– ఎ. సంధ్య, ధర్మపురి.
ప్రతి ఇంటికీ పంచభూతాల స్థానాలు తప్పక ఆపాదించబడి ఉంటాయి. అవి సమపాళ్లలో కుదరడమే ఇంటికి వచ్చే వైభవం. వీటిలో జరిగే లోపాలే ఎన్నో అనర్థాలకు మూలం. ఇల్లు కట్టడం కాదు.. ముందు వీటిని సరిచూసుకోవాలి. ప్రతి నిర్మాణంలోనూ ‘ఆకాశం’ అనేది ఒక ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. ఆకాశం అంటే ఏదో కాదు.. ఖాళీ ప్రదేశం. ఇది విశ్వమంతా ఆవరించుకొని ఉంది. దానినుంచే మిగతా నాలుగు భూతాలూ ఆవిర్భవించాయి. ఇంటిలో హాలు అనేది చాలా ముఖ్యవిషయం. ఇది లేకుండా కట్టిన ఇల్లు అనేక దురవస్థలకు, అనారోగ్యాలకు, అశ్లీలతకు ఆలవాలం అవుతుంది. అలాగే ఇంటికి ప్రదక్షిణ స్థలం లేకపోయినా.. ఇల్లును పూర్ణమైనదిగా గుర్తించలేం. అలాగే, ప్రతి గదిలో, వంట గదిలో, స్నానాల గదిలో ఎంత ఖాళీ స్థలం ఉండాలనేది కూడా చూడాలి. పూర్ణంగా ఖాళీ భాగమెంత? నిర్మాణమెంత? అన్న నిష్పత్తి మీదనే దాని ఐశ్వర్యం దాగి ఉంటుంది.
– పి. సత్యం, నిజామాబాద్.
వ్యాపార భవనాలు నిర్మించేటప్పుడు కాంపౌండ్ వాల్స్ ప్రధానం కాదు. అవి జనాకర్షణే ప్రాముఖ్యం కలిగి ఉండాలి. ఇల్లులాగా దాచుకున్నట్లు ఉండకూడదు. కాబట్టి, వీధివైపు కాంపౌండ్ వాల్స్ అవసరంలేదు. తూర్పు ముఖంగా కట్టే వ్యాపార భవనానికి చుట్టూ ఖాళీ ఇచ్చి కట్టడం తప్పనిసరి. ఆ భవనం చుట్టూ ఉండే హద్దులకు మాత్రం కాంపౌండ్ అవసరమే. అంటే, వీధివైపు కాంపౌండ్ లేకుండా, మిగతా మూడువైపులా రక్షణగా గోడ కట్టాల్సి వస్తుంది. తద్వారా జనాకర్షణకు, ధనాకర్షణకు లోటు లేకుండా ఉంటుంది. ఉత్తరం ముఖం ఉన్నాకూడా ఇదే విధంగా ఓపెన్ పెట్టుకొని కట్టుకోవచ్చు. దక్షిణం – పడమర వైపు వీధులు ఉన్నప్పుడు అన్ని వైపులా ఓపెన్ పెట్టుకొని, భవనం నిర్మించడం మంచిది. చుట్టూ అలాగే సెల్లార్లో కూడా పార్కింగ్ వాడుకోవచ్చు. దోషం ఉండదు.
– బి. పార్వతి, కేసముద్రం.
ఇంటి స్థలం అన్నిచోట్లా సక్రమంగా ఉండాలని లేదు. ఏదో ఒక మూల పెరిగి ఉంటుంది. దిశానుకూలంగా స్థలం ఉన్నప్పుడు ముందుగా మెట్నకు (మూల మట్టానికి) ఆ భూమిని సరిచేయాలి. అప్పుడు పెరిగిన మూలలు బయటికి వస్తాయి. ఎట్టి రీతిలోనూ పెరిగినదానిని వాడుకోకుండా.. నిర్ణయించిన హద్దులకే కాంపౌండ్ వాల్ కట్టుకోవాలి. మిగిలిపోయిన మూలలు పక్కవారికి అనుకూలంగా ఉంటాయి. అలాంటి వాటిని ఇతరులకు ఇవ్వడం (దానంగానైనా) ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. లేదా ఆ తరుగు స్థలాలలో మొక్కలు పెంచుకోవాలి. అందులోకి రాకపోకలు చేయకూడదు. వదిలిన స్థలానికి దారి ఉన్నట్లయితే.. అంటే దక్షిణ – నైరుతి పెరిగినప్పుడు దక్షిణంలో వీధినుంచి వెళ్లేలా ఆ స్థలంలో గదికానీ, షాపుకానీ కట్టి.. ఇతరులకు ఇచ్చుకోవచ్చు. ఇలా ఆ స్థలాన్ని వదులుకోవడమే కానీ, ఏదోవిధంగా ఇంటివాళ్లు వాడుకోవాలని మాత్రం ఆలోచించకూడదు.
– ఎన్. మాయావతి, మోత్కూర్.
ఇవ్వాళ ప్రతివ్యక్తీ స్వేచ్ఛ అనే చట్రంలోనే అతిగా సంచరిస్తున్నాడు. యాభై ఏండ్లక్రితం ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. పెద్దవాళ్లను అడిగి కానీ, శాస్త్రం ఏం చెబుతున్నది అనికానీ తెలుసుకొని చేసేవారు. స్వేచ్ఛకు కూడా హద్దు ఉంది. నిరంతరం జాగ్రత్తగా ఉంటూ పనులు చేసుకోవడమే స్వేచ్ఛకు రక్షణ. అందుకు పెద్దలు చెప్పింది ఒక్కటే.. ‘ఇతరులు నీకు ఏం చేయాలని ఆశిస్తారో.. అదే ఇతరులకు చేయి!’. అంటే, నీకు ఆనందం కలిగించేదే.. ఇతరులకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది స్వేచ్ఛకు నిర్వచనం. ఇక్కడ శాస్త్రం కూడా చెప్పింది అదే! నేడు మనిషి చేసే ప్రతి పనికి కాలం ఒక ఫలితాన్ని తప్పకుండా అందిస్తుంది. ఆ ఫలం అందేనాటికి చేసిన పని గుర్తుండదు. కానీ, ఫలం అనుభవించాల్సిందే! పనిచేసే సమయంలో వచ్చే ఫలం ఏదో మనకు అర్థం కాదు. కాబట్టి, రుషులు అందించిన శాస్త్రం అన్నివేళలా ఆమోదయోగ్యం. అందుకే శాస్ర్తాన్ని అనుసరించాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143