ఉద్యోగంలో చేరిన కొత్తలో వచ్చిన కొద్ది జీతంతోనే సర్దుకుపోతారు. కెరీర్లో, జీతాల్లో కాస్త వృద్ధి కనిపించగానే జీవనశైలిని మారిపోతుంది. ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు అని ఖర్చులకు పోతారు. అంతేతప్ప ఎక్కువగా వచ్చిన మొత్తాన్ని పొదుపుగా మార్చుకోవాలని మాత్రం అనుకోరు. కానీ, ప్రైవేటు కొలువుల్లో ఉద్యోగం ఊడిపోవడం, ఆదాయం తగ్గిపోవడం వంటి రిస్కులు ఉంటాయి. దీంతో దుబారాకు అలవాటు పడ్డవాళ్లు… ఒక్కసారిగా పైసలకు కటకట ఏర్పడటంతో కష్టాలకు తట్టుకోలేరు. కాబట్టి, ఈ వాస్తవాన్ని గ్రహించి జీతాన్ని వాడుకోవాలి. అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదు.
Lifestyle Inflation | జీతం పెరిగే కొద్దీ ఖర్చులను కూడా అతిగా పెంచుకునే పద్ధతిని ‘లైఫ్ స్టయిల్ క్రీప్’, ‘లైఫ్ స్టయిల్ ఇన్ఫ్లేషన్’ అంటారు. ఇదెంతవరకు సాగుతుందంటే చివరికి మన దగ్గర పొదుపు కోసం పైసలే ఉండని స్థితికి చేరుకుంటుంది. అంటే ఇదో జీవనశైలి ద్రవ్యోల్బణం అన్నమాట.
‘ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి’ అనే మార్కెటింగ్ వ్యూహాలు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండటం. దీంతో ధర ఎక్కువగా ఉన్న వస్తువులను అవసరం ఉన్నా లేకపోయినా సులువుగా కొనేస్తారు. ఆదాయం హరించుకుపోయేలా చేసుకుంటారు.
విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవడం కూడా దీనికి ఓ కారణం.
నవతరం (జనరేషన్ జడ్, మిలీనియల్స్) సోషల్ మీడియా వేదికగా సాగే సౌందర్యం, ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణ చిట్కాలకు ప్రాధాన్యం ఇవ్వడం.
తమకంటే మరింత మెరుగైన జీవిత విధానం ఉన్నవారితో పోల్చుకోవడం.
ఇతరులు విలాసంగా, హాయిగా బతికేస్తుంటే… తామెందుకు మామూలుగా ఉండిపోవాలనే తత్వం కూడా లైఫ్‌స్టయిల్ ఇన్ఫ్లేషన్కు కారణమవుతుంది.
ఇంటి అద్దె, కిరాణా సరకులు, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల కోసం ప్రాధాన్యంతో కూడిన బడ్జెట్ తయారుచేసుకోవాలి.
తాత్కాలిక ఆనందాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టే కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలి. ఆర్థిక సుస్థిరత్వం, దీర్ఘకాలిక సంతృప్తికి చోటివ్వాలి.
మనకు తేలిగ్గా అందుబాటులో లేని సౌకర్యాల కోసం డబ్బును పొదుపుచేయండి. ఇలాచేస్తే దుబారాకు అవకాశం ఉండదు.
అనవసర ఖర్చుల గురించి తెలుసుకునేందుకు మీ పర్సు ఎలా ఖాళీ అయిపోతున్నదో గమనించుకోండి.
ముఖ్యంగా నవతరం ఉద్యోగుల్లో ఈ తత్వం అధికంగా కనిపిస్తుంది. దీనికి కొవిడ్- 19 మహమ్మారి తోడైంది. దీంతో ఆరోగ్యం కోసం ఆహారం, ఫిట్నెస్, వైద్యం ఖర్చులు పెంచుకుంటున్నారు. ఇలా ఆరోగ్యంపై శ్రద్ధతో ఖర్చులు పెంచుకోవడాన్ని ‘హెల్తీ లైఫ్ స్టయిల్ క్రీప్’ అంటారు.