జూన్ అయిదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓజోన్ చిల్లుల గురించీ, కర్బన ఉద్గారాల గురించీ, పరిశ్రమల కాలుష్యం గురించీ మాట్లాడుకుంటాం సరే. మరి మనం చేజేతులా పచ్చటి ప్రకృతి విషయంలో ఏం చేస్తున్నామో ఓసారి తరచి చూసుకోవాలి. తప్పు అనిపిస్తే సరిచేసుకోవాలి.
అదో పాత గుడి. సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. దాని పరిసరాల్లో రకరకాల ఫొటో షూట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పిల్లాడి తొలి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటో షూట్. ఓ నలుగురు డ్యాన్సర్లు తల మీద తళుకుబెళుకు ప్లాస్టిక్ పీచులను చుట్టుకుని కుప్పిగంతులు వేస్తున్నారు. రెండడుగుల ఎత్తు ఉన్న ఆ టోపీల కోసం కిలోల కొద్దీ ప్లాస్టిక్ కావాలి. షూట్ అయ్యాక అవి పక్కనే ఉన్న కోనేట్లోకి చేరవచ్చు. మరోవైపు పెళ్లి కోసం షూట్ జరుగుతున్నది. నేల మీద దట్టంగా పరిచిన హోలీ రంగుల మీద కొత్త జంట నడుస్తూ ఉంటే… గుప్పిళ్లతో మరింత రంగును వారి మీదకు చల్లుతూ ఫొటోలు తీస్తున్నారు. ఇదంతా సంప్రదాయంలో భాగమా కాదా అన్నది వాళ్ల ఇష్టం. దానికోసం అయ్యే ఖర్చు వృథానా వ్యక్తిగతమా అన్నది వేరే చర్చ. కానీ ఇలాంటి ప్రతి సందర్భంలోనూ పర్యావరణానికి, ఆరోగ్యానికీ జరుగుతున్న నష్టం ఏంటి అన్నది మాత్రం ఆలోచించాల్సిందే! ఎందుకంటే… ఆరోగ్యం వ్యక్తిగతం కావచ్చు కానీ పర్యావరణానికి నష్టం కలగడం సామాజికం! జూన్ అయిదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓజోన్ చిల్లుల గురించీ, కర్బన ఉద్గారాల గురించీ, పరిశ్రమల కాలుష్యం గురించీ మాట్లాడుకుంటాం సరే. మరి మనం చేజేతులా పచ్చటి ప్రకృతి విషయంలో ఏం చేస్తున్నామో ఓసారి తరచి చూసుకోవాలి. తప్పు అనిపిస్తే సరిచేసుకోవాలి.
మరీ ఎక్కువ రోజులేం వెనక్కి వెళ్లనక్కర్లేదు. ఓ నలభై ఏళ్ల నాటి సంగతి. ఉదయాన్నే పాలు ప్యాకెట్లో కాదు సీసాలో కనిపించేవి. పచారీల కోసం బండి తీయాల్సిన అలవాటు ఉండేది కాదు. అలా నడుచుకుంటూ కొట్టుకు వెళ్తే… నాలుగు కబుర్లు చెబుతూ సరుకులన్నీ పొట్లాలు కట్టి ఇచ్చేవారు. వాటిని ఓ గుడ్డసంచిలో వేసుకుని తాపీగా తిరిగివచ్చేవాళ్లు. పండగలకూ పబ్బాలకూ పప్పులు బియ్యంతో చేసే పిండివంటలే ఆకర్షణ. అప్పట్లో కొత్త దుస్తులు ఇంకా కాటన్‌లోనే ఉండేవి. ఇంటి ముందు పచ్చటి పందిరి వేశారంటే ఏదో వేడుక ఉందనే అర్థం. విస్తరి అంటే ఆకులతో కుట్టినదే కానీ డిస్పోజబుల్ ప్లేట్ అనే ఎరుక అప్పటికి రాలేదు. పిల్లల పుట్టినరోజుకు కొవ్వొత్తులు, కేకుల బదులు స్నేహితులని పిలిచి ఫలహారాలు తినిపించే వాళ్లం. డీజేలు లేవు, ఏసీలకు అలవాటుపడలేదు, ఫ్రిజ్ అనవసరం అనుకునే తత్వం! బావినీళ్లు, కచ్చికపొడులు, ఎడ్లబళ్లు, సైకిళ్లు, బొంతలు, నూనె దీపాలు, వట్టివేళ్లు… అబ్బో అప్పటికీ ఇప్పటికీ అసలు పోలికే లేదు. ఒకే ఒక్క తరంలో తలరాతలు చెదిరిపోయేంతగా జీవితం మారిపోయింది. ఇంధనం మీదా, రసాయనాల మీదా, కృత్రిమ పదార్థాల మీదా విపరీతంగా ఆధారపడుతూ… అవి లేని జీవితాన్ని ఊహించలేని పరిస్థితికి వచ్చేశాం.
వనరులను కాపాడుకోవడంలోను, వ్యర్థాలను నివారించడంలోనూ నాలుగు R లను పాటించాలని ఇప్పటి నిపుణులు చెబుతారు. అవే రెడ్యూస్ (Reduce), రీయూజ్ (Reuse), రీసైకిల్ (Recycle), రీకవర్ (Recover). అవసరానికి మించి వనరులను వినియోగించపోవడం రెడ్యూస్. ఇప్పటి తరానికి చాదస్తంగానో, కఠినంగానో తోచినా మునుపటి తరం వస్తువులను పోగేయడం, ఖర్చు చేయడంలో ఎంత పొదుపు పాటించేవారో తెలిసిందే. అంతేకాదు కాగితం నుంచి పెన్సిల్ వరకూ ఆఖరి దశ వరకూ వినియోగించడమూ గమనించేవాళ్లం. ఇక రీయూజ్ వాళ్లకు రోజువారీ చర్య. స్టీలు పాత్రలు, గాజు సీసాలు, గుడ్డ సంచీలు… ప్రతిదీ వేలసార్లు వాడేవాళ్లు. అవి చిరగడమో, విరగడమో జరిగేదాకా వినియోగంలో ఉండేవి. రీసైకిల్ విషయానికి వస్తే నిజంగా వాళ్లు మన తాతలే! వాళ్లు వాడే గాజు, స్టీల్ లాంటివన్నీ తిరిగి రీసైకిల్ చేయడానికి వీలుగా ఉండే పదార్థాలే. అంతేకాదు! చీర కాస్త పాతబడితే దుప్పటి, తువాలు, రుమాలు, అంట్లగుడ్డ… ఇలా సవాలక్ష రూపాల్లో కనిపించేది. ప్రతి వస్తువునీ ఇలా ఏదో ఒకలా తిరిగి వినియోగించుకోవాలనే తపన వారిలో స్పష్టం. రీసైకిల్ సాధ్యం కాని వాటిని కూడా వినియోగించుకోగలడమే రికవర్. కొత్తగా ప్రచారంలోకి వచ్చిన ఈ భావన మన పెద్దలకు చాలా సహజం. పెరట్లో పడిపోయిన చెట్టు నుంచి కలప తీసినా, ఎండుటాకులను ఎరువుగా మార్చినా, స్నానపు నీటిని పాదులకు మళ్లించినా, కొబ్బరిపుల్లలతో చీపుళ్లు చేసుకున్నా… వాళ్లకే చెల్లింది.
మన పెద్దల రోజువారీ జీవితమే పర్యావరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక వేడుకల గురించి చెప్పేదేముంది. వారి దృష్టిలో అవి జీవితంలో ముఖ్యఘట్టాలు. ఆ సంతోషాన్ని పదిమందితో పంచుకునే సందర్భాలు. వచ్చినవారికి ఆతిథ్యం బాగా జరిగిందా, అందరూ కలుసుకుని బంధాలను గుర్తుచేసుకున్నారా, పాత కబుర్లను కలబోసుకున్నారా, సుష్టుగా భోజనం చేశారా అన్నదే వేడుక నిర్వహణకు గీటురాళ్లు. కానీ చిన్నకుటుంబాలు, ప్రపంచీకరణ, సామాజిక మాధ్యమాలకు విస్తరించిన జీవితం, పెరిగిన జీవన వ్యయం, పోలికల పరుగు… నేపథ్యంలో వేడుక లక్ష్యం మారింది. వేదిక మీద ఉండే కుటుంబమే తొలి, మలి ప్రాధాన్యతగా మిగిలింది. ఈ మార్పు కేవలం బంధాల మీదే ప్రభావం చూపడం లేదు… పర్యావరణం మీద కూడా కొంత ప్రతికూలత చూపిస్తున్నది.
పుట్టినరోజు అనగానే ఇప్పుడు కేక్, దాని చుట్టూ క్యాండిల్స్ గుర్తుకొస్తాయి. ఇవి నిజానికి ఏ సంప్రదాయానికీ చెందినవి కాదు. గ్రీస్ రాజ్యంలో… ఆ తర్వాత జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో సరదాగా మొదలైన అలవాటు. బేకరీలు తమ వ్యాపారం కోసం ఈ అలవాటును ఓ ఆచారంగా మార్చేశాయని విశ్లేషణ ఉంది. 20వ శతాబ్దపు మొదట్లో బర్త్‌డే కేకుల గురించి విస్తృతంగా ప్రకటనలు కనిపించేవి. ఆ తర్వాత వాటి అవసరం లేకపోయింది. ఇది ఓ సాధారణ మార్పుగా ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పటి పుట్టినరోజు వేడుకలు అంతకుమించే జరుగుతున్నాయి. ఈ పార్టీల్లో పేల్చే పాపర్స్లో ఎర్ర భాస్వరం, పొటాషియం క్లోరేట్ లాంటి రసాయనాలతోపాటు అవి చిమ్మే ప్లాస్టిక్ ముక్కలు తినే పదార్థాల మీద పడుతున్నాయని సాక్షాత్తు మన కాలుష్య నియంత్రణ విభాగం హెచ్చరించింది. ఒక్కసారిగా వెలుగులు చిమ్మే బర్త్‌డే కేండిల్స్లోనూ మెగ్నీషియంలాంటి పదార్థాలు ఉంటాయి. వాటిని నేరుగా కేక్ మీదే పెడుతున్నాం మనం. కేవలం పుట్టినరోజే కాదు, ప్రతి వేడుకల్లోనూ ఈ తతంగం అంతా తప్పనిసరి అయిపోయింది. వీటిలో ప్రతి కృత్రిమ సంప్రదాయం వెనుకా పర్యావరణానికి నష్టమే కనిపిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు చిన్నాచితకా ప్రతి వేడుకలోనూ కనిపిస్తున్న పొగమంచు సృష్టినే తీసుకుందాం. కర్బనం, గ్లిజరిన్ లాంటి పదార్థాలతో రూపొందించే వీటి వల్ల ఆస్తమా, అలర్జీలాంటి సమస్యలు రావచ్చు.
ఒకప్పుడు ఫొటో తీసుకోవాలంటే అదో పెద్ద తతంగం. కెమెరా, అందులో రీలు, తగినంత వెలుతురు, దాని మీద పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కావాలి. ఫొటో తీశాక, అది ప్రింటులో ఎలా వచ్చిందో చూసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇప్పుడలా కాదు! ప్రతి చిన్న సందర్భానికీ వందల, వేల కొద్దీ ఫొటోలు తీసేస్తున్నాం. కెమెరా అనేది చిన్నపిల్లల ఆట వస్తువంత తేలికగా మారిపోయింది. అంతగా ఖర్చు లేనట్టు తోచే ఈ సులువు వెనుక కాలుష్యపు కోరలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. దీనికే డిజిటల్ పొల్యూషన్ అని పేరు. ఫొటోలను తీసేందుకు, వాటిని భద్రపరిచేందుకు మొబైల్‌ని వినియోగిస్తాం; వాటిని ఇతరులకు పంపేందుకు మెయిల్స్ చేస్తాం; అవి భద్రంగా ఉండేందుకు గూగుల్ ఫొటోస్ లాంటి సేవలు ఉపయోగిస్తాం; సోషల్ మీడియా ద్వారా పంచుకునేందుకు ఇంటర్నెట్ వాడతాం. ఇవన్నీ పనిచేయాలంటే ఎంతో విద్యుత్ అవసరం. ఈ ప్రక్రియలో భాగమయ్యే సర్వర్లలాంటి వ్యవస్థ నుంచి ఎంతో వేడి ఉత్పన్నం అవుతుంది. కర్బన ఉద్గారాలు కేవలం పరిశ్రమల నుంచో, భారీ యంత్రాల నుంచో మాత్రమే రావు. ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను రోజుకు గంటపాటు వాడితే… అది ఏడాదిలో 63 కిలోల కర్బనాన్ని విడుదల చేస్తుందని ఓ అంచనా. ఇందుకు కారణం చార్జింగ్, ఇంటర్నెట్ వినియోగం, సర్వర్ల వాడకం… ఏదైనా కావచ్చు. ఇక వెయ్యికీ రెండు వేలకీ కూడా చవగ్గా దొరుకుతున్నాయి అనుకుని డిజిటల్ వస్తువులని కొని వాటి మీద మోజు తీరగానే పడేసే అలవాటు కూడా అటు ఉత్పత్తిలోనూ, ఇటు ఇ-వ్యర్థాలలోనూ కాలుష్యాన్ని పెంచుతున్నది.
ఒకప్పుడు పెళ్లిళ్లకీ, పేరంటాలకీ ఓ నాలుగు ట్యూబ్ లైట్లు ఎక్కువగా పెడితే ఘనం. కాలం మారింది. ప్రతి చిన్న సందర్భానికీ కళ్లు బైర్లుకమ్మే ఎల్ఈడీ బల్బులు, తెరలు వాడేస్తున్నాం. ఇవి కాస్త చవగ్గానే దొరకడం, వాటితో విద్యుత్ కూడా ఆదా అవుతుందనే అభిప్రాయంతో ఇళ్లంతా వాటితో నింపేసి… ప్రతి చిన్న సందర్భానికీ వెలిగించేస్తున్నాం. ఇక ఆ వేడుక ఆరుబయటో, ఫంక్షన్ హాలులోనో జరిగితే చెప్పనక్కర్లేదు. అమాయకంగా కనిపించే ఈ ఎల్ఈడీ లైట్ల వల్ల అటు పర్యావరణానికే కాదు, వాటి కింద వెలిగిపోతున్న మనుషులకూ ఆపదే అంటున్నాయి పరిశోధనలు. కొన్నాళ్ల క్రితం వీటి గురించి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వెలువరించిన పత్రం సంచలనమే సృష్టించింది. ఓ బల్బ్ కాంతి నుంచి వెలువడే ఉష్ణోగ్రతను ‘కలర్ టెంపరేచర్’ అంటారు. దీన్ని కెల్విన్‌లలో కొలుస్తారు. ఇది 3,000 వరకూ ఉంటే ఫర్వాలేదు కానీ… చాలాసార్లు మనం ఆ పరిమితిని దాటేస్తున్నాం అని హెచ్చరించిందీ నివేదిక. దీనివల్ల మన కంటి రెటీనా దెబ్బతినడం, జీవగడియారం మారిపోవడం, మానసిక సమస్యలు తలెత్తడం లాంటి సమస్యలు వస్తాయని తేల్చింది. ఇక రాత్రివేళ తిరిగే నిశాచర జీవుల మీదా వీటి ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. క్రిమికీటకాలు ఈ వెలుతురు వైపు ప్రయాణించి ప్రాణాలు కోల్పోతుంటాయి.
వేడుకల్లో సన్నాయిమేళాలు విని చాలా రోజులే అవుతున్నది. సంప్రదాయబద్ధం అని చెప్పుకొంటున్న సందర్భాల్లో కూడా సినిమా పాటలు, డీజే సౌండ్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పందిట్లోకి చేరిన నలుగురూ కలిసి, ఏళ్ల తరబడి కబుర్లన్నీ కలబోసుకునేవారు. వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి ముహూర్త సమయంలో గట్టిమేళం వాయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. మండపంలో అడుగుపెట్టినప్పటి నుంచి దిమ్మతిరిగే దరువే. కాలుష్య నియంత్రణ బోర్డు సూచన మేరకు ఈ శబ్దాలు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరులోపే ఉండాలి. పైగా విద్యాసంస్థలు, ఆసుపత్రులు, కోర్టులకు కనీసం వంద మీటర్ల దూరంలోనే ఉండాలి. కానీ వీటినెవరూ పాటించడం లేదు. ఐక్యరాజ్యసమితి పరిమితి ప్రకారం 65 డెసిబుల్స్ కంటే అధికంగా ఉండేది ఏదైనా శబ్ద కాలుష్యమే. అదే 75 డెసిబుల్స్ దాటితే అది ప్రమాదకర స్థాయి. ఇక 120 డెసిబుల్స్‌ని ఒక్కసారి విన్నా అది శాశ్వత వినికిడి సమస్యలకు దారితీస్తుంది. వేడుకలలో డీజేల దగ్గర 90 డెసిబుల్స్ కంటే అధికంగానే ఉంటుంది. అవి మనకే కాదు… సున్నితమైన వినికిడి ఉన్న జీవాల పాలిట శాపమే!
2022లో భారతీయ వివాహాల కోసం 3.75 లక్షల కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. ఇందులో భోజనాల కోసం చేసే ఖర్చుది సింహభాగం. కానీ ఎన్జీఓ ఫీడింగ్ ఇండియా అనే సంస్థ ప్రకారం పెళ్లిళ్లకు చేసే వంటకాల్లో 10-20 శాతం కచ్చితంగా వృథా అయిపోతున్నాయట. ఒకప్పుడు మనసుకు దగ్గరైనవారిని పిలిచేవారు. వారికి కడుపు నిండేలా భక్ష్యాలు వడ్డించేవారు. ఇప్పుడు తీరు మారింది. పరపతి కోసం వీలైనంత మందిని పిలవడం ఆనవాయితీ కావడమే కాదు… మెనూలో వీలైనన్ని ఎక్కువ పదార్థాలను వడ్డించడం కూడా స్తోమతకు, ఆతిథ్యానికి చిహ్నంగా భావిస్తున్నారు. ప్రతీ ధాన్యపు గింజ వెనుక ప్రకృతి వేదనతో పాటు కష్టజీవుల శ్రమ ఉంటుంది. వాటిని పారేయడం అంటే, ఆకలితో ఉన్నవారికి అన్యాయమే కాదు కాలుష్యాన్ని కూడా పెంచడమే. కేవలం ఆహార వృథా మాత్రమే కాదు. ఒక మూడు రోజుల పాటు జరిగే భారీపెళ్లి నుంచి సగటున 1,500 కిలోల పొడిచెత్త బయటపడుతున్నదని అంచనా. పూలు, పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, రంగులు… ఇలా వేడుక పూర్తయిన వెంటనే కుప్పలా మారే సామగ్రి అంతా ఇంతా కాదు.
ఒకప్పుడు వేడుకల కోసం కొన్న బట్టల్ని మాటిమాటికీ ధరించడమే కాకుండా, తరం నుంచి తరానికి వాటిని అందజేసేవాళ్లు కూడా. పైగా పంచెల్లాంటి సంప్రదాయ దుస్తులు ధరించేవారు. ఖద్దరు, పట్టు వస్ర్తాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. ఇప్పుడలా కాదు. ఆ సందర్భంలో మాత్రమే ఉపయోగపడేలా, ఫొటోలలో జిగేలుమనేలా మెరిసే దుస్తులు కొంటున్నారు. ఆ తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక పారేస్తున్నారు కూడా. ఇవన్నీ కూడా పాలిస్టర్ లాంటి సింథటిక్ దుస్తులు కావడం మరో విషయం. సింథటిక్ వస్ర్తాలను తయారుచేయడానికి పెట్రోలియం లాంటి ఉత్పత్తులు కావాలి. వాటిని ఘనంగా, రంగురంగుల దుస్తులుగా మార్చేందుకు కృత్రిమ రంగులు, సీసం లాంటి లోహాలు ఉండాలి. ఈ ప్రక్రియ మొత్తంలో ఖర్చయ్యే నీటి శాతం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వాటిని ధరించిన తర్వాత కూడా మైక్రో ప్లాస్టిక్స్ విడుదల అవుతూనే ఉంటాయి. ఇంతాచేసి కొన్నాళ్లకు వీటిని పారేస్తారు. అదో పెద్ద సమస్య. ఓ నివేదిక ప్రకారం 2014 నుంచి 2023 నాటికి దుస్తుల వాడకం ఏకంగా 60 శాతం పెరిగింది. అయితే వాడేసిన దుస్తుల్లో 80 శాతం మాత్రం చెత్తకుప్పల్లోకే చేరుకుంటున్నాయి. ధనిక దేశాలైతే చిలీలాంటి చోట్లకు వీటిని తరలిస్తున్నాయి. చిలీలోని అటకామా ఎడారిలో ఓచోట 60 వేల టన్నుల దుస్తుల్ని పారేశారు. ఈ కుప్ప అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందట!!!
మన చుట్టూ ఉండే ప్రతీ పదార్థంలోనూ ఏదో ఒక రసాయనం కనిపిస్తున్నది. డియోడరెంట్లు, నెయిల్ పాలిష్ లాంటి రోజువారీ ఉత్పత్తులలో కూడా ఎండోక్రైన్ డిజ్ప్ట్రింగ్ కెమికల్స్ ఉంటున్నాయి. ఇవి మన హార్మోన్లను దెబ్బతీసి… క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీయవచ్చు. ఇక దుకాణంలో బట్టలు, పరుపులు నిలవ ఉండటానికి వాడే ఫార్మాల్డీహైడ్; పెయింట్ల తయారీలో వినియోగించే సీసం; మంటలు చెలరేగకుండా నిర్మాణ సామాగ్రిలో వాడే పీబీడీఈ, బాత్రూం శుభ్రం చేసే క్లీనర్లలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం; ప్లాస్టిక్ తయారీలో కలిపే బైస్ఫినాల్… ఆఖరికి పొద్దున లేవగానే వాడే టూత్ పేస్టులో ఉండే పారాబెన్స్… అన్నీ మనకీ, పర్యావరణానికీ హాని కలిగించే రసాయనాలే!
ఏటా జూన్ 5న నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవం వెనుక సదుద్దేశమే ఉంది. ఐక్యరాజ్య సమితి 1972లో మొదలుపెట్టిన ఈ రోజు ఏటా ఒక కొత్త నినాదాన్ని తలకెత్తుకుని, ఆ సమస్య మీద అవగాహన… దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు 2018లో పర్యావరణ దినోత్సవానికి కేంద్రంగా ముంబయి వెరసోవా బీచ్‌ని ఎంచుకున్నారు. ఆ రోజున ఆరువేల మందికి పైగా పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడ పేరుకున్న 90 వేల కిలోల ప్లాస్టిక్‌ని తొలగించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా చర్యలు మొదలుపెట్టింది.
ఇదీ సంగతి. ఇప్పుడిప్పుడే ‘సుస్థిరత్వం’ (సస్టెయినబిలిటీ) పేరుతో పర్యావరణానికి అనుకూలమైన వేడుకలు జరుగుతున్నాయి. కానీ అవి కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితంగా ఉన్నాయి. ఇప్పటికీ మధ్యతరగతి భేషజాల మధ్య, పేదల అవగాహనాలోపంతోను… వేడుకలు పర్యావరణానికి ఆమడ దూరంలోనే సంబరాలు చేసుకుంటున్నారు. పైగా వేడుకలు మరింత విస్తృతం అవుతున్నాయి. మెహందీ, సంగీత్ లాంటి పేర్లతో సుదీర్ఘంగా సాగుతున్నాయి.
అప్పు చేసి మరీ ఆర్భాటం చేయాల్సిన పరిస్థితి. ఆ తత్వం మారుతుందనే ఆశిద్దాం. వీలైతే, ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలుపెడదాం!