ఓ మధ్యతరగతి ఇల్లు. ఆ ఇంటి యజమాని విశ్వనాథం ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తుంటాడు. అతని భార్య సావిత్రి గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కుసుమ, శివ. కాలేజీలో చదువుతుంటారు. ఇంటర్నెట్ వాడకం ఈ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం..
నాటకం పేరు: లక్ష్మణ రేఖ దాటితే
రచయిత: కోన గోవిందరావు
దర్శకత్వం: ఎస్.ఎం.బాషా
సంస్థ: మిత్రా క్రియేషన్, హైదరాబాద్
నటీనటులు: బాషా, లక్ష్మి, నాగరాజు, దీప్తి తదితరులు
కథాంశం: ఇంటర్నెట్ దుర్వినియోగం మన జీవితాల్లో కలుగజేస్తున్న దుష్పరిణామాలను ఈ నాటిక కండ్లకు కట్టింది. ఎల్లలు లేని ఇంటర్నెట్ ప్రపంచానికి ఓ లక్ష్మణ రేఖ ఉండాలని చాటి చెప్పింది.
‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు మహాకవి కాళిదాసు తెలుగు రాష్ర్టాల్లో నాటక రంగం తరాల తరబడి వన్స్మోర్లతో అలరారింది. సినిమాల రాకతో, సీరియళ్ల కాకతో కుదేలైన రంగస్థలం మళ్లీ చిగురిస్తున్నది. ఔత్సాహిక కళాకారులు, యువతీయువకుల మేలు కలయికతో నాటకం మళ్లీ ‘కళ’కళలాడుతున్నది. ఓటీటీ హీట్‌లోనూ ప్రేక్షకులతో ఈలలు వేయిస్తున్నది. కాలదోషం పట్టని నాటకాలను ఈ తరానికి అందిస్తున్నవారు కొందరైతే, సామాజిక అంశాల్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్న యంగ్తరంగ్లు మరికొందరు! ఈ నవీన కళాపిపాసుల ప్రయత్నాన్ని అందరికీ చేరువ చేసే వేదికే ‘ఆన్ స్టేజ్’. ఇక వారం వారం మన రంగస్థల వైభవాన్ని ఆవిష్కరించుకుందాం.
విశ్వనాథం జూమ్ మీటింగ్‌లో ఉంటాడు. అతని భార్య సావిత్రి టిప్‌టాప్‌గా మేకప్ వేసుకొని ఇన్‌స్టా రీల్స్ చేస్తుంటుంది. సెల్ఫోన్లో చాటింగ్ చేస్తున్న కుసుమ తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తుంటుంది. ల్యాప్‌టాప్ పట్టుకున్న శివ ఆన్లైన్ క్లాస్‌లో బొమ్మలు గీస్తుంటాడు. ఇలా ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా విశ్వనాథం చిన్ననాటి మిత్రుడు చలపతి ఆకస్మికంగా రంగ ప్రవేశం చేస్తాడు. తన మాటలతో వారిని తమ బాల్యంలోకి తీసుకుపోతాడు. విశ్వనాథం తండ్రి గొప్పదనం, తల్లి చేసిచ్చే ఫిల్టర్ కాఫీ రుచి గురించి చలపతి చెబుతూ ఉంటే విశ్వనాథం ఉబ్బితబ్బిబ్బవుతాడు. వాళ్లిద్దరూ కాలం చేశారని తెలిసి చలపతి విచారపడతాడు. చలపతి భార్య సుమతి మరణించిందని తెలిసి విశ్వనాథం దంపతులూ బాధపడతారు. ‘బిజినెస్‌లో ఎదగాలి. నెంబర్ 1 పొజిషన్‌కి రావాలి. ఈ లక్ష్యంతో పరుగులు తీశానే తప్ప భార్య ఆరోగ్యాన్ని పట్టించుకోలేక పోయాన’ని పశ్చాత్తాపపడతాడు చలపతి.
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో శివ పొరుగింటి అమ్మాయి రోష్నితో ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసి రోష్ని తండ్రి అహ్మద్ ఖాన్‌కి కోపం వస్తుంది. ఇంటికి వచ్చి శివను బెదిరించి పోతాడు. శివలాగే కూతురు కుసుమ కూడా చదువుపై శ్రద్ధ పెట్టకుండా బాయ్‌ఫ్రెండ్ నాగరాజుతో కలిసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కుసుమ ఓరోజు ఎంతకీ ఇంటికి రాదు. తల్లిదండ్రులు కంగారుపడుతుంటారు. చివరికి కుసుమను వెంటపెట్టుకొని చలపతి వచ్చి ఇంటి దగ్గర దింపుతాడు. నాగరాజు అనే అబ్బాయి మాయ మాటలు నమ్మి తమ కూతురు అతని ప్రేమలో పడిందని ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. చదువు, భవిష్యత్తు గురించి కూతురుకు నచ్చజెబుతారు తల్లిదండ్రులు.
మరునాడు నాగరాజు సరాసరి కుసుమ ఇంటికే వస్తాడు. తనతో రావాలని నానాయాగీ చేస్తాడు. అప్పుడు కుసుమ ‘నీకూ నాకూ పెళ్లేంటి? నీ డిగ్రీ కూడా ఇంకా పూర్తవ్వలేదు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నాతో నీకు పెళ్లి అని నీవనుకుంటే సరిపోతుందా…?’ అని ఎదురు తిరుగుతుంది. అదే సమయంలో విశ్వనాథం కాలర్ పట్టుకుంటాడు నాగరాజు. కుసుమ తనతో పెళ్లికి ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తానని వెంట తెచ్చుకున్న సీసా బయటికి తీస్తాడు. సమయానికి ఖాన్, చలపతి వచ్చి అతణ్ని అడ్డుకుంటారు. ‘నాగరాజును పోలీసులకు అప్పగిస్తాం’ అనడంతో కథ ముగుస్తుంది.
ఆన్లైన్ స్నేహాలు, సోషల్ మీడియా రిలేషన్లు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తాయో, ఎంత పరిణతి లేకుండా ఉంటాయో కుసుమ, శివ వ్యవహారం తెలియజేస్తుంది. డిజిటల్ దునియాలో స్వైర విహారం చేస్తున్న పిల్లలపై ఓ కన్ను వేయడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగని వారిని అనుక్షణం అనుమానించడమూ సరికాదు. కానీ, ఈ చాటింగ్‌లు, వీడియో రీల్స్ ఎదుటివారిలో ముఖ్యంగా యువతలో ఎలాంటి భ్రమలు కల్పిస్తాయో ‘లక్ష్మణరేఖ దాటితే’ నాటిక వివరిస్తుంది.
రెండు తెలుగు రాష్ర్టాల్లో కొన్నేళ్లుగా మిత్రా క్రియేషన్ సంస్థ ఈ నాటికను ప్రదర్శిస్తున్నది. కేవలం చప్పట్లు, బహుమతులకే పరిమితం కాకుండా, చూసిన ప్రేక్షకుల హృదయాలను బలంగా తట్టి లేపే కథాంశం ఇది. రచనతోపాటు దర్శకత్వ ప్రతిభ, కళాకారుల నటనా కౌశలం అన్నీ కలగలిసి వాస్తవిక సౌందర్యాన్ని తొణికిసలాడిస్తాయి. నాటకం జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. జీవితం నాటకానికి స్పందిస్తుంది అంటే ఇదే కదా!
…? కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు