– కె. పరమేశ్వరి, భువనగిరి.
కోణములు అంటే.. మూలలు. నాలుగు కోణాలు ఉన్న స్థలం.. అంటే చతుర్భుజం, చతురస్రం లేక దీర్ఘచతురస్ర స్థలం అనవచ్చు. ఐదు కోణాలు అంటే.. ఒక మూల పెరిగినట్టు. అంటే, ఆ స్థలం ఏదో ఒక మూల కత్తిరించబడి ఉంటుంది. ఈ విధంగా అనేక వంకరలతో, మూలలతో ఉన్నప్పుడు కోణాలు అధికంగా వస్తాయి. ఉత్తరం సరళంగా సాగకుండా, ముందుకు బాక్సులాగా పెరిగి, ఈశాన్యంలో రెండుచోట్ల తరిగిపోయి అంటే.. కట్ చేయబడి, తిరిగి ఆగ్నేయం కట్ చేయబడినప్పుడు అవి అన్నీ కలిపి పది మూలలు వస్తాయి. తద్వారా అది దశ వంకరలు కలిగిన భూమిగా లెక్కిస్తారు. అదే దశ కోణముల భూమి. పది కోణాలు కలిగి ఉన్నదని అర్థం. అయితే, అది పెద్దస్థలం అయినప్పుడు దిశ ఉన్నప్పుడు మూలలు తీసి, ఒక చక్కని సమకోణ భూమిగా కూడా మార్చుకొనే అవకాశం ఉంటుంది.
అలాంటప్పుడు అన్ని మూలలు కట్ చేసి రోడ్డును అనుసరించి శాస్త్రీయంగా ఉపయుక్తమయ్యే విధంగా అందులోంచి స్థలాన్ని బయటికి తీయవచ్చు. అలాంటి సమకోణ భూమిలో శాస్త్రపరంగా ఇల్లు కట్టుకోవచ్చు. అయితే, ఇదంతా కూడా చాలా పద్ధతిగా జరగాలి. అన్ని మూలలు కొలిచి వీధిని అనుసరించి, దిశను అనుసరించి సక్రమంగా దీర్ఘచతురస్రాన్ని తయారుచేసుకోవాలి. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి దోషం ఉండదు. అయితే, వదిలిన స్థలాన్ని, కట్టే ఇంటిలో కలుపుకోవద్దు. యజమాని ఏ విధంగానూ వాడుకోవద్దు. అలా ఉపయోగించుకొనే అవకాశం త్యాగం చేసి, మిగతా భాగం ఇతరులకు ఇచ్చి, తనదైన స్థలానికి కాంపౌండు కట్టి.. అందులోనే నివసించాలి.
– వి. లత, దోమలగూడ.
కొందరు అన్నదమ్ములు, స్నేహితులు.. స్థలం వృథా కావొద్దని ఇండ్లను కలిపి కడుతుంటారు. కొన్నిచోట్ల ‘రో హౌజెస్’ అని రైలు డబ్బాల్లా వరుసగా.. కనీసం సందుకూడా లేకుండా ఇండ్లను కడుతుంటారు. అవన్నీ మనిషికి ఎండావానల నుంచి రక్షణ ఇస్తాయేమో కానీ.. ప్రశాంతతను మాత్రం అందివ్వలేవు. ఏది తిన్నా కడుపు నిండుతుంది. శరీరానికి కావాల్సింది పోషకాహారం. ఇల్లు కూడా.. మన భౌతిక శరీరమే! ఇలా అంటుకొని ఇండ్లు కట్టడం వేరు. గృహాలు నిర్మించడం వేరు.
మీరు ఉంటున్న ఇల్లు ఏ దిక్కు అంటుకొని ఉందో వివరించ లేదు. మీ ఇల్లు.. తూర్పు అంటుకొని, ఉత్తరం రోడ్డు కలిగి ఉన్నదైనా.. ఉత్తరం అంటుకొని తూర్పు రోడ్డు ఉన్నదైనా తక్షణమే ఆ ఇంటిని వదిలేయండి. వేరే అద్దె ఇంట్లోకి మారండి. వాటిలోని గృహస్థుల వృద్ధి.. తలలు అంటుకొని పుట్టిన కవల పిల్లల్లాంటి జీవితంలాగా తయారవుతుంది. మనిషి బతుకు పోరాటంలో ఇంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తాడు. ఎలా ఉంటే ఏంటి? ఎంతమంది ఉండటం లేదు? అనుకుంటాడు. కానీ, బతుకులో పోరాటాన్నే దూరం చేసేది.. మన నివాసమే కదా! అనేది అర్థం చేసుకోవాలి.
– ఎం. శ్రీనివాస్, కోరుట్ల.
ప్రారబ్ధం.. అంటారు మన పెద్దలు. అంటే.. అంతర్ మనసు. జన్మజన్మలుగా మన భావనలు, స్వభావాలు మారవు. అవి మర్రిగింజలో చెట్టు ఉన్నట్టు.. కనిపించకుండా నిక్షిప్తమై ఉంటాయి. వాటికి అనుకూల వాతావరణం రాగానే.. అవి మొగ్గ తొడుగుతాయి. ఆ తరువాత మొక్కలుగా పెరిగి.. మహా వృక్షాలుగా ఎదుగుతాయి. మనిషి జీవితమంతా ఇంతే! గెలవాల్సింది ప్రపంచాన్ని కాదు.. అంతర్ స్వభావాలను. ఒక ఇల్లు చూడగానే.. దానిపట్ల మక్కువ కలుగుతుంది. ఎలాగైనా తీసుకోవాలి అనిపిస్తుంది. ఎవరన్నా అందులో దోషాలు చెప్పినా.. అతనికేం తెలుసు? ఏం కాదులే! అనిపిస్తుంది.
మనం అందులోకి వెళ్లేలా.. కొనేలా కొన్ని ఆలోచనలు ప్రేరేపిస్తాయి. వాటినే మనవాళ్లు వాసనలు అంటారు. అలా మనలోని ఇష్టాలు.. ఆ ఇంట్లోకి వెళ్లేలా చేస్తాయి. అలా ఇరుక్కుపోతాం. ఇది అర్థం కావడం కష్టం. అందుకే ఇతరులు అంటే.. శాస్త్రకారులు చెప్పేది అప్పటికి అయిష్టంగా, కష్టంగా అనిపించినా వినాలి. కొన్నిటిని వదులుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి అడుగువేయాలి. అందరూ బాగుండాలి. ఎవరిదైనా జీవితమే. నొప్పి అందరికీ ఉంటుందని ఆలోచించి చెబుతాయి శాస్ర్తాలు. వాటిని పాటించాలి అంతే!
– వి. ప్రమీల, కొత్తూరు.
మీ ఇంటి ప్లాన్ చూశాను. తప్పకుండా మార్పులు చేయాలి. వాయవ్యం డౌను అంటే.. అది మీ స్లాబు నుంచి అందులోకి వెళ్లే మెట్లు కట్టారు. అది మీకు మేడమీద సిటవుట్గా ఉపయోగపడుతున్నది. నిజానికి అక్కడ కూర్చునే వీలు కల్పించడమే ఇబ్బంది. కాంటెలివర్లో దానికదిగా ఉంటే వేరు. ఓపెన్ బాల్కనీ ఇచ్చి.. ఎక్కువ లోతు చేయకూడదు.
ఇంటినుంచి వాయవ్యం గొయ్యి అవుతుంది. తద్వారా వాయవ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో వాదులాటలు, అంతరంగ విభేదాలు, అనారోగ్యాలు, కోర్టు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ వాయవ్య స్లాబును ఇంటి ఫ్లోరింగ్ లెవల్‌కు వేసి.. దానిపైన కప్పు వేసుకొని గదిలాగా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇంటికి నైరుతిలో గది ఇచ్చి, దానికన్నా విస్తీర్ణంలో పెద్దగా ఓపెన్ చేస్తే.. ఇంటి యజమానికి ప్రమాదాలు అధికం అవుతాయి. జాగ్రత్తగా ఆ లోపాన్ని సవరించండి. మంచి జరుగుతుంది.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143