ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రయాణించడం పురోగామి మార్గం. అందుకు కావాల్సింది పరిశోధన, అభివృద్ధి. ఈ విషయంలో నాటక రంగానికీ మినహాయింపు లేదు. ఈ కృషి నాటక రచన, నటన, దర్శకత్వ ప్రతిభకంటే భిన్నమైనది. కష్టమైనది. బహుమతులు, సత్కారాలకు బహు దూరమైనది. తెలుగునాట ఈ కృషిలో నిమగ్నమై పని చేస్తున్నవాళ్లను వేళ్ల మీద లెక్కించవచ్చు. వారిలో ఒకరు ఆకుల మల్లేశ్వరరావు. ‘తెలుగు నాటకరంగాన్ని ఎలా అభివృద్ధి పరచాలి? ఎలా విస్తృతం చేయాలి?’ అన్న ధ్యేయంతో ఆయన ‘రంగ వీక్షణం’ రచించారు. ఈ పరిశోధన కీర్తి కోరుకోని ‘థ్యాంక్స్ లెస్ జాబ్’. అయినా సరే రంగస్థలం మీద ప్రేమతో ఆయన రచించిన ‘రంగ వీక్షణం’ తెలుగు రంగస్థలంపై ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది.
అబద్ధాలుఆడేటప్పుడు, అసందర్భంగా వ్యవహరించేటప్పుడు జీవితంలోకి అకస్మాత్తుగా నాటకం ప్రవేశిస్తుంది. అందుకే.. రుజువర్తన కంటే అసందర్భ ప్రవర్తనే ఎక్కువగా ఉంటే ‘వాడివన్నీ నాటకాలు’ అంటాం. మనిషిగా ప్రవర్తించే స్వభావం లేనివాళ్లకు నాటకం ఆడాల్సిన అవసరం వస్తుంది. కారాగార ఖైదీలకు, మానసిక రోగులకు నాటకం చికిత్స కూడా! ముఖ్యంగా మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పేది. జ్ఞానేంద్రియాలను మొద్దుబార్చకుండా సజీవంగా సచేతనలో నిలిపేది రంగస్థలం. జీవితానికి-నాటకానికి గల అవినాభావ సంబంధాల ఆనుపానులను కనిపెట్టేది రంగస్థల అధ్యయనం. నాటకానికి ఉండే శక్తిని, సామర్థ్యాన్ని, వైశిష్ట్యాన్ని, అవసరాన్ని సశాస్త్రీయంగా రంగస్థల శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే నాటకం వేరు. నాటక రంగం వేరు.
రంగస్థల సత్యాలు
సమీక్షా వ్యాసాలతోపాటు ప్రపంచ రంగస్థల దినోత్సవం (మార్చి 27) సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్తల సందేశాలను రచయిత అనువదించారు. ఈ సందేశాలు నాటకకర్తలకు గొప్ప పాఠాలు. వాటికి అంతేవాసిగా రంగ వీక్షణంలోని అనువాదాలు మనసుని హత్తుకుంటాయి. ఎందుకంటే అవి ఆయా నాటకకర్తల జీవన సత్యాలు. నాటకం పట్ల సమాజం పట్ల బాధ్యతగల గురుతర సందేశాలు. ‘యుద్ధాల-రక్తపాత సంఘర్షణల బురద నుంచి అతని (నాటక కర్త) పాదాలను బయటకు తీయండి. వాటిని వేదిక వాకిట వద్దే వదలి రమ్మని చెప్పి మరీ అతణ్ని ఆహ్వానించండి’ అని- ఆయూబ్ పేర్కొన్నాడు. ‘యుద్ధమూ-కళలు పరస్పర విరుద్ధమైనవి. కళ సరిహద్దులను బద్దలు కొట్టే విశ్వజనీనమైనది. అది ఎల్లప్పుడూ విశ్వశాంతినే కాంక్షిస్తుంది’ అని యాన్ ఫాస్పే అన్నాడు. ‘మనల్ని మనమే ప్రభావితం చేసుకుని, అనేక మంది జీవితాలను మార్చడానికి పునఃసృజన చేయండి. అజ్ఞానం, అతివాదమనే చీకట్లను ఎదుర్కొనేందుకు కళల వెలుగును ఉపయోగించుకోవాలి. ప్రమాదంతో కూడిన సంఘర్షణ సమయంలో మనల్ని మనం సజీవంగా ఉంచుకోవాలి’ ఇలా ప్రతి అక్షరంలో నాటక కర్త బాధ్యతను పీటర్ సెల్లార్స్ గుర్తు చేస్తాడు. ‘నిజాయితీ కలిగిన ప్రతి కళాకారుడు ప్రతిఫలాపేక్ష లేకుండా స్వేచ్ఛగా జీవించాలని కాంక్షిస్తాడు. స్వేచ్ఛాకాంక్షతో కూడిన కళాకారుల సృజనశీలత ఏకోన్ముఖంగా పయనించేందుకు అవకాశం ఇచ్చే అద్భుత వేదిక రంగస్థలం ఒక్కటే’నని కార్లోస్ అభిప్రాయపడతాడు.
యువ కళాకారుల పాఠ్యగ్రంథం
‘రంగ వీక్షణం’ పుస్తకానికి ‘వర్తమాన నాటక సమీక్షా వ్యాసాలు’ అనే ఉప శీర్షిక కూడా ఉంది. ఇందులోని 67 సమీక్షా వ్యాసాల్లో కొన్ని నాటక సమీక్షలు, చిత్ర సమీక్షలు, నాటక వార్తలు ఉన్నాయి. రచయిత కొన్ని విషయాలు సూటిగా చెప్పాడు. మరికొన్ని పాఠకుల, ప్రేక్షకుల విచక్షణకు వదిలేస్తాడు. తన మిత్రుడు చింతకింది శ్రీనివాసరావు కథ, నవలల సమీక్ష కూడా ఇందులో ఉన్నాయి. రావి శాస్త్రి – పతంజలి మిశ్రమ ఒరవడిలో సాగే చింతకింది రచనా శైలీ విన్యాసాన్ని, ఉత్తరాంధ్ర మాండలిక సొబగుల గురించి మల్లేశ్వరరావు కవితాత్మకంగా వర్ణిస్తాడు. పుస్తక రచయిత కూడా కవే కదా! మల్లేశ్వరరావు ఆంగ్లానువాదమే కాదు హిందీ అనువాదం కూడా మనసును రంజింపచేస్తుంది. తొలుత చెప్పినట్టు రంగస్థలం.. ముఖ్యంగా నాటకరంగం పట్ల అభినివేశం ఉన్న యువ కళాకారులకు, అధ్యయనం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ‘రంగ వీక్షణం’ ఓ చక్కని పాఠ్యగ్రంథం. రచయిత మల్లేశ్వరరావు సదా అభినందనీయులు.ఇందులోని 67 సమీక్షా వ్యాసాల్లో కొన్ని నాటక సమీక్షలు, చిత్ర సమీక్షలు, నాటక వార్తలు ఉన్నాయి. రచయిత కొన్ని విషయాలు సూటిగా చెప్పాడు. మరికొన్ని పాఠకుల, ప్రేక్షకుల విచక్షణకు వదిలేస్తాడు. …?
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు