మ్యారేజ్ హాల్ కట్టాలని అనుకుంటున్నాం. స్థలం దక్షిణానికి పల్లంగా ఉంది. సెల్లార్వేసి గదులు, స్టోర్ పెట్టుకోవచ్చా?
– ఎ. శ్రీకాంత్, వైరా.
ఉత్తరం ప్రధాన రోడ్డు ఉన్న స్థలానికి అది ఏ నిర్మాణమైనా సెల్లార్ పనికిరాదు. మీ స్థలం దక్షిణ నైరుతి ఎక్కువ పల్లంగా ఉంది అని రాశారు. అలాగని దక్షిణంలో, నైరుతిలో సెల్లార్ తీసి, కిందిభాగంలో స్టోర్, తదితర గదులు కట్టడం ఎంతమాత్రం మంచిదికాదు. వాణిజ్య నిర్మాణాలకైనా అది సముచితమైన సూచన కానప్పుడు.. పెళ్లి మండపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్లార్ నిర్మాణం పనికిరాదు. ముందుగా లోతు ఎంత ఉందో లెక్కకట్టి, నిర్మాణానికి సంబంధించిన పిల్లర్లు వేసి, ఉత్తరం రోడ్డును అనుసరించి తప్పకుండా నైరుతిభాగం నింపేయండి. అది ఎత్తు చేయాల్సిందే! దక్షిణ, పడమరలలో ఖాళీ స్థలం వదిలి, అటువైపు అవసరమైన ఆఫీస్ గది, స్టోర్ గదులను కట్టుకోండి. మొత్తం స్థలంలో దక్షిణభాగం పెళ్లి మండపం, దానికి తూర్పున లేదా ఉత్తరంలో డైనింగ్, కిచెన్ ఏర్పాటుచేయండి. కిచెన్.. వాయవ్యం లేదా ఆగ్నేయంలో వచ్చేలా చూసుకోండి.
వ్యవసాయ భూమిలో బావి ఎక్కడ తవ్వుకోవాలి? బోర్లు ఎన్నయినా వేసుకోవచ్చా?
– బి. నర్సిరెడ్డి, మోత్కూర్.
నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ బావి లేదా బోర్లు వేసుకోండి. వ్యవసాయ భూమిలో నీరు ఉన్నచోటు దొరికితే చాలు. నీటి వనరును ముందు స్థిరపరచుకోవాలి. ఇక మొత్తం స్థలానికి ఈశాన్యంలో పెద్ద నీటిసంపును నిర్మించండి. అన్నిచోట్ల నుంచి నీటిని సేకరించి ఆ పెద్ద సంపులోనికి అనుసంధానం చేయండి. బోర్లు ఎన్ని అయినా వేయండి. నీళ్లు ప్రధానం. వ్యవసాయ భూమిలో ఉండటానికి ‘ఫామ్ హౌజ్’ లాంటిది నిర్మించుకోవాలని అనుకుంటే.. తప్పక ఆ స్థలాన్ని ముందుగా ఎంచుకోవాలి. స్థల నిర్ణయం అయ్యాక దానికి తప్పకుండా కాంపౌండు కట్టుకొని, అందులో వాస్తు పద్ధతులతో ఇంటి నిర్మాణం చేసుకుంటే సరిపోతుంది. ఆ నిర్మాణానికి దక్షిణం, పడమర బావులు, బోర్లు రాకుండా చూసుకుంటే చాలు.
స్థలం అడుగున ఎముకలు వస్తే.. ఆ స్థలం ఇంటికోసం పనికివస్తుందా?
– డి. శాంతి, మేడ్చల్.
స్థలం ఎన్నో విధాలుగా ఉంటుంది. స్థలం ఎంపిక జరిగిన తర్వాత.. స్థలశుద్ధిలో భాగంగా ఆ చోట పాత నిర్మాణాలు, రాళ్లు, ఎముకలు, వెంట్రుకలు.. ఇలా ఏవి ఉన్నా తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ స్థలం తవ్వకంలో మనుషుల అస్థిపంజరాలు, గోరీలు (సమాధులు) బయటపడితే మాత్రం.. ఆ స్థలం గృహ నిర్మాణానికి ఏమాత్రం పనికిరాదు. తప్పక దానిని వదులుకోవాల్సి వస్తుంది. సాధారణంగా జంతు ఎముకలు వస్తే.. వాటిని తొలగిస్తే సరిపోతుంది. ఏ స్థలంలో అయినా ఒకటి రెండు అడుగులు మట్టి తొలగించి చూడాలి. ఎలాగూ సాయిల్ టెస్ట్ చేసినప్పుడైనా ఆ భూమి స్థితి అర్థం అవుతుంది. స్థలశుద్ధి చేయకుండా నిర్మాణం చేయకూడదు. అప్పుడే భూస్వరూపం – స్వభావం మనకు తెలుస్తుంది. ఎంత లోతునుంచి నిర్మాణం చేయాలి అనేది కూడా అర్థమవుతుంది.
మా స్థలం చిన్నగా ఉంది. ఏ మూలనైనా తెంపు చేసి, మెట్లు వేయవచ్చా? మాది ఉత్తరం రోడ్డు.
– ఎం. శ్రీలక్ష్మి, ఉప్పల్.
ఉత్తరం వీధి ఉంది కాబట్టి.. ఉత్తర వాయవ్యంలో మెట్లు పెట్టుకొని, అంటే ఉత్తర వాయవ్యం ఏడు అడుగులు కట్చేసి (మెట్ల మందం), అలాగే ఆ మెట్ల దగ్గరికి వెళ్లడానికి ఉత్తరంలో కనీసం మూడున్నర అడుగులు వదిలి ఇల్లు కట్టుకోవాలి. ఆ విధంగా కడితే తెంపుచేసిన భాగంలో మెట్లు వచ్చి దోషం కాదు. అలా ఇంటిని ప్లాన్ చేయండి. తప్పనిసరిగా పడమర ఒక మాస్టర్ బెడ్రూమ్ను నైరుతిని కలుపుకొని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వాయవ్యంలో తెంపులో ఇల్లు కట్టినప్పుడు వంటగదిని తప్పకుండా ఆగ్నేయంలోనే పెట్టుకోవాలి. వాయవ్యంలో పెట్టొద్దు. ఎంత చిన్న స్థలం అయినా.. కనీసం ఇంటిచుట్టూ అడుగున్నర ఖాళీ స్థలం అయినా వదిలి, ఇంటి నిర్మాణం చేయాలి. వాయు ప్రదక్షిణం కూడా లేకపోతే.. ఆ ఇంటికి ఆయుక్షీణం అవుతుంది. అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని నిర్మాణం జరపండి. నిర్లక్ష్యం వద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా..
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143