జరిగిన కథ : కాశీలో చదువుకున్న ఏడుగురు మిత్రులు.. భోజరాజు వద్దకు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. వారి ప్రయాణంలో భాగంగా.. మొదటివాడైన దత్తకుడు యక్షుని శాపం వల్ల స్త్రీగా మారాడు. అతణ్ని భోజరాజు కుమారుడు ప్రేమించాడు. రెండోవాడైన గోణికాపుత్రుడు యువరాజు దగ్గరే కొలువు సంపాదించాడు. మూడోవాడైన సువర్ణనాభుడు.. ఒక గాయని అయిన యక్షిణిని పెళ్లాడి మిత్రులను కలుసుకున్నాడు. ఇక నాలుగో మిత్రుని కథ ఇది.
కుచుమారుడు పాపం చాలా సుకుమారుడు. అతనికి మహారణ్యాలలో సంచరించి ఓషధీలతల విశేషాలు కనుగొనాలని చాలా ఉబలాటం. కానీ సువర్ణనాభుడిలా ధైర్యం చేసి అటవీమార్గంలో ఎక్కువ రోజులు ప్రయాణం చేయలేకపోయాడు. ఫలితంగా వెనుదిరిగాడు. కాశీపురానికి తిరిగి వస్తూ ఆ అడవిలో దారితప్పాడు. చాలాకష్టాలు పడ్డ తర్వాత ఒక కోయగూడేనికి వెళ్లగలిగాడు. గూడెపు పెద్దను కలుసుకుని.. “నీకు కాశీపురానికి దారి తెలుసునా?” అని అడిగాడు.
“కాశీ అని మా పెద్దలు చెప్పడమే సామీ! పుణ్యం చేసినవారు చచ్చిన తరువాత అక్కడికి వెళతారని చెబుతారు” అని చెప్పాడా పెద్ద. “అయ్యో! పుణ్యం చేసుకుంటే చచ్చిన తరువాత పోయేది స్వర్గమయ్యా నాయనా! అది పైనుంటుంది. కాశీపురం మన భూమ్మీదే ఉంది. సరే కానీ, మీ అడవిలో ఆశ్చర్యకరమైన విశేషాలేమైనా ఉన్నాయా?” అని ప్రశ్నించాడు కుచుమారుడు. “లేకేం సామీ! ఇక్కడికి పదిదినాల పయనంలో పడమరగా ఒక రుషిగోరు ఉంటాడు. ఆయనకు ఎన్నేళ్లుంటాయో ఎవరూ చెప్పలేరు. పులులు, సింహాలు కూడా ఆయన ముందు సాగిలపడతాయి. ఆయన చెప్పినట్లు నడుచుకుంటాయి. ఆయన దగ్గరికి వెళ్లేవారిని కూడా జంతువులు బాధపెట్టవు.
ఎప్పుడైనా మా గూడెంలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆయన పేరు చెప్పి ముడుపులు కట్టుకుంటాం. ఆపద గట్టెక్కిన తరువాత ఆ ముడుపులు తీసుకుని ఆయన దగ్గరికి పోతాం. కానీ ఆయన వాటిని తీసుకోడు. ఎప్పుడు చూసినా తన గుడిసెలో ముక్కుమూసుకుని ఉంటాడు” అని చెప్పాడు. కుచుమారుడు ఉత్సాహంతో అతడు చెప్పినదంతా విన్నాడు. “నువ్వు ఆయనను ఎరుగుదువా?! ఆయన ఇప్పుడు ఉన్నాడా?” అని అడిగాడు. “తెలియదు సామీ! మా గూడెం నుంచి ఏడాదికాలంగా మేమెవరం ఆయన దగ్గరికి పోలేదు” అని చెప్పాడు పెద్ద. అతని దగ్గరనుంచి గుర్తులు అడిగి తెలుసుకుని, కుచుమారుడు ఒంటరిగా బయల్దేరాడు. పది దినాలపాటు ప్రయాణించాడు. గూడెం పెద్ద గుర్తులు చెప్పిన వనంలోకి ప్రవేశించాడు.
అక్కడ వృక్షాలు, లతలు ఎండిపోయి ఉన్నాయి. పూలు పూయడం లేదు. పళ్లు కనిపించడం లేదు. దానిని చూసిన వారికి.. ఆ వనం పూర్వం చాలా శోభాయమానంగా ఉండేదని తోచక మానదు. గూడెం పెద్ద చెప్పిన ఆనవాళ్లను బట్టి ఒక తటాకం దగ్గరికి వెళ్లాడు. ఆ తటాకానికి మనోహరమైన సోపానాలు ఉన్నాయి. కానీ, నీరు వనరెక్కి నాచు పట్టింది. మెట్లు పాడుబడ్డాయి. పద్మాలు లేవు. సారహీనమై కనిపించిన ఆ తటాకాన్ని చూసి, దానికి తూర్పుదిక్కుగా కనిపిస్తున్న మర్రిచెట్టు ఆ సిద్ధుని తపోభూమి కావచ్చని అక్కడికి వెళ్లాడు.
ఆ చెట్టుకింద ఒక పర్ణశాల ఉంది.
అది కూడా కళాహీనంగానే ఉంది. కృష్ణాజినం చివికిపోయింది. కమండలువు శకలాలై పడి ఉంది. ఆ సిద్ధుడు పరమపదించి ఉంటాడని అప్పటికి నిశ్చయానికి వచ్చాడు కుచుమారుడు. కొంతసేపు ఆ చెట్టుకింద కూర్చొని ధ్యానంలో గడిపాడు. ఆ తరువాత ఆ చెట్టుపైకెక్కి వనమంతా పరికించి చూడాలనిపించింది. సగం వరకు ఎక్కేసరికి అక్కడో పక్షిగూడు లాంటిది కనిపించింది. కానీ, దానికి బిరడా మూత ఉండటం గమనించి దానిని ఊడలాగాడు. లోపల ఒక తాటియాకుల పుస్తకం దొరికింది. చెట్టుదిగి వచ్చి, ఆ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించాడు. కానీ అక్షరాలు అలుక్కుపోయి కనిపించాయి. ఆకుపసరు తెచ్చి ఆ ఆకులకు పూస్తే, అక్షరాలు స్పష్టంగా కనిపించి, వాటిని చదవగలిగాడు.
మొదటి పుటపై ‘సిద్ధుని స్వీయచరిత్రము’ అని శీర్షిక కనిపించింది. ఆసక్తిగా లోపలి పుటలు తిప్పి చూశాడు. అందులో ఇలా ఉంది. గోదావరీ తీరంలో పర్ణశాల అనే అగ్రహారం ఉంది. అందులో శ్రీధరభట్టు అనే బ్రాహ్మణుడికి పెద్దవయసులో మహీధరభట్టు అనే కుమారుడు పుట్టాడు. ఆ బాలుడు ఎనిమిదేళ్ల ప్రాయంలో ‘నామలింగానుశాసనం’ అని మరోపేరున్న అమరకోశం చదువుకున్నాడు. దాంట్లో అష్టసిద్ధులను వివరించే శ్లోకాన్ని కంఠతా పట్టాడు. తన గురువును, తానెరిగిన పండితులను ఆ శ్లోకాన్ని వివరించమని పదేపదే కోరుతుండేవాడు. ఇలా ఉండగా ఆ బాలుడి తల్లిదండ్రులు పరమపదించారు.
“చేయడానికి, పొందడానికి, దాటడానికి ఏది శక్యం కాదో అది తపస్సు చేత శక్యం అవుతుంది” అని ఒక పురాణ పండితుడు చెబుతుండటం విన్నాడతను. “కానీ ఆ తపస్సు చేయడం మాత్రం చాలా కష్టం” అన్నాడాయన. ఉత్తరదేశపు అడవులకు పోయి తపస్సు చేసి, అష్టసిద్ధులను కైవసం చేసుకోవాలని బయల్దేరాడు మహీధరభట్టు. దారిమధ్యలో తాను తపస్సు చేస్తానని, మంత్రోపదేశం చేయమని పలువురిని ఆశ్రయించాడు. వారంతా మహీధరభట్టును ఎద్దేవా చేశారు కానీ, ఎవరూ మార్గం చూపలేదు. ఆశ విడవకుండా తిరిగి, తిరిగి ఒక కొండగుహలో తపస్సు చేసుకుంటున్న అవధూతను కలిశాడు. తన సంకల్పం చెప్పకుండా ఆయనకు చాలాకాలంపాటు శుశ్రూష చేశాడు. చివరికి ఆయనకు అతనిపై దయ కలిగింది.
“నీకేం కావాలో కోరుకో!” అన్నాడు. “స్వామీ! అణిమాది అష్టసిద్ధులనూ సాధించాలనే కోరికతో ఉన్నాను. నా కోరిక నెరవేరే మార్గం చెప్పండి” అని వేడుకున్నాడు. అప్పుడా అవధూత ఒక మంత్రాన్ని ఉపదేశించి, జపించమని ఆ విధానమంతా తెలియచేశాడు. అతను కూడా ఆ కొండమీదే వేరొక గుహలో కూర్చుని సాధన ప్రారంభించాడు. తదేకదృష్టితో మంత్రాన్ని జపిస్తుండగా పది సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పుడొక దేవత ప్రత్యక్షమై వరం కోరుకోమంది. “అష్టసిద్ధులలో ఎనిమిదోది అయిన వశిత్వ సిద్ధిని నాకు ప్రసాదించు!” అని కోరుకున్నాడితను. “అందుకు ఈ తపస్సు చాలదు” అని చెప్పి, దేవత అదృశ్యమైంది. మహీధరభట్టు పట్టు విడవకుండా మరో పది సంవత్సరాలు తపించాడు.
దేవత మరోసారి దర్శనమిచ్చింది. కానీ, ఈసారి కూడా వరమివ్వలేనని చెప్పి తప్పించుకుంది. ఆ తరువాత అయిదేళ్లకు ఒకసారి చొప్పున దేవత దర్శనమిస్తూనే ఉంది. వచ్చిన ప్రతిసారీ తపస్సు చాలదని చెబుతూనే వచ్చింది. చివరికి నలభై ఏళ్ల తరువాత ఆ దేవతకు మహీధరభట్టు అడిగిన వరాన్ని ఇవ్వక తప్పలేదు. వశిత్వ సిద్ధి లభించిన వెంటనే మహీధరభట్టుకు వివాహేచ్ఛ నశించింది. అస్థిరమని తెలిసిన తరువాత మహాత్ములు తుచ్ఛభోగాలను కోరుకోరు కదా! అతి ప్రయత్నం మీద కాశీగంగ తీసుకొచ్చి తోటకూర మడిలో జల్లే మూర్ఖుడు ఉండడు కదా? అలాగే మహీధరభట్టు కూడా భక్తిజ్ఞాన వైరాగ్యాలతో ఆత్మవేత్తయై గిరిశిఖరంపై ఈ ఉపవనాన్ని కల్పించుకున్నాడు.
మృగాలు ఊడిగం చేస్తుండగా.. ఈ వటవృక్షం కిందనున్న పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నాడు. అతనే నేను. ..అంతవరకు చదివిన కుచుమారుడు ఆనందబాష్పాలతో ఒకసారి కళ్లు తుడుచుకున్నాడు. ‘ఓహో! ఇంతటి మహానుభావుణ్ని చూసే భాగ్యం నాకు కలగలేదు. అయ్యో ఎంతటివారికైనా మరణం తప్పదు కదా!’ అనుకున్నాడు. ఆకులకు మరికొంత పసరు పూసి, తరువాతి పుటలు చదివాడు. వాటిలో మనుషులను మృగాలుగా, పక్షులుగా మార్చే విధానం.. పక్షులు, మృగాల చేత మాట్లాడించడం వగైరా గొప్ప విద్యల గురించిన విశేషాలు ఉన్నాయి. చివరి పుటలో.. ‘ఇవన్నీ ఉగ్రతపస్సు చేతనే తప్ప ఇతరత్రా సాధ్యం కావు. అయితే నా అస్తిమాలను మెడలో ధరించినవాడికి వెనువెంటనే ఈ విద్యలన్నీ ఫలిస్తాయి’.. అని రాసిపెట్టాడు సిద్ధయోగి. గొప్ప పెన్నిధి దొరికినట్లుగా కుచుమారుడు ఆనంద పడిపోయాడు.
ఆ చుట్టుపక్కల సిద్ధుని అస్థిపంజరం కనిపిస్తుందేమోనని వెతికాడు. తటాకానికి సమీపంలో కనిపించింది. కపాలం భిన్నమై ఉంది. ‘ఓహో! ఈయన యోగమార్గంలో దేహం విడిచినట్లున్నాడు’ అనుకున్నాడు కుచుమారుడు. వెండికడ్డీల్లా మెరుస్తున్న ఆ అస్తికలను నీటిలో కడిగి.. వాటిలో ముఖ్యమైన వాటిని ఒక తాడుతో మాలికగా కట్టుకుని తన మెడలో వేసుకున్నాడు. ఆ క్షణంలోనే అతని హృదయంలో అనేక విషయాలు స్ఫురించసాగాయి. ఎంతోకాలం తపస్సు చేస్తేకానీ లభించని వశిత్వ విద్య కుచుమారునికి అరనిమిషంలో లభించింది. పశు పక్షి మృగాదులలో ఏది కనిపించినా.. పిలిచినంతనే వచ్చి శిష్యునిలా ఉపచారాలు చేయసాగాయి. ఆ అడవిలోని ఏ ఓషధిని పేరుపెట్టి పిలిచినా వెనువెంటనే వచ్చి, తన స్వరూపాన్ని తెలియ చేయసాగింది. ఆ విధంగా తన విద్యలన్నీ పరీక్షించిన తరువాత కుచుమారుడు ఆ వనాన్ని వదిలి.. దక్షిణాభిముఖుడై ప్రయాణమయ్యాడు.
ఒకనాడు ఒక అగ్రహారానికి చేరుకున్నాడు. ఒక బ్రాహ్మణుని ఇంటికి అతిథిగా వెళ్లాడు. అతను అందించిన అతిథి పూజలను స్వీకరించిన తర్వాత ప్రస్తావవశంగా.. “నేను కాశీలో చదువుకున్నాను. భోజమహారాజు ఆస్థానంలోని విద్వాంసులను జయించడానికి ధారానగరం వెళుతున్నాను” అని తెలియచేశాడు.
అందుకు ఆ ఇంటి యజమాని.. “అయ్యా! మీరంతటి వారే అయితే శ్రమపడి ధారానగరం దాకా పోవడం ఎందుకు? మీరు తన కొలువులో పండితులను పరాజితులను చేసినా ఆ భోజరాజు మీకు వేలివ్వచ్చు.. లక్షలివ్వవచ్చు గాక; తన రాజ్యం ఇవ్వడు కదా! మీకంత విద్యలలో గట్టితనముంటే సులభంగా రాజ్యలక్ష్మిని చేపట్టే ఉపాయం చెబుతాను.
నాకేం పారితోషికం ఇస్తారు?” అని అడిగాడు. “మీ నోటిచలవ వల్ల నాకు రాజ్యం రావాలే కానీ, మీ భాగం మీకు అందకపోదు. చెప్పండి ఆ విశేషమేమిటో..” అని ఆసక్తిగా అడిగాడు కుచుమారుడు. “చెబుతాను వినండి. ఇక్కడికి కొద్దిదూరంలోని పురందరపురం అనే రాజ్యాన్ని హిరణ్యగర్భుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి ఒక్కతే కూతురు. పేరుకు తగ్గట్లే విద్యలలో సరస్వతి. చతుష్షష్టి కళలను బాలరామాయణంలా పారాయణ చేసింది. ఆరుశాస్ర్తాలను తలకిందులుగా ఏకరువు పెట్టగలదు. తన పరీక్షకు నిలిచిన వాణ్ని తప్ప.. ఇతరులను పరిణయం ఆడనని శపథం చేసింది.
ఆమెను గెలవాలని శస్ర్తాస్త్ర నిపుణులు, విద్యాధన వైభవం కలవారు ఎందరో వచ్చి పరాజితులై వెనక్కు పోయారు. మీ తేజస్సు చూడగా మీరామెను గెలువగలరని అనిపిస్తున్నది. మీరు సరేనంటే నా కుమారుడైన శంబరుణ్ని మీతోపాటు పంపిస్తాను. గెలిచిన తరువాత మీరు నాకిస్తానన్న భాగమేదో నా కుమారునికి అప్పగించండి” అని చెప్పాడు ఆ ఇంటి యజమాని. అందుకు కుచుమారుడు అంగీకరించాడు. మార్గాయాసం తీరేందుకు నాలుగు రోజులు ఆ ఇంటిలోనే గడిపి, శంబరునితోపాటు పురందరపురానికి వెళ్లాడు. ఆ నగరమంతా సరస్వతిని వాదంలో ఓడించాలని విచ్చేసిన పండితులైన రాజపుత్రులతో నిండి ఉంది. బ్రాహ్మణుడైన కుచుమారుడు కూడా వాదానికి సిద్ధపడటంతో.. రాజపురుషులు అతణ్ని వారించబోయారు.
“బాబూ! అది గేలపు సిరి కానీ, గంపసిరి కాదు.. అంత తేలిగ్గా ఎత్తుకుపోలేవు. మహావిద్వాంసులు ఎందరో ఆమె ముందు మట్టి కరిచారు. నువ్వు ఎండ కన్నెరుగని సుకుమారునిలా ఉన్నావు. బుద్ధిగా వచ్చినదారినే వెళ్లు” అని చెప్పారు. కుచుమారుడు అంగీకరించలేదు. దాంతో అతను వచ్చిన వార్తను సరస్వతికి చేరవేయక తప్పలేదు. ‘అతను బ్రాహ్మణ పండితుడు అంటున్నారు కనుక, వెయ్యిన్నూట పదార్లు బహుమానమిచ్చి పంపండి’ అని సందేశం పంపించింది సరస్వతి. “ఈమాత్రం దానికి వాదప్రకటన చేయడం ఎందుకు? తాను పరాజితురాలైనట్లుగా అంగీకరిస్తేనే ఈ బహుమతిని తీసుకుంటాను” అన్నాడు కుచుమారుడు.
ఆ వార్త కూడా సరస్వతికి చేరింది. ఆమెకు రోషం ముంచుకు వచ్చింది. ‘ఒక్కదెబ్బతో ఆ మూర్ఖుణ్ని వెనక్కు పంపిస్తాను’ అనుకుని, కొన్ని పువ్వులను అతని వద్దకు పంపింది. ‘ఇది విద్యా పరీక్ష’ అని చెప్పి రాజపురుషులు వాటిని అతనికి ఇచ్చారు. కుచుమారుడు ఆ పువ్వులను విచిత్రమైన మాలికలుగా, బంతులుగా కట్టాడు. వాటిలో తన పేరు కనిపించేలా విచిత్రంగా అల్లాడు. వాటిని చూసిన సరస్వతి.. ‘ఇతడెవరో గట్టివాడే!’ అనుకున్నది. ఈసారి రత్నపరీక్ష చేసింది. దానిలోనూ అతను నెగ్గాడు. (వచ్చేవారం.. శంబరుడి కుతంత్రం)