉన్న శివయ్యను మార్కండేయస్వామిగా పిలుచుకుంటారు. శివరాత్రితోపాటు శ్రావణ, కార్తిక మాసాల్లోనూ మార్కండేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ నెలల్లో శివదీక్ష తీసుకున్న స్వాములు ప్రత్యేకంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
శివకేశవ సంబంధానికి, అద్వైత సిద్ధాంతానికి మమ్మాయపల్లి ఆలవాలమై దర్శనమిస్తుంది. ఇక్కడి శివాలయం ఉన్న గుట్ట కింద వేంకటేశ్వరస్వామి కోవెల ఉండటం విశేషం. గుట్ట కింద సొరంగంలో అలమేలు మంగా సమేతంగా వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అంతేకాదు తెలుగు సాహిత్యంలో తొలి రచయిత్రుల్లో ఒకరైన కుప్పాంబిక ఈ ప్రాంతంలో నడయాడిందని స్థానిక కథనం. గోన బుద్ధారెడ్డి కుమార్తె అయిన ఈమె ఈ మార్కండేయుడి సన్నిధిలోనే తన రచనలు చేసిందని చెబుతారు. మమ్మాయపల్లిని అనుసరించి చిట్టడవి విస్తరించి ఉంటుంది. అంతేకాదు ఈ ఊరి చుట్టూ కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. రతంగుండు, కొమ్ముల గట్టు, మబ్బుల గుండు, పిల్లిగుండు, గంగరాళ్లు ప్రకృతి చెక్కిన శిల్పాల్లా యాత్రికులను అలరిస్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మమ్మాయపల్లి మార్కండేయ చెరువును అభివృద్ధి చేశారు. మార్కండేయ రిజర్వాయర్ కింద పదివేల ఎకరాలకు నీరు అందుతుండటం విశేషం.
ప్రకృతిని ఆస్వాదించడానికీ, ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడటానికీ మమ్మాయపల్లి సరైన ఎంపిక. రణగొణ ధ్వనులకు దూరంగా, పచ్చదనానికి దగ్గరగా ఇక్కడ రోజంతా సేదతీరొచ్చు. చుట్టూ ఉన్న విశేషాలను చూస్తూ మైమరచిపోవచ్చు. హైదరాబాద్ నుంచి మమ్మాయపల్లికి 120 కిలోమీటర్ల దూరం. బిజినేపల్లి నుంచి వనపర్తికి వెళ్లే రహదారి మధ్యలో ఉంటుందీ క్షేత్రం. వనపర్తి నుంచి, నాగర్కర్నూల్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు ప్రాంతాల నుంచి రోడ్డుమార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు.