Kasi Majili Kathalu |జరిగిన కథ : గత 127 వారాలుగా ‘కాశీమజిలీ కథలు’ అనుసృజనను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. 1930వ దశకంలో 12 భాగాలుగా మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీమజిలీ కథల విశిష్టతను గురించి, ఈ అనుసృజనలో ఆ కథలను చెప్పేందుకు అనుసరించిన నిబంధనలను గురించి క్లుప్తంగా తెలియచేస్తూ.. ఈ శీర్షికను ఇంతటితో ముగిస్తున్నాం.
తెలుగులో కాశీమజిలీ కథలకున్న ప్రాచుర్యం మరి దేనికీ లేదు. సంసార వ్యామోహాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించిన మణిసిద్ధుడు అనే యతి.. కాశీయాత్ర చేయాలని నిశ్చయించుకుంటాడు. అయితే యాత్రలకు ఒంటరిగా వెళ్లరాదనే నియమాన్ని పురస్కరించుకుని, తనకు తోడుగా రమ్మని ఒక గోపాలకుణ్ని కోరుతాడు. కథలంటే మక్కువ కలిగిన ఆ గోపాలకుడు.. ‘దారిలో కనిపించే విశేషాలన్నిటినీ నాకు విడమరిచి చెబితేనే మీతో వస్తా!’ అని షరతు పెట్టాడు. మణిసిద్ధుని వద్ద ఒక అపురూపమైన మణి ఉంది. దాని సాయంతో దారిలో కనిపించిన ప్రతి విశేషాన్ని తెలుసుకుని, ఎప్పటికప్పుడు మణిసిద్ధుడు ఆ గోపాలకుడికి కథలు కథలుగా చెబుతాడు. అవే కాశీ మజిలీ కథలు.
1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షిత కవి రచించిన కాశీమజిలీ కథలు తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా, పండిత పామరులనే భేదం లేకుండా.. ఒకప్పుడు తెలుగు వారందరూ కాశీమజిలీ కథలను ఆస్వాదించినవారే! పూర్తి జానపద శైలితో సాగినప్పటికీ, సామాన్యులకు అంతగా రుచించని వేదాంత, వ్యాకరణాది అంశాలను పరమార్థ బోధారూపంగా అందించిన అద్వితీయ రచన కాశీమజిలీ కథలు. మధిర సుబ్బన్న దీక్షితులు ఈ కథలను రచించేనాటికి తెలుగులో నవలలు లేవు. చిన్నవైనా, పెద్దవైనా కథలు మాత్రమే! కాశీమజిలీ కథల్లో 359 మజిలీలు ఉంటాయి. ఆ మజిలీలన్నిటిలో ‘కథ’ అనే పేరు కనిపిస్తుంది. లెక్కకు మిక్కిలిగా కథలుంటాయి. ఉదాహరణకు మొదటి సంపుటంలో వరప్రసాదుల కథ ఉంటుంది. ఇది అయిదుగురు స్నేహితుల కథ. ప్రధాన కథ ఇదే అయినప్పటికీ.. వేర్వేరు శీర్షికలకు కూడా కథ అనే పేరుతోనే పేర్కొన్నారు.
ఈ అనుసృజనలో ప్రతిభాగానికీ వేర్వేరు శీర్షికలను ఉంచినప్పటికీ ప్రధాన కథ ప్రారంభాన్ని, ముగింపునీ తప్పనిసరిగా తెలియచేశాం. ఆవిధంగా చూస్తే ఇప్పటివరకు 28 కథలను మీరు చదివారు. ఇంకా మిగిలిన కథలేమయ్యాయి?! వాటిని ఎందుకు చెప్పలేదు!? అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్మరించాల్సి ఉంది. కాశీమజిలీల్లో ప్రధాన కథ ఎప్పుడూ మణిసిద్ధుడనే యతి.. గోపాలకుడనే సహాయకుడికి బోధించినట్లుగా మొదలవుతుంది. కథలో చర్చించబోయే విషయాన్ని నాటకఫక్కీలో ముందుగా వారిద్దరి మాటల్లో చర్చించారు. అయితే ఈ అనుసృజనలో వారిద్దరి పాత్రలనూ పక్కన పెట్టినప్పటికీ అసలు స్మరించకుండా ఉండలేదు.
ఇక, వరప్రసాదుల కథలోనే కృష్ణదేవరాయల వృత్తాంతం ఇమిడి ఉంటుంది. కృష్ణరాయని కథను కమనీయ కావ్యంగా తీర్చిదిద్దిన రచయిత, అందులోనే తిమ్మరుసు కథ, గజపతులతో సంబంధం వగైరా కథలను హేతుబద్ధంగానూ, చరిత్రకు అందే విధంగానూ రచించారు. అయినప్పటికీ ఈ అనుసృజనలో చారిత్రక పురుషులపై వచ్చిన కథలను తప్పించడం జరిగింది.
కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితులు.. 1. జానపద ఇతివృత్తాలు, 2. చారిత్రక ఇతివృత్తాలు, 3. కావ్యకథలు, 4. పౌరాణిక కథలు అనే విభాగాల నుంచి స్వీకరించి రచించారు. ఇందులో ఇప్పటివరకు మనం జానపద ఇతివృత్తాలను మాత్రమే చదువుకున్నాం.
కృష్ణరాయని కథతో పాటుగా.. జగన్నాథ పండితరాయలు, తెనాలి రామలింగడు వంటి చారిత్రక పురుషుల కథలను అప్పటి పండిత పామరులను రంజింపచేసే విధంగా సుబ్బన్న దీక్షితులు రచించారు. అవి ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి బాగుంటాయి. జనబాహుళ్యాన్ని కాస్త తికమక పెడతాయి. కనుకనే వాటిని విడిచిపెట్టడం జరిగింది.
రెండో సంపుటంలో పూరీ జగన్నాథుని అవతార నేపథ్యానికి సంబంధించిన ఇంద్రద్యుమ్న మహారాజు వృత్తాంతాన్ని యధాతథంగా వర్ణించాం. 8వ సంపుటిలోని పౌరాణికమైన మదాలస కథను చెప్పాం. పురాణ పాత్రల నేపథ్యాలతో వచ్చిన మరికొన్ని కథలనూ చెప్పాం. విక్రమార్కుడు ఉట్టికోసిన కథ, భేతాళుని వశం చేసుకున్న కథ ఒక క్రమపద్ధతిలో లేవు. అవన్నీ ఇతరత్ర బహుళ ప్రాచుర్యంలో ఉన్నవే. కాశీమజిలీల్లోనివే అయిన విక్రమార్కుని మనుమని కథను చదువుకున్నాం. కానీ, అతను పాతాళానికి వెళ్లి విభీషణుడు మొదలైన రాక్షసులను కలుసుకోవడం వగైరా కథలను నేటితరం వారికి ఓ పట్టాన కొరుకుడు పడవు కనుక, విడిచిపెట్టాం.
వీణావిద్వాంసుని కథ చాలా చిన్నదే కానీ, మజా కలిగించే కథ కాదు. నాలుగు కులాలకు చెందిన నలుగురు కన్యలు ఒకే వరుణ్ని వరించిన కథను కూడా ఈ శీర్షికలో చెప్పలేదు. 5వ సంపుటిలోని శంకరవిజయాన్ని ఈ అనుసృజనకారుడు గతంలో నవలగా రచించారు. కనుక ఇక్కడ మళ్లీ చెప్పలేదు. అలాగే అదే సంపుటిలోని కాదంబరి అనే కావ్యకథను కూడా విడిచిపెట్టాం.
ఈ అనుసృజనలో మూలంలోని వర్ణనాసౌందర్యాన్ని చెడగొట్టలేదు. ఏ ముఖ్యవిషయాలు చెప్పడం ద్వారా పాఠకుల స్థాయి పెరిగేలా మూలకర్త వాటిని రచించారో.. వాటిని చెప్పకుండా వదిలి పెట్టలేదు.
కాశీమజిలీ కథలకు రెండో మూడో సరళ అనువాదాలు వచ్చాయి. ఇందులోని అనేక కథలను విఠలాచార్య వంటివారు పలు సినిమాల్లో ఉపయోగించుకున్నారు. జగదేకవీరుని కథ, చిక్కడు దొరకడు.. వంటి హిట్ సినిమాలు కాశీమజిలీల్లోని ముఖ్యమైన థాట్‌ని ఉపయోగించుకుని చేసిన కథలే.
కాశీమజిలీలను రూపొందించడంలో మధిర సుబ్బన్న దీక్షితకవి చూపించిన రచనా నైపుణ్యం అనితర సాధ్యం. అయినప్పటికీ ప్రతికథకూ ప్రాచీన సాహిత్యపు మూలాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రధానంగా కథాసరిత్సాగరం కనిపిస్తుంది. అలాగే సంస్కృత కావ్యాలలోని కథలను తనదైన భాషలోకి మలుచుకుని, గమ్మత్తయిన మలుపులతో మధిర సుబ్బన్న దీక్షితులు ఆరోజుల్లో ఆబాలగోపాలాన్ని అలరించారు. నేటికీ ఈ కథలు వీటికివే సాటి అని చెప్పుకోవాలి.
ఈ అనుసృజనకు ఇది చివరి భాగం. కాశీమజిలీల్లోని తొలిభాగం మణిసిద్ధుడనే యతికి, గోపాలకుడికి మధ్య సంభాషణతో మొదలు అవుతుంది. 12వ సంపుటిలో కాశీమాహాత్మ్య గాథలుంటాయి. అవన్నీ మన పౌరాణికాలను పరమార్థ బోధారూపంగా చెప్పినవి.
కాశీఖండం నుంచి స్వీకరించిన దివోదాసు కథ ప్రత్యేకంగా ఇందులో వర్ణించారు. ఈ కథ పద్మకల్పంలోని స్వాయంభువ మనువు కాలానికి చెందినది. అప్పట్లో అరవై ఏళ్లపాటు భూమిపై అనావృష్టి సంభవించింది. పాడిపంటలు నశించాయి. ప్రజలు విశూచి, మశూచి మొదలైన దారుణ రోగాలపాలయ్యారు. ప్రజలు కోటానుకోట్లుగా మరణిస్తుండగా, యమధర్మరాజు విసిగిపోసాగాడు. యజ్ఞయాగాదికాలు చెడ్డాయి. మానవులకు కలుగుతున్న అన్యాయానికి ఇంద్రాదులను నిలవేసి అడిగేవారే కరవయ్యారు.
ఈ విశేషాలన్నీ నారదుడి వల్ల విన్న బ్రహ్మదేవుడు.. స్వాయంభువ మనువు వంశంలో పుట్టిన రిపుంజయుణ్ని ధరణీచక్రాన్ని పాలించవలసిందిగా నియమించాడు. రిపుంజయుని పేరును దివోదాసుగా మార్చాడు.
అయితే దివోదాసు ఒక షరతు పెట్టాడు.
“దేవతలకు స్వర్గం, నాగులకు పాతాళం ఉండగా.. వారు ఈ భూమిమీద ఎందుకు సంచరించాలి? వాళ్లు భూమి వదిలిపోవాలి. నేను కాశీని రాజధానిగా పాలిస్తాను.. కనుక శివుడు కూడా అక్కడినుంచి వెళ్లిపోవాలి” అన్నాడు. బ్రహ్మదేవుడు అతని కోరికను శివునికి విన్నవించగా..
“బ్రహ్మా! నీవు చేసిన నిర్ణయానికి కట్టుబడి.. నేను మందర పర్వతానికి వెళ్లిపోతాను. నేను తిరిగి వచ్చేదాకా ఈ ధరణీచక్రాన్ని దివోదాసుడే ఏలనీ” అన్నాడు. దివోదాసు అధికారం చేపట్టగానే నేలపై పాతాళవాసులను తరిమికొట్టాడు. తన బలంతో వర్షదేవతలను శాసించి వర్షాలు కురిపించాడు. దాంతో భూమి సస్యశ్యామలమైంది. నేలపై ధర్మం నాలుగు పాదాలతో నడవ సాగింది. కొంతకాలం జరిగిన పిమ్మట దివోదాసు రాజ్యంలో పుట్టలోని పామువల్ల పుత్రుణ్ని పోగొట్టుకున్న ఆటవికులు న్యాయంకోసం అతని వద్దకు వచ్చారు. వారికి ఆ పుత్రుణ్ని తిరిగి ఇచ్చే నిమిత్తం.. దివోదాసు కథంతా చిత్రవిచిత్రాలతో సుబ్బన్న దీక్షితులుగారి శైలిలో సుందరంగా సాగుతుంది.
ఆ కథలో భాగంగా రసాతలం నుంచి నాగులు, యక్షులు మొదలైనవారంతా భూమిపై నివసించడానికి తగిన అనుమతిని దివోదాసు మంజూరు చేశాడు. కానీ, దేవతలను మాత్రం రానివ్వలేదు. కాశీని విడిచి ఉండటం ఇష్టంలేని దేవతలు బృహస్పతికి మొరపెట్టుకున్నారు. ఆయన సూచన మేరకు భూలోకంలో అగ్నిదేవుడు తన తత్త్వాన్ని ఉపసంహరించాడు. వాయువు స్తంభించాడు. వరుణుడు వర్షించడం మానేశాడు. దేవతల కపటం గ్రహించిన దివోదాసు, తన యోగవిద్యాబలంతో తానే సర్వదేవతామయునిగా మారిపోయాడు. రాజ్యాన్ని ఎప్పటిలా పాలించసాగాడు. కాశీనగరం శివుని నివాసభూమి. ఆయన కాశీవియోగాన్ని సహించలేక ముందుగా అరవైనాలుగు మంది యోగినీస్త్రీలను కాశీకి పంపాడు. వారు కాశీలో స్థిరపడిపోయారు. ఆలస్యం భరించలేక, శివుడు తరువాత సూర్యుడిని పిలిచాడు.
“దివోదాసును ఏదోవిధంగా ధర్మవిముఖుడిని చేయి” అని కోరాడు. కానీ ఆ పని సూర్యుడివల్ల కూడా కాలేదు.
అటుపై ఈశ్వరుని ఆజ్ఞపై బ్రహ్మ బ్రాహ్మణ వేషంలో కాశీకి వెళ్లి.. దశాశ్వమేధ యాగాలతో ఈశ్వరుడిని ప్రతిష్ఠించి.. గంగానదికి పడమటి తీరంలో ఉండసాగాడు. కానీ, కాశీని విడిచిపెట్టి వెనక్కు రాలేకపోయాడు. ఆ తరువాత ప్రమధులు కూడా వెళ్లి.. ఆ క్షేత్రంలోని అద్భుతానందాన్ని అనుభవిస్తూ అక్కడే ఉండిపోయారు.
అప్పుడు డుంఠి భట్టారకుడై గణపతి వెళ్లాడు. అతడు కాశీవాసులకు అనేక దుశ్శకునాలు కల్పిస్తూ, వాటికి శాంతులు కూడా తెలియచేయసాగాడు. ఒకనాడు డుంఠి భట్టారకుని దర్శనానికి దివోదాసు వెళ్లాడు.
“కాశీ ప్రజలకు ఉత్పాతాలు రావడానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించాడు. అప్పుడు భట్టారకుడు..
“ఇటుపైన ఇంకా ఉత్పాతాలు రావడానికి అవకాశముంది. వాటిని నేను ఉపశమింప చేయగలను. కానీ, నువ్వు ఇక్కడ ఉండటం మంచిదికాదు. నేటికి పద్దెనిమిదో రోజున నీకోసం ఒక బ్రాహ్మణుడు వస్తాడు. అతడు చెప్పినట్లుగా చేయి” అని సూచించాడు.
ఆయన చెప్పినట్లుగానే ఆ పద్దెనిమిది రోజులలో చాలా వింతలు జరిగాయి. విష్ణువే లక్ష్మీ గరుడ సమేతంగా దిగివచ్చాడు. వాళ్ల బోధలతో అధర్మం పెచ్చుపెరిగి పోయింది. పద్దెనిమిదో రోజున మధుసూదనుడు బ్రాహ్మణ వేషంలో దివోదాసుని కలుసుకున్నాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు రాజు హృదయాన్ని ఆవేశించి ఉన్నాడు.
“ఇన్నాళ్లూ నా రాజ్యంలో అకాల మరణాలు, వ్యాధులు, దారిద్య్రం, ముసలితనం లేవు. ఎందుకో అవన్నీ ఇప్పుడు కలుగుతున్నాయి. నేను దేవతలను తృణీకరించిన అపరాధం తప్ప మరే దోషమూ ఎరుగను. ఇదంతా దేవతలు కల్పించిన నాటకంలా కనిపిస్తున్నది. ఏదేమైనా నేను చాలాకాలం రాజ్యం చేశాను. నా ఇంద్రియాలు విశ్రాంతి కోరుతున్నాయి. నేను మోక్షం కోరుకుంటున్నాను. ఏం చేయాలో సెలవియ్యండి” అని కోరాడు దివోదాసుడు.
ఆపైన మధుసూదనుడు చెప్పినట్లుగా, కాశీలో లింగప్రతిష్ఠ చేశాడు. తన కొడుక్కి పట్టాభిషేకం చేసి, దైవభక్తిని ఉపదేశించాడు. తాను తపోవనానికి వెళ్లిపోయాడు. దివోదాసు వారణాసి వదిలేసి వెళ్లాడన్న వార్త విష్ణువు ద్వారా తెలుసుకున్న ఈశ్వరుడు తిరిగి వచ్చాడు. ఆయనతోపాటు సర్వదేవతలూ కాశీ చేరుకున్నారు. ఆనాటినుంచి ఈ భూమండలాన్ని దేవతలే పాలిస్తారని విశ్వేశ్వరుడు ప్రకటించాడు.
దివోదాసు కథ తరువాత, కాశీమజిలీ కథల్లోని 12వ సంపుటిలో.. పుండరీకుని కథను వర్ణించారు. ఈ కథ మనందరం ఎరిగిన పాండురంగ మహత్యాన్ని చాటే పుండరీకుని కథ కాదు. వైకుంఠ సభలో ఈశ్వరుడి చేత శపించబడిన ఇంద్ర, చంద్రులు.. పుండరీక, కుమారకేసరులుగా జన్మించారు. పార్వతీదేవి శాపం వల్ల అహల్య, తార పాతాళంలో ఉదయసుందరి, తారావళులుగా పుట్టి, భూలోకంలో అనేక కష్టాలు పడ్డారు. పుండరీక, కుమారకేసరులను పెళ్లాడారు.
వాళ్లే తరువాతి జన్మలో గంధర్వలోకంలో హంసుడికి మహాశ్వేతగా, చిత్రరథుడికి కాదంబరిగా.. ఈశ్వరుడి వరం వల్ల జన్మించారు. ఇంద్రచంద్రుల మరో రూపాలైన చంద్రాపీడ, పుండరీకులని వివాహమాడి సంతానం పొందగానే వారి శాపం తొలగిపోయింది. చంద్రుడి భార్య అయిన రోహిణి కూడా అతణ్ని మూడు జన్మలలోనూ అనుసరించింది. కాశీమజిలీల్లో అటుపైన వైశ్వానర, నిరృతి, వరుణుడు మొదలైన దిక్పతుల పూర్వగాథలు ఉంటాయి. చివరిగా మణిసిద్ధుడు, గోపాలుడు కాశీపుర ప్రవేశం చేసి, అక్కడే స్థిరపడడంతో పన్నెండో భాగం పరిసమాప్తమైంది.
– అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ
ఫోన్ నెం : 99517 48340