తెలిసీ తెలియని వయసు. ఫ్రెండ్స్‌తో పబ్‌కి వెళ్లొస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికారు. మీరు చేసిన హంగామాను ట్రాఫిక్ పోలీసులు షూట్ చేశారు. చేసిన తప్పునకు మీరు బాధపడ్డారు. కొన్ని రోజులకు మర్చిపోయారు. కానీ, ఆనాడు షూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ కనిపిస్తే.. పరిస్థితేంటి? *** ఎప్పుడో కాలేజీ రోజులు.. ట్రూ లవ్.. ఇద్దరూ కలిసి చేసిన సందళ్లు అన్నా.. ఇన్నా? అవన్నీ ఎఫ్బీలోనో, యూట్యూబ్ రీల్స్లోనో షేర్ చేసుకున్నారు. లైకులు, కామెంట్లకు మురిసిపోయారు. కొన్నాళ్లకు బ్రేకప్. వాళ్లిద్దరూ లైట్ తీసుకున్నారు. ఏండ్లు గడిచాయి. ఇద్దరూ సెటిలయ్యారు. సడన్‌గా నెట్టింట్లో ఆనాటి విజువల్స్ విజిల్స్ వేస్తూ కనిపిస్తే.. ఎలా?
ఈ సీన్లు ఊహిస్తేనే! వామ్మో… పగోడికి కూడా ఇలాంటి రోజు రావొద్దు అనుకుంటాం కదా! అందుకే.. నెట్టింట్లో మీరు వదిలేసిన, ఆదమరచిన జాడల్ని కచ్చితంగా జల్లెడపట్టాలి. ఎవరికంటా పడకుండా.. వాటిని తుడిచేయాలి. అందుకు రాజ్యాంగబద్ధంగా ఓ హక్కే ఉంది తెలుసా? అదే.. ‘రైట్ బూ బీ ఫర్గాటెన్’. దీన్నే సంక్షిప్తంగా RTBF అని పిలుస్తున్నారు. దీన్ని నేటితరం నెటిజన్లు ఓ హక్కుగా వాడుకోవచ్చు. నెట్టింట్లో ఏ ప్లాట్ ఫామ్ అయినా.. వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్.. యూట్యూబ్ చానెల్.. క్లౌడ్ స్టోరేజ్.. ఎందులో అయినా మీ మూలాలు ఏమైనా ఉంటే రివ్యూ చేసి తొలగించొచ్చు. మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఏదైనా.. ఎవరికంటా పడకుండా జాగ్రత్తపడొచ్చు.
ఈ RTBF ఏదో బాగుందే! మనం కూడా ఈ హక్కుతో సమాచారాన్ని యాక్సెస్ చేయొచ్చు అనుకుంటే కాస్త తొందరపడినట్టే. ఎందుకంటే ఇది మన దేశ న్యాయపరమైన విధివిధానాల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. కానీ, ‘ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్-2019’ ప్రకారం ఆన్లైన్ డేటా సంరక్షణ కోసం ఓ వ్యవస్థను సిద్ధం చేశారు. ఈ చట్టం ప్రకారం యూజర్లు RTBF మాదిరిగానే వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడం.. ప్రైవసీని కాపాడుకునేలా ఆయా మూలాల్ని శాశ్వతంగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించొచ్చు. అంతేకాదు.. ‘ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ 2021’ నియమాల ప్రకారం.. ఆన్లైన్ సర్వీసులు, సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లు చట్టం పరిధుల్ని దాటి యూజర్ల వ్యక్తిగత సమాచారానికి భంగం కలిగిస్తే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవచ్చు.
నెట్టింట్లో యూజర్ సమాచారాన్ని సేకరించడం అంటే.. గోల్డ్ మైనింగ్ చేయడం లాంటిదే. ఎందుకంటే.. నెట్టింటి ఉనికికి యూజర్ సమాచారమే ఇంధనం. అందుకే టెక్నాలజీ నిపుణులు ఈ RTBF హక్కును వినియోగించుకునే నేపథ్యంలో ఓ సరికొత్త ప్రతిపాదన చేస్తున్నారు. అదేంటంటే.. తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడున్నా యాక్సెస్ చేయడం అనేది ఓ అంతర్జాతీయ హక్కుగా పరిగణించాలి. నేటి డిజిటల్ యుగంలో అన్ని ఆన్లైన్ సర్వీసులు, యాప్‌లు, ఇతర సర్వీసులు యూజర్ల డేటాని యాక్సెస్ చేయడాన్ని విధిగా చేస్తున్నాయి. ఆయా సర్వీసుల్ని యాక్సెస్ చేసే క్రమంలో యూజర్‌కి మరో ప్రత్యామ్నాయ మార్గం లేకుండా చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు వారి వ్యక్తిగత గోప్యతని పణంగా పెట్టయినా నెట్టింట్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇది యూజర్ల ప్రైవసీ విషయంలో కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నది.
సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ.. గోప్యత గురించి కచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే.. అన్ని విషయాల్లో మనతో అల్లుకుపోయిన సామాజిక మాధ్యమాల్లో తెలిసో, తెలియకో చాలా విషయాలను బహిర్గతం చేస్తాం. దీంతో ఆయా మాధ్యమాలు మనల్ని ఓ ప్రొడక్ట్‌గా వాడుకొని.. మన డేటాతో వ్యాపారం చేసే ప్రమాదం లేకపోలేదు. మన ఇష్టాల్ని, అభిప్రాయాల్ని, ప్రయాణాల్ని, రిలేషన్స్‌ని ట్రాక్ చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మనల్ని పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టి అంగట్లో సరుకుగా అమ్మేస్తున్నాయి. మరోవైపు వ్యక్తిగత డేటాని సైబర్ నేరగాళ్లు మంచినీళ్ల ప్రాయంగా యాక్సెస్ చేస్తున్నారు. దీంతో ఎదురయ్యే సమస్యల్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సైబర్ స్టాకింగ్, లొకేషన్ ట్రాకింగ్, ఫిషింగ్, ఐడెంటిటీ థెప్ట్, బ్లాక్ మెయిలింగ్.. ఇలా ఏ రూపంలోనైనా మీపై సైబర్ దాడులు జరగొచ్చు. అందుకే.. సోషల్ మీడియా జర్నీపై నిత్యం రివ్యూ చేయండి.
మీరేదైనా కొత్తగా ఏదైనా సైట్‌ని ఓపెన్ చేస్తే చాలు.. ఓ డైలాగ్ బాక్స్ వస్తుంది. అదే ‘కుకీ’ ట్రాకింగ్ సిస్టం. అదో చిన్న పిల్. వేసుకున్నట్టు మనకు తెలియదు. అంటే.. ఈ కుకీ ఆహ్వానాన్ని ఒక్కసారి మన్నిస్తే చాలు. బ్రౌజర్‌లోకి ఎంట్రీ ఇచ్చి… మన మొత్తం బ్రౌజింగ్, నెట్టింటి విహారాన్ని ట్రాక్ చేసేస్తుంది. మార్కెట్లోని ఈ-కామర్స్, ప్రకటనల సంబంధిత విభాగాలకు ఈ కుకీ ట్రాకింగ్ డేటా చేరిపోతుంది. అంతే.. మీకు సంబంధించినవే.. మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఊరిస్తుంటాయి. అందుకే.. కుకీస్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
మొత్తంగా చెప్పాలంటే..ఈ RTBF హక్కు ప్రధానం ఉద్దేశం ఒక్కటే.. ప్రతి ఒక్కరి ప్రైవసీని కాపాడుకునేలా ప్రోత్సహించడం. దీని అమలుతో ఆదమరిచిన డిజిటల్ ఫూట్ప్రింట్స్ని చెరిపేయొచ్చు. టెక్నాలజీ నిపుణులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయ నిపుణులు, ఎథికల్ హ్యాకర్లు.. అందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రభుత్వంతో కలిసి నెట్టింట్లో యూజర్ల ప్రైవసీని కాపాడుకునేలా కట్టుదిట్టమైన చట్టాలు చేయాలి. ఇది నేటి తరం నెటిజన్లకు అనివార్యమైన డిజిటల్ రక్షగా గుర్తించాలి. చట్టం ఉన్నప్పుడే సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది. అది ఆఫ్‌లైన్ ప్రపంచమైనా.. ఆన్లైన్ వరల్డ్ అయినా!!
g https://support.google.com/legal/answer/10769224?hl=en
g https://takeout.google.com/settings/takeout?pli=1
g https://gdpr.twitter.com/en.html
g https://www.facebook.com/business/gdpr
g https://business.safety.google/compliance/
g https://privacy.linkedin.com/gdpr