చుట్టూ సముద్రం.. మధ్యలో నలభై అడుగుల ఎత్తున్న రాతి గోడలు. వాటి వెనుక.. రాచరిక వైభవం! మూడున్నర శతాబ్దాలు దాటుతున్నా తరగని సౌందర్యం! కట్టుబానిసలుగా మన దేశానికి వచ్చినవారి పట్టుదలకు నిదర్శనం.. మహారాష్ట్రలోని జంజీరా కోట!! 22 ఎకరాల్లో.. 22 సంవత్సరాల్లో.. 22 బురుజులతో.. కట్టిన అరుదైన నిర్మాణం ఇది. కొంకణ తీరంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన సిద్దీల రాజధానిగా వెలుగొందింది. ఎందరో రాజుల దాడులను తట్టుకొని.. శత్రు దుర్భేద్యమైన దుర్గంగా పేరొందింది. శతాబ్దాలుగా సముద్ర అలలు దాడి చేస్తున్నా.. అంతే అందంగా, అంతే దర్జాగా కనువిందు చేస్తున్నది.
మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజ్పురీ తీరం. అక్కడ సముద్రంలో సుమారు కిలోమీటర్ దూరం ప్రయాణించి జంజీరా కోటకు చేరుకోవచ్చు. 17వ శతాబ్దం ప్రారంభంలో జంజీరా ప్రాంతానికి సిద్దీ మాలిక్ అంబర్ కొన్నాళ్లు ప్రధానిగా ఉన్నాడు. ఆయన హయాంలోనే కోట నిర్మాణానికి పునాది రాయి పడింది. ఆ తర్వాత సిద్దీ సురల్ ఖాన్ రాజుగా ఉన్నప్పుడు కోట నిర్మాణం పూర్తయింది. కాలక్రమంలో ఈ కోటపై ఎందరి కళ్లో పడ్డాయి. దాడులకు దిగారు. యుద్ధాలు చేశారు. కోట నీడను కూడా తాకలేకపోయారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు జంజీరా స్వతంత్ర రాజ్యంగానే ఉంది. 1948లో భారత్లో విలీనమైంది. కోట లోపల వింతలూ అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాజ ప్రాసాదాలు, దర్బార్ హాల్, రాణివాసం, ధాన్యాగారం ఇలా ఎన్నో! 22 ఎకరాల్లో దీర్ఘవృత్తాకారంగా ఉన్న ఈ కోట చుట్టూ 22 బురుజులు ఉన్నాయి. కోటపై ఏ దిక్కు నుంచి శత్రువుల కన్ను పడినా.. ఫిరంగుల మోత మోగేది.
కోట గోడల నిర్మాణంలో రాళ్ల మధ్య.. పాదరసం, సీసం, బెల్లం మిశ్రమం వినియోగించారట అందుకే శతాబ్దాలుగా కడలి కెరటాలు దాడి చేస్తున్నా.. ఈ గోడలు బీటలు వారలేదు. జంజీరా కోటలో విహరిస్తున్నంత సేపు ఏదో సాహస యాత్ర చేస్తున్న అనుభూతి కలుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లో సముద్రంలో ఇలాంటి నిర్మాణం ఎలా కట్టారో అనిపిస్తుంది. సూర్యాస్తమయ వేళ మరింత అందంగా కనిపించే కోటను చూస్తూ.. పర్యాటకులంతా పడవల్లో తిరుగు ప్రయాణం అవుతారు.