నటనా వారసత్వం లేదు. గాడ్ ఫాదర్లు అంతకన్నా లేరు. అయితేనేం, వెండితెర, బుల్లితెర నటులను మించిన పాపులారిటీ సాధిస్తున్నారు వీళ్లు. ఫోన్ స్క్రీన్ మీద 70 ఎమ్ఎమ్ పిక్చర్ రేంజ్లో వెలిగిపోతున్నారు. పల్లె అంటే పాడిపంటలకే కాదు.. సృజనాత్మకతకూ చిరునామా అని నిరూపిస్తున్నారు. తెలంగాణ పల్లెల్లోని ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలి, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల మధ్య ఉండే సంబంధాలే కథా వస్తువులుగా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించి.. లక్షల్లో సబ్‌స్ర్కైబర్స్‌ను, కోట్లలో వ్యూస్‌ను కొల్లగొడుతున్నారు లంబాడిపల్లె సృజనశీలురు.
ఇక్కడి మట్టి పరిమళం నుంచి పుట్టుకొచ్చిన యూట్యూబ్ చానెల్ ‘మై విలేజ్ షో’ ఓ సంచలనం. ‘ధూంధాం’ ఈ ఊరు ఉనికిని చాటితే, ‘అంజిమామ’ చందమామంత పాపులర్ అయ్యాడు. మరెన్నో యూట్యూబ్ చానెల్స్‌కు కేరాఫ్‌గా మారిన లంబాడిపల్లెలో ఇంటికో స్టార్ కనిపిస్తాడు. పూటకో షార్ట్‌ఫిల్మ్ ఇక్కడ పురుడు పోసుకుంటుంది.యూట్యూబ్ అడ్డాగా దునియాను దున్నేస్తున్న ఈ పల్లెలో స్టూడియోలూ వెలిశాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ‘పల్లెల్లో అవకాశాలేమున్నాయ్..’ అనుకునే వారికి లంబాడిపల్లె ప్రస్థానం ఓ గెలుపు పాఠం. కష్టపడే తత్వం, నలుగురినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉంటే.. పొలిమేర దాటకుండానే ప్రపంచాన్ని జయించొచ్చని నిరూపించింది ఈ యూట్యూబ్ హబ్.
జిల్లా మల్యాల మండలంలోని ఒక కుగ్రామం లంబాడిపల్లె. జనాభా మూడువేల వరకు ఉంటుంది! గ్రామానికి చెందిన శ్రీరాం మొండయ్య (ప్రస్తుతం కరీంనగర్ జిల్లా విద్యాధికారి) గతంలో కరీంనగర్‌లోని డైట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. ఆయన కొడుకు శ్రీరాం శ్రీకాంత్ డిజిటల్ యానిమేషన్లో ఎం.టెక్ పూర్తిచేశాడు. ఓ పన్నెండేండ్ల కిందట శ్రీరాం మొండయ్య డైట్ కాలేజీలో పనిచేస్తున్న రోజుల్లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా సైతం విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో డైట్ కాలేజీ విద్యార్థులతో లంబాడిపల్లెతోపాటు, మల్యాల మండలంలోని పలు గ్రామాల్లో సామాజిక సేవ క్యాంపులు నిర్వహించారు.
ధూమపానం, మద్యపానం వ్యసనాలు, వరకట్నం లాంటి దురాచారాన్ని అరికట్టడానికి తమవంతుగా ప్రయత్నించారు. అందులో భాగంగా సామాజిక రుగ్మతల వల్ల కలిగే దుష్ఫలితాలను స్కిట్స్ రూపంలో వీడియోలుగా చూపించగలిగితే బాగుంటుందని ఆలోచించాడు శ్రీకాంత్. గ్రామానికి చెందిన ఒకరిద్దరు యువకులతో పాటు, మరో నలుగురు పెద్దవాళ్లను కలుపుకొని, హ్యాండ్ కెమెరాతో చిన్నచిన్న స్కిట్లు చేయడం ప్రారంభించాడు. వీటిని మేలుకొలుపు అనే బ్యానర్‌పై ప్రదర్శించాడు. వాటికి విద్యావంతులు, అధికారుల ప్రశంసలు దక్కినా.. ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదు. దీంతో సామాజిక అంశాలకు కామెడీ జతచేసి, స్థానిక యాసతో స్కిట్స్ చేస్తే బాగుంటుందని భావించాడు శ్రీకాంత్. అలా 2015లో మొదలైందే ‘మై విలేజ్ షో’.
తన బంధువులు, స్నేహితులను భాగస్వాములుగా చేసుకొని శ్రీకాంత్ షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించడం మొదలు పెట్టాడు. తనకు దగ్గరివారైన మిల్కూరి గంగవ్వ, బైరగోని రాజు, మిల్కూరి అంజయ్య (అంజిమామ), అలువాల తిరుపతి, అలువాల రాజు, సిద్దిపేటకు చెందిన అనిల్, చంద్రశేఖర్ (చందు)లను కలుపుకొని ‘మై విలేజ్ షో’ ప్రస్థానం మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంగా తూట్ల ప్యాంటు, తీర్థం (జాతర) పోతే లాంటి షార్ట్‌ఫిల్మ్‌లను రూపొందించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు.
స్థానిక భాష, హాస్యం, సామాజిక అంశాలు అన్నీ కుదరడంతో వాటికి మంచి ఆదరణ లభించింది. చూస్తుండగానే మై విలేజ్ షో చానెల్‌కు సబ్‌స్ర్కైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వ్యూయర్స్ (వీక్షకుల) సంఖ్య వందలు, వేలు దాటి లక్షలకు చేరుకుంది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో మై విలేజ్ షో బృందం, వెబ్ సిరీస్‌లను పోలిన హుషారు పిట్టలు, బర్లమల్లి, లేచిపోతే లాంటి వాటిని నిర్మించారు. ‘మేళ’ లాంటి యూట్యూబ్ సినిమాను సైతం నిర్మించారు. వాటన్నిటికీ అంతే ఆదరణ లభించింది. గడిచిన పదేండ్లలో మై విలేజ్ షో చానెల్లో 300కు పైగా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించి ప్రసారం చేశారు.
‘మై విలేజ్ షో’ ఇచ్చిన స్ఫూర్తితో లంబాడిపల్లెకి చెందిన మరికొందరు యువకులు యూట్యూబ్ చానెల్స్‌కు శ్రీకారం చుట్టారు. వాటిలో ఒకటి ధూంధాం. ఇదే గ్రామానికి చెందిన అలువాల రాజు దీనిని ప్రారంభించాడు. డిగ్రీ చదివిన రాజు ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనేవాడు. మై విలేజ్ షో బృందంలో సభ్యుడిగా చేరాడు. తన ఆలోచనలతో సొంతంగా షార్ట్‌ఫిల్మ్‌లు తీయాలని భావించాడు. అలా 2018లో అలువాల రాజు, అలువాల తిరుపతి ఇద్దరూ మై విలేజ్ షో నుంచి వేరుపడి ‘ధూంధాం’ పేరుతో మరో యూట్యూబ్ చానెల్ ప్రారంభించారు.
తొలి ప్రయత్నంగా తిరుపతి, మరో ఐదుగురు చిన్నారులతో ‘సెలవులు’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాడు. దీనికి అంతగా ఆదరణ రాలేదు. తర్వాత హాస్యం డోస్ పెంచి ‘కౌసుగాళ్లు’ పేరుతో తీసిన స్కిట్‌తో ‘ధూంధాం’ హవా మొదలైంది. తర్వాత రాజు తన స్నేహితులైన గుండారపు చిన్ను, గుండారపు గవాస్కర్, బల్కం మధుతో కలిసి లంబాడిపల్లె ప్రకృతి అందాల ఒడిలోనే షార్ట్‌ఫిల్మ్‌లు తీయడం మొదలుపెట్టాడు. రాజుకు మేనల్లుడైన తొట్ల మణివర్షిత్ అలియాస్ రసూల్, బల్కం ధనుష్, గంగాధర్, తొట్ల రాజవ్వ (తల్లి పాత్రధారి)లను కలుపుకొని స్కిట్స్ చేశాడు. నిత్య జీవితంలో జరిగే సంఘటనలే వీరికి కథా వస్తువులు.
ఫిల్మ్‌లో ఆడ పాత్రలను పోషించడానికి గ్రామంలోని మహిళలు ముందుకు రాకపోవడంతో వేరే ప్రాంతాల వారిని నటింపజేయడం ప్రారంభించాడు. సిద్దిపేట, వరంగల్, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన జాముడు రుచిత (నిర్మల-తిరుపతి భార్య పాత్రధారి), తేగుళ్ల నిహారిక (భీమన్న భార్య పాత్రధారి), శ్రేయాదీప్ (సుబ్బడి లవర్ పాత్రధారి)కి అవకాశం కల్పించారు. ధూంధాం బ్యానర్ కింద త్రిబుల్ రైడ్, ఆర్మీ ఎపిసోడ్, సుబ్బి సుబ్బడు, మల్లిగాడు సిరీస్, లవ్ మ్యారేజ్ ఇవన్నీ తెగ పాపులర్ అయ్యాయి. 2018 నుంచి ఇప్పటివరకు దాదాపు వెయ్యి షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి వారెవ్వా అనిపించుకున్నారు రాజు అండ్ కో.
అంజిమామ చానెల్ రెండేండ్ల క్రితం మొదలైంది. లంబాడిపల్లెకు చెందిన మిల్కూరి అంజయ్య ‘మై విలేజ్ షో’లో అంజిమామగా బాగా పాపులర్. శ్రీరాం శ్రీకాంత్‌కు స్వయానా మేనమామ. అంజయ్యకు సినిమా అవకాశాలు రావడంతో.. మై విలేజ్ షో షూటింగ్‌లకు హాజరవడం కష్టమైపోయింది. ఈ క్రమంలో ఆయన ఆ బృందం నుంచి బయటికి వచ్చేశాడు. సినిమాల్లో నటిస్తూనే రెండేండ్ల కిందట ‘అంజిమామ’ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించాడు.
గ్రామానికి చెందిన జెట్టి మల్లేశం, ఆకుల పవన్, పొన్నం పవన్, నరేష్, వంశీ, మల్లేష్ తదితరులను కలుపుకొని, షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తున్నాడు. ఇంటింటి రామాయణం, పుడమి, ఏయ్ చికితా (యూట్యూబ్ మూవీ)లు అంజిమామ చానెల్ బ్యానర్‌పై నిర్మించినవే! రైతు కుటుంబం నేపథ్యంగా, రైతుగా మారిన యువకుడికి పిల్లనివ్వడానికి రైతులు కూడా ముందుకు రాకపోవడం ఇతివృత్తంగా తీసుకొని అంజిమామ నిర్మించిన ‘ఏయ్ చికితా’ యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సంపాదించింది. ఈ చానెల్ ద్వారా లంబాడిపల్లెకు చెందిన పదిహేను మంది ఔత్సాహికులు నటులుగా మారిపోయారు.
మై విలేజ్ షో, ధూంధాం, అంజిమామ చానెల్స్‌కు అనుబంధంగా లంబాడిపల్లె వాసులు మరిన్ని చానెల్స్ ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నారు. మై విలేజ్ షో చానెల్ అధీనంలోని నటీనటులు, నిర్వాహకులే మై విలేజ్‌షో వ్లోగ్, మై విలేజ్ షో మిక్స్, కల్లివెల్లి (గల్ఫ్ దేశాల్లో ఆజాద్ వీసా పొందిన వారిని లేదా కంపెనీ వదిలిపెట్టి, నిబంధనలకు వ్యతిరేకంగా బయట ప్రాంతాల్లో పనిచేసుకునే వారిని కల్లివెల్లి అంటారు) పేరిట యూట్యూబ్ చానెల్స్ నిర్వహిస్తున్నారు.
అలాగే ధూంధాం చానెల్‌కు అనుబంధంగా అలువాలు రాజు అండ్ కో మరికొన్ని చానెల్స్ నిర్వహిస్తున్నారు. సల్ల అర్వింద్ డీడీసీ పేరిట ఒక చానెల్ రన్ చేస్తున్నాడు. గుండారపు గవాస్కర్ ‘చిన్ను కచ్చ’ చానెల్ ప్రారంభించాడు. ఇలా ఎన్నెన్నో చానెల్స్ లంబాడిపల్లె వాసుల సృజనాత్మకతకు వేదికగా నిలుస్తూ, వీక్షకులకు వినోదాన్ని, పల్లె సౌందర్యాన్ని పరిచయం చేస్తున్నాయి. యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న లంబాడిపల్లె చానెల్స్, నిర్వాహకుల గురించి ప్రస్తావిస్తూ.. యూట్యూబ్ స్పాట్‌లైట్‌లో ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించడం గమనార్హం. ప్రముఖ వార్తా ప్రసార మాధ్యమాలైన బీబీసీ, సీఎన్‌ఎన్‌లు సైతం వీరిపై డ్యాకుమెంటరీని రూపొందించడం విశేషం.
ఈ లోకల్ చానెల్స్ ఖ్యాతి ఖండాంతరాలకూ పాకింది. మారుమూల పల్లెలో సాధారణ కెమెరాలతో, స్థానిక నటీ నటులతో ప్రారంభమైన షార్ట్‌ఫిల్మ్‌లు.. ఇప్పుడు దేశ దేశాల్లోని ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అంతేకాదు వీటిలో నటించిన వాళ్లకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మై విలేజ్ షో నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గంగవ్వ అంటే తెలియని తెలుగువారు ఉండరు. ‘ బిగ్‌బాస్’ రియాలిటీ షోలో రెండుసార్లు పాల్గొని తన ఫాలోవర్లను రెట్టింపు చేసుకున్న గంగవ్వ ఇప్పటికే 25 సినిమాల్లో నటించింది.
మై విలేజ్ షోలో నటించిన అనిల్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. చందు, బైరగోని రాజు సైతం అనేక సినిమాల్లో నటించారు. ధూంధాం చానెల్ తిరుపతి బలగం సినిమాలో యాక్ట్ చేశాడు. బాలనటుడు మణి వర్షిత్ (స్క్రీన్ నేమ్ రసూల్) ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో తళుక్కుమన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో రసూల్ నటించాడు. రుచిత, నిహారిక, శ్రేయాదీప్లకు సైతం ఇప్పుడిప్పుడే సినిమా, సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి. రాములా, ఇంటింటి రామాయణం సినిమాల్లో అంజిమామ కీలక పాత్రలు పోషించాడు. ఇంకా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.
లంబాడిపల్లెకి చెందిన మూడు ప్రధాన చానెల్స్, వాటి అనుబంధ చానెల్స్ ద్వారా అప్లోడ్ అవుతున్న షార్ట్‌ఫిల్మ్‌లు కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. మై విలేజ్ షో, అనుబంధ చానెల్స్‌కు మిలియన్ల కొద్దీ సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఇవన్నీ 70 కోట్ల వ్యూస్ సాధించాయని చెబుతున్నారు. లక్ష మంది సబ్‌స్ర్కైబర్స్ దాటితే యూట్యూబ్ ఇచ్చే సిల్వర్ స్క్రీన్ అవార్డును మై విలేజ్షోతోపాటు ధూంధాం, అంజిమామ చానెల్స్ కూడా సాధించాయి. సబ్‌స్ర్కైబ్, వ్యూయర్ షిప్ విషయంలో ఇచ్చే పలు అవార్డులను మై విలేజ్ షో, ధూంధాం చానెల్స్ కైవసం చేసుకోవడం విశేషం. ధూంధాం చానెల్ 89 కోట్ల వ్యూయర్షిప్ను దాటిపోగా, 8 లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్‌ను కలిగి ఉంది. అంజిమామ చానెల్‌కు లక్షమందికిపైగా సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు.
ఈ మూడు ప్రధాన చానెల్స్ లంబాడిపల్లెలోనే మూడు స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఇన్డోర్ షూటింగ్‌లన్నీ ఇక్కడే చేస్తారు. మై విలేజ్ షో కార్యాలయంతోపాటు షూటింగ్స్‌కు అనుగుణంగా స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలకుపైగా వెచ్చించారు. కెమెరాలు, డబ్బింగ్ స్టూడియో, మిక్సింగ్ సెంటర్, చిత్రీకరణకు అవసరమైన సామగ్రినంతా సమకూర్చుకున్నారు.
కెమెరా ఆపరేటింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, మిక్సింగ్ వీటి కోసం ప్రముఖ దినపత్రికల్లో పనిచేసిన నిపుణుడైన వెంకట్‌తో పాటు మరికొందరిని నియమించుకున్నారు. షూటింగ్ సమయాల్లో వచ్చేవారి వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ షెడ్డును సైతం నిర్మించడం వీళ్ల రేంజ్‌ను తెలియజేస్తున్నది. అలాగే ధూంధాం చానెల్ నిర్వాహకులు కూడా ఒక ఇంటిని తమ కార్యాలయంగా, స్టూడియోగా మార్చుకున్నారు. అంజిమామ చానెల్ నడిపే అంజయ్య సైతం సొంతంగా ఒక కార్యాలయాన్ని, చిన్నసైజ్ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ యూట్యూబ్‌లకు పర్మినెంట్ నటీనటులు ఉన్నారు. వీరికి నిర్వాహకులు ప్రతి నెలా వేతనాలు ఠంచనుగా చెల్లిస్తున్నారు. బయటినుంచి పిలిపించిన ఆర్టిస్టులకూ గౌరవప్రదమైన రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ‘మై విలేజ్ షో’ చానల్ ఇప్పటికే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయింది. శ్రీకాంత్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిసున్నాడు. ఈ చానెల్ టీమ్‌లో 15 మంది పర్మినెంట్ నటీనటులు, టెక్నీషియన్లు ఉన్నారు. వీరికి నెలకు రూ.5 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. వీరు కాకుండా షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించే వారికి రోజువారిగా పారితోషికం అందజేస్తున్నారు.
‘ధూంధాం’లో 15 మంది నటీనటులు పనిచేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించే తిరుపతి, భీమన్న, రుచిత, నిహారికలకు రోజువారిగా పారితోషికం ఇస్తున్నారు. వేతనాల కోసమే నెలకు రూ.3.50 లక్షలు వెచ్చిస్తుండటం విశేషం. అంజిమామ చానెల్ నెలకు రూ.లక్ష వరకు వేతనాలు చెల్లిస్తున్నది. ఈ మూడు చానెల్స్ నిర్వాహకులు వీలైనంత వరకు తమ గ్రామస్తులనే నటీనటులుగా ఎంపిక చేసుకుంటున్నారు. అవసరమైతేనే బయటివారిని తీసుకుంటున్నారు. వీరి కృషి ఫలితంగా ఇప్పుడు లంబాడిపల్లెలో కెమెరా అంటే ఎవరికీ జంకు లేని పరిస్థితి. గ్రామంలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో కెమెరా కంటికి చిక్కినవారే!
లంబాడిపల్లె ఆర్థిక వ్యవస్థలో నేడు యూట్యూబర్లది కీలకపాత్రగా మారిపోయిందంటే అతిశయోక్తి లేదు. ఏదో సరదాగా ప్రారంభించిన యూట్యూబ్ చానెల్స్ ఇప్పుడు వందల మందికి బతుకుదెరువుకు ఆదరువు అయ్యాయి. వ్యవసాయం ఆధారంగా ఉన్న ఈ పల్లెలో సాగుబడి ఆదాయానికి దీటుగా ఈ యూట్యూబర్లు సంపద సృష్టిస్తున్నారు. మూడు చానెళ్లు కలిపి ప్రతినెలా రూ.10 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వేతనాలు, పారితోషికాలు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి లెక్కిస్తే… యూట్యూబ్ చానెల్స్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏటా ఐదున్నరకోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే, ఈ గ్రామం ఇంతటి ఆర్థిక ప్రగతిని సాధించేందుకు ఈ యూట్యూబ్ చానెల్స్ ఎలా తోడ్పడుతున్నాయో, ఎన్ని కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి లంబాడిపల్లె.. యూట్యూబ్ చానెల్స్ కార్ఖానాగా మారిపోయింది. క్రియేటివిటీకి చిరునామాగా నిలుస్తున్నది.
నేను స్కిట్లు తీస్తున్నప్పుడు, షార్ట్‌ఫిల్మ్‌లు యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్న తొలిరోజుల్లోనే.. భవిష్యత్తులో యూట్యూబ్‌దే హవా అనిపించింది. డిజిటల్ యానిమేషన్ రంగంలో ఎం.టెక్ చేయడంతో ఈ రంగంపై నాకు కొంత అవగాహన ఉంది. అయితే, మా మై విలేజ్ షో ఇంతగా జనంలోకి వెళ్తుందని ఊహించలేదు. చక్కటి హాస్యం, గ్రామీణ వాతావరణం, భాష, సంస్కృతి ఇవన్నీ మా చానెల్ని గొప్పగా నిలిపాయి.
మై విలేజ్ షో తర్వాత అనేక చానెల్స్ పుట్టుకొచ్చాయి. మా ప్రయత్నం వల్ల లంబాడిపల్లె యూట్యూబ్ హబ్‌గా మారింది. భవిష్యత్తులో ఓటీటీ రంగంలోకి విస్తరించాలన్నది మా ఆకాంక్ష.. ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే మా లంబాడిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. అందులో భాగంగానే మేము మై విలేజ్ షో చారిటీని ఏర్పాటుచేశాం. గ్రామీణ యువతకు డిజిటల్ అంశాలపై సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి, 24 క్రాఫ్ట్స్‌పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తాం.
– శ్రీరాం శ్రీకాంత్, మై విలేజ్ షో క్రియేటర్
నాకు అల్లుడు వరుస అయ్యే శ్రీకాంత్ కెమెరా పట్టుకొని నటించమన్నడు.. ముందు ఏందో అనుకున్న…అటెన్క…ఆ పిల్లగాడు చెప్పినట్లు చేసిన. మెల్లెమెల్లగా అందురు నన్ను గుర్తించుడు మొదలువెట్టిండ్రు. పదేండ్లు తిరిగే సరికి నా బతుకే మారింది. సినిమా, టీవీ తెల్వని నేను గిప్పుడు సిన్మాలు జేస్తాన్న. అంతా ఒక కల లెక్కనే ఉంది. ఇప్పటికి ఓ ముప్పయ్ సిన్మాలు చేసుంటా! రెండుపార్లు బిగ్‌బాస్‌కు పోయినా. పెద్దపెద్ద యాక్టర్లతోని యాక్ట్ జేసిన. ఉన్నంతల మంచిగున్న! మై విలేజ్ షోతోని ఇంత తెల్లగైన. ఒక్క మాట అందరు వత్తుండ్రు.. మా ఊరిని రెవెన్యూ గ్రామం చెయ్యమని ఎవరికి చెప్పినా పట్టించుకుంట లేరు.. జర రెవెన్యూ గ్రామం అయ్యేటట్లు చేయ్యిండ్రి గంతే!
– మిల్కూరి గంగవ్వ, సినీనటి
సినిమాకు దర్శకత్వం చేయాలన్నది నా కళ. ఎప్పుడు కథలు రాసేందుకు ప్రయత్నించేది.. ఆ క్రమంలోనే యాక్టింగ్, వీడియోలు తీయడంపై ఆసక్తి ఏర్పడింది. కొన్నాళ్లు మై విలేజ్ షోలో నటించాను. కొన్నిటికి కథను అందించాను. తిరుపతి, భీమన్న, మా పెద్దమ్మ లక్ష్మితో కలిసి ధూంధాం చానెల్ మొదలుపెట్టాను. ఇప్పటివరకు వెయ్యి స్కిట్లు చేశాను. ఆదరణ బాగుంది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకొని సినిమాకు దర్శకత్వం వహించాలన్నదే నా ఆశయం.
– అలువాల రాజు, ధూంధాం చానెల్ దర్శకుడు
లంబాడిపల్లె యూట్యూబర్స్ నేడు అనేక ఈవెంట్లకు ప్రమోషన్స్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువమందికి రీచ్ కావాలంటే యూట్యూబ్‌ను మించిన మార్గం లేదని గుర్తించిన సినీ, బుల్లితెర దర్శక నిర్మాతలతోపాటు, వ్యాపారవేత్తలు సైతం ఈ చానెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. మై విలేజ్‌షో, ధూంధాం, అంజిమామ నిర్వాహకులు సినీ నటులతో కలిసి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు.
పుష్ప ఫేమ్ కేశవ, అందులోని విలన్ క్యారెక్టర్ రాజు తదితరులు సైతం లంబాడిపల్లి యూట్యూబర్స్‌తో ప్రమోషన్ చిత్రాలు చేశారు. మై విలేజ్ షో నలభై సినిమాలకు, ధూంధాం ఇరవై సినిమాలకు ప్రమోషన్స్ చేశాయి. గతేడాది సాధారణ ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల నాయకులు సైతం గంగవ్వతో పాటు, ఇతర యూట్యూబర్లతో కలిసి ముచ్చటించారు. అలా లంబాడిపల్లి యూట్యూబర్లు పొలిటికల్ ప్రమోషన్స్‌లోనూ కేక అనిపించుకున్నారు.
నేను సినిమా యాక్టర్‌ను అయ్యాను అంటే నాకే నమ్మబుద్ది అయితలేదు. వ్యవసాయం తప్ప మరే వృత్తులూ పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు నేను సినిమా యాక్టర్‌ను అయ్యానంటే దానికి యూట్యూబ్ చానెల్సే కారణం. 2010లో శ్రీకాంత్ మేలుకొలుపు పేరుతో చిన్నచిన్న స్కిట్స్ చేశాడు. అందులో మేమే సరదాగా నటించాం. తర్వాత మై విలేజ్ షో ద్వారా గ్రామీణ అంశాలను నేపథ్యంగా చేసుకొని షార్ట్‌ఫిల్మ్‌లు తీశాం.
వాటితో నాకు మంచి గుర్తింపు వచ్చింది. క్రమంగా సినిమా రంగం నుంచి పిలుపు వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఇంటింటి రామాయణం సినిమాలో ముఖ్యపాత్ర పోషించాను. అలాగే రాముల, పిట్టకథలు, పుడమి ఇలా ఆరు సినిమాల్లో నటించాను. అంజిమామ పేరిట నేను కూడా యూట్యూబ్ చానెల్‌ను ఏర్పాటుచేసి, గ్రామానికి చెందిన యువకులతో షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తున్నా! ఇందులోనే కొత్తకొత్త ప్రయోగాలు చేయాలన్నదే నా ఆకాంక్ష.
– మిల్కూరి అంజయ్య, అంజిమామ చానెల్