యంత్రం! మన పనిని సులువు చేసేసే మంత్రం. వినియోగదారులకు అది బాగానే లాభపడుతుంది. కానీ, అప్పటివరకూ అది చేస్తున్న పనిని చేతులతో చేస్తున్నవారికి? వాళ్ల దృష్టిలో అది ఓ బ్రహ్మరాక్షసి. తమ పనిని, ఉపాధిని లాక్కున్న మహమ్మారి. అందుకే ఏదన్నా కొత్త సాంకేతికత వస్తున్నదంటే సమాజంలో తెలియని భయం మొదలవుతుంది. కొన్ని సందర్భాలలో తిరుగుబాటు కూడా కనిపిస్తుంది. దాని మీద స్వారీ చేసే ప్రయత్నం కంటే… అడ్డుకోవాలనే తపనే అధికంగా ఉంటుంది. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఇలాంటి వాతావరణమే ఉంది. ఇదిగో ఇప్పుడు కృత్రిమ మేధ విషయంలోనూ ఇదే జరుగుతున్నది. మనుషుల జీవితాల్ని కృత్రిమ మేధ అస్తవ్యస్తం చేసేస్తుందనీ, లక్షలాది ఉద్యోగాలే లేకుండా చేస్తుందనే భయం నిజం అవుతున్న ఈ సందర్భంలో… ఈ ఏడాది నోబెల్ పురస్కారం ఓ మార్గాన్ని చూపిస్తున్నది. మానవ జీవితాల్లో వచ్చే ఈ మార్పు వెనుక కారణాన్నీ, అది ఆర్థిక రంగం మీద చూపించే ప్రభావాన్నీ, దాన్ని ఎదుర్కొనే పరిష్కారాన్నీ తెలియజేస్తున్నది. 2025కి ఆర్థికరంగంలో నోబెల్ బహుమతిని జోయెల్ మోకిర్, ఫిపిప్ అఘియన్, పీటర్ హౌవిట్లకు ప్రకటించారు. ఆర్థిక శాస్త్రం లాంటివి కాస్త కొరుకుడుపడని విషయాలే. కానీ, ఈ ముగ్గురు వెలువరించిన అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

రోజూ కోట్లాది మంది యాపిల్‌తో సహా ఏదో ఒకటి నేల మీదకి రాలడం చూస్తూనే ఉన్నారు. కానీ, న్యూటన్‌కి మాత్రమే.. దాని వెనకాల ఏదో కారణం ఉందనిపించింది. అదేంటో కనుగొనే ప్రయత్నంలో అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. ఇంచుమించు ఇలాంటి కారణంతోనే మన కథ మొదలవుతుంది. జోయెల్ మోకిర్ నెదర్లాండ్స్‌కి చెందిన ఆర్థికవేత్త. గత చరిత్రను గమనిస్తున్నప్పుడు ఓ చిత్రాన్ని గమనించారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకూ కూడా జీవన ప్రమాణాలు ఒకేలా ఉన్నాయి.
ఏ దేశాన్ని చూసినా, అందులోని అభివృద్ధి ఒకే తరహాలో కనిపించింది. కానీ, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత… అభివృద్ధి ముందుకు వెళ్తూనే ఉంది. తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో తప్ప ఏ ఏడాదీ కూడా వృద్ధి కుంటుపడలేదు సరికదా… సూచీలు పైపైకి వెళ్తూనే ఉన్నాయి. పంటనష్టాలు, కరువు, యుద్ధాలు లాంటివేవీ కూడా పెద్దగా ప్రభావితం చేయలేదు. పైపైన చూస్తే కనుక ఇది కేవలం పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చిన మార్పు. యంత్రాల సాయంతో మనిషి ఎదిగాడు అనిపించవచ్చు. కానీ, ఆ వేగం ఎలా సాధ్యం అని లోతుగా పరిశీలించిన జోయెల్‌కి ఓ అనూహ్యమైన తర్కం స్ఫురించింది.

పారిశ్రామిక విప్లవానికి ముందు కూడా ఏదో ఒక ఆవిష్కరణ జరుగుతూనే ఉండేది. అప్పటికే లోహశాస్త్రం, రసాయనరంగాల్లో కొన్ని అద్భుతాలు సాధించారు. కానీ, అదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ స్థాయిలోనే ఉండేవి అంటారు. అంటే రకరకాలుగా ప్రయత్నిస్తూ ఏదో ఒక పనికి ఫలితాన్ని అందుకోవడం. కానీ, ఈ ఫలితం ఇలా ఎందుకు వచ్చిందనే స్పష్టత ఉండేది కాదు. విజ్ఞాన శాస్త్రం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల… కార్యకారణ సంబంధాలను తెలుసుకోలేకపోయేవారు. దాంతో అక్కడక్కడా అద్భుతాలైతే కనిపించేవి కానీ, వాటిని మరింత మెరుగుపరచడం కానీ అందరికీ ఉపయోగపడేలా భారీ స్థాయిలో ఉత్పాదన చేయడం కానీ సాధ్యమయ్యేది కాదు.
అప్పటి కాలంలో మరో బలహీనత ఏంటంటే… ఇలాంటి యంత్రాలు ఉంటే బాగుండు అని ఊహలతోనే సరిపెట్టుకోవడం. ఉదాహరణకు లియొనార్డో డావిన్సి విమానం నుంచి జలాంతర్గామి వరకు ఎన్నో రకాల యంత్రాలను ఊహించాడు. అవి ఇలా ఉంటే బాగుండు అని నమూనాలు కూడా గీశాడు. ఊహించినంత మాత్రాన, బొమ్మలు గీసినంత మాత్రాన ఆవిష్కరణ కాదు కదా. కానీ, 18వ శతాబ్దంలో ఆ తీరు మారింది. బ్రహ్మాండం నుంచి పరమాణువు వరకు ఏది ఎలా పనిచేస్తుందనే స్పష్టత వచ్చింది. అందుకే రైలింజను ఆవిరితోనే నడుస్తూ ఉండిపోలేదు. బొగ్గు నుంచి విద్యుదయస్కాంతం వరకూ ఎదుగుతూ వచ్చింది.
శతాబ్దాల నడకలో వచ్చిన సామాజిక మార్పు కూడా ఈ ఎదుగుదలకు తోడ్పడింది అంటారు జోయెల్. ఒకప్పుడు ఉన్న రాచరికం, భూస్వామ్య పెత్తందారీతనం… ఉత్పత్తి రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేవి. వాళ్ల అవసరాలకు, ఆంక్షలకు అనుగుణంగానే అందరూ నడుచుకోవాల్సి వచ్చేది. కొన్ని ఆవిష్కరణలు, సిద్ధాంతాలు చేయడానికి ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వచ్చిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. ఇప్పుడలాంటి పరిస్థితి లేకపోవడంతో… సాంకేతిక అభివృద్ధి సాధ్యం అవుతున్నదని అంటారు జోయెల్. తనకు నోబెల్ దక్కింది ఈ పరిస్థితిని గమనించినందుకు మాత్రమే కాదు.. దాన్ని కొన్ని సూచనలుగా మార్చినందుకు కూడా!


జోయెల్ పరిశోధనకుగాను ఆయనకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిలో సగం మొత్తాన్ని ఇస్తున్నారు. మిగతా సగాన్ని… ఫిలిప్ అఘియన్, పీటర్ హౌవిట్ పంచుకుంటున్నారు. వీరి పరిశోధనా ఆసక్తికరమే. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అన్న సిద్ధాంతంలో వీరి కృషికి ఆ బహుమతి. దీనికి పునాది మన పురాణాల్లోనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు.
కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టోలో ఓ మాట అంటారు. ‘పెట్టుబడిదారీ విధానంలో జరిగే విధ్వంసంలో… గత ఉత్పాదక శక్తులు కూడా నాశనం అవుతాయి!’ అని. డార్విన్ కూడా తన ఆరిజిన్ ఆఫ్ స్పీషిస్ సిద్ధాంతంలో ‘కొత్త తరహా జీవులు ఉద్భవించాలంటే పాతవి కాలగర్భంలో కలవాల్సిందే’ అని ప్రతిపాదిస్తాడు. ఇలాంటి ఆలోచనలు వినిపిస్తున్న కాలంలో… జర్మన్ సామాజికవేత్త వెర్నర్ సోంబర్ట్ Creative Destruction అనే భావన ప్రతిపాదించాడు. సృష్టి, లయ అనేది ఒక చక్రంలాగా సాగుతూనే ఉంటుందనేది తన ఉద్దేశం. భారతీయ దేవుడు అయిన శివుణ్ని చూసిన తర్వాతే తనకు ఆ ఆలోచన తట్టిందని చెబుతారు. భారతీయ తత్వశాస్త్రం జర్మనీకి చేరుకున్న ఆ సమయంలో, సోంబర్ట్ అందులోని లయతత్వానికి ప్రభావితం అయ్యాడని అంటారు.
సోంబర్ట్ చెప్పిన సిద్ధాంతం ఉత్పాదక రంగంలో ఎలా పనిచేస్తుందని నిరూపించారు షుంపీటర్ అనే ఆర్థికవేత్త. ఇన్ని చేతులు మారిన ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు ఫిలిప్, పీటర్లు అందుకున్నారు. ఒక ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చింది అనుకుందాం. దాని వల్ల బ్యాటరీ ఉత్పాదన లాంటి కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. కాలుష్యం నుంచి కారు మెయింటెనెన్స్ వరకు అన్ని విభాగాల్లో ఆకర్షించే మార్పులు వస్తాయి. అదే సమయంలో అప్పటివరకూ ఉన్న ఉద్యోగాలు పోతాయి. ఉపాధి తీరు మారుతుంది. దాన్ని అందుకోలేనివారు నష్టపోతారు. ఈ పరిస్థితిని కేవలం సిద్ధాంతంగానే కాకుండా… ప్రతి సందర్భంలోనూ నిరూపించగలిగే ఓ నమూనాను (మేథమెటికల్ మోడల్) రూపొందించారు ఫిలిప్, పీటర్ ద్వయం.
కొంత నష్టం వస్తుంది కదా అని మార్పును ఆపాలి అనుకుంటే… సమాజం ముందుకు సాగేదే కాదు. మన జీవితాలు టైప్ రైటర్లు, టెలిఫోన్ల దగ్గరే ఆగిపోయేవి. ఈ విషయాన్ని సంస్థలూ, ప్రభుత్వాలు, పౌరులూ అందరూ గుర్తించాల్సిందే. అందుకే వ్యాపార వర్గాలు ఈ విషయంలో చురుగ్గానే ఉంటున్నాయి. ఎవరూ ఊహించని కొత్త సాంకేతికతను తీసుకురావడం (ఉదా: టెస్లా) లేదా అప్పటివరకూ ఉన్న సాంకేతికతను చిన్నపాటి మార్పుతో మార్కెట్‌ని ఆక్రమించుకోవడం (ఉదా: జియో)కనిపిస్తున్నది.
ఇప్పటి మార్కెట్ ఎలా పనిచేస్తుందో Creative Destruction చెప్పిందే కానీ… ఇది తప్పా ఇది ఒప్పా అని చెప్పదు. ఇది నైతికతకి సంబంధించిన ప్రశ్న కాదు. అందుకే దాని ప్రభావాన్ని అంగీకరిస్తూనే సంప్రదాయం, విలువలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు స్పిన్నింగ్ మిల్లులతో ఎక్కువ ఉత్పత్తి అని తెలిస్తే… దానర్థం చేనేతను దూరం చేసుకోవాలని కాదు. తయారీ నుంచి అమ్మకం వరకూ దాన్ని మరింత దీటుగా ఎలా మలచుకోవాలి అనే ఆలోచనకు నాంది కావాలి. ఇలాంటి సందర్భాలలోనే ప్రభుత్వాల అండ అవసరం అవుతుంది. పరిశోధన కోసం, సాంకేతిక ఎదుగుదల కోసం ఇచ్చే రుణాలు, రిబేట్లు ఊపిరి అందిస్తాయి.
ఏతావాతా Creative Destruction చెప్పేది ఒకటే. మనం ఒప్పుకొన్నా, ఒప్పుకోకున్నా, ఇష్టమున్నా, లేకున్నా… ప్రపంచం మారుతూ ఉంటుంది. దాన్ని ఎలా స్వీకరిస్తాం, ఎలా అందుకుంటాం, దానితో కలిసి ఎలా ప్రయాణిస్తాం అన్నదే మన భౌతికమైన అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ఇది సాంకేతికత నుంచి సినిమా వరకూ ప్రతీ రంగానికీ అన్వయిస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గానే అమితాబ్ ఉండాలి అనుకుంటే… తన తోటి నటుల్లాగా బ్లాక్ అండ్ వైట్ కాలానికే పరిమితం అయ్యేవారు. అందుకే ఇప్పుడు మనం కూడా ఓసారి ఆగి ఆలోచిద్దాం. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధ లాంటి పెనుమార్పులు పొంచి ఉన్న ఈ సమయంలో… మన కెరీర్ ఎలా సాగాలో ఓసారి బేరీజు వేసుకుందాం!

చమురు విలువను తెలుసుకున్న ఎడారి దేశాలు… భూతల స్వర్గంగా మారిపోయాయి. మరోవైపు లెక్కలేనన్ని వనరులు ఉన్నా కొన్ని ప్రాంతాలు అంతర్గత కలహాలతో చీకటిలోనే ఉండిపోయాయి. అంతదాకా ఎందుకు! కంప్యూటర్ విప్లవాన్ని అందిపుచ్చుకున్న భారతీయులు.. పాశ్చాత్య దేశాల్లో సంపద సృష్టించుకున్నారు. Creative Destructionని గమనించుకుని ఎదిగిన దేశాలు కొన్నయితే, దాన్ని ఆపాలనే ప్రయత్నం చేసి భంగపడినవి కొన్ని.
పారిశ్రామిక విప్లవంలో స్పిన్నింగ్ మిల్స్ మొదలయ్యాక, ఇంగ్లండులో వాటికి విపరీతమైన ప్రోత్సాహం లభించింది. దాంతో పత్తి పంటకు కూడా అవకాశం వచ్చింది. 1750-1850 కాలంలో ఆ పంట దాదాపు రెండు వందల రెట్లు పెరిగింది. వస్ర్తాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే 20 శాతం వస్ర్తాలను రూపొందించే స్థాయికి చేరుకుంది. దేశంలో మౌలిక వసతులు, సౌకర్యాలూ పెరిగిపోయాయి. సమాజం సుభిక్షంగా ఉండటంతో జనాభా కూడా ఒక్క శతాబ్దంలోనే మూడు రెట్లు పెరిగింది. ఈ క్రమంలో తన పాలనలో ఉన్న దేశాల మీద దాష్టీకమూ, నిబంధనలు కూడా పెరిగాయి.
18వ శతాబ్దం వరకూ స్థానిక రాజుల పాలన, సమురాయ్ల ఆధిపత్యంలో ఉన్న జపాన్ ఒక్కసారిగా ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు సిద్ధమైంది. పరిశ్రమలు, యంత్రాలు, మౌలిక సదుపాయాలు, రవాణా రంగాలను ఆధునీకరించింది. ఫలితంగా ఆసియాలోనే మొదటి పారిశ్రామిక దేశంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయాక… రాజకీయాల జోలికి పోకుండా కేవలం పునర్నిర్మాణం మీదే దృష్టి పెట్టి మరోసారి అద్భుతాలు సాధించింది.
అమెరికా సైతం ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో రష్యా మీద పైచేయి సాధించేందుకు… పరిశోధనల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. విజ్ఞాన రంగంలో ఆధిపత్యం కోసం STEM రంగాలకి (Science, Technology, Engineering, and Mathematics) ఎక్కువ నిధులు కేటాయించి ప్రోత్సహించింది. ఫలితంగానే, అమెరికా ఉత్పాదక దేశం కాకపోయినా అగ్రరాజ్యంగా మారింది.
ఈ దేశాలకు విరుద్ధమైన ఉదాహరణలూ ఉన్నాయి. ముద్రణాయంత్రం లాంటి ఆవిష్కరణలను స్వీకరించని ఒటోమన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. విజ్ఞాన రంగంలో వచ్చిన స్తబ్దతే రష్యా ముక్కలు కావడానికి ఒకానొక కారణం అని చెబుతారు.
నోబెల్ బహుమతిని మొదట్లో కేవలం అయిదు రంగాల్లోనే ఇచ్చేవారు. అందులో ఆర్థిక శాస్త్రం లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత… ఉత్పత్తి, ఉపాధి రంగాల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. కేవలం అవసరాలు మాత్రమే మార్కెట్‌ను శాసించని మార్పులు ఏర్పడ్డాయి. వీటిని అధ్యయనం చేయడానికి అర్థికశాస్త్రమే కీలకం అయ్యింది. అందుకే Sveriges Riksbank అనే బ్యాంక్ ఆర్థికసాయంతో 1969 నుంచి ఆర్థిశాస్త్రంలో నోబెల్‌కు సమానమైన బహుమతిని ఇస్తున్నారు. లాభాలంటేనే విరక్తి పుట్టిన ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా ఈ బహుమతి ఉందనే విమర్శలు ఉన్నాయి. సాక్షాత్తు తన వారసులే ఇందుకు వ్యతిరేకత చూపుతున్నారు. వేరే సంస్థ నుంచి నోబెల్ రావడం వల్ల, పక్షపాత ధోరణికి అవకాశం ఉంటుందనే భయమూ ఉంది. ఈ వాదనలకు ఊతమిచ్చేలా కొన్ని సందర్భాల్లో వివాదాస్పద వ్యక్తులకు కూడా ఆర్థికరంగంలో నోబెల్ అందింది. ఈ విషయంలో జాగ్రత్తపడుతూనే ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తూ వచ్చారు. దాంతో పాటే పేరులో కూడా మార్పు వచ్చింది. ప్రస్తుతం ఈ రంగంలో బహుమతి పేరు ‘The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel’.
మా ఉత్పత్తికి, నైపుణ్యానికి తిరుగులేదు అనుకోవడం నమ్మకమే. కానీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా… దాన్ని మీరి వెళ్లను అనే పట్టు కొంపముంచుతుంది. అందుకు చాలానే ఉదాహరణలు కనిపిస్తాయి.
కెమెరాల కంటే అందులో ఉండే రోల్స్ మీదే ఎక్కువ సంపాదించే కొడాక్… డిజిటల్ ఫొటోగ్రఫీని వ్యతిరేకించింది. తన సొంత ల్యాబ్‌లోనే డిజిటల్ కెమెరాలు తయారైనా వాటిని ప్రోత్సహించలేదు. మార్పును గమనించని మూర్ఖత్వానికి ప్రతీకగా దివాళా తీసింది. పొలరాయిడ్ది కూడా ఇలాంటి కథే!
ఒకప్పుడు మెయిల్ అంటే యాహూనే. చాట్ అంటే యాహూనే. అసలు ఇంటర్నెట్ వాడేది యాహూ కోసమే. సాంకేతిక సునామీలో తనదో సంచలనం. కానీ, వినియోగదారుల ఇష్టాన్ని గమనించకపోవడం, సర్వర్ వేగమే కీలకం అనే విషయాన్ని గ్రహించకపోవడంతో తన పేరు కూడా మాయమైంది.
ఇప్పటికీ మన దృష్టిలో కాగితాన్ని కాపీ చేయడం అంటే అది జిరాక్సే. ఒక కంపెనీ పేరే ఉత్పత్తిగా మారిన అరుదైన సందర్భం ఇది. కానీ అదే జిరాక్స్ కంపెనీ కంప్యూటర్ రంగంలో వస్తున్న మార్పును అడ్డుకుంది. స్టీవ్ జాబ్స్ లాంటి దిగ్గజం తన దగ్గరకు వచ్చినా కాలదన్నింది. ఫలితంగా ఓ పేరుగానే మిగిలిపోయింది.

అందరికీ తెలిసిన కథే. 2007లో మొబైల్ విపణిలో 40 శాతం తన ఉత్పత్తులే ఉండేవి. ఆరేళ్లు తిరిగేసరికే అది 3 శాతానికి పరిమితమైంది. మొబైల్ రంగంలో వస్తున్న ఆపరేటింగ్ సిస్టం, టచ్ స్క్రీన్ లాంటి మార్పులను స్వీకరించేందుకు సిద్ధపడక నామమాత్రంగా మిగిలిపోయింది.
ఆర్థికశాస్త్రం అంటేనే కౌటిల్యుడి అర్థశాస్త్రం గుర్తుకొస్తుంది. ఆధునిక భారతంలోనూ దాదాభాయ్ నౌరోజీ, మాంటెక్ సింగ్ అహ్లువాలియా లాంటి ప్రముఖ ఆర్థికవేత్తలు మనకు తెలుసు. కానీ, భారతీయ మూలాలు ఉన్నవారిలో కేవలం ఇద్దరికి మాత్రమే (అమర్త్య సేన్, అభిజిత్ బెనర్జీ) ఆర్థికశాస్త్ర నోబెల్ వరించింది. విశేషం ఏమిటంటే ఇద్దరూ కూడా సంక్షేమం గురించి చేసిన పరిశోధనకు నోబెల్ అందుకున్నారు. ఇక మరి ఏ భారతీయుడికీ ఈ నోబెల్ అందకపోవడం వెనకాల చాలా కారణాలే ఉన్నాయి. ఇది కేవలం ఆర్థికశాస్ర్తానికే పరిమితం కాదు. నోబెల్ బహుమతుల్లో మన లోటుకు కూడా ఇవే కారణాలు వర్తిస్తాయి.
ఇలాంటి కారణాలన్నీ ఒక ఎత్తయితే, పశ్చిమ దేశాల్లో జరిగే పరిశోధనలకే నోబెల్ కమిటీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మరింత ముఖ్యమైన విషయం.
మన ఆర్థికవేత్తలు స్థానిక సమస్యల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. అంతర్జాతీయ జర్నల్స్లోకి తమ పేరు ఎక్కాలనీ, తమను తాము శాస్త్రవేత్తలుగా మార్కెట్ చేసుకోవాలనీ వారికి తపన ఉండదు. ఫలితంగా కమిటీ దృష్టిలో పడరు. కాబట్టి, నోబెల్ వస్తేనే శాస్త్రవేత్త లేదా అత్యున్నతమైన మేధావి అనే భావన పోవాల్సిందే!
– కె.సహస్ర