– కె. ప్రభావతి, దోమలగూడ.
చూడమ్మా! ఇల్లుగా ఒక గదిని వాడుతున్నపుడు దానిలో ప్రధానంగా చూడాల్సింది ఆ గది ద్వారం. అది ఈశాన్యంగా ఉందా? ఆగ్నేయంగా ఉందా? లేక వాయవ్యంలో ఉందా? అనేది. ఇది అతిపెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. మరో అంశం లెట్రిన్ గది. ఇది ఆ గదిలో ఉన్నదా? లేక ఆ గదిలో నుంచే బయటికి పొడుచుకొని ఉందా? అంటే.. వాయవ్యంలో డోరు ఉండి, బయట టాయిలెట్ కట్టి ఉంటే.. అది మంచి గదికాదు. నైరుతి నుంచి వాడుకునే టాయిలెట్ బయట ఉంటే.. తక్షణం ఆ గదిని వదిలివేయాలి. ఇలా ఒక గదిలో ఉన్నప్పుడు చూసుకోవాల్సిన అంశాలు. ఉన్నదాంట్లోనే ఆగ్నేయంలో పొయ్యి గట్టు ఉండి, వాయవ్యంలో టాయిలెట్ ఉంటే.. త్వరలోనే పెద్ద ఇంటికి మారుతారు.
అంటే, ఆ గదికి ఉన్న వాస్తు బలం తప్పకుండా మీ జీవితాలలో అభ్యున్నతిని తీసుకువస్తుంది. ఎందరో మహావ్యక్తులు చిన్న గదుల్లో ఉండి ఎదిగి వచ్చినవారే! మనమూ అంతే! గొప్ప ఇండ్లు అని చూడకుండా, ఉనన గుడిసెకైనా గుణం కలిగించే వాస్తు ఉందా? అన్నది చూసుకుంటే చాలు. గంగ గోవుపాలు గరిటెడైనా చాలు.. అన్నారు కదా! పేదరికం తప్పుకాదు. పేదవాళ్లుగా పుట్టడం తప్పుకాదు. కానీ, పేదవాడిగానే చావడం తప్పు. ఉన్నది ఏదైనా శాస్త్ర ఉన్నతిలో ఉంటేచాలు. ప్రకృతే మిమ్మల్ని తప్పకుండా గొప్ప స్థితికి చేరుస్తుంది. ప్రకృతికి ఏదైనా సాధ్యమే! దానిని అనుసరించాలి. అంతే!
– కె. భిక్షపతి, ఉప్పల్.
ఇంటికి తూర్పులో మెట్లు వేయవద్దు. తూర్పు – ఈశాన్యం, ఉత్తర – ఈశాన్యం, అలాగే.. ఉత్తరం మధ్యలో కూడా. ఆ దిశలు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చి, ఆరోగ్య రక్షణనిస్తాయి. ఆ దిశలను కప్పుతో, కట్టడాలతో ఇంటికి అడ్డు చేసుకోవద్దు అనేది ప్రధానం. మీరు మెట్లను తూర్పు ఆగ్నేయంలో వేసుకోండి. దానికి కిందినుంచి పైవరకూ గ్లాసుతో పూర్తిగా మూతవేయకూడదు. అప్పుడు ఆ దిశ మూత పడిపోతుంది. ఇవ్వాళ అందరూ ఎలివేషన్ పేరుతో ఇండ్లకు, ఆఫీసులకు పూర్తిగా గ్లాసులు అమర్చి, గాలి – వెలుతురు చొరబడని సమాధులుగా మారుస్తున్నారు. వెంటిలేషన్ అనేది మనం సృష్టించేదికాదు. సూర్యుడి నుంచి వచ్చేది అని మరిచిపోతున్నాం.
నిర్మాణాన్ని బందీగా చేసి, ఓపెన్స్ లేకుండా లోపల కృత్రిమ వాతావరణం కల్పిస్తున్నాం. అది గొప్పకాదు. అలాంటి నిర్మాణాల్లో సహజ వాతావరణం చచ్చిపోతుంది. దాదాపు ఎనిమిది నుంచి పది గంటల వరకూ ఆఫీస్‌లో పనిచేసేవాళ్లు ఉన్నారు. అన్ని గంటలు కృత్రిమ ఏసీల్లో, కరెంటు లైట్ల మధ్య శరీరం కుమిలికుమిలి, అతి సుకుమారమైన అంతరేంద్రియాలు సహజ శక్తిని కోల్పోతున్నాయి. అది చాలా నెమ్మదినెమ్మదిగా ఆరోగ్యాన్ని కుంగదీసి, దీర్ఘ రోగాలకు మూలమవుతుంది. మనిషి అనేవాడు యంత్రంకాదు కదా! ఇది అర్థం కావాలి మనకు. మీ ఇంటికి మెట్లకు హెడ్‌రూమ్ వేసుకోండి. వాన నీళ్లు జారకుండా ఉంటాయి. ఎలివేషన్ కోసం గ్లాస్ బాక్స్ కట్టకండి. ఓపెన్ మెట్లు చాలా మంచివి. రెయిలింగ్ సేఫ్టీగా, ఎత్తుగా వేసుకోండి. చాలు.
– ఎ. వెంకటేశ్వర్, అమీర్‌పేట.
ఇవ్వాళ స్థలం తక్కువ – ఇండ్లు ఎక్కువ. అందరూ పెద్దపెద్ద నగరాల్లోనే ఉండాలని కోరుకుంటూ, దండెత్తి వస్తుంటే.. ఒకదాని మీద ఒకటి కట్టక ఏం చేస్తారు? ఇలా ఇండ్లను సృష్టించగలరు. కానీ, భూమిని సృష్టించలేరు కదా! మన పల్లెటూళ్లలో ఇప్పటికీ అదే ప్రశాంతత, అదే ఆనందం! దానికి రహస్యం.. అక్కడ నేలమీద ఇండ్లు ఎక్కువ. అపార్ట్మెంట్లు లేకపోవడం.
ఎప్పటికైనా మనిషి కోరుకునేది నేలనే! కారణం.. మనిషి రావడానికి, తిరిగి పోవడానికి అదే మూలం కాబట్టి. అపార్ట్మెంట్లకు నేల కాగితాల మీద రాసి ఉంటుంది. ఎన్నో కొన్ని గజాలు. ప్రత్యక్షంగా నిర్మాణం ఏదో ఒక స్థలం మీదనే ఉంటుంది. కాబట్టి దోషంకాదు. మనం ఉండే స్లాబునే నేలగా భావించాలి. అయితే, ఆ స్థలం అంటే.. ఆ అపార్ట్మెంట్ ఎలాంటి స్థలంలో కట్టారు? అన్నది చూసుకోవాలి. అప్పుడే అందులో ఉండటం అనేది నిర్ణయించుకోవాలి.
– ఎ. బుచ్చిరెడ్డి, సుచిత్ర.
గుడిని శాస్త్రీయంగా కట్టినప్పుడు దానికి ప్రాకారం వస్తుంది. జీవాలయాలకు మూడు ప్రాకారాలు ఉంటాయి. ఇక ఆ ప్రహరీ లోపల అయ్యవారు కదా! ఆఫీసు కదా! అర్చకులు కదా.. అని నైరుతి భాగంలో మనుషుల ఇండ్లు, అవి చిన్నవైనా, పెద్దవైనా పనికిరావు. తద్వారా దోషం వస్తుంది. నివాసాలు గుడి మాడ వీధుల వెనక ఉండాలి. గుడి గోడను ఆనుకొని గుడిలో కాళీ స్థలం ఉన్నదని వీలున్న చోటల్లా ఇండ్లు కట్టొద్దు. అది ఆగమ విరుద్ధం.
ఆఫీస్ గదిని కూడా బయటికి పంపాల్సిందే! గుడి సేవలకు అడ్డం లేకుండా, భక్తుల ప్రదక్షిణలకు పవిత్రత లేకుండా మానవ అవసరాలకు ఉపయోగపడే వాటిలో ఆఫీసులు కూడా వస్తాయి. శౌచం అనేది చాలా ప్రధాన అంశం. అంటే.. భౌతిక, మానసిక శుభ్రత. ఇది పాటించాలి. వ్యక్తుల గదులు, టాయిలెట్లు గుడి ప్రాంగణంలోకి రాకూడదు. అప్పుడే గుడి ప్రయోజనం, గుడి వైభవం నిలుస్తుంది. ప్రతి నిర్మాణానికి ఒక శాస్త్ర నిబద్ధత ఉంటుంది. దానిని అనుసరించాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143